ఆ రోజు వస్తే…

0
4

[dropcap]సాం[/dropcap]ఘిక మాధ్యమాలు, దూరదర్శన్ మరియు అన్ని ప్రసారమార్గాల్లో ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానం ప్రవేశపెట్టిన కొత్త చట్టం ‘ముద్దు బిడ్డ’ గురించి విని మగపిల్లలు ఇప్పటికే ఉన్నవాళ్లు, కొత్తగా మగబిడ్డలకు జన్మనిచ్చిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టసాగాయి. ఆడబిడ్డకు కనీసం చీమెత్తు హాని తలపెట్టినా లేక లైగింకంగా వేధించినా, మానసికంగా బాధ పెట్టినా ఆ వ్యక్తికి ఖచ్చితంగా కఠినమైన శిక్షపడుతుంది. అంతే కాదు ఆ వ్యక్తిని చట్టం అంతటితో వదలదు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత కూడా శిక్షాకాలం బట్టి ఆ వ్యక్తికి సమాజంలో ముద్ర వేయబడుతుంది. చట్టం రూపొందించిన ముద్ర ఆ వ్యక్తికి వేస్తారు. మళ్లీ ఒక వేళ ఆ వ్యక్తి ఆడవాళ్ల పట్ల తప్పుగా ప్రవర్తించినా ఏ విధంగానైనా బాధపెట్టినా రెండో సారి శిక్ష కఠినంగా ఉంటుంది. ఆడబిడ్డని చూసిన వాడి గుండెల్లో, కాళ్లల్లో భయంతో కూడిన వణుకు మొదలయ్యేలా కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టారు.

‘ముద్దు బిడ్డ’ చట్టంలో అబ్బాయిలకు వేసే శిక్షల గురించి విని అబ్బాయిలున్న తల్లిదండ్రుల్లో; జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న తల్లిదండ్రుల్లో వణుకు మొదలైంది.

“ఏమే నిన్నే!!… ‘ఆది’కి కావాలసినవన్ని చేసి పెట్టడం కాదు, వాడు చిరకాలం బ్రతికుండి తినాలంటే – వాడు మన ఇంటి ముందు, దించిన తల మధ్యలో ఎత్తకుండా కళాశాలకి వెళ్లి అక్కడ మీనమేషాలు లెక్క పెడుతూ ఇటు అటు కళ్లు చక్రాల్లా తిప్పుతూ అమ్మయిల వైపు వెధవ చూపూలు చూడకుండా ఇంటికి వచ్చి తగలడమను. ఎవడో కథానాయకుడి జుత్తులా అని ఈ వెధవ జుత్తు పెంచాడుగా, ఆదివారం మంగలి దుకాణానికి తీసుకు వెళ్లి డిప్పక్షవరం చేయిస్తాను. ఈలోగా వాడి తలకి నూని బాగా పూసి నున్నగా దువ్వి, దేవునికి దణ్ణం పెట్టించి, ‘ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడను, వాళ్లని ఏ విధంగాను బాధ పెట్టన’ని ప్రమాణం చేయించి, వాడి నుదుటి మీద ఇంత కుంకం పెట్టి కళాశాలకి పంపు. ఆదికి ఏమైనా అయితే మనం బ్రతికి ఉండగలమా? ఒక్కగానొక్క కొడుకు” అన్నాడు బాధగా ఆది తండ్రి.

“అయ్యో! మీరంతగా చెప్పాలండీ? ‘ముద్దు బిడ్డ’ చట్టం వచ్చిన దగ్గర నుండి నా కాళ్లు చేతులు ఆడడం లేదు. ప్రభుత్వం ‘ముద్దు బిడ్డ’ చట్టం చాలా కఠినంగా రూపొందించారు” అంది ఆది తల్లి.

“అందుకే తప్పు చేసిన వాడు వెంటనే శిక్ష అనుభవించాలని ప్రభుత్వానికే వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేసి ‘ముద్దు బిడ్డ’ చట్టం సంపాదించుకున్నారు. అయినా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు? ముందు నీ కొడుక్కి మర్యాద, గౌరవం ఆడపిల్లల పట్ల చూపించమని బాగా నూరిపోయ్యి. అమ్మాయిల జోలికి వెళితే వాడి బ్రతుకు కుక్క చించిన విస్తరవుతుందని గట్టిగా చెప్పు” అన్నాడు ఆవేశంగా.

“నాన్నగారూ!… నా గురించి మీరు కంగారు పడకండి. ధైర్యంగా ఉండండి… చెయ్యి కాలుతుందని తెలిసి నిప్పు జోలికి వెళతానా?… శిక్ష పడతుందని తెలిసి తప్పు చేస్తానా?” అన్నాడు ఆది.

“నా బాబే! బంగారు కొండవిరా” అంది తల్లి.

***

శ్రవణ గ్రహణం ద్వారా కార్యలయంలో ఉన్న ఆనంద్‌కి ఆసుపత్రి నుంచి కబురు వచ్చింది.

“ఏంటి అబ్బాయి పుట్టాడా? అయ్యో! భగవంతుడా” అని గభాలున కుర్చీలో కూలబడ్డాడు. మొహం అంతా చమటలు పట్టాయి.

చుట్టూ ఉన్న సహచరులు విషయం తెలుసుకొని ఆనంద్‌ని ఓదార్చసాగారు.

“ఏం చేస్తాం ఆనంద్? మన చేతుల్లో ఏం లేదు? భగవంతుడు ఎవరిని ఇస్తే వాళ్లనే మనం స్వీకరించాలి.”

“మన పిల్లల పట్ల ప్రభుత్వం కఠినమైన చట్టం ప్రవేశ పెట్టిందని కన్న పిల్లలను కాదనుకోలేము కదా? ఈ పరిస్థితులలో మగపిల్లాడు జన్మించడం ఆనందించ తగ్గ విషయం కాదు.”

“ఒకనాడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు అనేవారు. కాని ఇప్పుడు మెడకు ఉరి తాడయ్యాడు. ఉన్నది ఒక్కటి మార్గం ఆనంద్!… నీ కొడుకు నోటిలో ఉగ్గు పాలు పోసిన దగ్గర నుండి మీసాలు, గడ్డాలొచ్చే వరకు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కొడుక్కి పెళ్లి, చేసి అర్ధాంగి చేతిలో పెట్టే వరకు స్త్రీ ఆదిశక్తి, పరాశక్తి, ప్రపంచం అంతా ఆమె సంతానం అని, ప్రతీ ఆడపిల్ల ఆది పరాశక్తి ప్రతిరూపం అని గట్టిగా చెప్పు, మాటలు పెడచెవిన పెట్టి ఆడిపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించావో, చేసిన వెధవ పని బట్టి తుపాకితో కాల్చి వేయడమే లేక యావజ్జీవ శిక్ష విధించడమో, ఈ రెండింటిలో ఏదో ఒక శిక్ష తప్పదని నీ కొడుకుని భయపెట్టు” అని సహచరుడు అన్నాడు.

సహచరులను పట్టుకొని గొళ్లున ఏడ్చి అందరికి కృతజ్ఞతలు తెలిపాడు ఆనంద్.

తుఫాను వచ్చి ప్రళయం సృష్టించిన తరువాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడినట్లు ‘ముద్దు బిడ్డ’ చట్టం వచ్చిన తరువాత దేశంలో ఎక్కడ చూసినా ప్రశాంతమైన జీవనశైలి ఏర్పడింది.

ఆడపిల్లలు… ఆడవాళ్లు దర్జాగా, రాత్రుళ్లూ పగలూ రోడ్డు మీద నడవసాగారు. ‘ముద్దు బిడ్డ’, ‘దిశ’, ‘పోక్సో’ చట్టాలు వచ్చిన తరువాత వాళ్ల శ్రవణ గ్రహణంలో రక్షకభటుల యొక్క శ్రవణ గ్రహణ సంఖ్యలుండడంతో, రోడ్డు మీద ధీమాగా, ఏ విధమైనా బెరుకు, భయం లేకుండా, మాకు మంచి రోజులొచ్చాయన్నట్లు సంతోషంగా నడవసాగారు.

కళాశాలకి వెళ్లి పరీక్ష వ్రాయడానికి వాహనం దొరకక “దయచేసి మీ వాహనం మీద ఎక్కించుకొని కళాశాల దగ్గర దించుతారా?” అని అమ్మాయి అడగ్గానే “అయ్యో! ఏమిటండి… నోరారా అన్నయ్యా అని పిలవండి, తప్పకుండా కళాశాల దగ్గర మిమ్మలను దించుతాను. ఒక్క నిమిషం” అని జేబులో నుండి ఆ యువకుడు రక్షాబంధనాన్ని తీసి “ఇది నా చేతికి కట్టు చెల్లెమ్మా” అని అనగనే ఆశ్చర్యంగా “ఈ రోజు రాఖీ పండగ కాదు అన్నయ్యా” అంది.

దేశంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల లైంగిక వేధింపులు, అల్లరి చేయడాలు, ఏడిపించడాలు లేవు. ఆడపిల్లలు కనబడినా, మధ్య వయసు స్త్రీలు కనబడినా, చివరికి ముసలి వాళ్లు కనబడినా కుర్రాళ్లే కాదు, పెద్దవాళ్లు కూడా తలదించుకొని వెళ్లసాగారు.

***

“వసూ!… నువ్వు చాలా దృరదృష్టవంతురాలివే… నువ్వు బ్రతికి ఉండగా ‘ముద్దు బిడ్డ’ చట్టం వచ్చి ఉంటే అనుమానంతో నిన్ను హింసించి, కూరంగా చంపిన ఆ దుర్మార్గుడు నరేష్ గాడు నీ జోలికి రాకపోను, నీ ప్రేమ గురించి నాతో ఎంతో గొప్పగా చెప్పదానివి. ‘చిన్నప్పటి నుండి నరేష్ నేను కలిసి చదువుకున్నాం. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం, నేను చాలా అదృష్టవంతురాలిని కదూ?’ అని నాతో చెప్పిపొంగిపోయే దానివి. కొత్తగా కళాశాలలో చేరిన ప్రవీణ్ నీ వెనకాల పడితే నరేష్‌తో నీ ప్రేమ గురించి ప్రవీణ్‌తో చెప్పావు. విషయం తెలిసి క్షమించమని ప్రవీణ్ అడిగితే మనం స్నేహితులుగా ఉందామని అన్నావు… ప్రవీణ్ నీతో మాట్లాడడం నచ్చని నరేష్ నీ మీద అనుమానం పెంచుకొని, క్రూరమృగంలా మారి, నిన్ను క్రూరంగా హింసించి చంపాడు.

నాకు ఒకటి అర్థం కాలేదు. ఆ దుర్మార్గుడే కాదు… ఎవడైనా సరే ప్రేమించిన అమ్మాయి ఏ కారణం చేతనైనా నచ్చలేదో, ఇష్టం లేదో, లేక అనుమానం అనిపిస్తే ఆ అమ్మాయిని వదిలేయాలి. ఒక మనిషి ప్రాణం క్రూరంగా, భయంకరంగా తీసే హక్కు వాడికి ఎవరిచ్చారు?

వసూ!… నువ్వు మాకు దూరం అయినా నీ మరణంతో వచ్చిన ‘ముద్దు బిడ్డ’ చట్టంతో వాడు నరకం అనుభవించి చస్తాడు. నరేష్ గాడిలాంటి దుర్మార్గుల భరతం పట్టడానికి ‘ముద్దు బిడ్డ’ చట్టం వచ్చింది. భవిష్యత్తులో ఆడిపిల్లలకు భయం లేకుండా, ధైర్యంగా బ్రతికే ధైర్యం నీ వలనే వచ్చింది. ఈ రోజు నువ్వు లేకపోయినా, ప్రతీ ఆడపిల్ల మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావు. ఇది నిజం వసూ” అని పలవరించడం చూసి అటుగా వచ్చిన వనజ కంగారుగా కూతురు దగ్గరకు వచ్చి “అర్చనా! అమ్మా అర్చనా!” అని కుదుపుతూ –

‘స్నేహితురాలు వసుకి జరిగిన ఘోరం చూసి భయపడిపోయింది. నిన్నంతా వణికిపోతూనే ఉంది’ అని అనుకొని “అర్చనా!… లే తల్లీ!” అని తట్టి లేపడంతో కంగారుగా లేచి కూర్చొని చుట్టూ చూసింది అర్చన.

‘అయితే ఇప్పటి వరకు తను కన్నది కలా? నిజంగా అలాంటి ‘ఆ రోజు వస్తే’ ఆడపిల్లలకు అంత కన్నా ఏం కావాలి?’ అనుకుంది.

“ఏమిటి అర్చనా అలా ఎటో చూస్తున్నావు? భయపడకు తల్లీ” అంది వనజ.

“ఏం లేదమ్మా!” అని మంచం మీద నుంచి లేచింది అర్చన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here