అన్నింట అంతరాత్మ-31: మీ కంటికి తోడును.. ‘కళ్లజోడు’ను నేను!

6
8

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం కళ్లజోడు అంతరంగం తెలుసుకుందాం.

***

కామాక్షమ్మ ఉల్లిగడ్డలు కోస్తోంది. వాటి ఘాటుకి ఆమె కళ్లు మండి వర్షించసాగాయి. చూపు అలుక్కుపోయింది. ‘బాబోయ్.. కళ్లు మండిపోతున్నాయి. నానీ నా కళ్లజోడు తెచ్చివ్వు’ అంది కొంగుతో కళ్లద్దుకుంటూ. నానీ కళ్లజోడు తెచ్చిస్తూ, ‘ముందే పెట్టుకోవచ్చుగా నానమ్మా’ అన్నాడు. ‘నిజమే. కాస్త బద్దకించేసరికే ఈ తిప్పలు’ కళ్లద్దాలు పెట్టుకుంటూ అంది కామాక్షమ్మ. ‘తిక్క కుదిరింది.. నేను (కళ్లజోడును) టేబుల్ మీద సిద్ధంగానే ఉన్నా పెట్టుకోకపోతే ఇలాగే అవుతుంది’ చిరుకోపంతో అనుకున్నాను.

ఇంతలో ‘ఆమధ్య ఎక్కడో చదివానత్తయ్యా.. ఉల్లిగడ్డలు కోసేటప్పుడు వాటిలో ఉన్న రసాయనం కారణంగా కళ్లు మండి, నీరు కారుతుందని, ఈ ఇబ్బంది లేకుండా దీనికోసం ప్రత్యేక కళ్లద్దాలు మార్కెట్ లోకి వచ్చాయని రాశారు. వాటిని ‘ఆనియన్ గ్లాసెస్’ అంటారు. వివిధ రంగుల్లో దొరుకుతాయట. పైగా విరగని మెటీరియల్‌తో తయారు చేశారుట’ చెప్పింది కోడలు కోమల. ‘అవునా.. భలేఉందే. ఎక్కడ దొరుకుతాయో తెలుసుకో’ అంది కామాక్షమ్మ. ‘అలాగే’ అంది కోమల. ‘అబ్బో! మా జాతిలో కళ్లు మండకుండా ఉల్లిగడ్డలు కోసేందుకు సాయపడే కొత్తరకం వచ్చిందన్నమాట. అయితే త్వరలో మాకో నేస్తం వస్తుంది’ అనుకున్నాను సంతోషంగా.

‘అమ్మా! గుడ్డివాళ్లు నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారు?’ అడిగాడు నాని. నాకు టీవీలో చూసిన అంధులు గుర్తొచ్చారు. ‘నిజమే. వాళ్లు ఎందుకు నల్ల కళ్లజోడు ధరిస్తారో విందాం’ అని దృష్టంతా అటుంచాను.

‘అంధులలో చాలామందికి కొద్దిగా చూపు ఉంటుంది. వారు నల్ల కళ్లజోడు ధరిస్తే వారు చూడడానికి మరింతగా సహాయపడుతుందని ఆ మధ్య ఓ హెల్త్ లైన్ నివేదిక తెలిపింది. అదీ కాకుండా కంటిచూపు కోల్పోయిన బాధితులు కాంతిలో ఓ ప్రత్యేక సమస్యను ఎదుర్కొంటారు. దాన్ని ఫొటో ఫోబియా అంటారు. ఈ భయాన్ని నివారించడానికి వాళ్లకు నల్ల కళ్లజోడు ధరించమని వైద్యులు సూచిస్తారు. ఇంకో కారణం ఏమిటంటే సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు వారి కళ్లను మరింత దెబ్బతీయకుండా కూడా వారు నల్ల కళ్లజోడు పెట్టుకోవలసి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంచి అంధులు నల్ల కళ్లజోడు ధరించినపుడు ఆ వ్యక్తి కంటి వ్యాధితో బాధపడుతున్నట్లు ఇతరులకు వెంటనే అర్థమవుతుంది. ఫలితంగా అతడికి సహాయం చేసేందుకు వీలవుతుంది. అర్థమైందా’ అంటూ, ‘నువ్వూ, నానమ్మా హాల్లో కూర్చోండి. నేను పకోడీలు చేసి త్వరగా పట్టుకొస్తాను. నీకు ఇంకా సందేహాలు ఉంటే తాతయ్య, బాబాయ్ కూడా ఉన్నారక్కడ. వాళ్లనడుగు’ చెప్పింది కోమల. ‘సరే, రా నానమ్మా’ అంటూ హాల్లోకి దారితీశాడు నాని.

అక్కడ ఈజీ చెయిర్లో పడుకున్న తాతయ్య, సోఫా మీద బైఠాయించిన బాబాయ్ కనిపించారు. ‘తాతా! అంధులు కానివారు కూడా నల్ల కళ్లద్దాలు ధరిస్తుంటారు కదా, మరి నీ కళ్లద్దాలేమో వేరుగా ఉంటాయి.. ఎందుకు?’ అడిగాడు నాని. ‘ఇవాళ నా కళ్లజోడు మీద నీ చూపు పడిందా. సరే చెపుతా విను. నేను కంటి చూపులో లోపం ఉండట వల్ల కళ్లజోడు వాడుతాను. నాకంటి చూపు లోపానికి అనుగుణంగా కంటి అద్దాలను తయారు చేసి ఇచ్చారు. దృష్టి దోషాలు రెండు రకాలు. హ్రస్వ దృష్టి, దీర్ఘదృష్టి. హ్రస్వ దృష్టి అంటే దగ్గరున్నవి చూడలేకపోవటం, దూరదృష్టి అంటే దూరంగా ఉన్నవి చూడలేకపోవటం. ఇంక దృష్టి దోషం ఏమీ లేకపోయినా వేసవిలో కంటికి మంచిదని చలువ కళ్లద్దాలు ధరిస్తారు. వాటినే సన్ గ్లాసెస్ అని కూడా అంటారు. కొంతమంది వాహనాలపై ప్రయాణించేవారు కళ్లలో దుమ్ము, ధూళి పడకుండా కంటికి రక్షణగా కూడా ఈ కళ్లద్దాలను వాడతారు. ఇంకొంతమంది ఫ్యాషన్ కోసం వాడుతుంటారు అదుగో, మీ బాబాయ్ లాగా’ నవ్వుతూ.. ముక్కుమీదకు జారిన కళ్లజోడును పైకి నెట్టుకుంటూ ముగించాడు తాతయ్య. బాబాయ్ అశ్విన్, తండ్రి వంక వాడిగా చూస్తుండగా, మా కళ్లజోళ్ళలో ఇన్ని రకాలున్నాయన్నమాట అనుకున్నాను నేను.

ఇంతలో అశ్విన్ అందుకుని ‘నానీ! తాతయ్య, నాకు ఫ్యాషన్ అంటున్నారు కానీ, నల్ల కళ్లద్దాలు ఏనాటి నుంచో వాడకంలో ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత డిఎంకె అధినేత కరుణానిధి ఎప్పుడూ నల్ల కళ్లజోడు ధరించడం అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన భౌతిక కాయానికి కళ్లజోడు పెట్టే ఉంచారు. కొన్ని దశాబ్దాల పాటు ఎంజీఆర్, కరుణానిధి నల్ల కళ్లజోళ్లు ధరించి ట్రెండ్ సెట్టర్లుగా నిలిచారు. అయితే కరుణానిధి, నల్ల కళ్లద్దాలు ధరించడానికి వెనుక ఒక బలమైన కారణం ఉందంటారు. గతంలో ఓసారి ఆయన కంటికి చిన్న గాయమైందట. చికిత్స అనంతరం డాక్టర్లు కళ్లద్దాలు ఎప్పుడూ వాడాలని సూచించారట. ఆయన అలాగే చేశారు. కొంతకాలం తర్వాత నల్లటి స్టైలిష్ కళ్లద్దాలను వాడటం మొదలు పెట్టారు’ చెప్పాడు. ‘చూశారా, నా ప్రత్యేకత’ అశ్విన్ చెంతనే ఉన్న నల్ల కళ్లజోడు, నా వంక, తాతగారి కళ్లజోడు వంక గర్వంగా చూసింది. మేం ఒకింత అసూయగా చూసి, మరుక్షణమే ‘అయితే మాకేంటి’ అన్నట్లు నిర్లక్ష్యంగా చూశాం దానివంక.

ఇంతలో కోమల పకోడీలు పట్టుకొచ్చి అందరికీ అందించింది. వాటిని తింటూ నాని ‘బాబాయ్! అసలు కళ్లద్దాలను మొదటిసారిగా ఎప్పుడు, ఎవరు కనుగొన్నారు?’ అడిగాడు ‘మొదటిసారిగా అంటే పదమూడో శతాబ్దిలో ఇటలీకి చెందిన సాల్వనో డి. అర్‌మటి కనుగొన్నాడు. రెండు కుంభాకార కటకాలను కొయ్యచట్రాలలో బిగించి, వాటి రెంటికి ఫ్రేముని తయారుచేశాడు. అయితే పద్దెనిమిదో శతాబ్ది వరకు కళ్లద్దాలకు ఇప్పటి ఆకారం రాలేదు. ముఖంపై అవి సరిగ్గా నిలిచేలా రూపొందించడమనేది క్రమంగా జరిగిందన్నమాట. కళ్లద్దాల ఫ్రేముకి తగిన మెటీరియల్‌ను వాడటం కూడా క్రమంగా వచ్చిన మార్పే. ఇక బైఫోకల్ లెన్స్‌ను పదిహేడువందల ఎనభైనాలుగులో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుగొన్నాడు. దగ్గర, దూరం తేడాలకు కళ్లద్దాలను మార్చడం కష్టమై, వాటిని కనుగొన్నాడు. తర్వాత వీటిని మెరుగుపరచడం జరిగింది’ వివరించాడు. ‘మా సృష్టి ఇలా ఆరంభమైందన్నమాట’ అనుకున్నాను నేను.

అంతలో తాతగారు పకోడీలు తినడం పూర్తిచేసి, ‘అన్నట్లు ఇంకో సంగతి, గొప్ప గొప్ప వాళ్లు వాడిన కళ్లద్దాలకు ఎంతో విలువ ఉంటుంది. స్మృతి చిహ్నాలుగా వారి స్మారక కేంద్రాలలో ఉంచుతారు. అంతేకాదు వారు వివిధ కళ్లజోళ్లను వాడి ఉంటే వాటిని కొన్నిసార్లు వేలం వేయడం కూడా జరుగుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం గాంధీజీ వాడిన బంగారుపూత కళ్లద్దాలను బ్రిటన్లో వేలం వేశారు. వాటికి మన కరెన్సీలో రెండున్నర కోట్లకు పైగా ధర పలికింది. ఇంతకూ ఆ కళ్లజోడు అక్కడ ఎలా ఉందంటే.. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు దాన్ని ఓ వ్యక్తికి ఇచ్చారు. అప్పట్లో మహాత్ముడు తాను వాడే కళ్లజోడును మారిస్తే పాత అద్దాలను ఎవరికైనా అవసరం ఉన్న పేదలకు ఇచ్చేవారట. అలా ఇచ్చిన కళ్లజోడే ఇది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి తాలూకు కుటుంబీకులు బ్రిటన్‌కు మారారు. వారే వాటిని అక్కడి ఓ సంస్థకు అందించి వేలం వేయించగా భారీ ధర పలికింది’ చెప్పాడు తాతయ్య. ‘మహాత్ముడు ధరించి, మా జాతికి ఎంత గౌరవం కల్పించాడో కదా’ అనుకుంటుంటే ‘అయ్యబాబోయ్.. అంత రేటా’ అన్నాడు నాని. ‘ఏమనకున్నావు మరి, అవి మహాత్ముడు ధరించినవి’ అన్నాడు బాబాయ్.

కోమల అందుకుని ‘మహాత్ముడంతటి వాడు కళ్లద్దాలు అవసరం ఉన్నవారికి తాను వాడినవి ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ నేటి కాలంలో చిన్నపిల్లలు కూడా ఇలాటి సేవకు పూనుకోవడం విశేషం. ఢిల్లీలోని బారాఖంబా రోడ్‌లో ఉన్న ఓ పాఠశాలలో చదువుతున్న ఆరుషి గుప్తా బీదలకు కళ్లజోడు సాయం అందించి వారికి చూపు ప్రసాదిస్తోంది. తను, తన స్నేహితుల వరకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా ‘స్పెక్టాక్యులర్ డ్రైవ్’ అనే పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని విస్తరింపజేసింది. పాత కళ్లద్దాలను సేకరించి, కళ్లజోడు కొనుక్కోలేని పేదలకు అందజేయడమే ఈ డ్రైవ్ లక్ష్యం. ఇరుగు పొరుగు, కళ్లద్దాల షాపులు, వివిధ సంస్థలు, తెలిసినవాళ్లందరి నుంచి పాత కళ్లద్దాలను, ఫ్రేములను సేకరించి వాటిని ఎన్‌జిఓలకు, స్వచ్ఛంద సంస్థలకు అందించింది. ఆరుషి ఎన్‌జిఓల సహాయంతో ఉచిత కంటి వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. అంతేకాదు, దేశంలో ఎంతమంది కళ్లజోడు సాయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశోధన మొదలెట్టింది. భారత్‌లో పదిహేను కోట్లకు పైగా పేదలు దృష్టిలోపంతో బాధపడుతూ, వైద్య పరీక్షలు చేయించుకోలేక, కళ్లద్దాలు కొనుక్కోలేక అలాగే జీవితాన్ని నెట్టుకొస్తున్నారని తెలుసుకుంది. నిజానికి పాత, పాడైన ఫ్రేములను రీసైకిల్ చేయడం వల్ల తక్కువ ధరకే వాటిని మళ్లీ తయారు చేయవచ్చు, విక్రయించవచ్చు, పర్యావరణానికి కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది’ అంది. ‘చిన్నదైనా ఎంత మంచి పనిచేస్తోందో. ‘పిల్లలంతా ఆరుషిని చూసి నేర్చుకోవాలి’ అంది కామాక్షి.

‘త్రీడీ మూవీలను త్రీడీ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తే భలే ఉంటుంది. ఆ పులులు, ఏనుగులు మన మీదికి వచ్చినట్లు ఉంటుంది’ అన్నాడు నాని. ‘మా జాతిలో ఆ రకంకూడా ఉందన్నమాట. ఎంత గొప్ప’ గర్వంగా అనుకున్నాను నేను. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి అయింది. అంతా అటుచూశారు, నాతో సహా.

‘నాన్నా!’ ఆనందంగా అరిచినంత పనిచేశాడు నాని. ‘పకోడీల వాసన అదుర్స్’ అంటూ హాల్లోని వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. కోమల హాట్ ప్యాక్ లోంచి పకోడీలు తీసి ప్లేట్లో పెట్టి అతడికి అందించింది. పకోడీలు తింటూ ‘నాన్నా! నీ మతిమరుపు వారసత్వం నాక్కూడా వచ్చినట్లుంది. ఇవాళ ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా?’ అడిగాడు. ‘ఏం జరిగిందేమిటి?’ అంతా ఒక్కసారిగా అడిగారు. నేనూ ఆత్రంగా ఎదురు చూస్తున్నా.

‘కళ్లజోడు కనపడటం లేదని ఆఫీసులో తెగ వెతికా. కనపడలేదు. చివరకు ఆఫీసర్ రూములో మర్చిపోయానా అని అనుమానం వచ్చింది. పిలవకుండా, పనిలేకుండా ఆయన దగ్గరకు అలా వెళ్లిపోవడం ఎలా అనుకున్నాను. చివరకు ఏమయితే అయిందని ఆఫీసర్ రూమ్ లోకి వెళ్లా. నేను కళ్లతోనే అటు, ఇటు వెతకటం చూసి, ఆయన ఏమిటని అడిగాడు. చెప్పాను. ఆయన పగలబడి నవ్వాడు. నాకు అర్థం కాక బిక్కమొహం వేశాను. ఆయన నవ్వు ఆపి నీ కళ్లద్దాలు నీ ముఖం పైనే ఉన్నయ్ కదా’ అన్నాడు. అప్రయత్నంగా చేత్తో తడుముకున్నా. నిజమే. ముఖం మీదే ఉన్నాయి. సిగ్గుపడి బయటకు వచ్చేశా’ చెప్పాడు. అంతా నవ్వారు. ‘ఈసారి నుంచి ఓ పని చేయండి’ అంది కోమల. ‘ఏమిటో అది?’ అన్నాడు నాని నాన్న ప్రసాద్. ‘కళ్లద్దాలు వెతికే ముందు అద్దంలో ఓసారి చూసుకోండి’ అంది. అంతా నవ్వారు. ‘నాన్నా! భలే విషయం చెప్పావే. మేం నువ్వు వచ్చేముందు కళ్లజోడు గురించే మాట్లాడుకుంటున్నాం’ అన్నాడు నాని.

‘అలాగా. కళ్లజోడు అంటే నాకు ఆ మధ్య చదివిన ఓ తమాషా సంగతి గుర్తొస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని నువ్వుల రేవు గ్రామంలో ఓ వింత ఆచారం ఉందట. పెళ్లికి పెళ్లికొడుకు మెడలో నోట్ల దండ వేసుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని వస్తేనే పెళ్లిపీటలు ఎక్కనిస్తారట. ఇంకా తమాషా ఏమిటంటే వరుడు, వధువు మెడలో తాళి కట్టడంతో పెళ్లి అయిపోదు, వధువుకూడా వరుడి మెడలో తాళి కట్టాలిట. అప్పుడే పెళ్లయినట్లుట’ అనగానే అంతా నవ్వులే నవ్వులు. ‘నాకయితే ఈ ఆచారం నచ్చింది. మగవాళ్లు కూడా అప్పుడు పెళ్లయిన గుర్తుగా తాళి ధరిస్తారు’ అంది కోమల. ‘ఇంకా వినండి.. ఆ ఊరి అబ్బాయిలు వృత్తిరీత్యా ఏ ఊళ్లో ఉన్నా పెళ్లి మాత్రం ఆ ఊరి అమ్మాయిని మాత్రమే చేసుకోవాలట. భలే ఉంది కదూ’ అన్నాడు ప్రసాద్. ‘నువ్వుల రేవు మా జాతికి ఇచ్చిన ప్రాధాన్యం నాకెంతో ఆనందం కలిగించింది. పెళ్లికొడుకు నల్లకళ్లజోడు ధరించి తీరాలని ఆచారం నెలకొల్పిన నువ్వుల రేవు గ్రామస్థుల పట్ల నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.

‘నేనూ ఒక విషయం గమనించా.. నాయకుల వెనుక ఉండే బాడీగార్డ్స్ నల్ల కళ్లద్దాలు ధరిస్తారు. అంటే అవి ధరిస్తే తాము ఎవరివంక చూసేదీ ఎదుటివారికి అర్థం కాదు కాబట్టి, చుట్టూ అందర్నీ గమనిస్తూ, తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారన్నమాట’ అన్నాడు. ‘కరెక్టుగా చెప్పావు’ అన్నాడు తాతయ్య.

అంతలో ‘అవునుగానీ మీకు మాట్లాడే కళ్లజోడు గురించి తెలుసా?’ అడిగాడు బాబాయ్. నేను నివ్వెరపోతుండగానే, ‘ఏమిటీ మాట్లాడే కళ్లద్దాలా?’ అన్నారు అమితాశ్చర్యంగా. ‘తెలియదా.. సరే, చెప్తా వినండి.. ఇజ్రాయిల్‌కి చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ అమ్నన్ షాషువ అంధుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ఓ కొత్త కళ్లజోడును కనుగొన్నాడు. దానికి ‘ఆర్కామ్ మై ఐ 2’ అని పేరు పెట్టాడు. కృత్రిమ మేధస్సు సహకారంతో ఇది పనిచేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టి చెపుతుంది. అలాగే కరెన్సీ నోటు విలువ ఎంతో చెపుతుంది. పుస్తకాలను చదివి వినిపిస్తుంది. ఇది కేవలం అంధులకు మాత్రమే కాకుండా చదవడంలో ఇబ్బందుల నెదుర్కొనే డిస్లెక్సియా పీడితులకు కూడా ఉపయోగిస్తుంది. ఈ మాట్లాడే కళ్లజోడును మరింతగా మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారట’ చెప్పాడు. అంధులకు మా జాతి సేవ గురించి విన్న నాకు సంతోషంతో కూడిన గర్వం కలిగింది.

‘చాలా బాగుంది. చూపులేని వాళ్లకు ఇలాంటివి ఎంతైనా అవసరం. గతంలో కళ్లద్దాలంటే పిల్లలకు ఎంతో వ్యామోహం ఉండేది. చిన్నప్పుడు తిరుణాళ్లలో రంగుకాగితంతో తయారుచేసిన కళ్లద్దాలు కొనిస్తే గొప్పగా ఉండేదని మా అమ్మ చెప్పేది. మా పెద్దమ్మకు సోడాబుడ్డి కళ్లద్దాలు ఉండేవి’ అంది కామాక్షి. ‘అంటే అవేం కళ్లద్దాలు?’ అడిగాడు నాని. ‘అంటే అంత మందంగా ఉన్న అద్దాలన్నమాట. కంటి పవర్ ఎక్కువగా ఉంటే అలాంటి కళ్లద్దాలు ఇచ్చేవారు. ఇప్పుడు కళ్లద్దాలకు ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి అవి పలచగా, తేలిగ్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఫ్రేములు కూడా ఎన్నో రకాలుగా తేలిగ్గా ఉంటున్నాయి. ముఖం మీద బరువుగా, మోటుగా ఉండటం లేదు. అద్దాలు కూడా చదరంగా లేదా గుండ్రంగా మన ఇష్టాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి’ అంది. అంతా ‘అవునవును’ అన్నట్లుగా తలలాడించారు.

ఆ తర్వాత కోమల మాట్లాడుతూ ‘నేను కళ్లజోడుకు సంబంధించి మరో విషయం చదివాను. అది డ్రైవర్లకు నిద్ర మత్తు వదిలిస్తుందట’ అంది. అంతా ‘చిత్రంగా ఉందే’ అన్నారు. ‘అవును. కర్ణాటకకు చెందిన ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు చిన్మయ గౌడ, వితిక్ శెట్టి ‘లైఫ్ లైన్’ పేరిట ఈ కళ్లజోడును రూపొందించారు. దీనికి ఓ వైపు బ్యాటరీ, మరో వైపు సెన్సర్ అమర్చారు. వీటిని ధరించిన వ్యక్తి రెండు సెకన్లపాటు కళ్లు మూసుకున్నా వెంటనే అలారం తరహాలో ఈ కళ్ల జోడు నుంచి పెద్ద శబ్దం వస్తుంది. రెండు కళ్ల వద్ద ఉండే వైబ్రేటర్ ఆన్ అయి డ్రైవరును అప్రమత్తం చేస్తుంది. కళ్లను తెరిచే వరకు వైబ్రేషన్ కొనసాగుతుందిట. ఈ కళ్లజోడు తయారీకి సాధారణ చలువ కళ్లద్దాలు, ఐ బంక్ సెన్సర్, నానో చిప్, మినీ సౌండ్ బజర్, వైబ్రేటర్, తొమ్మిది వాట్స్ బ్యాటరీలను వాడారట’ చెప్పింది. వింటుంటే నాకు భలే సంతోషంగా అనిపించింది. ‘పిల్లలయినా ఎంత మేలైన కళ్లజోడును తయారుచేశారో! నిద్రమత్తులో డ్రైవర్లు వాహనాలను ప్రమాదకరంగా నడపటం, ప్రాణనష్టం జరగటం తరచు వింటుంటాం. ఇలాంటి కళ్లజోడు వాడుకలోకి వస్తే చాలావరకు ప్రమాదాలను తప్పించవచ్చు’ అన్నాడు తాతయ్య. ‘నిజమే’ అన్నారంతా.

‘ఆ మధ్య నేను మరో విషయం విన్నాను. షికాగోకు చెందిన స్కాట్ ఉర్బన్ అనే ఆయన, సైకిలిస్టులకు, జాగింగ్ చేసేవారికి రాత్రిపూట బాగా కనిపించేందుకు ఓ కొత్త రకం కళ్లజోడును రూపొందించాడట. వాటిని ‘రిఫ్లెక్టకల్స్’ అంటారు. అయితే వీటిని ధరిస్తే సిసి కెమెరాలలో వారి ముఖం కనిపించదని, కేవలం వెలుగు మాత్రమే కనిపిస్తుందని, అందువల్ల నేరగాళ్లు వీటిని వాడే ప్రమాదం ఉందని కొంతమంది సోషల్ మీడియాలో వాపోయారు’ చెప్పాడు బాబాయ్. ‘వీటితో మేలు మాటేమో కానీ కీడు గురించి ఎవరికైనా భయం కలుగుతుంది’ అంది కామాక్షి. నాకు కూడా కొంచెం నిరాశగా అనిపించింది.

‘ఇదివరకు ఏ నలభై ఏళ్లు దాటిన వాళ్లకో కళ్లద్దాలు అవసరమయ్యేవి. ఇప్పుడు అన్ని వయసుల వారు ఏదో ఒక కంటిలోపంతో కళ్లద్దాలు వాడుతున్నారు. కాల మహిమ ఏంచేస్తాం.. ఇంకో సంగతి ఏమిటంటే, కళ్లజోడు అయితే ముక్కుకు నొక్కుకోవడం, మచ్చలు పడడం వంటి ఇబ్బందులుంటాయని కొంతమంది కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటున్నారు. ఇవి పెట్టుకుంటే దృష్టిలోపం ఉన్న విషయం అవతలివారికి తెలియదు కూడా. అయితే ఇవి తీసి, పెట్టుకోవడానికి నేర్పు కావాలి. మరికొంతమంది ఖర్చుకు వెనకాడకుండా లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. ఏమైనా మొత్తంమీద కళ్లజోడు వారే ఎక్కువ’ అన్నాడు తాతయ్య. కొత్త విషయాలు విని ‘ఔరా’ అనుకున్నాను నేను.

‘రాజకీయ నాయకులు ప్రతిపక్షం వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కళ్లద్దాలను ప్రస్తావన చేయడం పరిపాటి. ఆ మధ్య అమిత్ షా, రాహుల్ గాంధీని ‘ఇటాలియన్ కళ్లద్దాలు తీసి, అభివృద్ధిని చూడండి అన్నాడు’, నవ్వుతూ చెప్పాడు ప్రసాద్. ‘ఆమధ్య కరోనా నుంచి రక్షణకు కూడా అందరూ కళ్లజోడు వాడారు. అయితే కళ్లజోడును పదిలంగా, శుభ్రంగా ఉంచుకోకపోతే, దానివల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాటి భద్రత మనం చూసుకుంటే, మన రక్షణ అవి చూస్తాయి’ అంది కామాక్షి. ‘అవునవును. అమ్మో! టైము చాలా అయింది. అలా వాకింగ్ కెళ్ళిస్తాను నేను’ లేస్తూ అన్నాడు తాతయ్య. ‘నిజమే. చాలా సేపు మాట్లాడుకున్నాం’ అంటూ అంతా లేచారు.

కామాక్షి కళ్లజోడును, అంటే నన్ను తీసి, పర్సులో పదిలంగా పెట్టి, టేబుల్ మీద ఉంచింది. అంతా నిశ్శబ్దం కావడంతో నాలో, నేను మొదలైంది.. ఈ మనుషులు వినాలే కానీ వాళ్లకోమాట చెప్పాలనుంది. అది.. నన్ను ధరించి భౌతికం గా చూపును సరిదిద్దుకుంటున్నారు. కానీ మనసు చూపు సంగతో.. అనేక విషయాలను సంకుచిత దృష్టితో, వక్ర దృష్టితో చూడడం, స్వార్థ దృష్టితో చూస్తుంటారు. లోచూపును కూడా సవ్యంగా ఉంచుకున్నప్పుడేకదా, మనిషి మనిషిగా బతకగలిగేది! మా జాతి ఇన్ని రకాలుగా మీకు సేవలు చేయడం మాకెంతో గర్వ కారణం. కానీ మమ్మల్ని ధరించి, మీరు ద్వేషపు చూపులు, విషపు చూపులు చూస్తుంటే చెప్పొద్దూ, మేమే ఏదో నేరం చేస్తున్నట్లు, పాపం చేస్తున్నట్లు బాధపడిపోతాం. అందుకే లోచూపును ఎప్పటికప్పుడు దిద్దుకోమని నా విన్నపం.. కానీ నా మాట వారికి చేరేనా? చేరినా మనసుకెక్కేనా? అనుకుంటుంటే ‘ఏమండీ!’ కోమలి, ప్రసాదును పిలవడంతో నా దృష్టి అటు మళ్లింది.

‘ఏమిటోయ్!’ అన్నాడు ప్రసాద్. ‘ఏం లేదు, ఒక సారి కళ్ల పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నా. ఈ మధ్య దూరంగా ఉన్న బస్సు నంబర్లు కనపడటం లేదు’ అంది. ‘దానికేంఉంది. ఉన్నాడుగా మన డాక్టరు నయనానంద్. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళ్లాం పద. కంటి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు’ అన్నాడు ప్రసాద్. ‘సరే’ అంటూ కోమలి తయారవసాగింది. ‘అంటే ఇంట్లో మా జాతి సంఖ్య పెరుగుతుందన్న మాట. కొత్త నేస్తం వస్తుందన్న ఊహతో నా మనసు సంతోషపు అలల్లో అలా అలా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here