జాతీయవాద ఉద్యమకారుడీ యోగి – ‘రుద్రరాగాలు’ పుస్తకానికి శ్రీ గోరటి వెంకన్న ముందుమాట

0
3

[dropcap]“ఏ [/dropcap]ఉద్యమంలోనైనా (భావజాలం) భావసంక్రాంతిలోనైనా తన వివేకాన్ని దానికి పూర్తిగా అప్పగించుకొని పారతంత్రాన్ని అనుభవించే ధోరణి గల మనుష్యులు ఒక రకం. ఆ ప్రవాహంలో మునిగి తేలుతూ వున్నా తమను తాము కోల్పోక, వివేకం, విచక్షణను నిలుపుకొనేవారు మరొకరకం. సామాన్యంగా చూసినపుడు మొదటివారు నిబద్దలయినట్లు కన్పిస్తారు. కాని వాళ్లు ఆ సంకెళ్ళను స్వయంగా చేతులకు తొడుక్కునేవారు. రెండోరకం వారు వేరు. ఎప్పుడూ ఎదుగుతూ వుంటారు. ఏ బిందువు దగ్గరా ఆగరు. ఏ భావధోరణికి పూర్తిగా పట్టుబడరు. వారి దర్శనంలో నుంచి ఒక నూతన సమన్విత దృక్పథం ఆవిష్కృతమవుతుంది.” చేరా గురించి రాస్తూ కోవెల సుప్రసన్నాచార్యుల వాక్యాలు ఇవి.

“చదివితే పడని శిక్ష వింటే పడుతుందా?” అన్న భాస్కరయోగి గారి ‘రుద్రరాగాలు’లోని కవిత చదివినాక కోవెల సుప్రసన్నాచార్య ఉటంకింపు భాస్కరయోగికి సరిగ్గా సరిపోతుందనిపించింది.

ఆదిశంకరులు, రామానుజులు, బసవేశ్వరులు, వేమన, ఫూలే, కబీరుల ప్రస్తావనతో పై కవితలలో వారి బోధన పొదిగి తరతరాల కులఅంతరాలపై కొరడా విసిరిన కవిత. సమత్వభావనపై ఎంత మమకారం ఉంటేగాని కబీరు, వేమన, ఫూలేను కూడా జాతీయవాద కవి కవనంతో హారతులెత్తడం భాస్కరయోగి ఆధునిక దృష్టికి – ఆధ్యాత్మికత మధ్య సమన్వయం జరిగింది. జాతీయవాదం ప్రస్తావన వచ్చినప్పుడల్లా కవితల్లో ఉరుముల భీకర గర్జన పర్జన్య శంఖం మోగించే యోగియే నిజమైన ఆనందపుటంచుల లోకాలను అన్వేషిస్తూ ‘ఎంతబాగుండు’ కవితలో నిర్మల నిసర్గ జలపాతమై ఎరుక తడి స్పర్శతో మనల్ని ఏవో దివ్యలోకాలలోకి పయనింపజేస్తాడు. రుద్రరాగాల కవితాసంపుటి నిండా ఈ రెండు ధోరణులు ఎవ్వరికవసరమైనవి వారు ఎంచుకొని చదివి అనుభూతితో పాటు ఆలోచన, ఆచరణకు పురిగొల్పగల కవితలు ఇవి. ఆరాధనతో వినమ్రంగా వారి గురించి రాసే అవకాశం కల్పించినందుకు డా॥ భాస్కరయోగిగారికి ముందుగా కృతజ్ఞుణ్ణి.

భాస్కరయోగిగారు తెలంగాణలో విద్వన్మండలిచే నీరాజనాలందుకొనే అగ్రశ్రేణి రచయితలలో ఒకరు. వాగ్గేయ సాహిత్యంలో పరిశోధన పట్టా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అందుకున్నవారు. అనేక ధార్మిక రచనలు వెలువరించినవారు. లోతయిన అధ్యయనం, సృజనాత్మక అభినివేషం అంశమేదయినా అలవోకగా విప్పి చెప్పగల బోధనాసామర్థ్యం వీరి స్వంతం. జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి వ్రాసినప్పుడు వీరిలో ఒక సీనియర్ పాత్రికేయుని దర్శించగలం. అలుపెరుగక నిరంతరం రాసే రచనా కృషీవలుడు. ఆయన భావాలకతీతంగా ఆయనను అభిమానించే భిన్నశ్రేణికి చెందిన కవి, పరిశోధకులను నేనెరుగుదును. నందిని సిధారెడ్డి, సంగిశెట్టి లాంటి వారితో సైతం భాస్కరయోగి సన్నిహితత్వంతో కూడిన సాహిత్య భాగస్వామ్యం కలదు. వారి తాతగారయిన ఇమ్మడిజెట్టి చంద్రయ్య వల్లనేమి, మా పూర్వ జిల్లావాసి కావడం వల్లనేమి, భీంపల్లి శ్రీకాంత్ లాంటి కవి రచయితల చెలిమివారధి వల్ల సన్నిహితంగా సాహిత్య బంధమేర్పడింది.

యోగి ఒక కాంతిదీపం, కారుణ్యరూపం. ప్రణవతత్వము నెరిగిన వేదాంతి, లోకహితమగు నిస్వార్థ విలువలు చాటేందుకు కలం పట్టిన కవియోధుడు. దార్శనిక పథికుడు.

హిందుత్వం అంటే కర్మకాండ, క్రతుయాగములు, వర్ణధర్మం, పునర్జన్మ ఆచార నియమాలేకాదు, వైరాగ్యం, భోగనిరసన, నిరాడంబరత, అంతర్ముఖత్వం, జన్మాన్వేషణ పథం, నిరంతర గురుతత్త్వ విచారం, నిర్మలత్వం లాంటి భావనలు పంచిన జ్ఞానదాత.

నాకు ఒక అనుకూల దృక్పథముంది. దానికి కారకుడు మా నాన్నగారు, హఠయోగి చన్నదాసు, ఇమ్మడిజెట్టి చంద్రయ్య నాయనలాంటి వారల అడుగుజాడల దర్శించిన బాల్యం నాది. అతిశయోక్తి కాదు నాగలింగ యోగి శిష్యుడయి కఠిన సాధకుడయి, వాక్శుద్ధితో ఎన్నో అభీష్టాలు నెరవేర్చగల కఠిన సాధన సంపత్తులున్న యోగి సభలలో అందరినీ నవ్విస్తూ ఆకర్షణీయ ప్రసంగాలతో అలరించగల ఉదాత్త బోధకుడు. రాకమచర్ల, వేపూరి, అహ్మదొద్దీన్ లాంటి వాగ్గేయకారుల కవిత, సంకీర్తన తత్వాలను ఔపోసన పట్టినవారు. మార్క్సీయ సామ్యవాద దృక్పథం భౌతిక క్లేశాలను మాపేదిగా విచారిస్తే, ఆత్మిక అలజడుల అంతరంగ సంక్షోభాలకు నివృత్తి అచల అమనస్క సిద్ధ అవధూత భక్తిమార్గాలను ఎరుకపర్చగల జ్ఞానయోగి భాస్కరయోగి.

లోకహితమే అభిమతముగానెంచి సాగే పథికుని రచనల ఆరాధకుడతను. బాహ్య అంతరంగాల అరమరికలు లేని స్వచ్ఛ వ్యక్తిత్వం వారిది. పైకి నిజమే (కావచ్చు కూడా) తీవ్ర జాతీయవాదిలా కన్పిస్తాడు. బహుశా తన సత్వ ఆచరణ వల్లనేమో, నాకయితే ఎప్పుడూ ఒక సమతా సాధుమూర్తిలా కన్పిస్తాడు. తన రచనల్లో రుద్రరాగాల్లోని చాలా కవితలలోని హితసూక్తుల కను కొలుకులల్లో ప్రసారం చేసే ఆధ్యాత్మిక కవితలెన్నో ఈ సంకలనంలో ఉన్నాయి.

దున్న ఇద్దాసు నుడివినటుల “లోకంలో ఉన్నట్టెనడిసి లోకదూషణాల విడిసి” చరించే యోగిగారు నాగలింగ యోగితో ఉపదేశమొంది, కఠిన సాధనతో, దివ్యపథమేదో ఎరిగిన వీరు – వాక్శుద్ధి, కవితాశుద్ది జాతీయవాద పునర్వ్యక్తీకరణ కొరకే సులభతరమైన సుందరమైన శిల్పంతో చదువరులను తన భావప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే కవితలిందులో ఎన్నో. వారి కవిత్వాన్ని విశ్లేషించే ప్రతిభాపాటవాలు నాకు లేవు. కాని సైద్ధాంతిక రాజకీయ వివాదాస్పద అంశాలలో కవిత్వం చేయడం ప్రకృతి, ప్రేమ, ఆధ్యాత్మికత అంశాలంత సులభం కాదు. కానీ వీరి భావాలేవయినా కవితాపనితనంతో స్వతంత్ర అభివ్యక్తితో వచన కవిత కొక అందం తెచ్చారు.

వీరి కవితాధార విస్మయానికి గురిచేసే ఫెళ్లుమనే మేఘగర్జన ఒకవైపు, చల్లని జలపాతపు రెండు పాయలు ప్రవాహించే నదిగా మారినట్లు రుద్రరాగాల సవ్వడి కాంచగలం. లోకం తీరాలకావల కవిత పరుచుకున్న నిసర్గ భావనలకు నేను వినమ్రుడనైనాను. ఎందుకంటే నా తత్త్వమదే.

పరవశత్వం మోపగల శిల్పంతో, మనల లోకాల తీరాలకావల చేర్చుతున్నాడు. శ్వాసను వదిలేసిసినవారికే ద్వేషం నూరిపోయాలని ఆవేశంగా ప్రకటించినా ఇసుమంత ద్వేషానికి తావులేని అమనస్కమెరిగిన యోగివారు. ‘ఆత్మవత్ సర్వభూతాని’ వంటి అద్వైత తాత్విక ధారను ‘రుద్రరాగాలు’లో అనేక కవితలలో దర్శింపగలం.

“చైనాలో టిబెట్టును నంజుకుతినే” అన్నప్పుడు చైనా ఆధిపత్యం గర్హనీయం. చైనా స్టేట్ క్యాపిటలిజంతో పాటు ఏకపార్టీ నిరంకుశత్వం ఉంది. మావో చెప్పిన అష్టసూత్రాలు, చీమకైనా హాని చేయవద్దు. శత్రువు లొంగిపోతే శిక్షించవద్దు, ప్రజల నుండి గుండుసూది తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. మాట ద్వారా, చేతద్వారా ఎవరినీ బాధించవద్దన్న విషయాలు బుద్ధ భగవానుడు చెప్పినవే.

కానీ కమ్యూనిజం పేర అనేకసార్లు నిరంకుశత్వం ప్రదర్శించిన స్టాలిన్ చర్యలుగానీ, తియాన్మెన్ స్క్వేర్లో విద్యార్థులపై కాల్పులు జరిపిన చైనా దుర్నీతి – రాజ్యంగా మారిన ఏ హింస అయిన కవులు ఖండించాల్సిందే! యోగి కూడా అదే పని చేసారు.

యోగి అనేక సార్లు సహజమార్గ రామచంద్ర మహారాజ్ లాగా, జిడ్డు కృష్ణమూర్తిలాగా, కొన్నిసార్లు మా చంద్రయ్య నాయనలాగా కొన్నిసార్లు మా చెన్నదాసులా అనిపిస్తాడు. చాలా కఠిన సాధకుడు కూడా; పైకి తెలియదు. నిత్యం నిరంతరం సభలు, సాహిత్య సమావేశాలకు పోయే భాస్కరయోగి గారు తాను వచ్చిన కుటుంబ నేపథ్యానికి అతీతంగా చాలా సంప్రదాయ ఘనాధిపతులు పాటించని తన నియమనిష్ఠలతో ఉంటాడు. ఛాందసంగా కాదు అది శివరామయోగి దీక్షితులలాగా, శ్రీధరస్వామిలాగా కనబడతాడు. ఒక్కోసారి సకల జనుల సమానత్వాన్ని కోరే రామానుజాచార్యుల్ని, బసవేశుడిని, వేమనను, బుద్ధుణ్నీ కడకు ఇవాళ ఆధునిక అస్తిత్వాలు చెప్పిన ఫూలేను కూడా ఈ దేశం యొక్క జ్ఞాపసంపదగా భావిస్తాడు.

ఒక్కోమారు ఈ పుస్తకం రుద్రరాగాలు చూస్తే ఈ దేశంపై జరిగే దాడులు, ఈ దేశంలో మతం పేరుతో, కులం పేరుతో జరిగే ఆగడాలు – ఇవన్నీ ప్రశ్నిస్తూనే ఈ రుద్రరాగాల్లో ఒకవైపు తీవ్ర విప్లవవాదిగా, మరోవైపు అరుణాచలంలోని రమణమహర్షి తావుకోసం చేరిన ఋషిలా మనకు కన్పిస్తాడు. ఈ భావాల పరంపరను గురించి ఎవరికి కావాల్సింది వారు గ్రహించాల్సిందే. అయితే తెలిసో, తెలియకో నా నేపథ్యంలో కొంత ఎడం ఉన్నా వారితో మౌలికంగా కలిసే అంశాలు అనేకం ఉన్నాయి. చెట్టు గాలితో కలిసి ఊగినట్లు, తావి పూలతో కలిసి నాట్యమాడినట్లు, తల్లి పిల్లతో తలలూపుతూ పెనవేసుకొన్నట్టు, ఆత్మ శరీరాన్ని అంటి పెట్టుకొన్నట్లు ఎంత గొప్ప రసానుభూతి! మా ఇద్దరి అనుబంధం ఇది. అలాంటి యోగి కవిత్వానికి నాలుగు మాటలు రాయడం మహద్భాగ్యంగా భావిస్తూ… సెలవు.

గోరటి వెంకన్న

***

రుద్రరాగాలు

(కవితా సంపుటి)

రచన: డా. పి. భాస్కరయోగి

పేజీలు: 145

వెల: రూ. 150

ప్రచురణ: విజ్ఞాన సేవా ప్రచురణలు

ప్రతులకు: నవోదయ, ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here