[dropcap]2[/dropcap]020వ సంవత్సరం…
ఎర్రగా, బుర్రగా ఉండి, కంటికి కనిపించని ఒక సూక్ష్మ కణం ప్రపంచాన్నంతా గడగడలాడించింది. దాని పేరే కరోనా. దాని ప్రవర్తన ఒక ఎనిగ్మా. ఫ్లూ లక్షణాలుంటాయి కానీ ఫ్లూ కాదు. ఇంకా తీవ్రమైనది. రెండు ప్రపంచ యుద్ధాల్లో ఎరుగని లాక్‌డౌన్లూ, వర్క్ ఫ్రమ్ హోమ్లూ చాలా దేశాల్లో అమలు చేయించిందంటే దీని ధాటి ఏ పాటిదో తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే టీకాల గురించి చర్చిస్తున్నాం గానీ అప్పట్లో దాని పేరు చెప్తేనే జనాలకి వణుకు.
దీని రాక ఒక ‘ఆరోగ్య సంక్షోభం’గా గుర్తింపబడిందంటే ఇది ఒక ‘బాల మేధావి’ అని ఒప్పుకోవాలి కదా! పైపెచ్చు, ఇది సోకిందని అనుమానం వచ్చినా, రూఢి అయినా ఏకాంత వాసమే గతి! అది, ఈ మహమ్మారి పరపతి.
కష్ట కాలం జనాల్లో మంచిని వెలికి తీసినట్టు, రోజు కూలీలకి, అనాథలకి, తమకంటూ నివాసం లేని వారికి భోజనం, మందులు వగైరా ఇచ్చి, వాళ్ళ ఆలనా-పాలనా చూసే వాళ్ళ కథలు ప్రపంచమంతటా మారు మోగిపోతున్నాయి. పోలీసులు పేదలకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారని చాలా చోట్ల నుండి వార్తలు వచ్చాయి.
మనుషులు కూడుకుని జబ్బుని ఒకళ్ళకొకళ్ళు అంటించుకుంటారేమో అన్న బాధ లేకుండా 144వ సెక్షన్ విధించబడింది. నైట్‌లైఫ్ బంద్ అయిపోయిందని పెద్ద ఊళ్ళలో కొందరు బాధపడ్డారట. బయట తిండానికి లేదని టీనేజర్లు తెగ ఫీల్ అయిపోయారట.
ఇవన్నీ ఇలా ఉండగా, కరోనా, లాక్ డౌన్లు పీక్‌లో ఉన్నప్పుడు, ఓ ఆదివారం నాడు, పెళ్ళికి వెళ్తున్నంత హడావుడి జరుగుతోంది ప్రపంచమంతటా! బాధగా ఉన్నప్పుడు, సంతోషం కోసం కష్టపడాలి, అన్నట్టుంది వాళ్ళ వాలకం. సరేలే, వ్యక్తి వాదం బలంగా ఉన్న ఈ గ్లోబల్ విలేజ్‌లో ఈ పెళ్ళి-టైప్ హడావుడేమిటో! కొంపదీసి ఎవరింట్లోనో పెళ్ళంటే, ఇది కుక్కల హడావుడి కాదుకదా! అవునసలు, ప్రభుత్వం వాళ్ళు పెళ్ళిళ్ళు వీలైతే వాయిదా వేసి గాని, లేకపోతే తక్కువ మంది అతిథులతో గాని చెయ్యమన్నారు కదా! మరిదేమిటబ్బా!
***
ఆ సంఘటనలో పాల్గొనేందుకు, మంచి బట్టలు వేసుకుని, మేకప్ గట్రా చేసుకుని, లాప్‌టాప్ తెరిచి, జూమ్ సాఫ్ట్‌వేర్ ఆన్ చేసి, వీడియో, మైక్‌ల కనెక్షన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని (అదే ఆఫీసు పనైతే అసలు శ్రద్ధ చూపించి ఉండేవారు కారేమో!), ఆ అందమైన ముఖారవిందం బాగా కనిపించేందుకు ఉచితాసనం వేసుకుని కూర్చుని, మీటింగ్ సమయం కోసం మనుషులు, విరహ వేదనలో ఉన్న అభిసారికల్లా వేచి చూస్తున్నారు.
సాయంత్రం సరిగ్గా నాలుగున్నరకి ఒక విదేశీయుడు (బహుశః ఈ సభాధ్యక్షుడు కాబోలు) స్క్రీన్ పైకి వచ్చి, “హాయ్, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. నమస్కారం, సలామ్ వాలేకుమ్, అయిసస్తూ, విన్హో, సెల్యుటేస్యన్. అందరికీ స్వాగతం.
“మనం ఈ లాక్‌డౌన్‌లో మన్ను తిన్న పాము లాగ మొద్దుబారిన ప్రపంచానికి సంతోషం నేర్పించడం కోసం ఈ వెబినార్ ద్వారా కలుసుకున్నాం. మన పార్టిసిపెంట్స్ రెండు వందల వేలకు పైగా ఉన్నారు. అందరూ అందరికీ జేజేలు చెప్పండి”, అన్నాడు వక్త. అందరూ అరుపులూ, విజిల్స్‌తో ఆ జేజేలేవో చెప్పారు.
“ఇప్పుడు మనమంతా ఒకే గూటి గువ్వలమని మనకి, ఇతరులకి తెలియాలంటే మన లక్షణాలని ఒక్కసారి తలచుకొని, నెమరు వేసుకుని, గర్వపడాలి”, అన్నాడాయన. పాల్గొంటున్న వాళ్ళలో ఒకడు, చెయ్యి ఎత్తాడు. వెంటనే మాడరేటర్ అయిన ఆ వక్త అతణ్ణి మాట్లాడమన్నాడు. “ఆ లక్షణాలు నేను చదువుతాను, మీరు నా తరువాత చదవండి”, అన్నాడు ఆ ‘లక్ష’ణుడు.
“ఒకటి, మనమంతా ప్రజా సంక్షేమం, రక్షణల కోసం ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోం”, అని గాప్ ఇచ్చాడు ‘లక్ష’ణుడు. బడిపిల్లలను మించిన క్రమశిక్షణతో మిగిలిన వాళ్ళు వంత పాడారు. “రెండు, ఈ కరోనా సమయంలో అవసరమైన వస్తువుల్ని మిగిలిన వారికి దొరకకుండా నిల్వలు పేర్చాం”, అని ముగించాడా ‘లక్ష’ణుడు.
మిగిలిన వాళ్ళు ఈ మాటూ వంత పాడాక, “వరల్డ్ కోవిడియట్స్ మీట్, హిప్ హిప్ హుర్రే”, అని చెవి కోసిన మేకలా ఓ గావుకేక పెట్టాడు సభాధ్యక్షుడు. మళ్ళీ అందరూ అరుపులు, కరతాళ ధ్వనులు, ఈలలతో జవాబిచ్చారు.
మళ్ళీ అతనే, “ఇక మన కార్యక్రమంలోకి వద్దాం. మొదట ప్రార్థనా గీతం. కరోనాష్టకం. ఒక భారతీయులు దీన్ని చదువుతారు”, అన్నాడు.
“నమస్కారం అందరికీ. కరోనా పుణ్యమా అని నాలాంటి వాళ్ళకి కూడా మిమ్మల్ని వర్చువల్‌గా కలుసుకునే అదృష్టం కలిగింది. అందరూ చేతులు జోడించండి”, అని, “ఓం వూహాన్ నగరోద్భవే నమః, ఓం సూక్ష్మ రూపిణే నమః, ఓం మానవాసుర భంజనాయ నమః, ఓం ప్రకృతి పరిరక్షిణే నమః, ఓం ఆర్థిక విధ్వంసినే నమః, ఓం వికృత హాసినే నమః, ఓం బలహీన కణ ప్రియాయ నమః, ఓం విలయతాండవినే నమః”, అని చదివి, ఫలశ్రుతి చెప్పి, అష్టకాన్ని మంత్రంలా పఠించాడు.
“దీన్ని రచించిన వారు, శ్రీ శ్రీనివాస్ ఈడూరి”, అని రేడియోలో ప్రకటన చేసినట్టు ముగించాడు. సభాధ్యక్షుడు, “శ్రీనివాస్, రైజ్ యువర్ హ్యాండ్”, అన్నాడు. “నేను ఆహ్వానించినా ఆయన పాల్గొనడానికి నిరాకరించారు”, అన్నాడు ఆ ‘అష్ట’కుడు. వివరించమన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు సభాధ్యక్షుడు.
“ఆయన ఇదేదో సరదాకి వ్రాశారట. మన వెబినార్ అంటే నచ్చలేదు. ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న ఒక భారతీయుడట. అందుకని, కోవిడియట్ కారట. ఇన్ ఫాక్ట్, నన్ను ఈ అష్టకాన్ని వాడద్దన్నారు కూడా! అయినా, రూల్స్‌ని అతిక్రమించడం నాకు సరదా కదా! ఫేస్‌బుక్‌లో పబ్లిక్ పోస్టే కదా, అని కొట్టేశాను. ఎంతైనా, కోవిడియట్‌ని కదా!” అని గొప్ప చెప్పుకున్నాడు అతను.
అందరూ అరిచి, కేకలు పెట్టి, చప్పట్లు కొట్టి, ఈలలు వేసి, “కోవిడియట్‌కి జై”, అని బృందగానం చేశారు. సభాధ్యక్షుడు అందరినీ ఆపమన్నట్టు చేతులను ఆడించి, “ఇప్పుడు ఎక్స్‌పీరియెన్స్ షేరింగ్, అంటే మనవాళ్ళలో కొందరు అనుభవాలను పంచుకుంటారు.
నిన్నటి దాకా వచ్చిన స్పందనలలో అత్యంత అమూల్యమైనవి ఎంపిక చేసి, వాటిని పంపించిన మన కోవిడియట్స్‌కి ముందుగానే తెలియపరచడం జరిగింది. వరుస క్రమం కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు, క్రమశిక్షణతో ఒకరి తరువాత ఒకరు తమ అనుభవాలను పంచుకోమని మనవి”, అని ముగించాడు సభాధ్యక్షుడు.
మొదటి వ్యక్తి, “మా దేశంలో ఫుట్‌బాల్ ఆటంటే జనాలకి ఇష్టం. మా టీమ్ బాగా ఆడుతుంటే ఒళ్ళు మరచిపోతారు. ప్రీమియర్ లీగ్ మ్యాచ్ రద్దు చెయ్యాలని ఒక వర్గం కోర్టుకెక్కింది. నేను వెంటనే సామాజిక మాధ్యమాలని ఎడాపెడా వాడేసి, మ్యాచ్ రద్దు వ్యక్తి స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించినట్లే అని ప్రచారం చేశాను. ఆ దెబ్బకి, మ్యాచ్ అంటే ప్రజలకు ప్రాణమని, సామాజిక ఎడం పాటించే విధంగా ముప్ఫై శాతం టికెట్లు మాత్రమే అమ్ముతామని, అనుమతించమని ఫుట్ బాల్ క్లబ్ వారు కోరారు. కోర్టు అనుమతించింది.
“టికెట్ల నంబరింగ్‌లో గ్యాప్‌ని చూపించగలరు గాని స్టేడియంలో దడులు కట్టలేరు కదా. వాళ్ళు పెట్టిన అడ్డంకుల మీదనుంచి దూకి ఫాన్స్ అంతా గుమిగూడారు. మా టీమ్ కొట్టిన ప్రతీ గోల్‌కీ హై-ఫైవ్‌లూ, హగ్గులూను. ఈ ఒక్క మ్యాచ్ దెబ్బకి మా దేశమంతటా కరోనా సోకింది. ముఖ్య గమనిక- నేను ఆ మ్యాచ్‌ని స్టేడియంలోనే చూశాను. అయినా, నాకేం కాలేదోచ్!” అని ముగించాడు అతడు. అందరూ ఎప్పటిలాగే జేజేలు పలికారు.
రెండవ వ్యక్తి, “నేను అన్య దేశంలో ఉద్యోగం చేస్తున్న భారతీయుణ్ణి. కరోనా మొదలైన నెల లోపు ఇటలీ, స్పెయిన్, జర్మనీ తిరిగి వచ్చాను. భారత్‌కి వచ్చే ముందు జ్వరం వచ్చింది. అన్ని దేశాలూ ఒకే విధంగా ఘోషిస్తున్నా, కరోనా టెస్ట్ చేయించుకోకుండా, పారసెటమాల్ టాబ్లెట్ వేసుకుని, థెర్మల్ స్కానర్‌లోంచి బయటపడ్డాను.
తిరునాళ్ళకి వచ్చినట్టు జనాలున్నారు గనుక నేను రాసిన అబద్ధపు ‘ట్రావెల్ హిస్టరీ’ని పాస్‌పోర్ట్‌తో పోల్చే సమయం ఎయిర్పోర్ట్ అధికారులకు లేకపోయింది. ఇంటికి వచ్చి నాకు నేనే ఏకాంత వాసంలో ఉండాల్సింది పోయి, మా చుట్టాలనీ, ఫ్రెండ్స్‌ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ గిఫ్ట్స్ ఇచ్చి వచ్చాను. సామాజిక ఎడమూ, పాడూ ఏమీ పాటించలేదు. ఇంకా పబ్స్, మాల్స్కి కూడా వెళ్ళాను. ఇహ చూసుకోండి, నా వల్ల ఎంత మంది బుద్ధిగా ఇంట్లో ఉంటున్నారో! నాక్కూడా సోకింది కానీ, నా ఏజ్ వల్ల నేను నెల రోజుల్లో బయటపడ్డాను”, అన్నాడు. జేజేలు చెప్పబడ్డాయి.
“నేను ఒక పెద్ద నర్తకిని. అంతర్జాతీయ టూర్ నుండి తిరిగి వచ్చి, మా ఇంట్లో ఒక ఎక్సాటిక్ డిన్నర్ ఇచ్చాను. అందులో నగర ప్రముఖులందరూ ఉన్నారు. నేను తరువాత కరోనా పాజిటివ్ అయ్యాక, వీళ్ళంతా భయపడి టెస్టులు చేయించుకున్నారు. టెస్ట్ కిట్స్‌కి అప్పట్లో కొరత ఉంటే, ఉన్న కిట్స్ వీళ్ళ మీద ఖర్చైపోయాయి”, అని ఒక స్త్రీ గొప్ప చెప్పుకుంది. అందరినీ మించిన జేజేలు ఆవిడ అందుకుంది.
భయంతో కొంతమంది స్నేహితులను కలిసి, వాళ్ళకి దగ్గరగా కూర్చుని రోగాన్ని అంటించిన ఉదంతాలు, లాక్‌డౌన్ లేని దేశంలో ఒక కరోనా పాజిటివ్ స్త్రీ ఫలాల మీద లాలాజలాన్ని పూసిన సంఘటన, ఇంట్లో వయసు మళ్ళిన వాళ్ళున్నారని హోటల్లో పది రోజులున్న రోగుల ఘనత, తానున్నది ఎండలెక్కువున్న దేశం గనుక లాక్‌డౌన్ రూల్స్ పాటించనక్కర లేదని తలచి, రోజూ కుంటి సాకులు చెప్తూ బయటకు వెళ్ళి, కరోనాను విస్తరింపజేసిన యువకుల ‘సాహస’ కథలు, తరువాతి వాళ్ళు మాట్లాడినప్పుడు వెలుగు చూశాయి.
మరి కొందరైతే చుట్టుపక్కల ఉన్న సూపర్ మార్కెట్లలో సరుకులు మిగులకుండా ఏకంగా ఏడాదికి సరిపడే పప్పులూ-ఉప్పులూ కొనేశారట. మరి కొందరు ఓసీడీ వచ్చిన వాళ్ళలాగ మాస్క్లూ, శానిటైజర్లూ తెగ నిల్వ చేశారట. ఆ తరువాతి మనిషి మాట్లాడబోతుంటే, అందరి స్క్రీన్‌లూ ఒకటే డిస్టర్బ్ అయిపోయాయి. ‘అంతరాయానికి చింతిస్తున్నాం’, అనే మెసేజ్ రావడానికి ఇదేమీ ఎనభైయవ దశకం కాదు కదా!
ఇంతలో శుభ్రపు వస్త్రాలు, మెడలోను, చేతికీ బంగారు నగలు, తలపై కిరీటం, శరీరపు వెనుక భాగం నుండి బయటకు వచ్చే వెండి రెక్కలతో ఒక స్త్రీ స్వరూపం స్క్రీన్ మీదికి వచ్చింది. చూడ్డానికి వింతగా ఉన్నా, ఆవిడ ముఖంలో వర్చస్సు ఉట్టిపడుతోంది.
ముందుగా సభాధ్యక్షుడు తేరుకుని, “ఎవరమ్మా నువ్వు?” అని అడిగాడు. “ఆరోగ్య దేవతాదూతను”, అందావిడ ముక్తసరిగా. “మాతో పనేమిటి? హాయిగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడియట్ల వెబినార్ పెట్టుకుంటే, మధ్యలో నీ గోలేమిటి?” విసుగ్గా అన్నాడతను.
ఆమె ఒక వ్యంగ్యపు దరహాసం చేసి,“గోలా?ఎవరిది గోల? ఎవరు చేశారు గోల? ఫ్యాక్టరీల సైరన్‌లతో, వాహనాల హారన్‌లతో, డీజే డాన్స్ మ్యూజిక్‌లతో మీరు కాదూ గోల చేసింది? పగటికీ, రాత్రికీ తేడాని తుడిచేసి, ప్రకృతిలోని మిగతా ప్రాణులను మీరు డిస్టర్బ్ చేయలేదూ! ఇప్పుడు నేనొస్తే గోలా? మీ నాలుకలకి స్థిరమే లేదు”, అనేసరికి అధ్యక్షుడు కొంచెం జంకాడు.
ఆవిడ వెంటనే, “మీ అందరికీ సిగ్గూ, బుద్ధీ లేవా? సంక్షోభ సమయంలో వెబినార్లు సాధారణంగా ఎందుకు పెడతారు? చదువూ, జ్ఞానం పెంపొందించుకోవడానికే కదూ! లేకపోతే ముఖ్య విషయాలపై చర్చల గురించి. మీకు ఆ అవసరం లేదు కదూ!” అంది.
“ప్రతీ మాటకీ ముందూ-వెనుకా ‘కదూ’ అని తగిలిస్తే నువ్వు ఆరోగ్య ప్రదాయినివి అయిపోతావా?” అన్నాడు సభాధ్యక్షుడు కోపంగా. “నేను ఆరోగ్య దేవతను కాను. వారు పంపిన దూతను. మీరు చేస్తున్న పని తప్పని హెచ్చరించడానికి వచ్చాను”, అంది. “వెబినార్ నిర్వహించడం పెద్ద తప్పా? ఇంతకీ, నువ్వే మతపు దూతవి తల్లీ?” వెటకారం రెండు పాళ్ళు హెచ్చించి అన్నాడు అధ్యక్షుడు.
“విడగొట్టడం మీ నైజం. దేవుడొక్కడే. ఏ మతమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోరుకునేది ఆరోగ్యమే!” అందావిడ. మరొకడు చెయ్యెత్తి, “అందుకేనా, దేవుళ్ళందరి వాకిళ్ళూ మూసేశారు?” అన్నాడు. “ఓయీ నాస్తిక కోవిడియట్, మీరంతా మీ బుద్ధిలేనితనం వల్ల ఆ రోగాన్ని విస్తరింపజేయకుండా అలా అడ్డుకట్ట వెయ్యవలసి వచ్చింది. అయినా, మీరు ఆగలేదే! మీ ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. పోనీ, వాళ్ళని, వాళ్ళ సూచనలనైనా పాటించారా?
“రోజూ కొంప మునిగిపోయినట్టు బయటికి వెళ్ళడం, అరా-కొరా వస్తువులేవో కొనుక్కుని రావడం, శుచి-శుభ్రత పాటించకపోవడం, ఇంకా దూరాన్ని విస్మరించడం- ఒకటేమిటి, అన్ని పనికిమాలిన తెలివితక్కువ పనులూ చేసి, జనాలకి ఓ మహమ్మారిని అంటించి, కోవిడియట్ల మహాసభ వెబినార్ రూపంలో జరుపుతున్నారా, పొగరుబోతుల్లారా?” కోపంతో అందావిడ.
“అయితే ఏవిఁట్ట?” అన్నాడు వాళ్ళలో ఒకడు. “మా దేవతకి చాలా ఓరిమి ఉండబట్టి మీలాంటి దుర్మార్గులకి శిక్ష వేయలేదు. అవునూ, నువ్వు ఆ అష్టకం చదివిన వాడివి కదూ?”అని ఆవిడ అడిగింది. తలూపాడు వాడు.
“అందులో ఫలశ్రుతి ఎక్కడుంది? పాపం ఆ శ్రీనివాస్ వెటకారానికి ఏదో వ్రాస్తే, కరోనాని పొగిడినట్టు వీళ్ళందరి ముందూ ప్రార్థనా గీతంలా పాడుతావు కదూ? ఎప్పుడైనా దైవ స్తుతి చేశావురా నువ్వు? ఎప్పుడైనా మంచి విషయాలు మననం చేసుకున్నావా?…” ఇప్పుడు ఆ ‘అష్ట’కుడు నీళ్ళు నమిలాడు. “అదే శ్రీనివాస్ కరోనా బారిన పడకుండా ఉండడానికి ఒక గజల్ వ్రాశాడు కదా! తెలుసా?” అడిగింది ఆవిడ. అవునన్నట్టు తలూపాడు వాడు. దూత పాడమంటే, వాడు పాడాడు :
“ఇంటినుండీ కదలకుంటే అంటనన్నది కరోనా/ మంచిగుంటే మనిషి గోడును వింటనన్నది కరోనా/ ఇంటి వంటే తింటువుంటే రోగమంటదు తెలుసుకో/ చేతచిక్కితె జీవకణములు తింటనన్నది కరోనా/ బయటతిరుగకు బాధ పెంచకు భారమవ్వకు సోదరా/ మంచివాళ్ళను కనికరముతో కంటనన్నది కరోనా/ తడవతడవకు తమరి చేతులు కడుగుతుంటే మంచిదోయ్/ శుభ్రతుంటే కట్టుబాటులొ వుంటనన్నది కరోనా/ ప్రకృతంటే తల్లిలాంటిది చేటు చేయకు ఈడూరి/ సాటిజీవుల కోపమే ఈ మంటలన్నది కరోనా”.
“చూశావా? ఇన్ని మంచి మాటలు చెప్పేవాళ్ళున్నా, నువ్వు చెవికి ఎక్కించుకోవు కదూ! వెటకారపు అష్టకాన్ని ప్రార్థనా గీతం చేయగలవు కదూ! మీరంతా ఇంతే. కానీ, మీకు మించిన కోవిడియట్లున్నారు తెలుసా?” అడిగిందావిడ. అయోమయంగా చూశారు అంతా.
“వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఆపరేషన్‌ల కోసం వైద్యులని ఆశ్రయించే వాళ్ళు. వాళ్ళలో కొంతమంది మీ చేత కరోనా అంటింపబడిన వారే! అత్యవసర పరిస్థితిలో కరోనా పరీక్ష కోసం ఆగలేక డాక్టర్లు వివరాలడిగితే, బాధ్యతా రహితంగా బొంకినవాళ్ళు బోలెడు మంది. వాళ్ళ వల్ల ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరూ తరువాత ప్రమాదానికి గురైనట్టే కదా!
కొంతమంది కరోనా కోరల పాలపడితే, మరి కొందరు ఏకాంత వాసపు సంకెళ్ళు వేయించుకున్నారు. చూశారా మీ అహంకారం దేనికి దారి తీసిందో?” అడిగిందావిడ. “అదో సరదా, అహంకారం కాదు”, అని ఎవరో మైక్ ఆన్ చేసి అన్నారు.
“అంతేలే, పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం, అని వెనుకటికి మీ వాళ్ళే ఎవరో అన్నారులే! మీకు ఒకరు చెప్పిన మాట వినే అలవాటు లేదు, మీ పెద్దలైనా, మీ దేశపు ప్రధాని అయినా! అందుకనే ఇంతటి ఆపదని తెచ్చిపెట్టారు.
మనుషులకి చికిత్స చేసే వైద్యులకి ఈ వ్యాధి సోకితే, మీకు ఒంట్లో బాగులేకపోతే, మీకెవరు చికిత్స చేస్తారు? ఇలాంటి పనికిమాలిన వెర్రిమొర్రి వేషాలు వేస్తూ పోతే, మరి కొన్నాళ్ళకి ఎంతమంది వైద్యులు మిగులుతారు? అందుకే ఆరోగ్య దేవత నన్ను పంపించారు”, అని కొన్ని క్షణాల పాటు మౌనం వహించింది ఆవిడ.
“మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసే తరుణం వచ్చింది. చేస్తారు కదూ”, అందావిడ, ఆ మౌనాన్ని ఛేదిస్తూ. తమ ఉనికికే ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో, అందరూ, “చేస్తాం, చేస్తాం!” అని ఉత్సాహంగా అరిచారు. “మీరందరూ కరోనా సోకిన వారికి, సోకని వారికీ సహాయ పడుదురు గాక!” అని ఆవిడ దీవించింది.
ఎప్పుడూ రాంగ్ రూట్‌లో వెళ్ళడం తప్ప మంచిగా ఉంటూ సహాయమెలా చెయ్యాలో తెలియని ఆ కోవిడియట్లు తెల్ల మొహం వేశారు. వారి అయోమయాన్ని గ్రహించి ఆవిడ, “మీలో చదువుకున్న వాళ్ళు వెళ్ళి, ఆసుపత్రుల్లో సహాయపడండి. సహాయానికి పెద్ద పని, చిన్న పని అని ఉండవు. స్వచ్ఛందంగా వెళ్ళి రోగులకు సాయం చేయండి. వాళ్ళ పక్కని, తద్వారా మలమూత్రాలని, కఫాన్నీ శుభ్రం చేయండి. మీ ఇళ్ళను ఐసొలేషన్ వార్డులుగా మార్చండి.
మీ పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య పనివారికి తోడ్పాటునివ్వండి. మీరు నిల్వ చేసిన మాస్క్‌లూ, శానిటైజర్‌లూ అవసరమైన వారికి ఇచ్చేయండి. పాపం, పోలీసులు మీలాంటి కోవిడియట్లకి బుద్ధి చెప్పి చెప్పి అలిసిపోయారు. వాళ్ళకి ఒక రోజు విరామం ఇచ్చి మీలాంటి వాళ్ళకి, అదే కోవిడియట్లకి, బుద్ధి నేర్పండి. అనుకోవాలే గాని, మంచి చేయడానికి బోలెడన్ని ఉపాయాలున్నాయి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి- ఇక మీదట మీ జీవనం పరోపకారార్థమే!” ముగించింది ఆవిడ.
బుద్ధి పోనిచ్చుకోని ఒక కోవిడియట్, “మరి మాకు ఆ జబ్బు సోకదా?” అన్న అనుమానాన్ని వెలిబుచ్చాడు. “నేనిచ్చిన వరం వట్టిపోదు. ఆ ప్రశ్న కోవిడియట్ అవకముందు అడిగి ఉంటే, అసలు మీరంతా కోవిడియట్లు అయ్యేవారా?” అని, ఆవిడ అంతర్ధానమయ్యింది.
కోవిడియట్లు స్క్రీన్‌ని ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసినా, ఆవిడ జాడ లేదు. ఈ లోగా జూమ్ సాఫ్ట్‌వేర్ కూడా క్రాష్ అయ్యింది, వాళ్ళని పరోపకారార్థం బ్రతకమని ఆదేశిస్తున్నట్టు!
***
మరో ఏడాదికి, అంటే 2021లో మళ్ళీ కోవిడియట్ల మహాసభ జరిగింది. అప్పుడు అందరూ, “గతేడాది ఆ దూత వచ్చి మనకి బుద్ధి చెప్పకపోయుంటే మన వల్ల ఇంకెన్ని అనర్థాలు జరిగుండేవో! ఇప్పుడు మన బ్రతుకు మంచి పనులకే అంకితం చేశాం”, అని నెమరువేసుకుని, “సెకండ్ వేవ్‌ని ఓడించడానికి శాయశక్తులా కృషి చేద్దాం”, అని అనేక విధాలైన ప్రణాళికలు వేసుకుని, సభని ముగించారు ఒకప్పటి కోవిడియట్స్.
దానిలో భాగంగానే మాస్క్‌ని సరిగ్గా పెట్టుకోవడం నేర్పించడం, కరోనాపై అవగాహన పెంపొందించే వీడియోలు చేయడం, టీకా తీసుకోమని ఉద్బోధలూ మొదలైనవి చేశారు.
***
2022వ సంవత్సరానికి టీకాలు విజయవంతమయ్యాయి. కరోనా ఫ్లూ అంత బలహీన పడిపోయింది. ఈ ఏడు కరోనా బారిన పడ్డవారిలో ఎక్కువ శాతం వారం రోజుల్లో ఆరోగ్యవంతులయ్యారు. కోవిడియట్స్ మళ్ళీ సమావేశమై తమ పురోభివృద్ధిని నెమరు వేసుకుని, ఆరోగ్య దేవతా దూతకి ధన్యవాదాలు చెప్పుకున్నారు. అంతే కాకుండా, ఎప్పుడు, ఎటువంటి విపత్తు వచ్చినా సమాజ శ్రేయస్సుకే అంకితమవాలని తమకు తాము గుర్తు చేసుకున్నారు.
***సమాప్తం***
(తన కవిత్వాన్ని ఇక్కడ ఉపయోగించడానికి అనుమతించిన శ్రీనివాస్ ఈడూరి గారికి ధన్యవాదాలు)