వింత దంపతులు!

0
3

[dropcap]ఆ[/dropcap] రోజు.. అమావాస్య!.. పైగా అర్ధరాత్రి!

ఇంట్లోకి దొంగ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతుంది అతనికి. మెలుకువ వచ్చింది.. రావడమే తడవుగా.. టార్చి తీసుకుని పెరట్లోకి వచ్చాడు. చీకట్లో చుట్టూ చూస్తున్నాడు కాంతయ్య!

దూరంగా మనిషి కదిలినట్లుగా అలికిడి వినిపిస్తుంది.

ఆకులు కదులుతున్నట్లుగా అలికిడి.. కీచురాళ్ళ శబ్దం.. సన్నగా కనిపిస్తున్న వెలుతురులో మనిషి కదులుతున్న ఆనవాలు కనిపించి కనిపించినట్లుగా అనిపిస్తుంటే.. అటుగా నడిచాడు!

“యావండి..” కాంతం పిలుపు వినిపించింది.

ఆ పిలుపు ఆ చుట్టూ ప్రతిద్వనించడంతో.. ఉలిక్కి పడ్డాడు.

గుమ్మం దగ్గర నిలబడిన భార్య వైపు చూస్తూ.. “హుష్..” అన్నాడు అలికిడి చేయొద్దు అన్నట్లుగా.

అతని దగ్గరకు వచ్చింది కాంతం.

భర్త అడుగులో అడుగేసుకుంటూ నిశ్శబ్దంగా పెరట్లో నుండి బయటకు నడుస్తుంటే.. తనూ అలికిడి చేయకుండా గేటు వైపు నడిచింది.

గేట్ కిర్రు మంటూ శబ్దం చేస్తుంటే.. భార్యాభర్తలిద్దరూ కంగారు పడ్డారు.

“మీరు ఇల్లు కట్టే కొత్తల్లోనే చెప్పాను.. ఇట్లా నగర శివారుల్లో ఇల్లు కట్టవద్దని. కాస్త ఆలస్యమైనా అందరూ ఇక్కడకి వచ్చాకే మనమూ వద్దామని లెక్కలేనన్ని సార్లు చెప్పాను. నా మాట వింటేగా మీరు”.

“హబ్బా.. అలా గోలెట్టకే”.

“అయినా.. నాకైనా బుద్ధుండాలి. మీరు గృహప్రవేశం అనగానే నేను కూడా గంగిరెద్దులా తలుపుతూ వచ్చాను చూడండి.. అందుకని. అయినా గృహప్రవేశం చేశాక ఎవరికైనా అద్దెకిచ్చేసి మనం సిటిలో వుంటే కమ్మగా వుండేది. అంతా నా కర్మ!” తలపై మెల్లగా చరుచుకుంది కాంతం.

“నీ.. ఇక్కడ కూడా నీ గోలేంటే బాబు. ఆ దొంగెవడో కనిపెట్టి పోలీసులకి అప్పగించాలని నా ప్రయత్నం. పోలీస్ వాళ్ళ కళ్ళుగప్పి నెలరోజులుగా లూటీలు చేస్తున్న వాడ్ని ఎలాగైనా పట్టుకోవాలి. అదే ఇప్పటి ఈ కాంతయ్య శపథం” అన్నాడు తొడ కొడుతూ.

“అబ్బా.. ఆశ! అదంత సులువైన పనైతే పోలీసోళ్ళే పట్టుకునే వాళ్ళు”.

“మరదే.. పోలీసు వాళ్ళు చేయలేనిది నేను చేసి చూపిస్తా. అయినా నేను నీ కళ్ళకెలా కనిపిస్తున్నానే..”

నవ్వుతుంది కాంతం.

“ఏంటే!? అలా నవ్వుతున్నావు!? ఏం మజాక్‌గా వుందా కాంతయ్య అంటే? నేనేమైనా వెర్రివాడు లాగా.. బుద్ధితక్కువవాడిలాగా.. తెలివితక్కువ సన్నాసిలా కనిపిస్తున్నానా!? ఏంటి నా మాటలు వింటుంటే నీకు నవ్వొస్తుందా?”

ఏ మాత్రం ఆలోచించకుండా అవునన్నట్లుగా తలూపింది కాంతం.

“మీకు ఓ సంగతి తెలుసా..”

“ఏ సంగతి?”

“దొంగ కాదు కదా.. ఎవరు లేరిక్కడ! మీ భ్రమ అంతా.. మీ ప్రయత్నం మానుకుని ఎంచక్కా ఇంట్లోకి వెళ్ళదాం రండి.. హాయిగా నిద్రపోదాం..”

ఆమెలా నవ్వుతుంటే.. కాంతయ్యకి కోపం నశాలానికి అంటుతుంది.

“ఏంటి! నన్నో చవట లాగా భావిస్తున్నావా? అంటే నేను దొంగని కనిపెట్టలేని సన్నాసినని నీ అభిప్రాయమా!? అసలు దొంగే లేనప్పుడు నేనెలా వాడ్ని పట్టుకుంటానని నీ సందేహం కదా?” అన్నాడు కాంతయ్య కోపంతో భార్య పైన ఊగిపోతూ..

మళ్ళీ నవ్వింది కాంతం.

అంత చీకట్లో సైతం దూరంగా కనిపిస్తున్న స్ట్రీట్ లైట్ నుండి వస్తున్న కాంతి ఆమె మోముపై పడి మెరుస్తుంది.

అక్కడక్కడ ఉన్న ఇళ్లన్నీ లైట్లు ఆపేసి వున్నాయి.

“ఏంటి ఇంకా అలా నవ్వుతూనే ఉన్నావు.. అంటే నేను తెలివితక్కువవాడినని నీ అభిప్రాయమా?”

ఈసారి మరింత సంబరంగా నవ్వింది కాంతం.

“అసలు నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు? నన్ను ఎగతాళి చేయడానికా? అయినా నిన్ను కాదు, నిన్ను నాకిచ్చి కట్టబెట్టాడు చూడు మా మామననాలి. మహానుభావుడు ఏ క్షణాల్లో అన్నాడో కాని.. నా కాబోయే అల్లుడు మేధావని.. ఆ మాటకి పడిపోయాను. తబ్బిబ్బు పోయాను. నిజమే అనుకున్నాను. నా ప్రతిభ, నా మేధస్సును గుర్తించి మీ నాన్న నాకు నిన్ను కట్టబెట్టాడనుకున్నాను. కాని ఇదంతా నాపై జరిగిన కుట్ర. నిన్ను నాకు కట్టబెట్టడానికి మీ అమ్మ నాన్న కలిసి ఆడిన డ్రామా అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.”

నిష్ఠురంగా అంటూ దగ్గరలో వున్న లైట్ పోల్‌కి తల కొట్టుకోబోయాడు.

కొద్ది క్షణాలు ఆగాడు భార్యేమైనా తన ప్రయత్నాన్ని నిలువరిస్తుందేమోనని.

“మీరు నన్నేమైనా అనండి.. అంతేకాని మా పుట్టింటి వాళ్ళని ఏమైనా అంటే ఊరుకునేది లేదు..”

“ఆ.. ఊరుకోక ఏం చేస్తావ్?”

“నేను ఊరుకోను..అంతే!” బుంగమూతి పెట్టి అంది.

“ఆ ఏం చేస్తావ్!?” ఇంకాస్త రెట్టించి అడిగాడు కాంతయ్య.

“ఆ.. మా పుట్టింటికి పోతాను” అంది కన్నీరు తుడుచుకుంటూ.

అప్పటికే వాళ్ళిద్దరి గోలని గమనిస్తున్న నలుగురైదుగురు పొరుగిళ్ళవాళ్ళు అక్కడికి చేరుకున్నారు.

వెంటనే స్ట్రీట్ లోని ఇళ్ల వాళ్ళందరూ అక్కడికి చేరారు.

ఇంతలో ఎవరో పోలీస్ వాళ్లకి ఫోన్ చేయడంతో.. అక్కడంతా గోల వాతావరణం ఏర్పడింది.

అప్పటి వరకు భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవని చెట్ల చాటున వుండి ఆసక్తిగా గమనిస్తున్న దొంగకి ఎలా పారిపోవాలో అర్థం కాలేదు.

ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు “అడుగో దొంగ..”

అంతే పోలీసులు క్షణాల్లో దొంగని పట్టుకుని చేతికి బేడీలు వేసి.. పోలీస్ జీప్ వైపు నడిపించారు.

అప్పటి వరకు గొడవపడ్డ భార్యాభర్తలు.. చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం దొంగకి విస్మయాన్ని కలిగించింది.

‘లోకంలో ఇలాంటి భార్యభర్తలు కూడా ఉంటారా!’ ముక్కున వేలేసుకుని ఆ వింత దంపతుల వైపు చూసాడు.

తనే పెద్ద జాదూగాడు అనుకుంటే వీళ్ళేవరో తనకంటే మాయలమరాటీల్లా వున్నారే అనుకుంటూ ఉండగా.. పోలీస్ జీప్ కదిలింది పోలీస్ స్టేషన్ వైపు.

కాంతయ్య కాంతంల తెలివితేటల్ని మెచ్చుకుంటూ.. వారి వింత దాంపత్యాన్ని ప్రశంసిస్తూ.. నెలరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన దొంగ దొరికాడని.. వాడిని కటకటాల వెనుకకి తోసి మక్కెలిరగదీసి.. తామిక రాత్రిళ్ళు కాసేపైనా తీరిగ్గా కునుకు తీయవచ్చనుకున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here