ఆకట్టుకునే ఆత్మకథ ‘నా ఏకాంత బృందగానం’

11
3

[dropcap]ఆ[/dropcap]త్మకథలు వ్రాసిన వారి జీవితాన్ని ప్రతిబింబింపజేస్తాయి. వారి సమకాలీన పరిస్థితులకు అద్దం పడతాయి. కొన్ని సంగతులను దాచిపెట్టవలసి వస్తుంది. ఇతరులను బాధించే పరిస్థితులూ ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వ్రాయగలగాలి.

తెలుగులో ఆత్మకథలు తక్కువ. మహిళల ఆత్మకథలు ఇంకా తక్కువ. ఈ మధ్య కాలంలో వెలువడిన ఆత్మకథలలో డా.అమృతలత గారి ‘నా ఏకాంత బృందగానం’ పేరుతో ‘డా॥ అమృతలత సచిత్ర స్వీయ చరిత్ర’ పాఠకులకు చేరువయింది.

ఎవరీ అమృతలత? ఏమామె కథ? ఉత్తర తెలంగాణకు కంచుకోట అయిన నిజామాబాద్ జిల్లాలోని కలిగోటని ఆనుకుని ఉన్న పడకల్‌లో పుట్టి, జక్రాన్‌పల్లిలో పెరిగిన అమృత అనే బాలిక. ఏడేళ్ళు నిండే వరకు పై మూడూళ్ళలో మాత్రమే బాల్యాన్ని ఆస్వాదించిన బాలిక-ఇప్పుడు ఏడు దశాబ్దాల పరిపూర్ణ జీవితంలో జిల్లా, రాష్ట్ర దేశ, సరిహద్దులు దాటి విదేశీయానాలు చేశారు.

బాల్యంలోనే తల్లిని, టీనేజిలో తండ్రిని పోగొట్టుకున్నా – అక్కలు, బావలు, అన్నలు, వదినల అనురాగం, ప్రేమ, ఆప్యాయతలతో మౌనంగా ఎదిగి, చదివి, ఒదిగిన ధీరోధాత్రి. స్థితప్రజ్ఞత ఆమె స్వంతం. వినయం ఆమె ఆభరణం. ఈనాటికీ వారందరిపట్లా తనకు గల ప్రేమానురాగాలని ఈ గ్రంథంలో వ్యక్తపరచిన తీరు అనిర్వచనీయం.

ఈ స్వీయకథలో తన అనుభవాలతో పాటు సమకాలీన భౌగోళిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ చారిత్రక పరిణామాల నేపథ్యాన్ని సవివరంగా, సచిత్రంగా అందించిన చరిత్ర ప్రేమికురాలు. తన బాల్యపు కళారూపాల నుండి నేటి హైటెక్ యుగం వరకు కళాపరిణామ దశను అవగాహన చేసుకున్నారు. తన పసితనం నుండి అక్కున చేర్చినవారు, సన్నిహితులు, స్నేహితులు, తస్మదీయులు, కళాకారుల పట్ల గల మక్కువే ‘నా ఏకాంత బృందగానం’ పేరును పెట్టించిందేమో?

ప్రతి పేజీలోను తేదీ, మాసం, సంవత్సరాల వారీగా రాజకీయ, సాంకేతిక, శాస్త్రవిజ్ఞాన రంగాలలో పరిణామాలు సచిత్రంగా పొందుపరిచారు. తెలంగాణ కోసం జరిగిన అన్ని ఉద్యమాలనీ, తెలంగాణ ఆవిర్భావాన్ని చాల సంతోషంగా అనుభూతి చెందుతూ అందించారు.

బాల్యంలో పల్లెలలో ఆమె చేసిన అల్లరి పనులు చదువుతుంటే అల్లరి అమృత కనిపిస్తుంది. అల్లరి పనులు వికటించినప్పుడు “ఎందుకు ఇలా జరిగింది?” అని ప్రశ్నించుకున్న బాలికలో కొన్నిసార్లు బాలశాస్త్రవేత్త కనిపిస్తుంది. ఆ తెలియని తనంలో చేసిన పని వలన తన చేతి వేళ్ళను పోగొట్టుకుని ఎంతనరకం అనుభవించారో? ఆ సమయంలో తనని కంటికి రెప్పలా కాపాడిన చిన్నక్క, మేనత్తలను మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

పి.యు.సి, బి.ఎ, బి.యిడి, చదువుకోవడానికి డబ్బు ఎలా అని బాధపడున్న సమయంలో బాపు ఇచ్చిన ఎకరం పొలం అమ్మి చదువుకోమని సలహా ఇచ్చిన చిన్నక్క సలహాని పాటించారు. తనకు పొలం సంగతి తెలియక ముందు బీడీలు చుట్టి చదివించిన చిన్నబాపు కూతురు బాలవితంతువు గంగవ్వకు పునర్వివాహం చేసి ఋణం తీర్చుకున్నారు.

వివాహ బంధాలు కఠినాతి కఠినమైన సమస్యలను సృష్టించినా చదువును కొనసాగించి, ఉద్యోగంలో చేరారు. భరించలేని పరిస్థితులలో విడాకులిచ్చారు. కాని తండ్రిని పోగొట్టుకున్న బాధను అనుభవించిన స్త్రీ కాబట్టి తన కుమార్తెకు అవసరమైన సమయంలో తండ్రి హోదాలో అతని కర్తవ్యాలని నెరవేర్చమని కోరిన మంచి అమ్మ ఆమె.

జీవితంలో తొలి నుండి ఎన్నికష్టనష్టాలు ఎదురైనా స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకునేవారు. వారిని వేళాకోళం చేసి ఏడిపించేవారు. మళ్ళీ అందరితో కలిసి ఆయా వయసు కనుగుణంగా చెట్లెక్కి, పుట్టలెక్కి తోటలలో ఆడుకోవడం/గోదావరిలో తెప్పలలో విహరించడం/జోక్స్ వేసుకుంటూ, ఆటలాడుతూ పాటలు పాడుతూ, తన అల్లరి వల్లరితో అందరినీ అలరిస్తూ చదివారు. బి.యి.డి. చదువుతున్నప్పుడు నిబద్ధతతో ఈమె రాసిన పాఠ్యప్రణాళిక లెక్చరర్స్‌కి నచ్చింది. అప్పుడే ఉపాధ్యాయులకి ఉండవలసిన లక్షణాలని సొంతం చేసుకున్నారు.

ఆర్మూర్‌లో, కామారెడ్డిలో టీచరుగా పనిచేస్తూ విద్యార్థులతో మమేకమయ్యేవారామె. పిల్లలలో పిల్లలాగా, సహోపాధ్యాయులలో పెద్దదానిలా ఉంటూ మంచి టీచర్‌గా, మంచి స్నేహితురాలిగా ఎదిగారామె.

తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మారినపుడు తనకి ఇబ్బందులు ఎదురయిన సందర్భంలో భవిష్యత్‌లో తను బడి పెడితే ఇంగ్లీషు మీడియంలో పెట్టి గ్రామీణ పిల్లలకు ఉపయోగపడాలని ఆశించారు. విజయ్ పబ్లిక్ స్కూల్స్‌ని ఆర్మూర్, నిజామాబాద్‌లలో స్థాపించి తన ఆశయాన్ని నెరవేర్చారు.

‘విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజి’ని స్థాపించినప్పుడు తను కాలేజి చదువు కోసం ఊరూరా తిరుగుతూ పడిన బాధలు గుర్తు తెచ్చుకుని పిల్లలు ఒక చోట ప్రశాంతంగా చదివే ఏర్పాటు చేయాలనే ఆశయంతోనే కాలేజి నిర్మించానని స్నేహితురాలితో చెప్పి ఆనందాన్ని పంచుకున్నారంటే, ఈమె ఎంత విద్యా ప్రేమికురాలో తెలుస్తుంది.

ఇవేగాక ఈమె స్థాపించిన విద్యాసంస్థలనేకం. వివిధ కమిటీల ద్వారా నడుపుతున్నా (చట్టప్రకారం) తన సరస్వతీ సామ్రాజ్య అధినేత తనే! విద్యాసంస్థల వార్షికోత్సవాలని ‘టాలెంట్ షో’ల పేరుతో వివిధ రంగాలలో నిష్ణాతులని అతిథులుగా ఆహ్వానించి నడపడం, ప్రేక్షకుల మధ్యలో మారువేషంలో కూర్చుని వారి అభిప్రాయాలను విని, తరువాత సంవత్సరాలలో పొరబాట్లను సరిచేసుకోవడం వెన్నతో పెట్టినవిద్య.

ఈమె సినిమా పాటల ప్రేమికురాలు. ఈ ఆత్మకథలో చాలా సందర్భాలలో తనకిష్టమయిన తెలుగు, హిందీ పాటలను ప్రస్తావించారు.

బాల్యం నుండి కళలపట మక్కువ ఎక్కువ. తమ విజయ్ పాఠశాలలో టాలెంట్ షోలు ఏర్పాటు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల చేత వివిధ కళారూపాలను ప్రదర్శింపజేసేవారు. ఈ కార్యక్రమాలకి వివిధ రంగాల కళాకారులని రప్పించి వారిని సత్కరించి పంపడం ఈమె కళాతృష్ణకు, కళాకారుల పట్లగల అభిమానానికి తార్కాణం.

వివిధ రంగాల ప్రముఖులను సీనియారిటీ, వయస్సు ప్రకారం ఎంపిక చేసి 2013 నుండి అమృతలత అపురూప అవార్డులను ఇచ్చి గౌరవించడం ఈమె గొప్పతనం. మొదటి సంవత్సరం ఈ కార్యక్రమంలో శ్రీమతి రావు బాలసరస్వతీదేవి, శ్రీ అక్కినేని నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల వారిని ఎంపిక చేసేవారు. రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులను ఆహ్వానించి గౌరవించడం ఈమెకు గల ఐక్యతా భావాన్ని ప్రతిబింబింపజేస్తుంది. నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఇందూరు అపురూప అవార్డులను అందిస్తున్నారు.

చిన్న చిన్న విషయాలని గురించి బాల్యం నుంచే లాజికల్‌గా ఆలోచించేవారు. తన పొరబాట్లని అర్థం చేసుకుని వాటిని సరిచేసుకునే తెలివితేటలు కలిగిన బుల్లి శాస్త్రజ్ఞురాలు. బాల్యంలోనే తను పడిన బాధలను గురించి ఆలోచిస్తూ అటువంటి బాధలు ఇతరులకు కలగకూడదని ఆశించిన గొప్ప మనసామెది.

సామాన్యుల నుండి కేంద్రమంత్రుల వరకు ఈమె ఇంట భోజనం చేసి ఆతిథ్యం తీసుకున్న వారే! ఉత్తర తెలంగాణా పర్యటనలో ఉన్నప్పుడు రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర అధికార అనధికార ప్రముఖులు వీరి ఆతిథ్యం స్వీకరించారంటే ఈమె ఎంత ఉన్నతస్థాయికి ఎదిగారో అర్థమవుతుంది.

తమతో సన్నిహిత సంబంధం కలిగిన అతిసామాన్యుల నుండి అసామాన్యుల వరకు తన ఏకాంత బృందగాన సభ్యులుగా స్థానం కల్పించి, వారిని పరిచయం చేసి, ఫోటోలతో సహా మనకు చూపించిన ఆ అపురూప మహిళామూర్తి బహు అభినందనీయులు.

మనదేశంలోని వివిధ ప్రదేశాలు, విదేశాలను దర్శించినపుడు ఆయా ప్రదేశాల ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించి, వాటిని దర్శించిన సమయంలో తన అనుభూతులను గ్రంథస్థం చేసి పాఠకులకు అందించారు.

నాస్తికురాలైనప్పటికీ ఆర్మూర్, నిజామాబాద్ మార్గమధ్యంలోని అడవి మామిడిపల్లిలో గుట్టల సమీపంలో శ్రీ అపురూప వేంకటేశ్వర దేవాలయం నిర్మించి భక్తురాలిగా మారారు. వివిధ పండుగ దినాలలో విశేష పూజలతో పాటు ఏటేటా బ్రహ్మోత్సవాలను తమ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ గ్రంథంలో వీటికి సంబంధించిన చాలా ఫోటోలను పొందుపరిచారు.

రచయిత్రిగా ఎనిమిదవ తరగతి విద్యార్థినిగా రాశారు. అనేక పత్రికలకు కవితలు, కథలు, సీరియల్స్ వ్రాశారు. కొన్నింటికి బహుమతులను పొందారు. ‘అమృత కిరణ్’ పక్షపత్రికని కొంత కాలం నడిపి పత్రికా నిర్వహణలో సమస్యలను తెలుసుకున్నారు. పలు పత్రికలకు ఇంటర్వ్యూలను ఇచ్చారు. తన జీవిత లక్ష్యాలను వాటిలో వ్యక్తపరిచారు.

తన కుమార్తె చందూ (హిమచందన్)తో కలిసి విజయ్ స్కూల్ హాస్టల్ లోనే జీవనం, ఇల్లు కట్టే సమయానికి చందూ భర్తతో అమెరికా వెళ్ళడం, ఆమెతో కలిసి స్వంత ఇంటిలో ఉండలేక పోయాననే కించిత్ బాధను బయటకు కనపడని ధైర్యం ఆమెకే స్వంతం.

65 సంవత్సరాల వయస్సులో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం నుండి ‘ఎజుకేషన్’ అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను సంపాదించిన కార్యదీక్షాపరురాలు. ఇప్పుడు కుమార్తె చందూ, అల్లుడు వేణు, మనవళ్ళులు అమెరికాలో, ఆమె తన నివాసంలో ఉంటూ తరచుగా చరవాణి ద్వారా మాట్లాడుకుంటూ వారి రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ, స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో ఆనందంతో గడపగలగడం విశేషం. ఈ ఏడుపదుల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోని నిత్య శ్రామికురాలు.

1997-1998 సంవత్సరానికి రాష్ట్రస్థాయి బెస్ట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డుని ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తీసుకున్నారు.

ఈనాటికీ అటు విద్యాసంస్థలు, ఇటు దేవాలయాలు, ధార్మిక సంస్థలను నిర్వహించడం, అనేక మంది ప్రముఖులను తమ కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేయడంలో నిర్విరామంగా గడుపుతున్నారు. డిశంబరు 2021 వరకూ ఈ విషయాలని ఈ గ్రంథం చివరి పేజీలలో ఫోటోలతో సహా అందించి సంపూర్ణ సజీవ చిత్రాలను మన ముందుంచారు. ఫోటోలు దొరకని తొలిరోజుల ముచ్చట్లని ప్రముఖ కార్టూనిస్ట్ సరసి గారి చేత చిత్రాలు గీయించి అందించడం గొప్ప విషయం. సరసి గారు ఆమె ఆత్మని పట్టుకుని, భావాలను అర్థం చేసుకుని చిత్రాలను అందించి ఈ గ్రంథాన్ని సుసంపన్నం చేశారు.

కరోనా కాలాన్ని ఈ గ్రంథరచన కోసం వినియోగించమన్న తన రీడర్ నిర్మలజ్యోతి గారి కోరిక మేరకు ఈ గ్రంథాన్ని వెలయించి తన మనస్సుని ఆవిష్కరించిన డా.అమృతలత గారు అభినందనీయులు.

***

నా ఏకాంత బృందగానం
రచన: డా.అమృతలత
ప్రచురణ: అపురూప పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 404
వెల: ₹ 600/-
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్. 9848787284
అచ్చంగా తెలుగు, హైదరాబాద్ 8558899478
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ 040-24652387
వలబోజు జ్యోతి, 8096310140
రచయిత్రి: 9848868068

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here