చింతకాయ పచ్చడి
[dropcap]ఎ[/dropcap]ప్పటినుంచో “రండీ… రండీ” అంటున్నా కూడా రానంటే రానని మంకుపట్టు పట్టిన మా అత్తగారు తన పంతాన్ని కాస్త సడలించి, మా ఇంటికి… అదే అమెరికాకి రావడానికి ఒప్పుకున్నారు.
ఇక మా ఆయన కాళ్లు నేలమీద ఆనడం లేదు. కనపడిన ప్రతీవారికీ (స్నేహితులూ, పరిచయస్థులకే లెండి) “మా అమ్మ వస్తోందహోయ్” అని చాటింపు మొదలెట్టారు.
టికెట్ బుకింగ్ అయింది మొదలు రోజుకి రెండుసార్లైనా తల్లీకొడుకులు ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మధ్యలో నేనూ దూరేదాన్ని, వినడానికి.
అక్కడ నుంచి ఆవిడ “ఏవేం పట్రావచ్చూ?” అని అడగడం… ఇక్కడ నుంచి ఈయన మొత్తం లిస్ట్ చదవడం. ఎప్పటినుంచో ఈయనగారి తీరని కోరికల చిట్టా బుసలు కొట్టడం మొదలయింది. ఇక్కడ నేనేదో అస్సలు ఏమీ చేయనట్టూ… ఈయనగారి జిహ్వ చాపల్యాలు తీర్చనట్టూ… అసలు తిండికే ముఖం వాచిపోయినట్టూ… ఇంకా ఏదో అలా అట్టూ, ఇలా ఇట్టూగా ఉంది ఈయన వ్యవహారం. మధ్యలో పుసుక్కున నేనేదైనా అంటే… ఇంకేవన్నా ఉందీ? అంతెత్తున ఎగిరిపడతారు … నాకెందుకులే అని నా నోటిని మ్యూట్‌లో పెట్టేసి, చెవులు మాత్రమే అన్‌మ్యూట్ చేసాను.
“అమ్మా! కొత్త చింతకాయ పచ్చడి మర్చిపోకు. అసలు నేను చెప్పేవన్నీ బయటకు తీసి కటకటాల గదిలో పెట్టుకో. ఆనక, అయ్యో మర్చిపోయానురా! అనేస్తావు. ఇక్కడ ఓ బుల్లి రోలు కొన్నాను. నువ్వు వచ్చాక, నీతో చింతకాయ పచ్చడి, పచ్చిమిరపకాయలతో చేయించుకుని. ఉల్లిపాయ నంచుకుని తినాలి. నీ కోడలూ చేస్తుంది కానీ, ఇంత పొడికారం వేసేసి మిక్సీలో డుర్రు డుర్రుమనిపిస్తుంది. ఎర్రటి ఎండలో ఎండిపోయినట్టుంటుంది ఆ పచ్చడి. నా నాలిక ఆ పచ్చడిని ఏదో మమ అనిపిస్తుంది కానీ, మనస్ఫూర్తిగా ఆస్వాదించలేదు.”
ఆ మాట చెవిన పడగానే గుర్రు చూశాను… ఏదీ? ఆ నాలుకని బయటకి లాగి సర్రున కోసేయాలనిపించింది.
అబ్బే! నా చూపులు లెక్క చేసే స్ధితిలో ఉన్నాడా ఆ మానవుడు? మాట్లాడేది ఎవరితో? వాళ్ళమ్మతో… మాట్లాడేది దేని గురించీ? ప్రియాతిప్రియమైన చింతకాయ పచ్చడి గురించి… ఆ మాట విన్నా, అన్నా ఏదో అలౌకిక అనుభూతికి లోనై ఎక్కడో వెళ్ళిపోతాడు మా అత్తగారి ముద్దు బిడ్డడు… అదే నా మొగుడు. మమ అనిపిస్తాడట! చూడండి ఆ ముఖం… చేసినప్పుడల్లా ఆ పచ్చడి తోనే కుంభాలకి కుంభాలు లాగిస్తాడు… తరువాత భుక్తాయాసంతో కుంభకర్ణుడిలా గుర్రు గుర్రు గురక కూడా పెడతాడు. జన్మరాశి, కుంభం కూడా సరిగ్గా సరిపోతుంది ఈయనగారికి.
లోలోపల తిట్టుకుంటూ, ఆ కోపం కసి అంతా చేతిలో రిమోట్ మీద చూపిస్తూ… టకటక ఛానెల్స్ మార్చసాగాను.
అదేం పట్టించుకోకుండా వాళ్ళమ్మతో “మన ఊరి చింతచెట్టు కాయలేగా? నిరుడు మా అత్తగారు రైతుబజార్లో కొన్నారు. ఆ చింతకాయల పచ్చడి గరుడవేగాలో పంపారు. అబ్బే అస్సలు పులుపూ లేదూ, ఊటా లేదూ” అంటూ అనేసరికి, నన్ను అంటే అన్నారు – మా పుట్టింటివారు పంపిన చింతకాయల పచ్చడిని కూడా అనేసరికి, అర్జంటుగా బేక్ యార్డులో రొండు, రొడ్డు పులుపున్న రెండు చింతచెట్లు నాటేసి, వాటికి ఈయన్ని కట్టేసి చింతబరికతో బాదేయాలన్నంత చింతావేశం వచ్చేసింది.
“అయ్యో! ఇంకా నయమే! ఇవి మన చెట్టు కాయలేరా! మూడు తరాలనుండీ మనకి ఆ చింతకాయలేగా పచ్చడికీ, చింతపండుకీ వస్తున్నాయి. మొన్న మన ఊరి నుంచి సుబ్బయ్య వస్తూ వస్తూ రెండు బస్తాల చింతకాయలు తెచ్చాడు. మనకి సరిపడా పచ్చడి పెట్టి, మిగతావి ఇరుగుపొరుగలకందరికీ పంచాను” మురిసిపోతూ చెప్పింది అత్తగారు.
“ఔనమ్మా! ఆ చెట్టు కింద నేనూ గోపీగాడూ, రాజుగాడూ గోళీలాడుకునేవాళ్ళం. ఆ చెట్టెక్కి చింతచిగురు కోస్తోంటే ఓసారి కిందపడి చెయ్యి విరక్కొట్టుక్కున్నా గుర్తుందా?
ఓసారి బడి మానేసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళానని నాన్న ఆ చింతావారమ్మాయితోనేగా నా పెళ్లి చేసాడు.” ఈయనగారి ముఖంలో గత జ్ఞాపకాలు మెరుపు కాంతులీనుతూ కనిపించాయి.
“ఇప్పుడు నిజంగానే చింతావారమ్మాయినేగా నువ్వు చేసుకున్నదీ! హహహహ” అంటూ అత్తగారు అనేసరికి.. మా పుట్టింటివారింటి పేరు మీద చింతచెట్టంత కోపం చర్రున లేచింది.
“ఆ చింత చెట్టు కింద చిన్నప్పుడు మేమాడుకునే ఆటల్లో అదేదో పాట కూడా ఉండేది కాదమ్మా! ఆ.. గుర్తొచ్చింది ‘చెట్టు మీద దెయ్యం.. నాకేం భయ్యం’” అంటూ నావేపు చూసిన ఆయన నా కళ్ళు చింతనిప్పుల్లా మెరవడం గ్రహించి చటుక్కున పాట ఆపేసారు.
ఇక ఈ చింతకాయల ఎపిసోడ్ మొదలయిందంటే.. ఈ తల్లి కొడుకులు కళ్ళ ముందు ఫ్లాష్‌బ్యాక్ మొత్తం వలయాలు వలయాలు తిరుగుతాయి. ఈయనగారి ముత్తాత నాటిన చింతచెట్టు హిస్టరీ మొత్తం విత్తు వేసిన మొదలు ఎప్పుడు మొలక వచ్చింది? ఎప్పుడు మారాకు వేసింది? ఎప్పుడు పెరిగింది? ఎప్పుడు కాయలు మొదలయ్యాయి? మొదటిసారి ఎన్ని మణుగులు వచ్చాయి? ఇక ఈ చింతకి అంతు పొంతూ ఉండదు అని సణుక్కుంటూ.. కసుక్కున టీవీ ఆపేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి దుప్పటి ముసుగేసుకున్నాను.
(మళ్ళీ కలుద్దాం)