[dropcap]“ము[/dropcap]ద్దులు మూటకట్టే మోముతో అందమైన గులాబీలా మా ఇంట పుట్టిన నా చిట్టితల్లికి ఇంకా మాటలు రాకపోవడమేమిటి? నాలుగేళ్ళొచ్చిన మా కంటివెలుగు ‘అమ్మా, నాన్నా’ అని మాత్రమే అనగలుగుతోందే గానీ, మిగతా మాటలు రావడంలేదు” అనుకుంటూ గుమ్మంలో కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న కాంతిని తదేకంగా చూస్తోంది శారద.
ఎందుకు ఆ కళ్ళలో అస్సలు సంతోషం కనిపించదు? తోటిపిల్లలతో కలవటం లేదు. ఎన్ని బొమ్మలనిచ్చినా నిర్లిప్తంగా ఆడుకుంటుందేగానీ చలాకీతనం అగుపించదు. ముఖంలో ఏదో చెప్పలేని దిగులు, బాధలు ప్రకటితమౌతాయి. వ్యక్తమయ్యే అర్థం కాని భావాలనెన్నింటినో అడిగినా చెప్పేందుకు నా బంగారుతల్లికి మాటలు బాగా రాలేదింకా. శారద దేవుళ్ళందరికి మొక్కుకుని బాధపడుతోంది. ‘పైనున్నవాడు ఏదో ఒకరోజు కనికరించకపోడు’ అని సమాధానపడుతూ వంట చేసి పాపకు తినిపించి భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది శారద.
కాసేపటికి శారద భర్త చలం వస్తూనే ఆనందంగా, “శారదా! మనం భోజనం చేసి సిటీకు బయలుదేరాలి. మన కాంతిని పెద్ద డాక్టర్ గారికి చూపించాలనుకున్నాం కదా. మన సమస్య తెలిసిన నా మిత్రుడు ఫోను చేసి, అమెరికా నుండి పిల్లల డాక్టర్ గారు వచ్చారు. హైదరాబాద్ లోనే ఒక నెలరోజులు ఉంటారు. మీ కాంతిని ఆయనకు చూపించండి. పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు. వెంటనే నేను మన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేసాను. నువ్వు గబగబా బట్టలు సర్దు” అంటూ శారదను కంగారు పెట్టాడు.
ఆ రాత్రికి కాంతితో కలసి హైదరాబాద్ వెళ్ళే బస్సెక్కిన ఆ దంపతులు చలం స్నేహితునింటికి వెళ్ళారు. అమెరికన్ డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని స్నేహితునితో కలసి ఆయన దగ్గరకు వెళ్ళారు. పాపను పరీక్షించిన ఆ వైద్యుడు “మీరు కంగారు పడవలసిన పనిలేదు. ‘స్పీచ్ థెరపీ’తో మీ పాపకు మాటలు బాగా వస్తాయి. ప్రతిరోజూ మీ ఊరిలోనే ఈ ‘థెరపీ’ను చేయించండి” అంటూ కొన్ని మందులను వ్రాసి ఇచ్చారు. ఒక ఆరునెలలు తిరిగేసరికి కాంతి పరిస్థితిలో మార్పు వచ్చింది. చిన్న చిన్న వాక్యాలను మాట్లాడగలుగుతోందిప్పుడు.
అలా కాంతి 5 నుండి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ పుట్టిన రోజున తనను సిటీలోని గుడికిగానీ, మ్యూజియంకుగానీ, రామోజి ఫిల్మ్ సిటీకుగానీ తీసుకువెడదామని చలం దంపతులు హైదరాబాద్‌కు వచ్చారు.
రామోజీ ఫిల్మ్ సిటీకు వచ్చి, అక్కడ జరిగే సినిమా షూటింగ్ వివరాలను గురించి శారదకు, కాంతికు చెపుతూండగా ఓ సంఘటన జరిగింది.
కాంతికు సమవయస్కుడైన ఓ బాబు, తన పెద్దవారినుండి తప్పిపోయి “అమ్మా.. నాన్నా..” అని ఏడుస్తూ చలం వాళ్ళ దగ్గరకు వచ్చాడు.
కాంతి ఉన్నట్లుండి “బాబూ కృష్ణా!” అంటూ ఆ బాబును పట్టుకుని “ఏడవకు అమ్మను నీకోసం వచ్చేసాను కదా” అంది. ఆశ్చర్యంగా ఆబాబు ఏడుపునాపేసి కాంతి వైపు అయోమయంగా చూడసాగాడు. “బాబూ! నేను నీకు నెలలప్పుడే దూరమయ్యాను. అందుకే నీవు నన్ను పోల్చుకోలేవు. నా దగ్గర భయం లేకుండా ఉండు. ఈలోపుగా నాన్నగారు వచ్చేస్తారు” అంటూ తన చేతిలోని చాక్లెట్లను ఆ బాబు చేతిలో పెట్టింది. చలం, శారదలు కూతురి మాటలకు, వింత ప్రవర్తనకు తెల్లబోయారు.
చలం ఎంక్వ్యరీ ఆఫీసులో బాబు వివరాలను చెప్పి ప్రకటన ఇప్పించాడు. ఆ బాబు తల్లిదండ్రులు పావుగంటలోనే అక్కడికి చేరుకున్నారు.
“కృష్ణా! మా నాన్నా!” అంటూ ఆ బాబు తండ్రి బాబును దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతూ “థాక్సండీ” అంటూ చలం దంపతులతో అన్నాడు.
“కాంతీ! పద. మనం ఇంకా ఇక్కడి విశేషాలేవీ చూడనేలేదు? మనకు సమయం అయిపోతోంది” అంటూ కాంతి చెయ్యి పట్టుకుని ముందుకు కదిలాడు చలం.
ఒక్క ఉదుటున నాన్న చెయ్యి విడిపించుకుని “కృష్ణా” అంటూ ఆ బాబు దగ్గరకు వెళ్ళింది కాంతి. “ఏమండీ! మీరు కూడా నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ భార్య శాంతిని” అంది బాబు తండ్రితో.
ఇంత క్రితం కాంతి ఆ బాబును “కృష్ణా” అని పిలవటం గుర్తుకొచ్చిన చలం, “ఏమిటీ మీ అబ్బాయి పేరు కృష్ణేనా? నిజంగానే మీ భార్య పేరు శాంతా?” కాసింత ఆశ్చర్యపోతూ అడిగాడు చలం ఆ వచ్చిన వ్యక్తితో.
“ఔనండీ! నా పేరు ధర్మదాస్, నా మొదటి భార్య పేరు శాంతి. మా కృష్ణను కన్న మూడునెలలలోపుగానే ఆవిడ చనిపోయింది. వాడికి కన్న తల్లి ప్రేమ తెలియదు. ఆ పసివాణ్ణి పెంచటానికి నేను మరలా వివాహం చేసుకున్నాను” అన్నాడు ధర్మదాస్.
అదంతా వింటున్న కాంతి, “నా కిచ్చిన వాగ్దానాన్ని మరచిపోయి, మరో పెళ్ళి చేసుకోవటమేకాక నా బిడ్డను సవతి తల్లి చేతిలో పెట్టారా?” అంటూ అతణ్ణి నిలదీసింది. ఈసారి తెల్లబోవటం ధర్మదాస్ వంతయ్యింది. ఒక్కసారి బాబును తన చేతిలోపెట్టి కన్నుమూసిన శాంతి గుర్తుకొచ్చింది. నిజమే శాంతి చనిపోయేముందు తన చేతిలో చెయ్యి వేయించుకుని ఆ వాగ్దానం తీసుకుంది. కానీ బాబును చూసుకోవటానికి తప్పని స్థితిలో తాను మరలా పెళ్ళి చేసుకున్నాడు.
“మీ అమ్మాయికి ఏమయ్యింది? ఎందుకిలా ప్రవర్తిస్తోంది?” అని ప్రశ్నించాడు బాబు తండ్రి. కాంతి ప్రవర్తనకు శారదకు దుఃఖం వస్తోంది.
“మీ పాప మాట్లాడే మాటలన్నీ నిజాలేగానీ ఆమెకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసునో నాకు అర్థం కావటంలేదు. ఎందుకైనా మంచిది మీ పాపను ఒకసారి మంచి డాక్టర్ గారికి చూపించండి” అంటూ “పదరా కృష్ణా, ఇంకాసేపు ఇక్కడే ఉంటే మతిపోయేలా ఉంది” అంటూ కృష్ణను తీసుకుని ముందుకుసాగాడు ధర్మదాస్.
కాంతి “బాబూ కృష్ణా! ఏమండీ! నేనూ వస్తాను. నన్ను మనింటికి తీసుకెళ్ళండి” అంటూ ఏడుస్తోంది.
“కాంతీ! మనం రేపో, యెల్లుండో మీ ఇంటికి వెడదాం సరేనా! అంటూ అక్కడి నుండి కదిలారు చలం దంపతులు.
ఆ రాత్రి స్నేహితుడింటికి వెళ్ళిన చలం “మరలా పాపను డాక్టర్ గారికి చూపించాలిరా. కాంతి చాలా ఎక్కువగా, సందర్భంలేని విషయాలనెన్నింటినో మాట్లాడుతోంది. ఎవరినో పట్టుకుని కొడుకని, భర్తని అంటోంది. కాంతికి ఏమయ్యిందోనని భయమేస్తోందిరా” అంటూ బాధపడ్డాడు.
“తల్లీ! నీ పేరు కాంతి అయితే పొద్దున్న వాళ్ళతో శాంతి అంటున్నావేమిటి?” అంది శారద బిడ్డ పై చేయివేసి వెన్ను నిమురుతూ.
“అమ్మా! నేను ఉదయం కనిపించిన ధర్మదాస్ గారి భార్య శాంతినే. ఆ బాబు నేకన్న కొడుకే. నువ్వయినా నా మాటను నమ్మమ్మా” అంటున్న కాంతి మాటలకు, ‘శాంతి’ చనిపోయి మా ఇంట ‘కాంతి’గా జన్మించిందేమో అనిపించింది శారదకు. ఇదే విషయాన్ని భర్త చలంతో పంచుకుంది శారద.
మరునాడు డాక్టర్ గారి దగ్గరకు కాంతిని తీసుకెళ్ళారు చలం దంపతులు. డాక్టర్ గారు ఇంతకు పూర్వం కాంతిని పరీక్షించిన అమెరికన్ డాక్టర్ గారితో కేసు విషయాలను చర్చించారు. వారు కాంతితో “నీ పేరేమిటి? నీకు మీ ఇల్లెక్కడుందో తెలుసునా? మీ వారి పేరేమిటి? బంధువుల పేర్లు గుర్తున్నాయా? నీ భర్త చేసే వృత్తివ్యాపారాలేమిటి?” అంటూ రకరకాలుగా ప్రశ్నలను వేసారు. వాటన్నింటికి కాంతి సమాధానాలను చెప్పింది. వీడియోకాల్‌లో జరిగిన ఈ సంభాషణను డాక్టర్ గారు రికార్డ్ చేసారు.
పాపను తీసుకుని చలాన్ని బయటకు వెళ్ళమని చెప్పిన డాక్టర్ గారు శారదతో “అమ్మా! మీ పాపకు పూర్వజన్మ స్మృతి ఉంది. ఆమెను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పాప చెప్పే మాటలను తేలికగా తీసుకోకండి. ఏదో కోరికతోనే ఆమె మీ పాపగా పుట్టింది. అందుకే మీరామెతో మామూలు పిల్లలాగా వ్యవహరించవద్దు. ఆమె మనసులో ఏముందో తెలుసుకుని మెలగుతూ ఆమెను కంటిపాపలా చూసుకోండి. ఆమె ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగుంది. మీరామెతో సన్నిహితంగా మెలిగితే ఈ జ్ఞాపకాల నుండి త్వరలోనే బయటకు రావచ్చును” అంటూ జాగ్రత్తలను చెప్పారు.
డాక్టర్ గారి మాటలకు అచేతనురాలయ్యింది శారద. “ఆయన చెప్పిన పూర్వజన్మ స్మృతులు తన కాంతిని కదిలిస్తున్నాయా? పాప భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతోంది?” అని ఆలోచిస్తూ బయటకు వచ్చింది. తండ్రి ఒడిలో కూర్చుని కొబ్బరి నీళ్ళను తాగుతున్న కాంతి శారదను చూడగానే లేడిపిల్లలా పరిగెత్తుకొచ్చి “అమ్మా ఇక మనం మన ఊరికి వెళ్ళిపోదామా?” అని అడిగింది.
ఆటోలో బయలుదేరారు. “నాన్న ఒక్కసారి ఆటోను ఆపించండి. ఇదిగో ఈ వీధిలోనే మా ఇంటి పురోహితులుగారుండేది. ఓసారి వారెలా ఉన్నారో చూసివెడదాం” అంది కాంతి.
“ఇప్పుడెందుకమ్మా?” అని అనబోతున్న భర్తను వారిస్తూ “నాకు కూడా వారిని చూడాలని వుంది పదండి” అంది శారద, డాక్టర్ గారు కాంతిని గురించి చెప్పిన సలహాలను గుర్తుచేసుకుంటూ కాంతిని అనుసరించింది.
ఒకటి, రెండు, మూడు అని లెక్కపెడుతూ తొమ్మిదో ఇంటి దగ్గర ఆటోను ఆపించి గబగబా ఆఇంటి గేటును తీస్తూ “రఘునాథాచార్యులుగారూ” అంటూ పిలిచింది కాంతి.
“ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి?” అంటూ వారి కోడలు కాబోలు ఇంట్లోనుండి బయటకువచ్చి “వారు ఆరోగ్యం బాగులేక పడుకున్నారు” అంది.
“ఆచార్యులగారు నాకు బాగా తెలిసిన వారండీ. ఒక్కసారి పలకరించి వెళ్తాను” అంది కాంతి.
“ఇంత చిన్నపిల్లకు మామయ్యగారెలా తెలుసునా?” అని యోచిస్తూ కాంతివాళ్ళను లోపలకు తీసుకెళ్ళింది ఆ వచ్చిన అమ్మాయి.
“మామయ్యగారూ! మీకోసం ఓ ఆరేళ్ళపాప వాళ్ళ అమ్మానాన్నలతో కలసి వచ్చిందండి” అంటూ తట్టి లేపింది. ఆయన లేచి వచ్చి వాలుకుర్చీలో కూర్చున్నారు. వెంటనే కాంతి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. “శతాయుష్మాన్ భవః” అంటూ ఆయన దీవించుతూంటే, అదేమిటండీ “దీర్ఘసుమంగళీభవః” అంటూ ఎప్పుడూ దీవించే మీరు ఇప్పుడిలా.. అంటున్న కాంతి మాటలకు తెల్లబోయారు.
“పాపా నువ్వు..” అంటు ఏదో మాట్లాడబోతున్న వారి మాటలకు అడ్డుతగులుతూ “నేను వడ్డీ వ్యాపారం చేసే ధర్మదాస్ గారి భార్య శాంతినండి. మా ఇంట కృష్ణాష్టమి నాడు నాతో ప్రత్యేక పూజలు చేయించి ఆ కృష్ణుడే మీ ఇంటి దీపంగా వస్తాడమ్మా అని అశీర్వదించేవారు. మీకు గుర్తులేదా?” అంటూ ఆయనకు ధర్మదాస్ కుటుంబంతో ఉన్న పరిచయాలను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకొచ్చింది కాంతి. అందరూ విస్మయానికిలోనయి వినసాగారు.
వారిని ఇంకా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ “మీకు గుర్తుందో, లేదోగానీ నాకు కొడుకు పుట్టగానే, అబ్బాయి బారసాలకి మీకు వెండి కృష్ణ విగ్రహాన్ని కానుకగా ఇచ్చాంకదా! మీ పూజలలో ఆ విగ్రహం పెట్టుకున్నారా?” అని అడిగింది కాంతి.
“అమ్మా! మీ పాప అచ్చు మా శాంతమ్మగారిలాగే మాట్లాడుతోంది. కానీ బాబు పుట్టిన మూడునెలలకే ఆమె చనిపోయారు కదా! ఆ విషయాలన్నీ మీ పాపకు ఎలా తెలుసును?” అంటూ శారదతో అన్నారు ఆచార్యులగారు.
“ఆచార్యులగారు! మీ అమ్మాయి పెళ్ళికని మీకున్న కొద్దిపాటి స్థలం కాగితాలను మావారిదగ్గర తాకట్టుపెట్టి డబ్బు తీసుకున్నారు కదా. మీ అమ్మాయి పెళ్ళి చేసేసారా?” ఆతృతతో అడిగింది కాంతి.
“అమ్మా మీరు మా శాంతమ్మ తల్లే! మా కుటుంబం గురించి ఇంతగా ఆలోచించేది మా శాంతమ్మ తల్లి. అందులో సందేహమేమీలేదు. కాకపోతే ఈ విషయాలనన్నింటిని ఎలా చెప్పగలుగుతారు. ఆ రోజు మీరు ధర్మదాస్ గారితో అన్న మాటలు ఈరోజుకు నా చెవులలో మారుమ్రోగుతూనే ఉన్నాయి.
ఆచార్యులగారు మన ఇంటి పురోహితులు. మనం బాగుండాలని మనసారా కోరుకుంటూ మనతో ఎంతో నిష్టగా పూజలు, వ్రతాలు, ఒకటేమిటి మనింటి అన్ని శుభకార్యాలను చేయించే వారి స్థలం తాకట్టు పెట్టుకుని అప్పివ్వడమేమిటి? వారి అమ్మాయి పెళ్ళి మన ఇంటిలో జరిగే శుభకార్యంగా తలచి వారికి కావలసినంత డబ్బు ఇచ్చి పంపండి” అని మీరు ధర్మదాస్ గారితో అన్న మాటలను నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.
వారు మాత్రం ‘ఇది నేను కష్టాలకోర్చి సంపాదించుకున్న ఆస్థి. ఎవరికీ ఊరికినే దానంగా ఇవ్వను’ అని భీష్మించుకుని కూర్చుంటే, నేను స్థలం కాగితాలను ఇచ్చి డబ్బులను పట్టుకెళ్ళానమ్మా. అమ్మయి పెళ్ళి చక్కగా చేసేసాను. ఆ స్థలంలో చిన్న ఇల్లు వేసుకోవాలని నా కోరిక. కాలం కలసిరాక ఇదిగో ఇలా అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాం.
నా కొడుకు చేతికి అందివచ్చాడు. వాడికి ఉద్యోగంలో మొన్ననేవో ఏరియర్స్ వస్తే ఆ మొత్తం ధర్మదాస్ గారికి ఇచ్చి స్థలం కాగితాలను ఇవ్వమంటే, డబ్బయితే తీసుకున్నారుగానీ కాగితాలు కనిపించలేదన్నారమ్మా.
నా కొడుకు – ఇలా ఎంత మందిని మోసం చేసి ఆస్థులను కూడబెడుతున్నారో. మనలాంటి వారి ఉసురు తగిలే శాంతమ్మగారు చనిపోయి ఉంటారు అని కోపం పెంచుకున్నాడు” అని అన్నారు ఆచార్యులవారు.
వారి మాటలను విన్న కాంతి “అయ్యా, మీరు రేపొకసారి ధర్మదాస్ గారి ఇంటికి రండి. నేను కూడా వస్తాను. మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది” అని చెప్పి తల్లిదండ్రులతో కలసి వెళ్ళిపోయింది.
“నాన్నా! రేపొక్కరోజు మనం ఇక్కడే ఉందాం. పురోహితులవారి కాగితాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. వాటిని ఆయనకు ఇప్పించి మనం మన ఊరికి వెళ్ళిపోదాం” అని తండ్రితో చెప్పింది కాంతి.
శారద వెంటనే కూతురితో “సరేనమ్మా పొద్దుపోయింది. అన్నంతిని హాయిగా పడుకో. రేపటి విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు” అంది.
పిల్ల పడుకున్న తరువాత శారద భర్తతో, కాంతి గురించి డాక్టర్ గారు చెప్పిన పూర్వ జన్మ స్మృతి గురించిన మాటలను చెప్పి అమ్మాయికి కష్టం కలిగించే పని చేయవద్దని చెప్పింది.
మరునాడు అమ్మానాన్నలతో బయలుదేరి ధర్మదాస్ గారి ఇంటికి తనే గుర్తులు చెపుతూ తీసుకెళ్ళింది కాంతి. “అమ్మా ఈ మేడే మా ఇల్లు. ధర్మదాస్ గారు నా భర్త అని ఇప్పుడే అందరికి తెలుస్తుంది చూడండి” అంటూ లోపలికెళ్ళింది.
అక్కడ ఉన్న నౌకర్లను, పనిమనుషులను అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, గబగబా బాత్రూంకు వెళ్ళి కాళ్ళు కడుకొచ్చి దేవుని గదిలోకి వెళ్ళింది. ఇదంతా చలం, శారదలు చిత్రంగా చూస్తున్నారు.
‘వసుదేవసుతం’ అంటూ కృష్ణాష్టకం చదువుతోంది కాంతి. హాల్లోని అందరూ విస్మయంగా వింటున్నారు. ధర్మదాస్ గారి రెండో భార్య చంకలో పాపాయితో వచ్చి “ఎవరండీ ఆ అమ్మాయి? చక్కగా పాడుతోంది” అంటూ మెచ్చుకుంది. దేవునికి హారతినిచ్చి అందరికి తీర్థం ఇవ్వటానికి బయటకు వచ్చింది కాంతి.
ముందుగా ధర్మదాస్ గారికి తీర్థం, అక్షింతలు ఇచ్చి పాదాలకు నమస్కరించింది. ఆ తరువాత తన కొడుకంటున్న కృష్ణకు, మిగిలిన అందరికీ తీర్థప్రసాదాలను ఇచ్చింది కాంతి.
ఇంతలో రఘునాథాచార్యులగారు వారి అబ్బాయితో కలసి “నమస్కారమండీ ధర్మదాస్ గారు” అంటూ లోపలకు వచ్చారు. “మా శాంతమ్మ తల్లి పూజను పూర్తిచేసినట్లుగా ఉంది. ఆ పరిమళాలు ఈ ఇల్లంతా వ్యాపించాయి” అంటూ పేరుపేరునా అందరిని పలకరించారు.
హాల్లో ఉన్న పెద్ద ఆయిల్ పెయింటింగ్లోని శాంతి, అందమైన చిరునవ్వుతో అందరిని చూస్తున్నట్లుగా ఉంది. ‘కాంతి పెద్దదయితే ఆ పెయింటింగ్లో ఉన్న శాంతిలా ఉంటుంది’ అనిపించింది శారదకు.
“ఏమండీ ఓసారి పూజాగదిలోకి రండి” అంటూ ధర్మదాస్ గారిని వెంటబెట్టుకుని వెళ్ళింది కాంతి. ఏదో మంత్రముగ్ధుడైనవానిలా కాంతి వెనకనే వెళ్ళారు ధర్మదాస్ గారు.
అక్కడి మందిరం లోపలి సొరుగును లాగి అందులోని కొన్ని కాగితాలను తీసి ధర్మదాస్ గారికి ఇస్తూ, “ఇంతవరకు తెలిసో, తెలియకో చేసిన తప్పులను క్షమించి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి” అని వారితో అనిపించి, “ఆ కాగితాలు రఘునాధాచార్యులగారి ఇంటి కాగితాలు. నిత్యం పూజలు చేసేవారి ఇంటిపత్రాలు ఆ దేవుడినీడలో ఉంటేనే రక్షణ అని వాటిని నేనే ఇక్కడ భద్రపరిచాను. కాగితాల విషయం మీకు చెబుదామనుకున్నంతలోనే మీకు నేను దూరమయ్యాను. వాటిని ఆయనకు ఇవ్వండి” అని చెప్పింది కాంతి.
ధర్మదాస్ గారు కాంతి మాటలనన్నింటిని నిర్ఘాంతపోయి వింటూ, నాగస్వరం విన్న నాగుపాముల తలను ఆడిస్తూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. వారి వెనుకనే వచ్చిన కాంతి ఆచార్యులవారితో “ఇవిగోనండి మీ స్థలం కాగితాలు. దేవుని సన్నిధిలో పదిలంగా ఉన్నాయి. ధర్మదాస్ గారినుండి వాటిని తీసుకోండి” అంది.
ధర్మదాస్ గారు “స్వామి మన్నించండి. మీ కాగితాల గురించి ఒక్క దేవుని సన్నిధిలో తప్ప ఇల్లంతా వెతికాను. వస్తువునొకచోట పెట్టి వేరొకచోట వెతికితే ఫలితమేముంటుంది. అందుకే మీరు డబ్బు చెల్లించిన నాడు మీకు కాగితాలను ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నా శాంతే బ్రతికి వచ్చి నాతో మంచి పనులను చేయిస్తోందనిపిస్తోంది” అని కాగితాలను ఆచార్యులవారి చేతిలో పెడుతూ అపరాధ భావంతో అన్నారు.
“ధర్మదాస్ గారు, మీరు పెద్దవారు అలా బాధపడకండి. పునర్జన్మలు ఉన్నాయని మన శాస్త్రాలు చెపుతూనే ఉన్నాయి. కర్మ సిధ్ధాంతం ప్రకారం గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల ప్రభావంతో జీవుడు 84000సార్లు పుట్టాలని వ్యాసభగవానుడు చెప్పనే చెప్పాడు. అలా మంచి కర్మలకోసం కొందరు, గత జన్మలో చేయలేని పనులకొరకు ఇంకొందరు, ఈ జననమరణ చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటారు. శాంతమ్మ తన కొడుకును మంచి మార్గంలో పెంచాలనే తపనతో చనిపోయి ఉంటుంది. అందుకే ఆ జీవుడే ఇలా కాంతిగా మనింటికి వచ్చింది.
“ఈ శారద. చలం దంపతుల ఇంట కాంతిగా పుట్టిన శాంతమ్మ ఏదో గొప్ప కార్యం చేయటానికే పుట్టివుంటుంది. ఆమె కోరిక ఏమిటో తెలుసుకుంటూ ఆమె చెప్పిన సలహాల ప్రకారం నడచుకోండి. అది మీ రెండు కుటుంబాలకు ఉభయతారకంగా ఉంటుంది” అన్నారు రఘునాథాచార్యులుగారు.
కాంతి శారద దగ్గరకు వెళ్ళి, “నేను కూడా కృష్ణ చదివే స్కూలులోనే చదువుకుంటాను. నన్ను ఆ బడిలోనే జేర్చండి” అని అడిగింది. అందుకు సరేనంది శారద.
“మన శాంతమ్మ తన కొడుకుకు పురిటి వాసన పోకుండానే కన్నుమూసింది. ఇప్పుడందుకే మన కృష్ణబాబును తన కంటిరెప్పలా కాపాడుకోవాలన్న కోరికతో ఉన్నట్టుంది” నవ్వుతూ అన్నారు ధర్మదాస్ గారు.
“ఔను! మన కృష్ణ గొప్ప డాక్టరయి పేదప్రజలకు సేవలందించాలి” అంది ఆనందంగా కాంతి రూపంలో ఉన్న శాంతి. కాంతి ఆ ఇంటిని, కృష్ణను వదలలేక వదలలేక బయలుదేరి, అమ్మానాన్నలతో నడుస్తూ పదేపదే వెనుతిరిగి చూస్తూ వెళ్ళడం అందరిని కలచి వేసింది.
కూతురి కోసం చలం తన పై అధికారులతో సంప్రదించి ట్రాన్స్‌ఫర్ తీసుకుని సిటీకు చేరాడు. కృష్ణ, కాంతి ఇప్పుడు ఒకే స్కూలులో చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు కృష్ణ స్కూలునుండి తమ ఇంటికి వచ్చి కాసేపు ఆడుకుని వెళ్ళిపోతున్నాడు. తమను వదిలేసి కాంతి ఎక్కడికయినా వెళ్ళిపోతుందన్న భయం శారదకు లేదిప్పుడు. కాంతి కూడా పాత విషయాలను పట్టించుకోకుండా చదువులో పడిపోయింది. ఆమెను తిరిగి డాక్టర్‌కు చూపించాల్సిన అవసరం రాలేదు చలం దంపతులకు.