అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ‘విలయ విన్యాసం’

1
4

[dropcap]దే[/dropcap]వుడు నిజంగానే ఉన్నాడా లేక కల్పనా? దేవతలు దేవదూతలు ఉన్నారా? రెక్కలు తగిలించుకుని వాయువేగ మనో వేగాలతో వాళ్ళు ప్రయాణించే వారనడం నిజమేనా? వాళ్ళు భువి పైకి దిగొచ్చి మానవులతో సంభాషించేవారా? స్వర్గనరకాలు ఉన్నాయా? పధ్నాలుగు లోకాల మాటేమిటి? మన దేవతల వాహనాలు జంతువులేనా? వాటి వెనక ఉన్న మర్మం ఏమిటి? మానవ మేధకు అందని సృష్టి వైచిత్ర్యాలను ఎలా అర్థం చేసుకోవాలి? మానవులకు అసాధ్యమైన నిర్మాణాల రహస్యం ఏమిటి? ఇవన్నీ అభూతకల్పనలు కాదని చెప్పడానికి ఆధారాలున్నాయా? ఆధునిక విజ్ఞానంతో వీటిని అనుసంధానించి నిరూపించగలమా? ‘విలయ విన్యాసం’ అనే పుస్తకం రాయడానికి శ్రీ

కోవెల సంతోష్ కుమార్ గారిని పురిగొల్పిన ప్రశ్నలివే. వివిధ మతాలు, ధర్మాలు, సంప్రదాయాల్ని లోతుగా అధ్యయనం చేసి వివిధ అంశాల మీద సమగ్రమైన సమాచారాన్ని సాధికారికంగా వెలువరించే ప్రయత్నం చేసిన ఓ విశిష్ట గ్రంథం ‘విలయ విన్యాసం’.

సమున్నతమైన వ్యక్తిత్వంతో ఆదర్శమానవుడిగా వినుతికెక్కిన శ్రీరామచంద్రుడి చరిత్రమీద బురద చల్లే ప్రయత్నమే ఉత్తర రామాయణం అంటారు రచయిత. ఉత్తర రామాయణం కూడా వాల్మీకి విరచితమని నమ్మించడంలో కుట్ర దాగి ఉందంటారు. శివలింగం రూపురేఖలకు సంబంధించి ప్రచారంలో ఉన్న విపరీతార్థాల పైన రచయిత రాసిన వివరణాత్మక వ్యాసం ప్రారంభ ఖండిక ‘విలయ విన్యాసం’లో ఉంది. శివలింగం పురుషాంగానికి ప్రతీక అని, సాలగ్రామశిల స్త్రీ యోనిని సూచిస్తుందని, స్త్రీ పురుష సంయోగానికి శివలింగం ప్రతీక అని ఓ ప్రొఫెసర్ తన పరిశోధనాపత్రం సమర్పించినప్పుడు ఆ సదస్సుకు హాజరైన స్వామి వివేకానందగారు దాన్ని తీవ్రంగా ఖండించారు. ‘అధర్వవేద సంహితలో యూప స్తంభం ప్రస్తావన ఉంది. ఇది ఆద్యంతాలు లేనిది. అత్యంత శక్తివంతమైనది. జగత్తుకంతటికి ఆధారభూతమైనది. దాన్నుంచి వెలువడే శక్తి అనంతమైనది. ఇదే శివలింగానికి ప్రతీక’ అంటూ వివరించారు.

శివలింగానికి, న్యూక్లియర్ రియాక్టర్‌కి మధ్య ఉన్న సారూప్యతల్ని రచయిత సోదాహరణంగా వివరించారు. పరమాణువులోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల లక్షణాల గురించి చెప్తూ వీటిని త్రిమూర్తి తత్వానికి ప్రతీకగా భావించవచ్చా అని ప్రశ్నిస్తారు. విష్ణువుని ప్రొటానుగా, బ్రహ్మని ఎలక్ట్రాన్‌గా, కేంద్రక విచ్ఛిత్తికి కారణమైన న్యూట్రాన్‌ని శివుడిగా భావించవచ్చేమో అంటూ ఈ విషయానికి సంబంధించి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటారు. ఈ ఒక్క ప్రతిపాదన మీదే కాదు, ఈ పుస్తకంలో రచయిత అరూప, అలౌకిక శక్తుల్ని, దైవ భావనల్ని ఆధునికి శాస్త్ర పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ, భూమ్మీద ప్రత్యక్షంగా కన్పిస్తున్న అద్భుతమైన, హేతువుకందని కొన్ని ప్రతీకల్ని ప్రస్తావిస్తూ వెలిబుచ్చిన చాలా అంశాల మీద విస్తృతమైన చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది.

ప్రతి వ్యాసంలో రచయిత దేవరహస్యాల్ని సైన్స్ ఆధారంతో వివరించడానికి ప్రయత్నం చేశారు. ఎల్లోరాలోని కైలాస దేవాలయంలో ఉన్న అత్యంత భారీ శివుడి విగ్రహాన్ని తొలచడానికి, దేవాలయ నిర్మాణానికి అవసరమైన నాలుగు లక్షల టన్నుల రాతిని పగులకొట్టడానికి వేదాల్లో ఉటంకించిన భౌమాస్త్రాన్ని వాడి ఉంటారని, దీని సాయం లేకుండా ఆలయనిర్మాణం జరగడం అసాధ్యమని లెక్కలు కట్టి మరీ వివరిస్తారు.

ఈ రచయిత తన ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు కేవలం హిందూ మత గ్రంథాలనే ఆలంబనగా చేసుకోలేదు. ఇస్లాం, క్రిస్టియానిటీ, జొరాష్ట్రియన్ మత గ్రంథాల్లో ఉల్లేఖించిన విషయాల్ని కూడా సందర్భానుసారంగా ఉదహరించారు. భారతదేశంలో నెలకొని ఉన్న అచ్చెరువొందించే కట్టడాల గురించే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న అంతు చిక్కని రహస్యాల గుట్టు విప్పి, ‘మన పూర్చీకులంతా ఒక్కటే. మనమంతా ఒక జాతి సంతతే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనమంతా ఒక వ్యక్తి సంతతే. జగమంతా మన కుటుంబమే’ అంటారు.

‘దేవదూతలు’ అనే వ్యాసంలో ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు దేవదూతల గురించి ప్రస్తావించాయి. బైబిల్, ఖురాన్, గ్రీస్, జొరాస్ట్రియన్, మహాభారతం… అన్నిటిలోనూ ఏదో ఒక రూపంలో దేవదూతలు ఉన్నారు. అయితే అన్నిటిలోనూ కామన్ ఎలిమెంట్ ఏమంటే దేవదూతలకు

‘రెక్కలు ఉండటం..’ అంటారు. ఇది మిత్ కాదని చెప్తూ ‘ఇతర గ్రహాలనుంచి మనకంటే మేధావులు మన కోసం కిందకు దిగొచ్చారు. మనతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. భావి తరాలకు దారి చూపించారు. వీళ్ళను ఏలియన్స్ అంటారు కొందరు. దేవదూతలంటారు ఇంకొందరు. దేవతలే అంటారు మరికొందరు’ అంటూ పురాణ విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతికి విజ్ఞానంతో ముడివేస్తారు.

పుస్తకం మొత్తాన్ని కూలంకషంగా చదివిన పాఠకులకు రచయిత ఎంతటి సంస్కారవంతుడో అర్థమౌతుంది. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, నమ్మకాల గురించి ఎక్కువగా ప్రస్తావన ఉన్నా మిగతా మతాల్ని వాళ్ళ దేవుళ్ళని కూడా సమాన గౌరవంతో, వాళ్ళ ఉనికిమీద సమానమైన నమ్మకంతో ప్రస్తావించడం అభినందించదగ్గ విషయం. ‘సూర్య నారాయణుడు, యహోవా, అల్లా, ఆదిశక్తి, త్రిమూర్తులు, యూదుల దేవుడు.. అంతా ఈ భూమ్మీదకు వచ్చి వెళ్ళారు’ అని రాశారు. ప్రస్తుత సమాజంలో అందరూ ఈ రచయితలాంటి మనుష్యులే ఉండి ఉంటే మత ఘర్షణలే ఉండేవి కాదు కదా..

మనుషులు గ్రహాంతరవాసులనే దేవతలని నమ్మారా? సూపర్ నేచురల్ బీయింగ్స్‌నే దేవతలని భ్రమించారా? అనంత విశ్వంలో ఎక్కడో ఏదో గ్రహంలో జీవులు ఉన్నారని సైంటిస్టుల నమ్మకం. వాళ్ళు దేవతలా లేక మనలాగే ఇతర గ్రహాల్లో నివసిస్తున్న జీవులా? అని ప్రశ్నలు సంధిస్తూనే ‘ఈ విషయం తేలడానికి ఎంత సమయం పట్టినా, దేవతలు లేదా గ్రహాంతరవాసులు ఈ భూమ్మీదకు వచ్చి వెళ్ళారన్నది మాత్రం వాస్తవం’ అంటారు.

బృహదీశ్వరాలయం, విరూపాక్ష దేవాలయం, పెరూలోని ఆండీస్ పర్వత శ్రేణుల మీద ఉన్న ఆలయం.. టెంపుల్ ఆఫ్ కాండోర్గా అనే ప్రాంతంలో దీర్ఘచతురస్రాకారంలో తొలిచి ఉన్న రాళ్ళు, మెక్సికో లోని పురాతన నగరం టియోటి హుకాన్, ఇక్కడి సన్ పిరమిడ్‌కు ఈజిప్టు లోని గిజా పిరమిడ్‌కు ఉన్న సారూప్యం, మెడిటరేనియన్ సముద్రంలోని మాల్టా దీవిలో ఉన్న అత్యద్భుతమైన రాతి కట్టడాలు.. వీటన్నిటి గురించి చెప్తూ చివర్లో ‘మెషీన్లతో కూడా సాధ్యం కానంత అద్భుత నిర్మాణాలను మన పూర్వీకులు సృష్టించారు. వాటి ముందు ఈ సోకాల్డ్ సైన్స్ పిపీలికం. ఈ టెక్నాలజీని మనకు నేర్పింది, ప్రేరణ ఇచ్చింది గ్రహాంతరవాసులు. వాళ్ళు మన పాలిట దేవతలు’ అంటారు.

‘హిమాలయ పర్వత శ్రేణుల్లోని బందర్‌పంచ్ రేంజ్‌లో స్వర్గారోహిణి పర్వతం ఉంది. స్వర్గానికి దారి.. పర్వతం పైకి వెళ్తున్న కొద్దీ నిశ్శబ్దంలో ప్రణవనాదం విన్పిస్తుంది. వర్ణనలకు అందని అనుభూతి కలుగుతుంది. అదే స్వర్గం’ అని అంటారు స్వర్గం అనే ఖండికలో.

జెరూసలేం అనే ఖండికలో ‘ఇది దేవభూమి. మూడు ప్రధాన మతాలకు ఇది కేంద్రస్థానం’ అంటూ జెరూసలేం ప్రాముఖ్యత గురించి చెప్తారు. ‘యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు దైవంతో సమానమైన ఇబ్రహిం లేదా అబ్రహం వందల మైళ్ళ దూరం ప్రయాణించి చేరుకున్న ప్రాంతం జెరూసలేం. సున్నీ తెగ ముస్లింలకు ఇది కీలకమైన ఆధ్యాత్మిక ప్రదేశం. క్రిస్టియానిటీకి, జూడాయిజానికి కూడా ఇది పవిత్ర స్థలం. మహమ్మద్ ప్రవక్త ఇక్కడినుంచే స్వర్గానికి ఏడు అంతరాల్లో భూమికి అనుసంధానం చేశాడు’ అంటూ ఈ మూడు మతాలకు అత్యంత పవిత్రస్థలమైన జెరూసలేం గురించి రాయడంలోనే ఈ రచయిత సర్వమత సారాన్ని ఆకళింపు చేసుకుని వాటిని సమాదరించే ఉన్నతత్వాన్ని చేరుకున్నారని అర్థమౌతుంది.

ఈ పుస్తకం రాయడంలో రచయిత తన ఉద్దేశమేమిటో క్లుప్తంగా ఒకచోట ఇలా చెప్పుకున్నారు. ‘మనకు తెలియని వాతావరణం.. మనకు తెలియని టెక్నాలజీ.. మనకు అంతుపట్టని కాలపరిమితి.. మన అపారమేధకు సవాలుగా మారిన ప్రాంతాలు.. అనూహ్యమైన అపూర్వమైన కొత్త లోకాలివి. డెఫినెట్‌గా మానవమాత్రుడివల్ల కానివి. మనకు అతీతమైన శక్తుల సృష్టి ఇది. కాబట్టే ఇవి దేవలోకాలయ్యాయి. మనుషులకు దేవుడిపై విశ్వాస హేతువులయ్యాయి’.

ఈ పుస్తకంలో దొర్లిన ఒకట్రెండు టెక్నికల్ తప్పుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ‘తలాతలం’ అనే ఖండికలో ‘సాధారణంగా ఏ రాయి అయినా కార్బన్ డేటింగ్ వల్ల దాని కాలాన్ని అంచనా వేయవచ్చు’ అని రాశారు. ఇది కరెక్ట్ కాదు. రాళ్ళ వయసుని అంచనా వేయడానికి జియాలజిష్టులు రేడియోధార్మిక కార్బన్‌ని వాడరు. యాభై వేల యేళ్ళ కన్నా తక్కువ వయసున్న పదార్థాల విషయంలోనే కార్బన్ డేటింగ్ పనికి వస్తుంది. ఏ రాయి అయినా యాభై వేల యేళ్ళ కన్నా ఎక్కువ వయసు కలిగి ఉంటుంది. వీటి వయసు కనుక్కోడానికి ఎక్కువ హాఫ్ లైఫ్ పీరియడ్ ఉన్న పొటాషియం-40 కానీ బెరిలియం-10 కానీ వాడతారు. సెకండ్ లైఫ్ అనే ఖండికలో ఒకచోట ‘ప్రపంచంలోని అన్ని మతాలు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి’ అని రాశారు. ఇస్లాం మతంలో, క్రిస్టియానిటీలో పునర్జన్మలు ఉండవు. ఒకటే జన్మ. చనిపోయాక డే ఆఫ్ జడ్జ్ మెంట్ రోజు లేస్తారు. అంతే.

ఇటువంటి చిన్నచిన్న టెక్నికల్ పొరపాట్లని విస్మరిస్తే, ఈ పుస్తకం మనకు తెలియని ఓ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పాఠకుడికి విస్మయం కలిగించే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. కొత్త అవగాహన కలుగుతుంది. తెలుగు సాహితీ లోకానికి ఇటువంటి ఓ విలువైన పుస్తకాన్ని బహుమతిగా అందించిన రచయితకు అభినందనలు.

***

విలయ విన్యాసం
రచన: కోవెల సంతోష్‌కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 160, ధర: ₹ 100/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి. ఆర్. రోడ్, చుట్టుగుంట,
విజయవాడ – 520004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here