[dropcap]15[/dropcap]-07-2022న శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఆమె తెలుగింటి ఆడపడుచు, మహారాష్ట్రీయుల కోడలు. టీనేజిలోనే హిందీ పాఠశాలలో పెద్దవారికి కూడా పాఠాలు నేర్పిన హిందీ టీచర్. బాపూజీ హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించిన ఆయన అభిమానాన్ని చూరగొన్న బాలిక. జవహర్లాల్ నెహ్రూనే టికెట్ లేదని ఎగ్జిబిషన్ లోని ప్రవేశించనివ్వని ఉత్తమ వాలంటీర్.
స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి, మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలంటే ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించారామె. జైలు నుంచి విడుదలై చదివి గ్రాడ్యుయేషన్ పట్టాని, న్యాయవాద శాస్త్రంలో పట్టాని పుచ్చుకున్నారు.
రాజ్యాంగ పరిషత్ లోనూ, రచనాసభలోనూ సభ్యురాలై, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రణాళికా సంఘ సభ్యురాలయ్యారు. కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ ద్వారా మహిళల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జీవితాంతం మహిళాభ్యుదయం కోసమే కృషి చేసి జీవితాన్ని అంకితం చేశారామె. ఆమే శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్.
ఈమె 1909వ సంవత్సరం జులై 15వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ నేటి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, బి.వి.యన్. రామారావు సామాజిక సేవకి అంకితమయినవారు. వారి ప్రాంతంలో ప్రజలకు సేవలు చేశారు. ప్లేగు వ్యాధి బాధితులను ఆదుకునేవారు. ఆ సేవా తత్సరతే ఆమెకు వారసత్వంగా లభించింది.
బాల్యంలోనే రామారావు అనే జమిందారు యువకుడితో వివాహం జరిగింది. కాని వివాహబంధం విఫలమయింది. తండ్రి బాల్యంలోనే మరణించారు. తల్లి, మేనమామల వద్ద పెరిగారు. హిందీలో అద్భుతమైన పాండిత్యాన్ని సంపాదించింది. సుమారు పన్నెండేళ్ళ వయస్సులోనే తన అనుభవంతో హిందీ పాఠాలు నేర్పేందుకు పాఠశాలను స్థాపించింది. ఈ సమయంలో స్వాతంత్ర్యపోరాటం ఆమెని ఆకర్షించింది. కాకినాడ కాంగ్రెస్ సమావేశాలలో రెండు సంఘటనలు ఈమె జీవనగతిని మార్చింది.
భారత జాతీయ కాంగ్రెస్ కాకినాడ సమావేశంలో అణగారిన వర్గాల స్త్రీల సమస్యలను గురించి మాట్లాడే విషయంలో గాంధీ గారిని సంప్రదించారు. ఇంత చిన్నమ్మాయి అలా అడిగినందుకు ఆశ్చర్యపోయిన గాంధీ ఒక షరతును విధించారు. 5000 రూపాయలను విరాళంగా ఇవ్వమని, అపుడు ఆ విషయం సంగతి చూద్దామని చెప్పారాయన. దీనిని సవాలుగా తీసుకున్నారు దుర్గాబాయ్. వారం తిరక్కుండానే 5000 రూపాయలుతో కూడిన పర్సును గాంధీజీకి అందించారు ఆమె.
గాంధీజీ చాలా ఆశ్చర్యపోయారు. ఆమె కార్యదక్షత, పట్టుదలలను అర్థం చేసుకున్నారు. ఆయన హిందీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించి వినిపించారు సభికులకి దుర్గాబాయ్. గాంధీజీ మెచ్చుకుని ఆంధ్రపర్యటనలో మిగిలిన సమావేశాలలో కూడా పాల్గొని తన ఉపన్యాసాలను అనువదించమని కోరారు. అది ఆమెకి లభించిన వరం.
కాకినాడ సమావేశాలలో ఖాదీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. టిక్కెట్ లేకుండా ఎవరినీ లోపలకు వెళ్ళేందుకు అనుమతించవద్దని నిర్వాహకులు ఆదేశించారు. టిక్కెట్ లేకుండా వచ్చిన ఒక వ్యక్తిని ఆపేశారు దుర్గాబాయ్. “అది గమనించిన నిర్వాహకులు నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా? ” అని కోప్పడ్డారు. అందుకు “ఆయన జవహర్‌లాల్ నెహ్రూ గారని నాకు తెలుసు. నేను నా విధిని నిబద్ధతతో నిర్వహిస్తున్నాను” అన్నారామె. జవహర్‌లాల్ నిర్వాహకులతో “తమ విధిని సమర్థత, అంకిత భావాలతో, నిజాయితీగా పని చేసే ఇటువంటి కార్యకర్తలే అవసరం” అని చెప్పి ఆమెను ప్రశంసించారు.
ఇలా నెహ్రూజీ, గాంధీజీల అభిమానాన్ని సంపాదించారు దుర్గాబాయ్. గాంధేయురాలిగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. శాసనోల్లంఘనోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలలో పాల్గొన్నారు. ఉప్పుసత్యాగ్రహంలో మహిళలతో కలిసి పాల్గొని విజయవంతం చేసి వావ్! అనిపించుకున్నారు. 1930-1933 సంవత్సరాల మధ్య 3 సార్లు అరెస్టయి రాయవెల్లూరులో జైలు శిక్షని అనుభవించారు.
ఈ జైలు జీవితం ఆమెకు కొత్త పాఠాలను నేర్పింది. మహిళల కష్టాలు, కన్నీళ్ళు, మనోవేదన, అవిద్య, అజ్ఞానం వారిని ఎంతగా వెనకబడేట్లు చేశాయో అవగాహన చేసుకున్నారు. జైలు నుండి విడుదలయిన తరువాత మహిళల సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేయాలనుకున్నారు.
కాని ఆమె చదువు ప్రాథమిక విద్యతోనే ఆగిపోయింది. (హిందీ భాషని నేర్చుకోవడం వేరే విషయం) ముందుగా తను చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. డిగ్రీని తీసుకున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టాని తీసుకున్నారు. మహిళలకు న్యాయ సంబంధమైన విషయాలలో సహాయం చేసేవారు.
మద్రాసులో ఆంధ్ర మహిళాసభను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అనాథ, పేద స్త్రీలకు వితంతువులకు, అభాగినులకు నేత, కుట్లు, అల్లికలు మొదలయిన చేతిపనులలో శిక్షణను ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఖాదీని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేయించారు. వివిధ ముడి పదార్థాలతో వివిద రకాల పనిముట్లు, ఆటవస్తువులు, బొమ్మలు తయారు చేసే చిన్న పరిశ్రమలను పెంపొందింపజేశారు. హైదరాబాద్‌లో కూడా ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.
మహిళాభివృద్ధితో సమాంతరంగా స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఏర్పాటయిన రాజ్యాంగ పరిషత్ లోను, రాజ్యాంగ రచనా సభలోను సభ్యులుగా నియమితులయ్యారు. హిందూ వివాహ చట్టం రూపకల్పనలో ఈమె నిర్వహించిన ప్రముఖ పాత్ర ఎనలేనిది.
ఈమె స్వాతంత్రానికి పూర్వం మహిళల కోసం చేసిన కృషి, అనుభవం స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా మహిళల కోసం కృషి చేయడంలో ఉపయోగపడింది. ప్రణాళికా సంఘసభ్యురాలిగా నియమించబడ్డారు. ప్రజాసేవకు ఈ పదవిని ఉపయోగించుకున్నారు.
ఈమె వివిధరంగాలలో చేస్తున్న కృషిని గమనించి, అభిమానించి, అభినందించిన మరో ప్రణాళికా సభ్యుడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శ్రీ చింతామణి దేశ్‌ముఖ్ 1953లో ఈమెను వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి మహిళాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారు. శిశువిహార్లు, బేసిక్ టీచర్ శిక్షణా సంస్థల ద్వారా ఉపాధ్యాయినులను, సమాజానికి అందించారు.
స్త్రీ విద్యకోసం జాతీయ స్త్రీ విద్యాసంఘం స్థాపన కోసం కృషి చేపట్టారు. స్త్రీలకు శిక్షణ ఇచ్చి నర్సులుగా, వైద్యరంగంలో వివిధ అంశాలలో పని చేసే వారి కోసం ప్రభుత్వరంగంలో శిక్షణా సంస్థలను నెలకొల్పారు. ప్రసూతి వైద్యశాలలను విస్తృతంగా నెలకొల్పారు.
1953లో కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థాపించారు. ఈ సంస్థకు తొలి అధ్యక్షురాలుగా 10 సంవత్సరాల పాటు పదవిని నిర్వహించారు. గ్రామాణ ప్రాంతాలలో 30,000 గ్రామాలలో సాంఘిక సంక్షేమ సంస్థలను స్థాపించారు.
ఈ సంస్థలు స్త్రీ విద్యతోపాటు, చేతిపనులు, కుటీర పరిశ్రమలు, కొన్ని ప్రాంతాలలో మహిళల చేత వ్యవసాయం చేయించడంలో ముఖ్యపాత్రను నిర్వహించాయి. భర్తతో కలిసి ఆయా ప్రాంతాలను పర్యటించి అక్కడ పనిచేసే వారి పని తీరుని గ్రహించేవారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల సాంఘిక, పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో ఈ సంస్థలు కీలకమైన పాత్రను పోషించాయి.
బాలికావిద్య, వయోజన విద్యల కోసం ప్రత్యేకంగా నిధులను విడుదల చేయించారు.
చైనాలో పర్యటించినప్పుడు అక్కడి కుటుంబ న్యాయస్థానాల పని తీరుని అధ్యయనం చేశారు. మనదేశంలో ఏర్పాటు చేస్తే మంచిదని ఆలోచించారు.
మహిళా విద్యకోసం జాతీయ మండలిని ఏర్పాటు చేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ వైద్యశాల, దుర్గాబాయి దేశ్‌ముఖ్ అనాథ బాలికల ఆవాస కేంద్రాలు, వివిధ అంశాలకు సంబంధించి శిక్షణా కేంద్రాలను స్థాపించి స్త్రీల పట్ల తనకు గల ప్రత్యేక అభిమానాన్ని చాటారు.
ఈమె దేశానికి వివిధరంగాలలో చేసిన సేవలకు గాను ఈమెకు పలు పురస్కారాలు లభించాయి. పాల్.జి. హాఫ్‌మన్ అవార్డు, నెహ్రూ అక్షరాస్యతా అవార్డు, జీవన్, జగదీష్ అవార్డులను ఈమె పొందారు. 1975లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.
‘ఆంధ్రమహిళా సభ’ స్థాపన నుండీ కార్యకలాపాలను, చరిత్రను గ్రంథస్తం చేసి “The Stone that Speak Book’ పేరుతో విడుదల చేశారు. ‘చింతామణి అండ్ ఐ’ పేరుతో ఆత్మకథను వ్రాసి అభిమానులకు అందించారు.
1981 మే 9 వ తేదీన హైదరాబాద్‌లో తను అపురూపంగా నిర్మించుకున్న గృహం ‘రచన’లో మరణించారు.
1982 మే 9వ తేదీన ఈమె జ్ఞాపకార్థం 35 పైసల విలువతో స్టాంపును విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. స్టాంపు మిద కుడివైపున దీక్షగా చూస్తున్న దుర్గాబాయి దేశ్‌ముఖ్ చిత్రం కన్పిస్తుంది. ఆమె గంభీరంగా కనిపిస్తారు.
స్టాంపు మీద ఎడమవైపు వయోజనులకు పాఠాలను చెపుతున్న టీచర్, పలకలు, పుస్తకాలతో పాటు కూర్చుని చదువుతున్న వయోజన స్త్రీలు కన్పిస్తారు. వారి వెనుక చార్టు పట్టుకున్న మరో టీచర్ కూడా కనిపిస్తారు. ఈ సన్నివేశం చూస్తుంటే టీనేజీలోనే బాలికలకి హిందీ పాఠాలను నేర్పిన దుర్గాబాయ్ గుర్తుకు వస్తారు.
15-07-2022 ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet