కర్మయోగి-12

0
3

[ఆస్తి పంపకాల గురించి మరీ ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దని సత్యవతి రామారావుకు చెపుతుంది. లాయర్లతోనూ, ఆడిటర్లతోనూ మాట్లాడి ఆస్తి పంపకాలు చేయిస్తాడు రామారావు. వెండి, బంగారు ఆభరణాలను కోడళ్ళకు సమానంగా పంచేస్తుంది సత్యవతి. జరుగుతున్న పరిణామాల పట్ల సత్యం దిగులుగా ఉంటాడు. తల్లిదండ్రులు అతన్ని ఓదారుస్తారు. తమకి విడిగా వండిపెట్టమని సుధారాణి వరలక్ష్మికి చెబుతుంది. తన పిల్లల్ని శశిరేఖ పిల్లలతో కలవనివ్వదు. జగత్‌కి ఎం.ఎల్.ఎ. టికెట్ లభిస్తుంది. ఎన్నికల హడావిడిలో పడిపోతాడతను. ఖర్చులు అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటాయి. జగత్ అప్పులు చేస్తాడు. అన్నయ్యకి డబ్బు సాయం చేయడానికి వీల్లేదని సత్యంతో చెబుతుంది సుధారాణి. భార్యా పిల్లలతో సహా విజయవాడకి వచ్చేయమని సత్యం మామగారు ఒత్తిడి చేస్తారు. సత్తెనపల్లి వదిలి తనకు రావాలని లేదని, తనని ఇబ్బంది పెట్టవద్దని అంటాడు సత్యం. – ఇక చదవండి]

[dropcap]’తం[/dropcap]డ్రీ కూతుళ్లదీ ఒకటే మాట. మార్కెట్ అంతా మన గుప్పిట్లోనే వుంది, అందుకోవటమే ఆలస్యం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వ్యాపారాలకు ఇప్పుడు అన్నయ్య సపోర్ట్ లేదు. వదిన ఇప్పుడే అన్నీ అర్థం చేసుకుంటున్నది. నాన్న ఒక్కరే ఇబ్బంది పడతారు. ఇటువంటి పరిస్థితిలో నేను విజయవాడ వెళితే అది పచ్చి స్వార్థమవుతుంది. సుధా వాళ్లను పంపేసి వూరుకుంటానంటే అటు అత్త మామలు, ఇటు అమ్మా నాన్నలు ఎవరూ ఒప్పుకోరు. అందర్నీ కలిసి ఒకటిగా వుంచుదామని నాన్న ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు’ అని ఆలోచిస్తూ అక్కడున్న టేబుల్ మీద తల వాల్చి పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనానిక్కూడా ఇంటికి రావాలన్పించలేదు. తన భార్య, అత్త మామలు మరీ స్వార్థంగా, కొంత మూర్ఖంగా తయారయ్యారు. వీళ్లకెలా చెప్తే అర్థమవుతుందని ఆలోచించసాగాడు. తనకీ తన వాళ్లకీ మధ్య అడ్డుగోడలు కట్టేస్తున్నారు వీళ్లు అనుకుంటూ బాధపడసాగాడు.

రాత్రి కాస్త ప్రొద్దు పోయిన తర్వాత ఇంటికెళ్లాడు సత్యం. క్రింద అంతస్తులో అమ్మా, నాన్న హాల్లోనే వున్నారు. వాళ్ల దగ్గరకె వెళ్లి కూర్చున్నాడు.

“ఏం సత్యం? బాగా ఆలస్యమైంది. ముఖమంతా వాడిపోయింది. మధ్యాహ్నం ఇంటికీ రాలేదు. అసలు భోజనం చేశావా లేదా?” అన్నది సత్యవతి.

“కొంచెం పని ఎక్కువగా వున్నది. మీ భోజనాలు అయ్యాయా? ఇద్దరూ టాబ్లెట్లు వేసుకున్నారా?”

“వేసుకున్నాంలే. త్వరగా వెళ్లు. సుధ నీ కోసం కాచుకుని వుంటుంది. వేళకు భోజనం చేయ్యి” అన్నారు.

“వెళ్తానులే” అంటూ సత్యం తను పై అంతస్తులోకి వచ్చాడు.

పిల్లలు నిద్రపోతున్నారు. సుధ టీ.వీ. చూస్తున్నది. స్నానం చేసొచ్చి భోజనానికి కూర్చున్నాడు. మౌనంగానే భోజనం పూర్తి చేశాడు.

“ఇప్పుడేమయిందని అలా మూగనోము పట్టారు? మాటా పలుకూ ఏమీ వుండదు. కింద మీ అమ్మా నాన్నలతో బాగానే కబుర్లు చెప్పారుగా. ఇంట్లో కొచ్చి నా మొహం, పిల్లల మొహం చూస్తే మాత్రం నోరు పెగలదు” అన్నది ఉక్రోషంగా.

“ఏం మాట్లాడమంటావు? మూగనోము పట్టానంటున్నావుగా. నా చేత నోములు కూడా నోయిస్తావు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు” అన్నాడు విసుగ్గా.

“అంత విసుగు చూపించనఖ్ఖర్లేదు. ఒక్కొక్కళ్ల జాతకం అంతే. ఏ ముద్దూ ముచ్చటా వుండవు. ఏం చేస్తాను ఖర్మ” అంటూ నుదురు కొట్టుకున్నది.

“ముద్దుగా వున్న కాపురాన్ని ముక్క చెక్కలు చేశారు. నువ్వు నీ పుట్టింటి వాళ్లు కలిసి చేయిల్సిందంతా చేశారు. ఏం చేస్తాను ఖర్మ అని నేను నుదురు కొట్టుకోవాలి. నీకే బాధ వద్దులే.”

“చేశాను. చేశాను. అంటారు. ఎవరి కోసం చేశాను? మన బాగు కోసం. మన పిల్లల బాగు కోసం కాదూ చేసింది. ఎలాంటి వాళ్లు పిల్లలకి మంచి చదువులు చెప్పించాలని ఆరాట పడిపోతున్నారు. అలాంటిది అవకాశముండి కూడా నేను పోరు పడటం మంచి పని కాకుండా పోతుందా? మీకూ, మీ అమ్మ నాన్నలకు నేను చేసిన పని మంచిది కాదేమో కాని, నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎలాగూ మనం విజయవాడలో కాపురం పెట్టి పిల్లల్ని చదివించుకోవాలి. మీరు ఊరికినే విజయవాడలో వుండలేరు గదా? దాని కోసమని మా నాన్న మీకు ఏదైనా బిజినెస్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. సత్తెనపల్లిలోని వన్నీ లీజ్ లకివ్వండి. మన డబ్బు మన కొస్తుంది. అదీ మన దగ్గరున్న డబ్బూ కలిపినా పెద్ద కాంట్రాక్టులు చెయ్యాలంటే సరిపోదు. నాన్న పలుకుబడితో మీకెక్కడైనా లోన్ ఇప్పిస్తారు. వ్యాపారాల్లో ఇవన్నీ సహజమేగా. నేను రేపే విజయవాడ వెళ్తున్నాను. ‘సిద్ధార్థ’ స్కూల్లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తాను. అక్కడి కమిటీ మెంబర్సు నాన్నకు బాగా తెలుసు. అవసరమైతే నాన్న పలుకుబడినీ ఉపయోగించాలి” అన్నది గుక్క తిప్పుకోకుండా.

“పిల్లలిక్కడా బాగానే చదువుకుంటున్నారు. మన వ్యాపారాలూ బాగున్నాయి. ఇవి ఎవరికో లీజులకివ్వటమెందుకు? వాళ్లనీ వీళ్లనీ ప్రాధేయపడి లోన్లు కోసం వెంపర్లాడటం ఎందుకు? ఇక్కడ రాజులాగా బతుకుతున్నాం. విజయవాడకు పోయి అనామకుల్లా బతకాలి. మన జీవితాన్ని మళ్లీ మొదలెట్టాలి అన్నట్లు అవుతుంది. మీ నాన్నకూ, నీకూ ఏమర్థం కావటం లేదు. ఎండమావులు చూసి పరుగెత్తుదామంటున్నారు” అంటూ అటు తిరిగి పడుకున్నాడు.

“అలిగింది చాలుగాని, ముందిటు తిరగండి” అంటూ సత్యాన్ని తన వేపుకు బలవంతంగా తిప్పుకున్నది. “జీవితం మళ్లీ మొదలయ్యేది ఏముంది? కొద్ది రోజులు అద్దె ఇంట్లో వుంటాం. త్వరలోనే మంచి ఏరియాలో మనకి నచ్చిన ఇల్లు కొనుక్కుందాం. అక్కడికి వెళ్లిన తర్వాత మీరే అంటారు విజయవాడలో చాలా బాగుందని. ఎన్ని పెద్ద పెద్ద పరిచయాలవుతాయో మీకేం తెలుసు? మంచి బిజినెస్ ఏదో మీరూ ఆలోచించండి. నాన్న ఎలాగూ ఆలోచిస్తారనుకోండి. మా అన్నయ్య సపోర్ట్ కూడా బాగా వుంటుంది. అసలు తనూ, మీరూ కలసి చేసుకోవచ్చు. మనకంతా బాగుంటుంది. బాగా లేని దాన్ని నేనూ, మా నాన్నా చేస్తామా? మీరు ధైర్యంగా ఉత్సాహంగా వుండండి చాలు” అన్నది.

పిల్లల పరీక్షలయ్యాయి. విజయవాడ మొగల్రాజపురంలో ఇల్లొకటి అద్దెకు తీసుకున్నారు. పిల్లల్ని తీసుకెళ్లి ఆడ్మిషన్ టెస్టు వ్రాయించింది. అది పేరుకే, నాన్న అడిగేతే ఆ స్కూలు వాళ్లు సీటు ఇస్తారని సుధకు బాగా నమ్మకం. సామానంతా సర్దుకుని వెళ్లటమే మిగిలున్నది.

పరిస్థితి అంతా చేయిదాటి పోయిందని రామారావు దంపతులేమీ జోక్యం చేసుకోవటం లేదు. ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు. తన పోటీ చేసినప్పటికీ, ఇప్పుడు పోటీ చేసే పరిస్థితికీ చాలా తేడా వచ్చిందిదని రామారావుకు అన్పించింది. వాతావరణం ఉద్రిక్తంగా అవుతుంది. ప్రశాంతత తక్కువగా కనపడతున్నది. జగత్ ప్రచారానికి తిరుగుతూ అక్కడక్కడా, ఎక్కవుగా, వీలున్న చోటల్లా ఆగి తనను గెలిపిస్తే ఈ నియోజికవర్గానికి తను ఏమేం చేస్తాడో చెప్తున్నాడు. ఓటర్లకు సమస్యలు ఏమైనా వుంటే చెప్పమంటున్నాడు. తాగు నీటికీ, పారిశుధ్యానికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటున్నాడు. మున్సిపల్ విద్యాలయాల్లో కావలసిన మౌలిక వసుతులను మెరుగు పరచటానికి కృషి చేస్తానంటున్నాడు. ప్రతి ఓటరూ తన సమస్యను చెప్పకోనవచ్చనీ అంటున్నాడు. గతంలో మా నాన్నగారు చేసిన కృషిని గుర్తుకు తెచ్చుకోమంటున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడిచి మరింతగా నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానంటున్నాడు. వ్యాపారవర్గాల వారికీ తగినంత చేయూత ఇస్తానని చెప్తున్నాడు.

జగత్ అధికార పక్షం తరుపున పోటీ చేస్తున్నాడు. అతని ప్రత్యర్థికి ఆవేశం ఎక్కువ. జగత్ ప్రచారానికొస్తున్న స్పందన చూసి మరింత ఉద్రేకపడుతున్నాడు. ఆ ఉద్రేకంలోనే, తన అనుయాయులకు కొన్ని తప్పుడు సూచనలూ ఇస్తున్నాడు. దాంతో కార్యక్తలు రెచ్చిపోతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. అయినా సరే జగత్ తన కార్యకర్తల్ని మాత్రం వీలైనంత ప్రశాంతంగా వుండమనీ తమకు తాముగా ఏ అలజడి చేయవద్దని సూచిస్తున్నాడు. ప్రత్యర్థులు రెచ్చగొట్టినా సరే రెచ్చిపోవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అంచనాకు మించి ఖర్చు చేయాల్సి వస్తున్నది. కార్యకర్తలకూ, ప్రచారానికొచ్చిన వారికీ, కొన్ని చోట్ల సామాన్య ప్రజలకూ భోజన సౌకర్యం కల్పించాల్సి వస్తున్నది. ఇవన్నీ చూసే కాంట్రక్టర్లున్నారు. వాళ్లు పెద్ద మొత్తానే వసూలు చేస్తున్నారు. ప్రచార వాహానాల ఖర్చు తక్కువ లేదు. కనపడని ఖర్చులనేకం వుంటన్నాయి. ఎంత సంయమనంతో వున్నా కార్యకర్తలు ఎక్కడో ఓ చోట గొడవలు పెట్టుకుంటూనే వుంటున్నారు. చిన్నపాటి పోలీసు కేసులూ అవుతున్నాయి. వాళ్లను విడిపించాల్సి వస్తున్నది.

ఎన్నికల ప్రచారం కోసం ప్రతి వార్డు తిరుగుతుంటే ఆర్థికంగా దిగువనున్న ప్రజలు, మధ్యతరగతి వారు కూడా  ఎన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారో అర్థమవుతున్నది. అధికారపక్షం ప్రజలకు ఎంతో చేస్తున్నది. వాళ్లంతా సంతోషంగానే బతుకుతున్నారని తాను ఇన్నాళ్ల నుంచీ అనుకుంటున్నాడు. ఇంకా వాళ్లకు తీర్చాల్సిన కనీస అవసరాలు చాలా వున్నాయని అర్థమయింది. మండలాల్లో గ్రామాల పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. కొన్ని చోట్ల ఇంకా సరైన రోడ్లు లేవు. కొన్ని ఊళ్లలో స్మశాన స్థలాలు లేవు. మరి కొన్ని చోట్ల తాగునీటి వసతి లేదు. పడిపోయే స్కూల్ బిల్డింగ్స్. కూలిపోయే గోడలతో వున్న దేవాలయాలు. మరమ్మత్తుకు నోచుకోని మసీదులూ., అదరణ అంతగా లేని చర్చ భవనాలు చాలా కనపడ్డాయి. తను ఓటు వెయ్యమని అడుగుతుంటే వాళ్ల అవసరాలును వాళ్లు చెప్తున్నారు. మీరైనా మా కోర్కెలను తీరుస్తారా అన్నట్లుగా చూస్తున్నారు. అవన్నీ చూస్తుంటే తనకు తెలీకుండానే ఒక పట్టుదల, ఒక ఉద్విగ్నత జగత్ మానసులో చోటు చేసుకున్నది. ఈ ప్రజలకు చేతనైనంత సాయం చేయాలన్న కోర్కె బలపడింది.

***

రామ్, కృష్ణ ఇద్దరి పరీక్షలూ అయ్యాయి. పరీక్షలు కాగానే సామానంతా సర్దుకుని విజయవాడ వెళ్లిపోయారు. రామరావుకు, సత్యవతికీ ఇల్లంతా బోసిపోయినట్లున్నది. శశిరేఖ కూడా  బాధపడింది. వాళ్లు వెళ్లిపోతుంటే శశాంక్, శైలజలు చాలా దిగాలు పడిపోయారు. రామ్ చేతులు ఒకళ్లు, కృష్ణ చేతులు ఒకళ్లు పట్టుకుని వదిలిపెట్టలేదు. కారు దాకా వచ్చి వదల్లేక వదిలారు.

విజయవాడ నుండి సత్తెనపల్లి తిరగాలంటే సత్యానికి బాగా ఇబ్బందివుతుంది. బహుశా రోజూ రాలేకపోవచ్చు. వ్యాపార బాధ్యతలన్నీ తనూ, శశిరేఖా చూడాల్సిరావచ్చు అనుకున్నాడు రామారావు.

“సత్యం సత్తెనపల్లి వచ్చిన రోజు ఏ వేళ అయినా సరే ఇంటికొచ్చి భోజనం చేయి. లేదా నేనే కారియర్‌ను నువ్వున్న చోటుకే పంపిస్తాను” అన్నది సత్యవతి.

అలాగేనన్నట్లుగా తలూపాడు సత్యం. సుధారాణి తమ మనసుకు రెక్కలు వచ్చినట్లుగా ఉబ్బి తబ్బిబవుతున్నది. ఏదో కొత్త ప్రపంచం తనని రా రమ్మని పిలుస్తునట్లుగా భావించింది. తను కుటుంబం ఎంతో డెవలప్ అయిపోతుంది అన్నట్లుగా ఊహించుకుని పొంగిపోసాగింది.

మొగల్రాజపురంలో కాపురం. తల్లీదండ్రీ వచ్చి ఇంట్లో సామానంతా సర్దించి వెళ్లారు. తమ కూతురి బద్దకం సంగతి తెలుసు కనుక తమ ఊరి నుండే తులసి అనే ఆమెను తీసుకొచ్చారు.

“సుధా! ఈ తులసి మంచి పనిమంతురాలు, మన పాలేరు కూతురు. భర్త చనిపోతే పుట్టింటికొచ్చింది. ఇద్దరాడపిల్లలున్నారు. వాళ్లను తులసి అమ్మా నాన్నలు చూసుకుంటారు. అప్పుడప్పుడు తులసి వెళ్లి వాళ్లను చూసుకొస్తుంది. నువ్వు చీటికీ మాటికీ విసుక్కోకుండా నేర్పుగా చేప్పి తులసి చేత పనులు చేయించుకో. వంట కూడా బాగానే చేస్తుంది. దగ్గరుండి చేయించుకో” అని చెప్పింది తల్లి.

‘అమ్మయ్య. వంట కూడా చేస్తుంది కాబట్టి దిగుల్లేదు. అంతగా అవసరమైతే బట్టలు ఉతకటానికీ మరో మనిషిని చూచుకోవచ్చు’ అని సంబరపడింది సుధారాణి.

అప్పగింతలు పెట్టి సుధారాణి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ రామ్‌నూ కృష్ణనూ శెలవులకంటూ తీసుకెళ్లారు. పది రోజులుండి వచ్చేశారు. వాళ్ళిప్పుడు కావలసినంత సేపు ఫోన్‌లో టాబ్‌లో ఆడుకుంటున్నారు. వాళ్లక్కూడ ఈ కొత్తిల్లు నచ్చింది. అపార్ట్‌మెంట్‌లో కింద పిల్లల కోసం ఒక మాదిరి ఆట స్థలమున్నది. జారుడుబల్లలు వంటివి వేసివున్నాయి. చాలా మంది పిల్లలు సాయంకాలమయ్యే సరికి అక్కడ చేరే వాళ్లు. క్రికెట్, టెన్నీస్, దొంగా పోలీస్ అంటూ ఆడేవాళ్లు. రామ్, కృష్ణ మొదట్లో ఆవైపు పోయేవాళ్లు కాదు. పైన బాల్కనీలో నుంచి ఒకసారి చూసి లోపలికొచ్చేసేవాళ్లు. సత్యం ఇంటి దగ్గరున్నప్పుడు బలవంతాన అయినా పిల్లల దగ్గరకెళ్లి ఆడుకోమని పంపేవాడు. వాళ్లకు వెళ్లాలనిపిస్తే వాళ్లే వెళతారు అని అంటూ సుధారాణి మాత్రం పట్టించుకునేది కాదు. తన కొత్త కాపురం గురంచి ఫోన్‌లో స్నేహితురాండ్రకు చెప్పుకుంటూ మురసిపోవటానికే ఎక్కడెక్కడి సమయమూ చాలేది కాదు ఆమెకు.

“అమ్మా! తినటానికేమైనా కాలాలి” అని రామ అడిగితే “తులసినడుగు ఇస్తుంది” అనేది.

“నా ష్యూస్ కనపట్టంలేదు” అని కృష్ణ అంటే “తులసినడుగు వెతికి ఇస్తుంది” అని చెప్పేది.

పిల్లలకు టిఫిన్ చేసి పెట్టటం, వాళ్లకు కావలసిన బట్టలు తీసివ్వటం, అన్నాలు పెట్టటం, బాక్సులు సర్దివ్వటం అంతా తులసే చూచుకునేది. నెమ్మది నెమ్మది వంట పని అంతా కూడా తులసే చూచుకునేది. పిల్లలు మమ్మీ, మమ్మీ అని వాళ్లమ్మను పిలవడం కంటే తులసీ, తులసీ అని తులసిని పిలవటమే ఎక్కువయిపోయింది. సుధారాణికిక్కడ ఒక్కొక్కరుగా పరిచయమవుతున్నారు. వాళ్లందరితో కలసి వాకింగ్ కెడుతున్నది. సుధారాణి వాళ్ల ఎదురు ప్లాట్ ఆమె పరిచయం చేసుకున్నది. ఆమె ద్వారా మిగతా వాళ్లతోనూ పరిచయాలు పెరిగాయి.

“ఆరోగ్యానికి నడక చాలా మంచిది. మీరూరండని నన్ను పిలిచారు. రోజూ వెళుతున్నాను. ఏమండీ! ఇవాళ వాకింగ్‌కు ఇక్కడి యమ్.ఎల్.ఎ.గారి భార్య కూడా వచ్చింది. ఆయనే మళ్లీ ఈసారి కూడా పోటీ చేశారట. గెలుస్తారనే చెప్తుంది ఆవిడ. వాళ్ల చెల్లెలుగారు కూడా ఇక్కడే వుంటారుట. అక్క చెల్లెళ్లిద్దరూ బాగా మాట్లాడతారు. మా వాకింగ్ మెంబర్స్‌కు ఏమైనా పనులు కావాలంటే ఆమె ద్వారా యమ్.ఎల్.ఎ.గారికి చెప్పించుకుని చేయించుకున్నారటండీ. మనకీ ఏమన్నా అవసరం వస్తుందేమోనని ఆమెనూ, వాళ్ల చెల్లెల్నీ ఈ సాయంత్రం మనింటికి టీ తాగటానికి రమ్మని పిలిచాను. ఇవాళ సత్తెనపల్లి వెళ్లడం లేదు గదా? వాళ్లు వచ్చే టైమ్‌కు ఇంట్లోనే వుండండి. మిమ్మల్ని పరిచయం చేస్తాను. అయినా ఆ సత్తెనపల్లి బిజినెస్ అంతా లీజ్ కిచ్చేసేయండి అని చెప్తున్నాను. అక్కడికెళ్లే పని లేకపోతే మీరు ఆ టైమ్‌లో ఇక్కడ నలుగురితో మాట్లాడితే ఇక్కడా పరిచయాలు పెరుగుతాయి. ఇక్కడే ఏదైనా బిజినెస్ చేసుకుంటే మీకా తిరుగుడు తగ్గుతుంది. మా నాన్నెవో ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. మీ ప్రయత్నామూ వుండాలిగా. ఇంతకీ సాయంత్రం ఇంట్లోనే వుంటున్నారుగా?” అన్నది సుధారాణి.

“నేను ఇంట్లో వుండటం, వాళ్లతో మాట్లడటం అవన్నీ ఏం వద్దులే. ఆ స్నేహాలేవో నీ వరకూ చూసుకో” అని అక్కణ్ణుంచి లేచి వెళ్లి రామారావుతోనూ, ఆ తర్వాత జగత్ మోహన్ తోనూ ఫోన్‌లో మాట్లాడసాగాడు.

“ఇక్కడ మాకేమీ ఇబ్బంది లేదు. నేను విజయవాడ నుండి సత్తెనపల్లి రాగలుగుతున్నాను. ప్రస్తుతానికి ఇలాగే కొనసాగిస్తాను. వేరే ఇంకా ఏమీ లీజుకిచ్చే ఉద్దేశమేం లేదు నాన్నా” అన్నాడు సత్యం.

ఆ తర్వాత జగత్ మోహన్‍తో మాట్లాడుతూ “ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్యా. వేళకి కాస్త తింటూ వుండు. ఈ ఎలక్షన్స్‌లో నువ్వు గెలుస్తావు. నాకా నమ్మకముంది. నీ లాంటి వాళ్లు యమ్.ఎల్.ఎ.లైతే మన సత్తెనపల్లీ బాగుపడుతుంది. జనాలూ సుఖంగా వుంటారు ” అన్నాడు మనస్ఫూర్తిగా.

“మా నాన్న ఫోన్ చేశారండీ, మీతో మాట్లాడతారట. మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయటం లేదంటున్నారు. అందుకని నన్ను ఫోన్ ఇవ్వమంటున్నారు. లైన్లో వున్నారు. మాట్లాడండి” అంటూ ఫోనందించింది సుధారాణి.

“హలో అల్లుడుగారూ! మనమనుకొన్న కాంట్రాక్ట్ మనకు దొరికింది. మన భూమితో పాటు మరి కొంత గవర్నమంట్ భూమిని తొంభై ఏళ్ల పాటు మనం లీజుకు తీసుకుంటున్నాం. మన స్థలంలోనూ, గవర్నమెంట్ స్థలంలోనూ కలిపి గోడవున్స్ కట్టి వాటిని రైల్వే వారికి అద్దెకిస్తాం. రోడ్డుకు దగ్గరగా వున్న స్థలంలో కొన్ని షెడ్లులాగా వేస్తాం. ఆ షెడ్లను షాపుల్లాగా కన్వర్ట్ చేసి వాటినీ ప్రయివేట్ వ్యక్తుల కద్దెకిస్తాం. వాటిని ఎవరికి కావాలసినట్లుగా వారు మార్పులు చేసుకుంటారు. అవసరమైన వాళ్లు వుంచుకుంటారు. లేనివాళ్లు వాటిని సబ్ లీజుకు ఇచ్చుకుంటారు. స్టేషన్ రోడ్ లోని షాపులు కాబట్టి డిమాండ్ బాగా వుంటుంది. మన అద్దెలు మనకు ఖచ్చితంగా వస్తాయి. మంచి కాంట్రాక్ అనుకో. నీ అదృష్టం కొద్దీ మనకొచ్చింది. నువ్విక సత్తెనపల్లి వెళ్లి వచ్చే ప్రసక్తి మానుకో. ఇక్కడి పనే సరిపోతుంది నీకు. మెటీరియల్ తెప్పించుకోవాలి. వర్కర్స్‌ను మాట్లాడుకోవాలి. వాటన్నిటికంటే ముందు మంచి ఇంజనీర్ చేత ప్లాను గీయించాలి. అప్రూవల్ చేయించాలి. ఇవ్వన్నీ నీకు తెలియంది కాదనుకో. ఆయిల్ మిల్ అదీ కట్టించిన అనుభవం వున్నదిగా. నీ దగ్గర డబ్బు రెడీగా వున్నది కాబట్టి ఇబ్బందేం వుండదు. పని సాఫీగా జరిగిపోతుంది. అంతా నేను చెప్పటమే కాని నువ్వేం మాట్లడవేంటి?”

“ఇప్పుడంతా మీరూ, మీ అమ్మాయీ చెప్పటం, నేను వినటం. అంత వరకే కాని నన్నెక్కడ మాట్లాడనిస్తున్నారు? అసలు ఆ అవకాశం నాకిస్తున్నారా మీరు?”అన్నాడు నిష్ఠూరంగా.

“ఇంకా మీ కోపం తగ్గలేదా? మేమేదో కాని పని చేయిస్తున్నట్లు అలా మాట్లాడతారేంటి? మీ మీద అభిమానంతోనేగా నేనింత శ్రమపడేది. అర్థం చేసుకోండి. ముందు కోపం తగ్గించుకోండి.”

“కోపం ఎలా తగ్గుతుందండీ? మొదట్నండీ మా కుటుంబం కింద ఈ కాంట్రాక్టు తీసుకోమన్నారు. ఇప్పుడేమో అన్నయ్యను తప్పించి నన్నొక్కడినే చూసుకోమంటున్నారు. కొంచెమైనా మర్యాదగా వుంటుందా? మీరే ఆలోచించండి.”

“అవన్నీ మీరు కలిసి వున్నప్పుటి మాటలు. ఎవరిది వారు పంచుకున్న తర్వాత ఇంకా మీ అన్నయ్య సంగతి ఎందుకండీ? రేపు మీ అన్నయ్య రాజకీయాల్లో ఎదిగితే ప్రతిదానికీ నిన్ను కలుపుకుంటాడా? నీకూ వాటాలు పంచి పెడతాడా? ఇక నా సంగతులు వదిలెయ్యండి. అవన్నీ మానేసి పనులు మొదలు పెట్టే ధ్యాసలో వుండండి” అంటూ ఫోన్ పెట్టేశాడు.

రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు వెరవగూడదు గదా అనుకుని సత్యం ఒక్కసారి తల గట్టిగా విదిలించుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా వుండాలి. లేకపోతే మనసు మరీ చికాగ్గా వుంటుదనుకున్నాడు.

“కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కులూ-మనాలీ చూడటానికి వెళ్తున్నారు. నన్ను రమ్మంటున్నారు. వెళ్తాను” అన్నది సుధారాణి.

“పిల్లలు ఇబ్బంది పడతారు. వీలున్నప్పుడు మన కుటుంబమంతా వెళ్దాం. మనం వచ్చింది కొత్త. అప్పుడే ఈ ప్రయాణాలవీ వద్దు” అన్నాడు సత్యం.

“నాన్నగారేదో చెప్తున్నారు కదా? ఇక మీకా పనులన్నీ వస్తాయి. ఇంకా విహార యాత్రలు కెళ్లే తీరికెక్కడ వుంటుంది. కనీసం నేనైనా వెళ్లి చూసొస్తాను. మన పిల్లలు తులసికి బాగా అలవాటు అయ్యారు. ఇబ్బంది అనిపిస్తే మా అమ్మని వచ్చి కొన్నాళ్లు వీళ్ల దగ్గర వుండమంటాను.”

“మోకాళ్ల నొప్పులతో ఆవిడేం తిరుగుతారు వీళ్ల వెనకాల? ఆవిడనూ ఇబ్బంది పెట్టినట్లవుతుంది.”

“కుర్చీలో కూర్చుని తులసి చేత చేయించుకోవటమేగా? ఇబ్బందేం వుండదు.”

“వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నావు. సరే నీ ఇష్టం.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here