[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[మల్లినాధ శ్రీశైలం వెళ్లి వేదపాఠశాలలో చేరాడు. మహితని ఇంటర్ పరీక్షలకు కట్టించాడు పతంజలి. రాధా సారుకి ప్రమోషన్ వచ్చి కర్నూలు బదిలీ అవుతుంది. తోకోనికి కూతురు పుడితే, పతంజలి ఆ చంటిదానికి ‘నాగమణి’ అని పేరు పెడతాడు. వ్యవసాయపు పనులు ఎంతో వ్యయమవుతున్నాయి. గ్రామీణ బ్యాంకు ఇంటర్వ్యూకి వెళ్తూ దారిలో ప్రొద్దుటూరులో మేనత్త వాళ్ళింటికి వెళతాడు పతంజలి. మర్నాడు మరదలు వసుధతో మాట్లాడుతూ తన ఆలోచనలు వెల్లడిస్తాడు. ఆమె ధైర్యం చెబుతుంది. ఇంటర్వ్యూ బాగా చేస్తాడు పతంజలి. మార్కండేయశర్మకి ఒక సాహిత్య సభకి అధ్యక్షులుగా ఉండే అవకాశం వస్తుంది. ఆ సభలో ప్రార్థనా గీతం పాడి అందరినీ ఆకట్టుకుంటాడు పతంజలి. సభలో తిరుమలావధానిగారి పరిచయం కలుగుతుంది. విశ్వనాథ సాహిత్యం గురించి ఆయన గొప్పగా ప్రసంగిస్తారు. ఎం.ఎ. ఇంగ్లీషు చదవమని, హైదరాబాద్ వస్తే తాను సాయం చేయగలనని ఆయన పతంజలికి చెప్తారు. పతంజలి ప్రైవేటుగా చదువుకుంటాడని తండ్రి చెప్తాడు. ఎం.ఎ. ఇంగ్లీష్ ఎక్స్‌టర్నల్‌గా చదివేందుకు దరఖాస్తు నింపేందుకు పతంజలి ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. – ఇక చదవండి.]
[dropcap]రి[/dropcap]జిస్ట్రేషన్ మరియు ఎగ్జామినేషన్ ఫీజు నూటయాభై రూపాయలు చలానా కట్టాడు. డిగ్రీ మార్కులిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ జతపరచాడు. ఫోటోలో, అప్లికేషన్‌లో రెండు చోట్ల గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాలి. ఆర్ట్స్ కాలేజిలో ప్రొఫెసర్లు ఎవరయినా చేస్తారని చెప్పారు.
అన్నీ తీసుకొని ఆర్ట్స్ కాలేజికి వెళ్లి, ఇంగ్లీషు డిపార్టుమెంటు ఎక్కడో కనుక్కొని వెళ్లాడు. ఒక గది ముందు డాక్టర్ ఇంద్రకుమార్ జైన్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ అని చూసి, తలుపు కొద్దిగా తెరిచి, “మే ఐ కమిన్ సర్” అన్నాడు.
“ప్లీజ్ కమ్” అని వినపడింది.
లోపల రోజువుడ్ టేబులు వెనుక ఒక మధ్య వయస్కుడు కూర్చుని ఉన్నాడు. ఫ్రెంచి గడ్డం. బట్టతల. ఆయన ముఖంలో మేధస్సు ప్రస్ఫుటంగా కనబడుతూంది.
“ఎస్?” అన్నాడాయన.
“సర్. అయామ్ అప్లయింగ్ ఫర్ మై ఎమ్.ఎ. ఇంగ్లీష్ ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ అండ్ ఎక్జామినేషన్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యుటు అటెస్ట్ మై ఫోటోస్ అండ్ క్రెడెన్షియల్స్” అన్నాడు పతంజలి వినయంగా.
“విత్ ప్లెజర్” అన్నాడాయన. పతంజలి పక్కన నిలబడి చూపిస్తుంటే ఫోటోల మీద, ఇతర చోట్ల గ్రీన్ యింక్‌తో సంతకాలు చేశాడాయన. ఆయన సంతకం అందమైన ముగ్గులా ఉంది.
బల్లమీదున్న బజర్ నొక్కాడాయన. ఒక అటెండర్ వచ్చాడు.
“మేరే దస్కత్‌కే నీచే స్టాంపింగ్ కరో యాద్గిరి” అని చెప్పాడు.
“రాండ్రి సార్. స్టాంపేస్తా” అన్నాడతను. జైన్‌గారికి నమస్కరించి యాదగిరి వెంట వెళ్లాడు. అతను ఆఫీసు రూంకి తీసుకెళ్లి అన్ని చోట్లా స్టాంపు వేశాడు. “పాంచ్ రూపయే దీజియే. చాయ్ పానీకేలియే” అన్నాడు నిర్మొహమాటంగా. వాడికి ఐదు రూపాయలు సమర్పించుకొని వచ్చేశాడు.
అన్నీ జాగ్రత్తగా ట్యాగ్ చేసి, కౌంటరులో సబ్మిట్ చేసి అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నాడు. మనసులో భారం దిగింది.
అక్కడ నుండి తెలుగు డిపార్టుమెంటుకు వెళ్లి తిరుమలావధానిగారెక్కడుంటారని అడిగాడు. ఈరోజు ఆయన సెలవు పెట్టారని చెప్పారు. ఇల్లు బర్కత్‌పురాలో వై.యమ్.సి.ఎ. దాటింతర్వాత అని చెప్పారు.
ఆర్ట్స్ కాలేజి రైల్వే స్టేషన్‌లో ఎం.ఎం.టిఎస్ రైలెక్కి కాచిగూడలో దిగి అక్కడ నుండి నడుచుకుంటూ అవధానిగారింటికి వెళ్లాడు. ఇల్లు పాత కాలంలాంటిదైనా విశాలంగా ఉంది. లోపలికివెళ్లి ‘సార్’ అని పిలిస్తే ఒక పెద్దావిడ తలుపుతీసింది. “ఎవరు?” అన్నట్లుగా చూచింది.
“అవధానిగారి కోసమమ్మా. కర్నూలు నుండి వచ్చాను. నా పేరు పతంజలి”
ఆవిడ లోపలికి వెళ్లి చెప్పింది. రెండు నిమిషాల్లో అవధాని గారు డ్రాయింగ్ రూములోకి వచ్చారు.
“నమస్కారం సార్” అన్నాడు పతంజలి. వంగి ఆయన పాదాలకు నమస్కరించాడు.
“ఎప్పుడొచ్చావు నాయనా? మీ తండ్రిగారు కుశలమా!” అని అడిగారు.
వంటామె కాబోలు మంచినీళ్లు తెచ్చియిచ్చింది.
“ఈ రోజే ఎమ్.ఎ. ఇంగ్లీష్‌కు రిజిస్ట్రేషన్ చేయించి, ఫీజు కట్టేశానండి. మీ దర్శనం చేసుకొని పోదామని వచ్చాను.”
“మంచిది. చాలా త్వరగా స్పందించావే”
“ఈ సంవత్సరం ప్రీవియస్ మాత్రమే వ్రాయడానికి అవకాశం ఉందండి. రెండూ ఒకేసారి వ్రాసే ఒత్తిడి ఉండదని వెంటనే దరఖాస్తు చేసుకున్నాను.”
“ప్రీవియస్‌లో పేపరు – 1 లో ఆప్షన్ తీసుకున్నావు?”
“క్లాసిక్స్ ఇన్ ట్రాన్స్‌లేషన్ తీసుకున్నానండి”
“మంచి పని చేశావు, మరి పుస్తకాలు?”
“నెలనెలా వచ్చి కొన్ని కొన్ని కొంటాను సర్”
ఆయన రెండు నిమిషాలు ఆలోచించి, మూలన టేబులు మీదున్న ఫోన్ దగ్గరకు వెళ్లారు.
ఒక నంబరు తిప్పారు.
“హలో! ఈశ్వరయ్యగారేనా?”
“నేను ఒక అబ్బాయిని పంపిస్తాను. పేరు పతంజలి. ఎమ్.ఎ. ఇంగ్లీషు ఎక్స్‌టర్నల్‌కు వెళుతున్నాడు… నో. నో.. హాస్టలేమీ అవసరం లేదు. ఫీజులు పుస్తకాలకు సహాయం చేస్తే చాలు. అవసరమైతే మన డోనార్స్ కెవరికైనా చెప్పమంటారా… సరే అయితే… ఉంటాను. నమస్కారం” ఫోను పెట్టేసి అన్నాడు.
“అబ్బాయ్! చిక్కడపల్లిలో వెంకటేశ్వరస్వామి గుడి వీధిలో ఆ రోజు నీకు చెప్పానే ఆ ఎ.బి.సి.డి. ఆఫీసుంది. నీవు అక్కడికి వెళ్లి నేను పంపించానని చెప్పు. అక్కడ ఈశ్వరయ్యగారని ఉంటారు. ముందు సుల్తాన్ బజార్‌కు వెళ్లి ఒకేసారి ప్రీవియస్, ఫైనల్ పుస్తకాలన్నీ సిలబస్ ప్రకారం ఎంతవుతాయో వాళ్ల లెటర్ హెడ్ మీద కొటేషన్ తీసుకో. ఫీజు రశీదులు కూడ చూపించు, సంస్థవారు బుక్ షాపు వారి పేరున చెక్కు యిస్తారు. ఫీజులు కూడ రీ-ఇంబర్స్ చేస్తారు.”
“చాలా థ్యాంక్సండీ.. మీరు చేస్తున్న….”
“అదేం లేదులే. అంతా దాత ఔదార్యమే. నేను మాట సాయమే కదా చేస్తున్నా, సరే విను. పుస్తకాలు దాదాపు రెండు వేలవుతాయి. కేవలం టెక్స్ట్ పుస్తకాలు కొంటే కొరకకుడు పడవు. నీవేం చేయాలంటే టెక్ట్స్ కం గైడ్స్ దొరుకుతాయి. లక్ష్మీనారాయణ్ అగర్వాల్, రఘుకుల తిలక్ లాంటి ఉద్దండులు వాటిని తయారు చేశారు. అవన్నీ కొనుక్కో. వెళ్లిరా.. శుభం” అన్నాడు.
పతంజలి కళ్లు చెమ్మగిల్లాయి. అవధానిగారికి మళ్లీ పాదాభివందనం చేశాడు.
“కష్టపడి చదువు నాయనా. నీకు ఉజ్జ్వల భవిష్యత్తుంది” అన్నాడాయన.
గేటు వరకూ వచ్చి సాగనంపాడు ఆ మహానుభావుడు. సాక్షాత్తూ అహోబిలం నరసింహుడే ఆయన రూపంలో తనను ఆదుకుంటున్నాడని భావించాడు.
నడుచుకుంటూ టూరిస్టు హోటలుకు వెళ్లి భోజనం చేశాడు. అక్కడ నుండి సుల్తాన్ బజారులోని నీల్‌కమల్ బుక్ హౌస్‌కు వెళ్లాడు. డిగ్రీ పుస్తకాలన్నీ అక్కడే కొనుకున్నాడు.
వెళ్లి కౌంటరులోని యజమానికి నమస్కరించాడు. ఆయన గుర్తుపట్టలేదు. సేల్స్‌మన్ పెద్దాయన మాత్రం గుర్తుపట్టాడు. బ్యాగులోంచి సిలబస్ తీసి, దీని ప్రకారం టెక్స్ట్ విత్ గైడ్‌లకు కొటేషన్ కావాలన్నాడు. మీ షాపు పేరిట చెక్ యిస్తామని చెప్పాడు.
పెద్దాయనకు పుస్తకాల పేర్లన్నీ తెలుసు. పతంజలిని లోపల కూర్చోబెట్టి, టేబులు మీద పుస్తకాలన్నీ తెచ్చివ్వసాగాడు. ప్రతిపేరులో నాలుగు డిటెయిల్డ్, నాలుగు నాన్ డిటెయిల్డ్ టెక్ట్స్ ప్రిస్క్రయిబ్ చేయబడ్డాయి. మాడల్ ప్రశ్నా పత్రాలు స్టడీ చేశాడు పతంజలి.
ప్రతి పేపరులో ఎ, బి అని రెండు సెక్షన్లున్నాయి. సెక్షన్ ‘ఎ’ లో మొదటి ప్రశ్న కంపల్సరీ. అది యాన్నొటేషన్స్ కు సంబంధించింది. డిటెయిల్డ్ వాటి నుంచి మాత్రమే ఆ ప్రశ్నలు ఇస్తారు. సందర్భ సహిత వ్యాఖ్యలన్నమాట. ఎ లో నాలుగు, బి లో నాలుగు ఎస్సే ప్రశ్నలున్నాయి. మొదటిది కాక, రెండింట్లో కలిపి ఏవయినా నాలుగు ప్రశ్నలు వ్రాయాలి. ఐదు ప్రశ్నలకు ఒక్కో దానికి ఇరవై చొప్పున వందమార్కులు.
సిలబస్‌ను ఆంగ్ల సాహిత్యంలోని వివిధ యుగాలుగా విభజించారు. ఏజ్ ఆఫ్ చాసర్, షేక్సిపియరెన్ ఏజ్, విక్టోరియన్ ఏజ్. నియోక్లాసికల్ ఏజ్, మాడరన్ ఏజ్, అలాగ. అవి కాక అమెరికన్ లిటరేచర్, ఇండో ఆంగ్లియన్ లిటరేచర్ వేరే పేపర్లు.
అవధానిగారు చెప్పినట్లే సిలబస్ కంతా రఘుకుల తిలక్, లక్ష్మీనారాయణ్ అగర్వాల్ అనే ప్రొఫెసర్లే టెక్స్ట్ విత్ గైడ్స్ రూపొందించారు. ఆ పుస్తకాలు ఎంత బాగున్నాయంటే ‘కుక్‌డ్ ఫుడ్’ లాంటివి. సిద్ధాన్నంలా తయారు చేశారు. భారతదేశంలోని ఏ యూనివర్సిటీకైనా పనికివస్తాయి.
పతంజలి తీసుకోదలచిన పుస్తకాలన్నీ లిస్టురాసి వాటి ఎదురుగ్గా ధరలు, కన్సెషన్ వివరాలతో ‘కొటేషన్’ తయారు చేశాడు యజమాని. పంతొమ్మిది వందల ముఫై రూపాయలయింది. అది తీసుకొని చిక్కడపల్లిలోని ఎ.బి.సి.డి ఆఫీసుకు వెళ్లి ఈశ్వరయ్యగారిని కలిశాడు.
“రా బాబూ, నీ కోసమే ఎదురుచూస్తున్నా, తిరుమలావధానిగారు ఇప్పుడే ఫోన్ చేశారు. నీవు రాలేదా అని” అన్నాడు. కొటేషన్ పరిశీలించాడాయన. “నేను చెక్కు తయారు చేసి ట్రెజరర్‌గారి సంతకం పెట్టించి తెస్తాను. ఆయన యిల్లు దగ్గరేలే. అశోక్ నగర్‌లో. ఆయన సెక్రటేరియట్‌లో అడిషనల్ సెక్రటరీ. ఆరు గంటలకు ఇంటికి వస్తారు. మరి నీవు…”
“ఉంటానండి. ఇప్పుడు నాలుగు దాటింది కదండి. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని అలా తిరిగి ఆరు లోపల మీ దగ్గరికి వస్తాను.”
“సరే నాయనా, చెక్కు ఇన్ ఫేవరాఫ్ ఎవరి పేరున రాయాలో తెలుసుకున్నావా?”
“అయ్యో! లేదండీ! ఇప్పుడెలా?”
“ఏం పరవాలేదు. నేను ఫోన్ చేసి కనుక్కుంటానులే వారి కొటేషన్ మీద నంబరుంది కదా” అంటూ వారికి ఫోన్ చేశాడు. వారు చెప్పింది నోట్ చేసుకున్నాడు.
“చూశావా! ‘నీల్‌కమల్ బుక్‌హౌస్’ కాదట. ‘నీల్ కమల్ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్’ అని రాయమన్నారు చెక్కు మీద” అన్నాడాయన.
“సరిగ్గా ఆరు గంటలకు రా. ఏడు తర్వాత నేనింటికి వెళ్లిపోతాను.”
పతంజలి ముందుగా వెంకటేశ్వరుని గుడికి వెళ్లాడు. స్వామికి పూలమాల కొన్నాడు. గుడి చాలా పెద్దది. నగరం నడిబొడ్డున ఉందేమో బాగా అభివృద్ధి చేశారు. వెళ్లి దర్శనం చేసుకున్నాడు. ప్రసాదం తీసుకున్నాడు. కాసేపు రోడ్డు వెంట షాపులు చూస్తూ నడిచాడు. ఒకచోట మిరపకాయ బజ్జీల బండి కనపడిరది. వెళ్లి రెండు బజ్జీలు తిన్నాడు. ఐదు ముప్పావుకల్లా ఆఫీసులో కూర్చున్నాడు.
ఆరున్నరకు ఈశ్వరయ్య వచ్చాడు. “ఇదిగో నాయనా నీ చెక్కు. కష్టపడి చదువు. వృద్ధిలోకి వచ్చింతర్వాత నీవూ ఈ సంస్థకు చేయూత నందించు” అని చెక్కునందించాడు. “నీ రెండు సంవత్సరాల ఫీజూ రెండువందల యాభై ఐంది. దానికి కూడ నీ పేర చెక్కు రాయించాను. నీకు బ్యాంకు అకౌంటుందా?”
“లేదండి మా నాన్నగారి కుంది”.
“అలా కుదరదు, ఎప్పటికయినా ఉండాల్సిందే గద. పోయి నీ పేర అకౌంటు ఓపన్ చేసి చెక్కు అందులో వేసుకో”.
రెండు చెక్కులూ జాగ్రత్తగా జేబులో పెట్టుకుని మళ్లీ బుక్‌షాప్‌కు వెళ్లాడు. వాళ్లు చెక్కు తీసుకుని పుస్తకాలన్నీ ప్యాక్ చేసిచ్చారు. నోట్ బుక్స్ కూడ కొన్ని సొంత డబ్బుతో కొన్నాడు. ఎనిమిది పేపర్లకు ఒక్కో దానికి ఎనిమిది చొప్పున దాదాపు అరవైనాలుగు పుస్తకాలయినాయి. రెండు కార్టన్స్‌లో ప్యాక్ చేశారు. చాలా బరువున్నాయి. “ఇక్కడ పార్శిల్ సర్వీసు దగ్గరలో ఉందా?” అని అడిగాడు పెద్దాయనను. “ఇక్కడ ఉమెన్స్ కాలేజీ ప్రక్క సందులో ఎస్.ఆర్.యం.టి. వాళ్లది ఉంది” అని చెప్పారు. ఒక రిక్షాలో బుక్స్ వేసుకొని ఎస్.ఆర్.యం.టి. ఆఫీసులో రెండు పాకెట్లనూ డోన్ బుక్ చేశాడు. రశీదు భద్రపరచుకున్నాడు. ఎల్లుండి వస్తాయని చెప్పారు. అప్పుడు ఎనిమిది దాటింది. హరిద్వార్ హోటల్లో చపాతీలు రెండు తిని ఇమ్లిబన్ బస్టాండుకు వెళ్లాడు. తొమ్మిదిన్నరకు డోన్ బస్సు దొరికింది. నేరుగా వెల్దుర్తిలో దిగొచ్చు. బాగా అలసిపోవడం వల్ల బస్సులో మంచి నిద్ర పట్టింది. బావావాళ్లుండి ఉంటే హాయిగా వాళ్లింట్లో ఉండే వాడిననుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకు బస్సు దిగి యింటికి వెళ్లి మళ్లీ నిద్రపోయాడు పతంజలి.
రెండు రోజులు ట్యూషన్ల మీద దృష్టి కేంద్రీకరించాడు. సమ్మర్ క్లాసులే కాబట్టి పరవాలేదు. డోన్‌కు పోయి పుస్తకాల కార్టన్స్ తెచ్చుకున్నాడు. ప్రీవియస్, ఫైనల్ విడివిడిగా ప్యాక్ చేశారు. ఫైనల్ పుస్తకాలున్న అట్టపెట్టె అటకమీద పెట్టారు. ప్రీవియస్ పుస్తకాలన్నీ గూట్లో నీట్‌గా సర్దుకున్నాడు.
శంకరయ్యసారును కలిసి తాను ఎమ్.ఎ ఇంగ్లీషుకు కడుతున్నట్లు చెప్పి వచ్చాడు. ఆజంసారుకు, సాగర్ బావకు, రామ్మూర్తి బావకు అదే విషయాన్ని జాబులు వ్రాశాడు. దీక్షగా చదువు ప్రారంభించాడు పతంజలి. పుస్తకాల సాయంతో తానే స్వంతంగా ఎస్సేలు తయారు చేసుకుంటున్నాడు. ఆ పుస్తకాలు వ్రాసిన లక్ష్మీనారాయణ్ అగర్వాల్, రఘుకుల తిలక్ గార్లకు ఏమిచ్చినా ఋణం తీరదనిపించింది. టెక్స్ట్ బాగా చదివి ఎస్సేల మధ్యలో టెక్స్ట్ లోని కొటేషన్లు భావస్ఫోరకమైనవి ఉండేలా జాగ్రత్తపడ్డాడు. చదివేటప్పుడే ‘రెఫరెన్సెస్ టుది కాంటెక్స్ట్’ (యాన్నొటేషన్స్) కు రావడానికి అవకాశమున్న భాగాలను రెడ్‌యింక్‌తో మార్క్ చేసుకున్నాడు.
విద్యార్థులకు ఎంత మేలు చేశారంటే రచయితలు పుస్తకంలో ఎడమవైపు పేజీలో టెక్స్ట్, కుడివైపు పేజీలో దాని పేరాఫ్రేజ్ (మాడరన్ ఇంగ్లీషులో అనుసరణ) ఇచ్చారు. ఫుట్ నోట్సులో లోతైన విషయాలు వివరించారు. సంస్కృత కావ్యాలను సరళవ్యాఖ్యతో అందరికీ చేరువు చేసిన మల్లినాధ సూరి లాంటి వారు వీరు. ఆయన పంచకావ్యాలకు చేసిన వ్యాఖ్యానాన్ని ‘దీపశిఖా వ్యాఖ్య’ అంటారు.
మనకు ఆదికవి నన్నయ్య ఎలాగో, వేదవ్యాసులవారెలాగో, ఆంగ్ల సాహిత్యానికి, జియోఫెరీ చాసర్ (Geoferry Chaucer) అలాంటివాడు. ఆయన రాసిన ‘క్యాంటర్‌రీ టేల్స్’ ఒక కళాఖండం. క్యాంటర్‌బరీ అనేది ఒక గొప్ప క్రైస్తవ పీఠం. దాన్ని సందర్శించటానికి ఇంగ్లండులోని అన్ని ప్రాంతాల నుండి యాత్రికులు వెళుతూంటారు. అలాంటి బృందం ఒకటి యాత్రకు వెళుతూ, మార్గాయాసం ఉపశమించడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పాలని నిర్ణయించుకంటారు. రాత్రి ధర్మసత్రాలలో బస చేస్తుంటారు. ఆ బృందంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రతినిధులనూ చేర్చాడు చాసర్. ఆనాటి ఇంగ్లీషు సమాజం స్వరూప స్వభావాలు మన కళ్ళకు కడతాయి. ఒక రకంగ మన కాశీమజిలీ కథల లాంటి కావ్యమది
అంతవరకు ఆంగ్ల నాటక పితామహుడు (Father of English Drama) విలియం షేక్‌స్పియరేనని అనుకుంటున్నాడు పతంజలి. కాని అది తప్పని తెలిసింది. షేక్‌స్పియర్‌కు ముందే క్రిస్టోఫర్ మార్లో (Christopher Marlowe) అనే మహాకవి అద్భుతమైన నాటకాలు రాశాడు. ఆయనవి రెండు నాటకాలు పేపర్ – 2 లో పాఠ్యాలుగా ఉన్నాయి. షేక్ స్పియర్ మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ.
ప్రొజ్ (Prose) గద్యభాగం కోసం ఒక పేపరు కేటాయించబడింది. ప్రాన్సిస్ బేకన్, అలెగ్జాండర్ పోప్, జొనాధన్ స్విఫ్ట్ లాంటి హేమాహేమీల రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘గద్యం కవీనాం నికషం వదన్తి’ అని సంస్కృతంలో నానుడి. ఒక కవి ప్రతిభను నిగ్గు తేల్చే గీటురాయి గద్యమే అని దానర్థం. సంస్కృతంలో బాణభట్టు, దండి, తెలుగులో పానుగంటి వారు గద్యాన్ని అద్భుతంగా పండించారు. తన వ్యాసాలలో ఇలా తులనాత్మక సాహిత్యాన్ని కూడ స్పృశిస్తూ ముందుకు సాగుతున్నాడు పతంజలి.
కొన్ని రోజుల తర్వాత రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుండి పతంజలిని సెలెక్ట్ చేసినట్లు అపాయింట్‌మెంట్ ఆర్డరు వచ్చింది. మంత్రాలయ బ్రాంచికి పోస్టు చేశారు. పతంజలికి అంత సంతోషం అనిపించలేదు. కానీ ఉద్యోగం ఉద్యోగమే కదా అని చేరాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి సమ్మర్ ట్యూషన్లు పూర్తయి, రెగ్యులర్ ట్యూషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. అదీ మంచిదే అయింది. పిల్లలు ఇబ్బంది పడేవారు మధ్యలో వదిలేస్తే.
వెళ్లి మంత్రాలయంలో జాయిన్ అయ్యాడు. కేవలం ఇద్దరే స్టాఫ్. ఒక అటెండరు కూడ లేడు. ఏదో స్ల్పిట్ అవర్ డ్యూటీ అట. బ్యాంకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటలనుండి రాత్రి 7 గంటల వరకు పని చేస్తుంది. మేనేజరు పేరు వాసుదేవ రెడ్డి. ఎ.జి. బియ్యస్సీ. ఆయనకు నెలకు ఏడు వందలు కన్సాలిడేటెడ్ పే వస్తుందట. పతంజలికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్.డి.సి స్కేలు ఇస్తారట. బేసిక్ రూ. 250, డి.ఎ.హెచ్.ఆర్.ఎ కలిపి నాలుగువందలకు ఇంకా ఇరవై రూపాయలు తక్కువే వస్తుంది. తాను ట్యూషన్ల ద్వారానే నెలకు ఐదారు వందలు సంపాదించేవాడు. మేనేజరు ఒక గది తీసుకుని ఉంటున్నాడు. అద్దె అరవై రూపాయలు. పతంజలిని కూడ తనతో ఉండమన్నాడు రెంట్ షేర్ చేసుకుందామన్నాడు.
ఒక కన్నడ బ్రాహ్మడు పదిమంది ఉద్యోగుల కోసం చిన్న మెస్ నడుపుతున్నాడు. ఆయన పేరు సుధీంద్ర. ఉదయం టిఫిన్, రెండు పూటలా భోజనం పెడతాడు. శుచిగా రుచిగా ఉంటుంది. నెలకు నూట యాభై రూపాయలు తీసుకుంటాడు.
ఇక ఆఫీసుపని ఎలా ఉందంటే దాన్ని ‘గాడిద చాకిరీ’ అనవచ్చు. జాతీయ బ్యాంకుల జీతాలకూ గ్రామీణ బ్యాంకు జీతాలకూ పోలికే లేదు. అకౌంట్లు ఓపనింగ్ దగ్గర నుంచి, విత్‌డ్రాయల్స్, డిపాజిట్స్, క్యాష్ లోన్లు, గేదెలకు లోన్లు అన్నీ పతంజలి చేయ్యాల్సిందే. మేనేజరు కూడ బాగానే కష్టపడాలి. పేరుకు 11 గంటల వరకే గాని బ్యాంకు మూసిన తర్వాత చాలా పని ఉంటుంది. రాత్రి రూముకు వచ్చేసరికి తొమ్మిది. మంత్రాలయం రాఘవేంద్ర మఠంవారు రోజూ కొన్ని వేల రూపాలయు డిపాజిట్ చేస్తారు. కాని వాళ్ళు బ్యాంకుకు రారు. పతంజలే వెళ్లి ఆ డబ్బు తెచ్చుకోవాలి. వాళ్లకు రశీదు తీసుకొని వెళ్లి ఇవ్వాలి.
పదిరోజులు గడిచేసరికి పతంజలి డీలా పడిపోయాడు. ఎమ్.ఎ చదువు మూలబడింది. ఏమాత్రం సృజనాత్మకతలేని, పూర్తి యాంత్రికమైన ఆ ఉద్యోగం పతంజలికి ఏమాత్రం నచ్చలేదు. నాల్గు రోజులు తర్వాత తండ్రి వచ్చాడు. దైవ దర్శనం అయిన తర్వాత మఠంలో బ్రాహ్మణ అన్నదాన సత్రంలో ఆయనతో పాటు భోజనం చేశాడు.
బ్యాంకు తలుపులు తాళాలు తెరవడం, మూయడం దగ్గర్నుంచి, ఆఫీసులోని ముమ్మరమైన పనితో కొడుకు సతమతమవుతూండటం గమనించాడాయన. ఆరోజు శనివారం సాయంత్రం బ్యాంకుకు శెలవు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చెయ్యాలి.
సాయంత్రం తండ్రీ కొడుకులిరువురూ తుంగభద్రా నదికి వెళ్లి ఇసుకలో కూర్చున్నారు. కొడుకు చిక్కిపోయాడు. ముఖంలో కళ లేదు. “ఏం నాయనా! పతంజలీ! ఏమిట్రా పదిరోజులకే ఇట్లా అయినావు?” అని తండ్రి అడుగుతూనే, ఆయన ఒళ్లో తలపెట్టుకొని చెప్పాడు “నాన్నా నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు. నా మనస్సేమీ బాగలేదు” అని. కొడుకు వీపు నిమురుతూ లాలనగా అన్నాడు మార్కండేయశర్మ “ఇష్టం లేకపోతే వదిలెయ్యి నాయనా. ఇష్టంలేని పని అసలు చేయకూడదు” దిగ్గున లేచి తండ్రిని చూశాడు పతంజలి. తండ్రి మాటలతో ఎక్కడలేని ధైర్యం వచ్చింది.
“అయితే రేపే రాజీనామా చేస్తాను. మన ఊరికి వెళ్లిపోదాం. మరి ట్యూషన్లు కూడా ఈ సంవత్సరం ఉండవేమో మరి ఎట్లా?”
“ఏం పరవాలేదు. నరసింహస్వామి ఏదో ఒక దారి చూపుతాడులే. నేను కూడ నీవిక్కడికి వచ్చినప్పటి నుండి జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం సాధన చేస్తున్నా. వచ్చే సంవత్సరం మల్లినాధ వచ్చేస్తాడు. ఈ వ్యవసాయం వల్ల నేను వాటిమీద దృష్టి పెట్టలేదుగాని, ఇకనుంచి పూర్తి కాలాన్ని వినియోగిస్తాను. అన్నట్లు నీకు చెప్పలేదు కదూ టి.టి.డి వారు నన్ను వారి ‘హిందూ ధర్మ ప్రచార పరిషత్తు’లో సభ్యునిగా నియమించారు. మన రామకృష్ణారెడ్డి తోడల్లుడు టి.టి.డి బోర్డు మెంబరు. మన రెడ్డి ఆయనకు నా గురించి చెప్పినాడట. నెలకు మూడు నాలుగు ప్రవచనాలు చెప్పాలట. ఎక్కడ అనేది వారు ఎన్నిక చేసి ఉత్తరం ద్వారా ముందే తెలుపుతారట. దారి ఖర్చులిచ్చి నెలకు మూడువందల పదహార్లు గౌరవ వేతనం ఇస్తారట. పోయిన వారమే ఉత్తర్వులు వచ్చినాయి.
నీవు మరేం ఆలోచించకుండా రాజీనామా చేసెయ్యి. అవధానిగారు చెప్పిన ప్రకారం బాగా చదువుకో. నాక్కూడా ఈ ఉద్యోగం నచ్చలేదులే. పోదాం పద” అన్నాడు తండ్రి.
మరుసటి రోజే మేనేజరుకు రిజిగ్నేషన్ లెటరిచ్చి బయలుదేరారు ఇద్దరూ. అతను కూడ పెద్దగా ఆశ్చర్యపోలేదు.
“నేను ఊహించాను. దిసీజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ” అన్నాడు. “నేను కూడా మంచి ఉద్యోగం దొరికేంతవరకు మాత్రమే చేస్తాను. గుడ్‌లక్”
ఇద్దరూ కోడుమూరుకు వచ్చి, వెల్దుర్తి బస్సెక్కారు. పతంజలి మనసులో ఏమాత్రం గిల్టీనెస్ లేదు.
పతంజలికి పంజరం నుండి విడుదలయినట్లుంది. ఇనుమడించిన ఉత్సాహంతో ఇంగ్లీషు సాహిత్యాన్ని మథించసాగాడు. బ్యాంకు ఉద్యోగం మానేసి వచ్చినందుకు కొందరు విమర్శించారు. కొందరు మద్దతునిచ్చారు. ఒకనాడు లైబ్రరీలో ‘మునికుమార్’ కలిశాడు. హైస్కూల్లో ఒక సంవత్సరం పతంజలికి జూనియర్ అతడు. రోజూ లోకల్ ట్రైన్‌లో తిరిగి కర్నూలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బి.కాం చేశాడట. ఇంటర్మీయడియట్ కోల్స్’లో చదివాడట. ఇంటర్‌లో ఎం.పి.సి గ్రూపు తీసుకున్నాడట. వాళ్ల నాన్న సుంకరాజు సెంకడరీగ్రేడ్ టీచరు. అతని తమ్ముడికి యస్.యస్.సి మార్కులతోనే పోస్టాఫీసులో గుమాస్తా ఉగ్యోగం వచ్చిందట. నాల్గయదు బ్యాంకు పరీక్షలు వ్రాశాడట గానీ ఇంటర్వ్యూ ఒక్కటైనా రాలేదట. మ్యాధ్స్, రీజనింగ్ బాగా చేస్తాడట గానీ ఇంగ్లీషులో వీకట.
అప్పుడపుడూ మునికుమార్, పతంజలి సాయంత్రపూట రైల్వే గేటు వరకు షికారు వెళ్లేవారు. అతని నెమ్మదితనం పతంజలికి నచ్చింది. దగ్గర స్నేహితులయ్యారు.
మహిత బాగా చదువుతూంది. మల్లినాధ రెండుసార్లు వచ్చి వెళ్లాడు. శ్రీశైలం నీళ్లు వాడికి బాగా ఒంటాయి. బాగున్నాడు. చిన్నోడు తొమ్మిదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. వాడికి పతంజలి రోజూ కొద్దిసేపు గ్రామర్ నేర్పిస్తున్నాడు. వాడు సూక్ష్మగ్రాహి, పతంజలి దగ్గర అతి గారాబం.
ట్యూషన్ల ఆదాయం లేక లోటు బడ్జెట్ అయింది. బ్యాంకులో మిగిలిన డబ్బు హరించుకుపోతూ ఉంది. అప్పులు వడ్డీలతో కలిసి దాదాపు ఇరవై వేలకు చేరుకున్నాయి. హైబ్రీడ్ తెల్ల జొన్న బాగానే పండింది. గాని ధర లేదు. వెంటనే అమ్మేయక పోతే పురుగు పడుతుంది. ఖర్చులు పోను వెయ్యిరూపాయలు కూడా మిగలలేదు. చొప్ప వలీ కమ్మేశారు. గణపతి తింటాడని తక్కువ ధరకే యిచ్చారు. నెలకొకసారి గణపతిని ఇంటిదగ్గరకు తెచ్చి ఒక గంటసేపుంచి పోతున్నాడు వలీ.
కర్నూల్లో ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్, ది గ్రేట్ రేమన్ సర్కసు ఒకేసారి వచ్చాయి. తన ఫ్రెండ్సందరూ చూసి వచ్చారు. మనమూ వెళ్దామని పాణిని మొండికి పడ్డాడు. సరే అని మహితను, చిన్నోడిని తీసుకొని కర్నూలుకు బయలుదేరాడు. మార్కండేయశర్మ జాతకాలు చూడటం గృహవాస్తు, జలవాస్తు చూడటం మొదలుపెట్టాడు. ఇంటిదగ్గర పంచాంగం చూపించుకునే వాళ్ల దగ్గర కూడ మనుపటిలా కాకుండా మినిమం అయిదు రూపాయలు తాంబూలంలో పెట్టాలని చెప్పాడు. బీదరికం విద్యను వ్యాపారంగా మారుస్తుంది మరి. చెరువు కింద వరిమడి పండడంలేదు. చెరువు పూర్తిగా ఎండిపోయింది.
పొద్దున్న తొమ్మిది గంటలకే అన్నాలు తిని ముగ్గురూ బయలుదేరారు. ముందు మార్నింగ్ షో ‘చాణక్య ` చంద్రగుప్త’ చాంద్ టాకీసులో చూశారు. ఆర్యభవన్‌లో పూరీలు తిని సర్కస్‌కు మ్యాట్నిషో కెళ్లారు. చిన్నొడు సర్కస్‌ను బాగా ఎంజాయ్ చేశాడు. ఎగ్జిబిషన్ ఏడు గంటలకు గాని బాగుండదు లైట్ల వెలుగులోనే చూడాలి దాన్ని.
ఎందుకో రాధాసారు గుర్తుకొచ్చాడు పతంజలికి. ఎగ్జిబిషన్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో. సారు యిల్లు అక్కడి దగ్గర. విద్యానగర్‌లో. రిక్షాలో ముగ్గురూ సారింటికి వెళ్లారు. ఆయన అప్పుడే ఆఫీసునుంచి వచ్చినట్లున్నాడు.
“ఏంది సామీ! సుక్క తెగి కిందబడినట్టు బలె వచ్చినావే అనుకోకుండా. రాండమ్మా, ఈన సిన్నతమ్ముడా!” అంటూ అందర్నీ డ్రాయింగ్ రూంలోని సోఫాల్లో కూర్చోబెట్టాడు. సారు భార్య అందరికీ యాపిలు ముక్కలు, బిస్కెట్లు ఇచ్చి తిన్న తర్వాత టీ యిచ్చింది. మహిత టీ తాగనంటే పాలు తెచ్చిచ్చింది.
“ఈ మజ్జన కనబడల్యా. ఏంది కత?” అనడిగాడాయన.
అంతా వివరించాడు పతంజలి. గ్రామీణ బ్యాంకు ఉద్యోగం వదిలేసినందుకు ఆయనేమీ బాధపడలేదు.
“నీలాంటోనికి ఆ పని లాయకీ గాదులే. ఎమ్.ఎ పూర్తిజేచ్చే గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్ జాబ్ వచ్చాది.” అన్నాడు. “మల్ల ట్యూషన్లు లేకపోతే ఇబ్బందేనే…” అని కాసేపు ఆలోచించాడు.
“సామీ! నాకొకటనిపిచ్చాంది. నీలాంటోనికి ఆ పల్లెటూరుతో ఇంక బనిల్యా. కర్నూలే నీకు తగిన ఊరు. ఈడ ట్యూటోరియల్ కాలేజీ తెరుచ్చాం. నీతో బాటు ఇద్దర్ని పెట్టుకో. స్పోకెన్ యింగ్లీషొక్కటి చాలు నీ పేరు ఎలిగిపోనికే. ఏమంటావు?”
“కర్నూల్లో ట్యూటోరియల్స్ అంటే మాటలా సార్! చాలా పెట్టుబడి కావాలి. నాతో ఏమవుతుంది?” అన్నాడు పతంజలి నిరాసక్తంగా. “పెట్టుబడి సంగతి నాకొదిలెయ్యి. నేనిస్తా. నాకు నిదానంగా సర్దుదువుగాని. ఏముంది రెండు నెలల అడ్వాన్సు, అడ్వరటైజ్‌మెంట్ గనంగ జేయాల. అదే వ్యాపారానికి పానం. ఆఫీసు పర్నిచర్. పిల్లల కూసోడానికి ఇనప బెంచీలు. ఈడ్చి తన్నినా ఐదు వేలు దాటదు. నేనుండాగద” అన్నాడాయన ఉత్సాహంగా.
పతంజలిలో ఆశలు చిగురించాయి. వెంటనే మునికుమార్ గుర్తొచ్చాడు.
“సరే సార్! మీ అండ ఉంటే సాధిస్తాను” అన్నాడు.
“అదీ మొగోని మాట. రేపట్నించే మంచి వెన్యూ కొరకు ఎదుకుదాం”. సారుకు నమస్కరించి, ముగ్గురూ వచ్చేశారు.
దారిలో మహిత అన్నది. “రాధాసారు చెప్పింది చాలా బాగుందన్నయ్యా. టీచింగ్ అంటే నీకిష్టం కదా”
“అవునమ్మా! తప్పకుండా చేద్దాం”
తొమ్మిది గంటలవరకు ఎగ్జిబిషనంతా చూశారు. మహిత గాజులు స్టిక్కర్లు కొనుక్కుంది. పెద్ద పెద్ద మసాలా అప్పడాలు తిన్నారు. జయంట్ వీల్ ఎక్కారు. చిన్నోడికి చెప్పులు కొన్నారు. ఎగ్జిబిషన్ బయట టిఫిన్ బండిలో ఇడ్లీలు తిని, రాత్రి పదిగంటలకు శ్రీశైల దేవస్థానంవారి శ్రీశైలం-అనంతపురం బస్సులో వెల్దుర్తి చేరుకున్నారు.
రాధాసారు ప్రతిపాదన గురించి తండ్రితో చర్చించాడు పతంజలి. ఆయన కూడ బాగుంటుందన్నాడు. మరునాడు లైబ్రరీలో మునికుమార్‌తో చెప్పాడు. అతడు ఎగిరి గంతేశాడు. “నేను ఇంటర్ వాళ్లకు కామర్స్, ఎకనమిక్స్ చెప్పగలను. టెంత్ వాళ్లకు మాథ్స్, సైన్స్ కూడ” అన్నాడు.
మంచిరోజు చూసి సరైన బిల్డింగ్ కోసం వేట ప్రారంభించారిద్దరూ. ఉదయం లోకల్‌కు వెళ్లినా సాయంత్రం వరకు తిరిగి మళ్లీ లోకల్‌కు వచ్చేవారు. వారం రోజులకు స్టేషన్ రోడ్‌లోనే యస్.టి.బి.సి S.T.B.C. కాలేజీ ఎదురుగా ఒక బిల్డింగ్ మీద “TO LET for convents, Edn Institutions” అని బోర్డు కనబడింది. క్రింద ఐదు షాపులున్నాయి. పైన వరుసగా ఐదు రూములు విడివిడిగా ఉన్నాయి. దేని తలుపు దానికే.
(సశేషం)