[dropcap]“అ[/dropcap]మ్మా! నిద్ర పట్టడం లేదు” పక్కనున్న తల్లితో గారాబంగా అంది పిల్ల మొలక.
“ఆ చల్ల గాలికి అనుగుణంగా ఆ కొమ్మలను ఊయలలు ఊపుతూ పడుకో తల్లీ!” ప్రేమగా బుజ్జగించింది తల్లి మొక్క.
“ఏదీ… గాలి వీస్తేగా?” అంది మురిపెంగా.
“అవును తల్లీ! ఇంకెక్కడి గాలి? తనువంతా ఉక్కపోతగా ఉంటేను?” మొక్క పలుకుల్లో ఉదాసీనత.
“అది సరే గానీ, అమ్మా! నాకొక కథ చెప్పవూ? ఊ… కొడుతూ ఎంచక్కా బజ్జుంటా!” ప్రాథేయపడింది చిన్నారి మొలక.
“అలాగేరా… నా బంగారు తల్లీ! ఒక వింత కథ చెబుతా విను…” అంటూ తన బిడ్డకి కథ చెప్పడం మొదలు పెట్టింది, తల్లి మొక్క.
***
నిద్రమత్తులోనే అటూ ఇటూ దొర్లుతూ “మమ్మీ దాహంగా ఉంది…” పక్కనున్న తల్లిని కదిపాడు చిన్న.
కళ్ళు తెరవకుండానే “అలసటగా ఉంది… చిన్నా! కాస్త లేచి వెళ్లి తాగు నాన్నా! నా బంగారు తండ్రి కదూ?” లాలనగా అంది తల్లి సుజల.
నెమ్మదిగా బెడ్ మీది నుండి లేచిన చిన్న ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళాడు.
తలుపు తెరిచి ఇంజక్షన్ సీసా సైజులో ఉన్న చిన్న బాటిల్‌ని బయటకు తీసాడు. ఆ సీసా మూతను తీసి సీసాని పైకెత్తుతూ నాలుకతో ఒక నాలుగు చుక్కలు చప్పరించాడు. తిరిగి ఆ సీసాను లోపల పెట్టేసి వచ్చి పడుకున్నాడు.
తెల్లవారాక “మమ్మీ, పళ్ళు తోమేసా! స్నానం చేయనా?” అంటూ వంటగదిలో ఉన్న అమ్మను చుట్టేసింది టింకీ.
పాపను ఎత్తుకొని ప్రేమగా హత్తుకుంటూ “వీక్లీ వన్స్! సోమవారమే కదమ్మా! స్నానం చేసేది” అంటూ ఆ పసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సుజల.
భర్తతో పాటు పిల్లలిద్దరికి వారానికి ఒక్కసారి స్నానం. సుజలకు పూజలు ఉంటాయని శుక్రవారం కూడా స్పాంజ్ బాత్ చేస్తుంది.
“మమ్మీ… టుడే ఈజ్ మండే!” అంటూ పకపక నవ్వింది ఆ పాప.
“ఓ షిట్! మరిచేపోయా! చిన్నాని కూడా పిలుచుకురా!” అంటూ పాపను కిందికి దించేసి బాత్రూం వైపు కదిలింది సుజల.
అయిదు స్క్వేర్ సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న స్పాంజ్‌ని టీకప్ సైజులో ఉన్నపాత్రలో ముంచుతూ ఒకరి తరువాత ఒకరికి పిల్లలకు స్పాంజ్ బాత్ చేయించింది సుజల.
‘వారానికి ఒకసారి వాడే ఈ కాసిన్ని నీటి బిందువులకే వేలకు వేలు పోయాలి. ఇక ప్రతిరోజు నలుగురు స్పాంజ్ బాత్ చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు అది కుదరని పని.
పైగా అంగారక గ్రహంలో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం. నెలవారీ ఖర్చులను కొంత తగ్గించుకొని ఎంతోకొంత వెనకేసుకు వస్తున్నాం. ఆ గ్రహంలో నీటి ఊట బావులు బాగా పడతాయని రియల్ ఎస్టేటర్స్ ఊరిస్తున్నారు.
ఇక త్రాగునీటిని ప్రభుత్వమే రేషన్ ద్వారా కుటుంబాలకు సరఫరా చేస్తుంది.
బహుశా నిన్నటి తరం చేసిన భూ గాయాలకు, ప్రకృతి పర్యావరణాన్ని విధ్వంసం చేసిన పర్యవసనానికి… మా తరం ఇలాంటి నీటి కష్టాలు అనుభవిస్తున్నదేమో అనిపిస్తోంది!’
బాక్సులు సర్ది పిల్లలను స్కూలుకి, శ్రీవారిని ఆఫీసుకి పంపాక డైరీ ముందేసుకున్న సుజల గబగబా నాలుగు ముక్కలు రాసి డైరీని షెల్ఫ్‌లో పెట్టింది.
ఫ్రిజ్ లోంచి ‘టీ చాక్లెట్’ని తీసుకొని రేపర్ విప్పి బిళ్ళను నోట్లో వేసుకుంది. దాన్ని చప్పరిస్తూ వెళ్లి టీవీ ముందు కూర్చుంది.
జీడిపాకం సీరియల్స్, దురదగొండి కార్యక్రమాలు సుజల చూడదు. భక్తి ఛానల్స్ అంటే ఆసక్తి కనబరుస్తుంది. వీలైతే ‘న్యూస్ టాప్’ ముందేసుకుని వార్తలన్నీ చదివేస్తుంది.
ప్రతి సోమవారం ఒక భక్తి ఛానెల్‌లో శ్రీ జలానంద స్వామి వారి భక్తి ప్రవచనాలు ప్రసారం అవుతాయి.
సరిగ్గా అదే సమయానికి సుజల టీవీ ఆన్ చేసింది.
స్వామివారి గొంతు వినపడుతోంది.
“మాతృమూర్తులు, మహిళామణులు అందరికీ మంగళాశాసనములతో. ఒకప్పుడు పూలదండల అలంకరణలతో అమ్మవారు భక్తుల సేవలను అందుకునేవారు. పూలాభిషేకాలు ప్రీతిపాత్రమయ్యేవి.
కానీ ఇపుడు పూవు లేదు. ఆకు లేదు. చెట్ల జాడే లేదు!
తిరిగి ఆ వైభవం తీసుకురావడానికి నేనొక కొత్త అర్చన మీ ముందుంచబోతున్నాను. ఆచరించండి. ఆ జగజ్జనని అనుగ్రహం పొందండి. పిల్ల పాపలతో మీ కుటుంబం క్షేమంగా ఉండండి.
అదే లక్షకోట్ల వృక్షార్చన!
మీ ప్రాంతంలో మీకు వీలైనన్ని మొక్కల్ని నాటాలి. మీరు నాటిన మొక్కల ఫోటోలను ‘వృక్షార్చన@ అమ్మవారు డాట్ కామ్’లో అప్లోడ్ చేయాలి. మొక్కల సంరక్షణ బాధ్యతని ప్రభుత్వానికి వదిలేయండి. వారు స్వీకరిస్తామని సెలవిచ్చారు.
ఇదొక కొత్తరకం వ్రతం. మీరు వీలైనన్న మొక్కలను నాటుతూ పోవచ్చు. లక్ష కోట్ల సంఖ్యకు చేరగానే ఆ కంప్యూటర్‌లో అప్‌లోడింగ్ ప్రక్రియ పూర్తయిపోతుంది.
ఇది భారతీయుల సాముహిక భక్తిపూర్వక వృక్షార్చన కార్యక్రమం. మీరంతా రేపటినుండి దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆశిస్తున్నాను” అంటూ ముగిసింది స్వామివారి ప్రవచన కార్యక్రమం.
***
కథ చెప్పడం ఆపి “బంగారు తల్లీ! బజ్జున్నావా?” పిల్ల మొలకను అడిగింది తల్లి మొక్క.
“లేదమ్మా! నీవు చెప్పిన కథ గురించే ఆలోచిస్తున్నాను”
“ఏమిటమ్మా అది?”
“ప్రజలకు తాగడానికి నీళ్లు దొరకని గడ్డు పరిస్థితిలో ఉన్నారని అన్నావు కదా! నీళ్లు లేనిదే నాటిన మొక్కలు ఎలా ఎదుగుతాయమ్మా?”
గలగలా నవ్వేసింది తల్లి మొక్క.
“వర్షాలు పడక పోతాయా, ఆ మొక్కలు వృక్షాలుగా ఎదగకపోతాయా అని వాళ్ళ ఆశ”
“ఏమో వర్షాలు పడతాయేమో? ఎవరు చెప్పొచ్చారమ్మా!” ఆశాభావం వ్యక్తపరిచింది ఆ చిన్నారి మొలక.
“చెట్లను చిదిమేశారు. అడవులను ఆవిరి చేశారు. ఇంకెక్కడి వర్షాలు?” విచారంగా అంది తల్లి మొక్క.
“ఇదిగో కుండీల్లో ఉంచి మనని పెంచుతున్నారుగా! అలా ఏమైనా కొత్త రకం ఆలోచనలు చేస్తారేమో… మొక్కలు ఎదగడానికి”
నిర్లిప్తంగా “ఇంకా నీకు తెలిసే వయసు రాలేదు తల్లీ! మనది ప్రాణమున్న వృక్షజాతి కాదు. ఒకప్పుడు ఇలా మొలకలు, మొక్కలు ఉండేవని ఇప్పటి తరానికి తెలియడానికి ఏర్పాటు చేసిన మ్యూజియం లోని ప్రాణం లేని ప్లాస్టిక్ బొమ్మలం మనం…” అసలు విషయం తెలియజేసింది మొక్క.
ఉలిక్కిపడిన చిట్టి మొలక తల్లి మొక్క వైపు జీవం లేని చూపులు సారించింది.
***
“మమ్మల్ని సగర్వంగా మొలకెత్తనివ్వండి. స్వేచ్ఛగా జీవించనివ్వండి. మాలో ఊపిరి ఉన్నంత వరకు మీ శ్వాసలకు మేం శ్వాసలమవుతాం!”
ఆ మొక్క కనురెప్పల మాటునుండి రాలిన రెండు కన్నీటిబొట్లు ఆర్తిగా గుండెని తడుముతున్నాయి!!