[dropcap]ఉ[/dropcap]దయానే ఏదో అలికిడి
లేత అడుగుల చప్పుడు
కళ్ళు తెరచి చూస్తే చేతిలో కాగితంతో ఎదురుగా మా అబ్బాయి
బయట భోరున వర్షం
బాల్యంలోకి వెళ్ళి తేరుకునేలోపు
వాననీటిలో వాడు కాగితపు పడవయ్యాడు
ప్రవాహంతోపాటు పడవ వెళ్తుంటే
వాడి ముఖంలో చెప్పలేని ఆనందం
ఒక్కొక్క కాగితపు పడవ వాడి చేతికి అందించినప్పుడు
నీళ్ళలోకి వదులుతూ కృతజ్ఞతగా నావైపు చూస్తుంటే
ఆనీటిలో లీలగా మానాన్న కనబడ్డాడు
పడవలతోపాటు టపటప అడుగులతో
వాడు నీళ్ళలో తేలిపోతున్నాడు
కాలంలా జారిపోతున్న కాగితపు పడవమీద
ఒక్కొక్క వానచినుకు పడుతుంటే
బరువుతో నాలో నేను కుంగిపోయాను
చివర కాగితనపు పడవ
నాకొడుకు చేతిలోంచి దూరమైనప్పుడు
వాడి కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి
బాల్యం అడుగున దాగున్న జ్ఞాపకం
కాగితపు పడవగా ఎదురైనప్పుడు
ఆ అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది
బాల్యం పేజీని చించేసినవాడికి
జీవితపు పుస్తకంలో చోటుండదు
మనం కాగితాన్నే చూస్తాం గాని
దాని వెనకున్న ఆనందాన్ని చూడం
బాల్యంలో కాగితపు పడవ ఓ రూపం మాత్రమే
ఆ రూపాన్ని వదులుకుంటే ఆనందాన్ని వదులుకున్నట్టే
గుండె పొరలకింద దాగిన అనుభవాలు
తవ్వి బయటకు తీసినప్పుడు
ఒక్కొక్క జ్ఞాపకం ఓ కాగితపు పడవే