[dropcap]వి[/dropcap]ప్పుకుంటున్న ఆలోచనలు
దుంకుతున్నాయి జలపాతాల్లా
ఎగిరి పోతున్నాయి పక్షుల్లా
రాలిపోతున్నాయి ఆకుల్లా
అల్లుకుపోతున్నాయి తీగల్లా
ముసురు కుంటున్నాయి మబ్బుల్లా..!
రకరకాలైన లోచనాలను
నెమరువేసుకుంటూనే ఉంటాము
ఎంత కాదనుకున్నా కూడా
వదిలి వెళ్ళిన వాళ్ళ గూర్చిన
తలంపులు తరిగిపోవు
ఇబ్బందులు వస్తూనే ఉంటాయి
వాటన్నింటినీ ఛేదిస్తూనే సాగుతుండాలి..!
చిరు జల్లుల వంటి నడకల సోయగాలు
మనస్సును హత్తుకుంటవి
బాగుంటాయి చుట్టూరా
మనల్ని ఆకర్షిస్తుంటవి
ఎన్ని చెప్పుకున్నా కూడా
ఎన్ని పూరించిన కూడా
ఇంకా ఖాళీలు మిగిలే వుంటవి..!
పలు రకాలైన బంధాల గురించి
వాడవాడలా చెప్పుకుంటాము
ఒక సమ్మోహనమైన దృశ్యం
ఒక పిలుపుల ఆత్మీయత
ఒక మలుపుల అనుభూతి
తరగని మాటల కలబోత…!
కుంగుబాటును పాతర వేద్దాం
జరుగుబాటుకు స్వాగతం చెబుదాం
కౌగిలింతల కొలమానాల గురించి
చెప్పుకున్నవన్ని తక్కువే అవుతాయి
విషాద గాథల, విజయగాథల
మరువని ఘట్టాల గూర్చిన
మాటల మేఘాలు వర్షిస్తున్నాయి ..!
చిందరవందరైన జీవితాల్లోని
అసామాన్యమైన అనుభవాలను
అపురూపంగా గుండెలోనే
పదిల పర్చుకుందాం
మరువని జ్ఞాపకాల స్ఫూర్తితో
మనిషిలా మొలకెత్తుదాం..!