జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-1

1
3

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

సిద్ధేయాత్ర సతి త్రపాకులమివ స్పర్థాభిలాషాహతే హతేరన్తర్థి వహతి త్రిలోకమహితం శేషం నిజార్ధద్వయమ్।
స్నేహైకి భవదాశభవ యద్యజాయాకాంగీవ గాఢం మిలదేహార్ధ ద్వయమస్తు తద్భగవతోః సద్భావ సంపత్తయే॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-1)

[dropcap]సాం[/dropcap]ప్రదాయాన్ని అనుసరించి శివపార్వతుల మననంతో రాజతరంగిణి రచనను ఆరంభిస్తున్నాడు జోనరాజు.

శివపార్వతుల నడుమ ఉన్న అంచంచలమైన ప్రేమ వల్ల వారి చెరి సగాలు కలిసి సంపూర్ణమయ్యాయి. అయితే చెరి అర్ధ భాగాలు మాత్రమే కలిశాయి. మిగతా కలవని అర్ధ భాగాలు, తాము కలవలేకపోతున్నామన్న విషాదంతో అదృశ్యమైపోతాయి. కలిసిన పవిత్రమైన అర్ధనారీశ్వర రూపం సకల జనులకు శుభప్రదమవుగాక. సకల జనుల విఘ్నాలను గణపతి తొలగించుగాక.

కశ్మీరం పార్వతి కాబట్టి శివపార్వతుల ప్రసక్తి లేకుండా కశ్మీరు గురించి మాట్లాడడం కుదరదు. కశ్మీరం శివమయం. ఎంతగా శివమయం అంటే, మంచు కరిగి ప్రవహించే నదులలోని రాళ్ళు శివమూర్తుల్లా గోచరిస్తాయి. వాటిపై నుంచి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీరు నిరంతరం శివుడికి అభిషేకం చేస్తున్న భావనను కలిగిస్తాయి.

మొదటి శ్లోకంలోనే జోనరాజు ఒక అద్భుతమైన ఆలోచనను ప్రదర్శించాడు. సాధారణంగా అర్ధనారీశ్వరుల గురించి అందరూ ప్రస్తావిస్తారు. సగం పార్వతి, సగం శివుడు. సరే, సృష్టిలో స్త్రీ, పురుషులు చెరి అర్ధ బాగాలు. ఆ రెండు భాగాలు కలిస్తేనే పూర్ణానుస్వారం ఏర్పడుతుంది. సృష్టి సంపూర్ణమవుతుంది. కానీ కలవని రెండు అర్ధ భాగాల సంగతి ఏమిటి? కలవని అర్ధభాగాలు కూడా పవిత్రమైనవే. ఆరాధ్యనీయమే. కానీ వాటి ప్రస్తక్తి ఎక్కడా రాదు. జోనరాజు తన శ్లోకంలో ఆ కలవని అర్ధ భాగాల ప్రసక్తి తెచ్చి, విషాదంతో అవి అదృశ్యమయిపోయాయని సూచిస్తూ, రాజతరంగిణి ఆరంభంలోనే ఓ రకమైన విషాదభావాన్ని సూచ్య ప్రాయంగా పొందుపరచాడు.

జోనరాజు జీవించిన కాలం కశ్మీరు చరిత్రపై తిరుగులేని రీతిలో ప్రభావం చూపించిన కాలం. జోనరాజు భారతీయ రాజుల వైభవం అనుభవించలేదు. ఔన్నత్యాన్ని దర్శించలేదు. ఆయన జన్మించేందుకు రెండు వందల ఏళ్ళ ముందు కశ్మీరంపై ఇస్లామీయులు అధికారం సాధించారు. అంటే, జోనరాజుకి ఇస్లామీయుల పాలన అలవాటయిపోయింది. అతనికి పూర్వ ఔన్నత్యం అనుభవంలో లేదు. ఆ ఔన్నత్యాన్ని, ఒకప్పటి రాజుల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ కల్హణ కశ్మీర రాజతరంగిణి ఉంది. కశ్మీరు ఔన్నత్యాన్ని, జీవన విధానాల్ని, కశ్మీరు ధార్మికతను తెలియజేస్తూ ఇతర కావ్యాలున్నాయి. కానీ ఆయా కావ్యాలలో ప్రదర్శితమైన ఔన్నత్యం, సత్ప్రవర్తనలు జోనరాజు తరానికి తెలియవు. అనుభవంలోకి రాలేదు. కానీ ఇస్లామీయుల పాలనలో భారతీయ ధర్మాన్ని పాటించేవారు ఎదుర్కునే కష్టాలను  చూశాడు. బాధలను అనుభవించాడు. భయాందోళలను స్వయంగా అనుభవించాడు. సుల్తాను కరుణా కటాక్ష వీక్షణాలపై ఆధారపడిన ఇస్లామేతరుల జీవితాల గురించి అర్థం చేసుకున్నాడు. అతి అనిశ్చిత కాలం, అభద్రత కాలవాలం ఆ కాలం. ఎంతటి ప్రమాదం ఉన్నా, మనిషి బ్రతకక తప్పదు. ఉన్నదానిలో సుఖంగా, సంతోషంగా, భద్రంగా జీవించాలని ప్రయత్నిస్తాడు మనిషి. ఎంతటి ప్రమాదంలోనయినా, ఎలాంటి హింసాత్మక పరిస్థితులలోనయినా మానవ సమూహాలు  జీవిస్తాయి. ప్రేమిస్తాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటాయి. పిల్లల్ని కంటాయి. తమ తరువాత తరాలన్నా మెరుగైన పరిస్థితులలో జీవిస్తాయన్న ఆశతో జీవితాన్ని కొనసాగిస్తాయి. కల్హణుడు తన కళ్ళ ముందు రూపాంతరం చెందుతున్న కశ్మీరాన్ని చూశాడు. సంపూర్ణంగా రూపాంతరం చెందుతున్న వ్యక్తిత్వాలను చూశాడు. దిగజారుతున్న విలువలను, ముంచెత్తుతున్న స్వార్థాన్ని, కాపట్యాన్ని అర్థం చేసుకున్నాడు. కశ్మీర సమాజం ప్రయాణిస్తున్న దిశను గమనించాడు. ఫలితాన్ని ఊహించాడు. భవిష్యత్తు తరాలు నైతికంగా, ధార్మికంగా, ఎంతగా దిగజారుతాయంటే గతంలో తన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఊహించలేని, ఎవరేం చెప్పినా గ్రహించి ఆమోదించలేని అంధ తమస్సులోకి దిగజారి అదే గొప్పతనం, అదే సత్యం అనుకునే భ్రమలో ఆనందపడి గర్వించేంతగా దిగజారుతాయని గ్రహించాడు. అలాంటి భవిష్యత్తు తరాలకు తమ ఒకప్పటి ప్రాభవం, వైభవాలను గుర్తు చేసి, అంధకారంలో చిరు వెలుగు చూపి స్ఫూర్తినిచ్చే రీతిలో రాజతరంగిణిని రచించాడు. కశ్మీరు ఆవిర్భావం నుంచి తన కాలం దాకా, మారుతున్న వ్యక్తిత్వాలను, మారుతున్న విలువలను నిజాయితీగా ప్రదర్శించాడు. తన కర్తవ్యాన్ని నిజాయితీగా, చిత్తశుద్ధితో  నిర్వహించి నిష్క్రమించాడు. కల్హణుడి తరువాత కొన్ని  వందల ఏళ్ళ తరువాత జోనరాజు రాజతరంగిణి రచనను కొనసాగించాడు. కల్హణుడు రాజతరంగిణిని స్వయంప్రేరణతో రచించాడు. తన అంతరంగంలో జరుగుతున్న సంఘర్షణ స్వరూపాన్ని అర్థం చేసుకుని, తనలో చెలరేగుతున్న ఆవేదనకు ఉపశమనంగా రాజతరంగిణిని రచించాడు. ఏ రాజును ఆశ్రయించలేదు. ఎవరి నుంచీ ఎలాంటి సహాయాన్ని కోరలేదు. స్వచ్ఛందంగా, ఎలాంటి ప్రతిబంధకాలు, పరిధులు లేకుండా స్వేచ్ఛగా రచించాడు.

జోనరాజు రాజతరంగిణి రచనను చేపట్టటం సుల్తాన్ జైనులాబిదీన్ ఆదేశం వల్ల. కాబట్టి కల్హణుడి రాజతరంగిణిలో ఉన్న నిజాయితీ, నిక్కచ్చితనం, నిర్మొహమాటంగా సత్యం చెప్పటం, జోనరాజు రాజతరంగిణిలో ఉంటాయని ఆశించకూడదు. జోనరాజుకు రాజతరంగిణి రచనలో పరిధులున్నాయి. పరిమితులున్నాయి. మొహమాటాలున్నాయి. ముఖ్యంగా వేరే ధర్మానికి చెందిన రాజు ఆస్థానంలో, ఆ రాజు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు, ఆ రాజుకు ఎలాంటి కోపాలు రాకుండా, అభ్యంతరాలు లేకుండా నిజాలను, మసిపూసి మారేడుకాయ చేసినట్టు రాయాల్సి ఉంటుంది. అసిధార వ్రతం లాంటి రచన ఇది. కాబట్టి కల్హణుడి రచనతో పోల్చకుండా జోనరాజు రచనను ప్రత్యేకంగా విశ్లేషించాల్సి ఉంటుంది. జోనరాజు ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ఇస్లామీయుల పాలనలో జీవిస్తున్న భారతీయుల మనస్తత్వాన్ని, వారి ఆందోళనలను, అభద్రతా భావాలను, అనేక విషయాలలో జీవిక కోసం రాజీపడటాన్ని అర్థం చేసుకుంటూ, జోనరాజ రాజతరంగిణిని విశ్లేషించాల్సి ఉంటుంది.

కల్హణ రాజతరంగిణి, భారతీయుల ప్రాచీన వైభవాన్ని, ఉన్నత వ్యక్తిత్వాలను, ఉత్తమ జీవన రీతులను ప్రదర్శిస్తుంది. జోనరాజ రాజతరంగిణి అందుకు సంఫూర్ణంగా భిన్నమైనది. భారతదేశ చరిత్రలో ఇస్లామీయుల పాలనలో నివసించిన భారతీయుల పరిస్థితులకు సాక్షీభూతమైన ఏకైక రచన ఇది. ప్రత్యక్ష సాక్షి  రచన ఇది. ఇలాంటి రచన మరొకటి లేదు. భారతీయ సమాజం గురించి, భారతీయుల వ్యక్తిత్వాల గురించి, పలు రకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చలామణీలో ఉన్నాయి. జోనరాజ రాజతరంగిణిలో అంతర్లీనంగా, అత్యంత నిగూఢంగా పొందుపరిచిన చేదు నిజాలను గ్రహించకుండా, భారతీయ సమాజం గురించి చేసిన ఏ విశ్లేషణ అయినా, ఏ తీర్మానం అయినా, అసంపూర్ణం, సత్యదూరం అని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఇస్లామీయుల పాలన వైభవాన్ని, ఔదార్య గుణాన్ని ఎంతగా అధికంగా ప్రచారంలోకి తెచ్చి, ప్రజలలో ఆమోదం కలిగించాలని ప్రయత్నించినా, జోనరాజ రాజతరంగిణిలో అత్యంత సూక్ష్మంగా, అతి గోప్యంగా ప్రదర్శితమైన నరమేధం గురించి, మత ఛాందసం గురించిన అవగాహన లేకుండా చేసే ప్రయత్నం కూడా అసంపూర్ణం, అనృతం అవుతుంది. ఎందుకంటే, ఇస్లామీయుల పాలనలో జీవిస్తూ, ఇస్లామీ సుల్తానులను సంతృప్తిపరుస్తూ కూడా స్వీయ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, తన చుట్టూ సంభవిస్తున్న పరిణామాలను అత్యంత సృజనాత్మకంగా, ప్రియమైన వాటిని ప్రత్యక్షంగా, అప్రియమైన వాటిని సూచ్యప్రాయంగా ప్రదర్శించిన జోనరాజ రాజతరంగిణి, ఆనాటి భారతీయ సమాజాన్ని బిందువులో సింధువును దర్శింపజేసిన రీతిలో ప్రదర్శిస్తుంది. ఇలాంటి ప్రత్యక్ష సాక్షి కథనాన్ని విస్మరించి భారతీయ చరిత్రను నిర్మించటం కుదరని పని.

జోనరాజ రాజతరంగిణిలో మొత్తం 23 రాజుల ప్రస్తావన ఉంటుంది. వీరిలో 13 మంది భారతీయ రాజులు. ఒక భౌటియా రాజు, తొమ్మిది మంది ఇస్లామీ సుల్తానులు. జోనరాజ రాజతరంగిణి 459 సంవత్సరాల కశ్మీర చరిత్రను దాదాపుగా 976 శ్లోకాలలో ప్రదర్శిస్తుంది. జోనరాజు సికందర్ బుత్‌షికన్, జైనులాబిదీన్‌ల సమకాలీనుడు.

జోనరాజు రచించిన రాజతరంగిణిలో ఉన్న 976 శ్లోకాలలో భారతీయ రాజుల పాలన ప్రస్తావన కేవలం 174 శ్లోకాలలో మాత్రమే ఉంటుంది. కల్హణుడు రాజతరంగిణిని ఏ రాజు పాలన దగ్గర ఆపాడో, జోనరాజు అక్కడి నుండి ద్వితీయ రాజతరంగిణిని ఆరంభిస్తాడు. వడివడిగా ఇస్లామీయుల పాలనను చేరుకుంటాడు. ఎందుకంటే జోనరాజు రాజతరంగిణిని రచించటంలో ప్రధానోద్దేశం, కశ్మీరు చరిత్రను రచించటంతో పాటుగా, కశ్మీరులో ఇస్లామీయుల పాలనను అతి గొప్పగా వర్ణిస్తూ సుల్తానులను సంతృప్తి పరచటం. జోనరాజు తన రచనలో మొత్తం 140 ఏళ్ళ ఇస్లామీయుల పాలనను వర్ణించాడు.

జోనరాజు కాలంలో జరిగిన ప్రధాన సంఘటనల్లో ఇస్లామీయుల పాలనలో భారతీయ ధర్మాన్ని విస్మరిస్తున్న వారికి తమ ధర్మం ఔన్నత్యం వివరించి, వారిని భారతీయ ధర్మానుయాయులుగా నిలపాలని జరిగిన ప్రయత్నాలు ఒకటి. జోనరాజు ఈ ప్రయత్నాల గురించి ప్రత్యక్షంగా వివరించడు. పరోక్షంగా వర్ణిస్తాడు. ముఖ్యంగా కశ్మీరులో ఆవిర్భవించిన ‘యోగిని’ వ్యవస్థ గురించి రాజతరంగిణిలో పొందుపరిచిన జోనరాజు, ఆ కాలంలో కశ్మీరు సమాజంలో సంచలనం సృష్టించి, ప్రజలకు శైవం పట్ల ఆసక్తిని కలిగించి, అధిక సంఖ్యలో ప్రజలు శైవం వైపు ఆకర్షితులవడంలో ప్రేరణగా నిల్చిన లల్లేశ్వరి, లల్లాదేవి లేదా ‘లాల్‌దేద్’ ప్రస్తావన తేకపోవటం ఆశ్చర్యం. ఇందుకు కారణాలు ఊహించగలం తప్ప, ‘ఇదే కారణం’ అని నిశ్చయంగా ఏమీ చెప్పలేం. ‘లల్లాదేవి’ శైవధర్మానికి ఊపునిచ్చిన కాలంలోనే, కశ్మీరంలో భారతీయులను పెద్ద సంఖ్యలో ఇస్లామీయులుగా మార్చేందుకు ప్రధాన కారకుడు సయ్యద్ అలీ హమదానీ (షాహి హమదాని) కూడా కశ్మీరును రూపాంతరం చెందిస్తున్నాడు. ప్రొఫెసర్ కె.ఎన్. ధర్ ప్రకారం “Shah Hamadan was the sole instrument for transplanting Muslim faith in place of Hinduism in Kashmir. The crusade for mass conversion in Kashmir was initiated by him”. ‘crusade for mass conversion’  అన్న పదాలు గమనార్హం Crusade అంటే మత యుద్ధం. మతోన్మాద, మత ప్రచారక యుద్ధం. కశ్మీరులో ఈ యుద్ధాన్ని ఆరంభించింది షాహి హమదాని. లల్లాదేవి గురించి చెప్తే ఈయన గురించి చెప్పాల్సి ఉంటుంది. అది జోనరాజుకు ఇష్టం లేదు. ఎందుకంటే  షాహి హమదాని గురించి చెప్పే సమయంలో ఇస్లామీయులలోని మత ఛాందసం, తమ మతం కాని వారి పట్ల వారి దృక్కోణం, తమ మతాన్ని అనుసరించని వారితో వారు వ్యవహరించే తీరు గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మానవ మనస్తత్వంలోని ఒక ప్రధానమైన లక్షణాన్ని జోనరాజు అర్థం చేసుకున్నాడనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు దానిలో దౌష్ట్యం, నైచ్యం వారికి కనబడదు. కానీ అదే పనిని వేరే వారు ఎత్తి చూపించినప్పుడు తమ చర్యలోని నైచ్యం అర్థం అవుతుంది. ఆగ్రహం కలుగుతుంది. అందుకని జోనరాజు షాహి హమదానిని ప్రస్తావించలేదు. లల్లాదేవి పేరు ఎత్తలేదు. కానీ పరోక్షంగా అందరినీ తమ మతం స్వీకరించేట్టు చేయాలన్న పట్టుదలలోని సంకుచితత్వాన్ని ఎత్తి చూపించాడు. ఆ సంకుచితత్వం వల్ల కలిగిన దుష్పరిణామాలను, రాక్షస ప్రవర్తనను ప్రదర్శించాడు. అందుకే జోనరాజును ‘The father of study of genocide’ అంటారు. నరమేధాన్ని అధ్యయనం చేసి ప్రదర్శించిన తొలి వ్యక్తి జోనరాజు. ఈ నరమేధాన్ని జోనరాజు ఎంత నర్మగర్భితంగా, ఎంత అంతర్లీనంగా ప్రదర్శించాడంటే, ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పితే అర్థం కాదు. అంత జాగ్రత్త వహించకపోతే, అందరికీ సులువుగా అర్థం అయ్యే రీతిలో ప్రదర్శిస్తే, సుల్తాన్‌కు రాకున్నా, ఆయన చుట్టూ ఉన్న వారికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహానికి కారణమయిన జోనరాజు మెడపై తల నిలవదు. ఆధునిక సమాజంలో ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తున్న సమాజాలలోనే ఆగ్రహం కలిగించిన వారి మెడలపై తలలు నిలవడం లేదు. ఆ కాలంలో, మధ్యయుగంలో, ఇస్లామీయులు అధికారంలో ఉన్న కాలంలోని పరిస్థితిని ఊహించాలంటేనే భయం కలుగుతుంది. అలాంటి భయంకరమైన కాలంలో, కరాళ కరవాలాల నీడలో నివసిస్తూ, రాజతరంగిణి కావ్యాన్ని సృజిస్తున్న జోనరాజు మానసిక స్థితిగతులను ఊహిస్తేనే మనస్సులో భయావహమైన కంపనాలు చెలరేగుతాయి. ఆ కంపనల నడుమ తన కలాన్ని,  జోనరాజు, ఎవరికీ అభ్యంతరాలు లేకుండా, ఆగ్రహాగ్ని జ్వాలలు చెలరేగకుండా నడిపించాడంటే, అతని ధైర్యానికి, తన సృజనాత్మక ప్రతిభ పట్ల విశ్వాసానికి జోహార్లు అర్పించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కుంటూ జోనరాజు రచించిన రాజతరంగిణి వల్ల ఈనాడు, ఆనాడు ఇస్లామీయుల పాలనలోని భారతీయుల జీవన విధానం, వారిపై చెలరేగిన నరమేధం తాలూకు ఆనవాళ్ళు మనకు లభిస్తున్నాయి. లేకపోతే ఇస్లామీయుల పాలన భారత దేశ చరిత్రలో ‘స్వర్ణ యుగం’ అనీ, భారతీయులు తమ సమాజంలోని అసమానతల పట్ల నిరసన ప్రకటిస్తూ స్వచ్ఛందంగా, భారతీయ ధర్మాన్ని త్యజించి, ఇస్లాం స్వీకరించారని ఆధునిక మేధావులు చేస్తున్న ప్రచారంలోని అన్యాయాన్ని గ్రహించే వీలు లేకుండా ఉండేది. తన మాన ప్రాణాలకు ప్రమాదాన్ని లెక్కించక, తన ధర్మం కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిసి కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించి, భావి తరాలకు చేదు నిజాలను, తీపి పూతతో అందించిన జోనరాజు లాంటి మహానుభావులకు జోహార్లు అర్పించాల్సి ఉంటుంది. మన చరిత్రను సరైన దృష్టితో దర్శించి, అర్థం చేసుకునేందుకు వీలుగా దారి దివిటీలు ఏర్పాటు చేసిన పూర్వీకులకు చెయ్యెత్తి నమస్కరిస్తూ, జోనరాజ రాజతరంగిణిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

కల్హణ రాజతరంగిణికి లభించిన ప్రాచుర్యం జోనరాజ రాజతరంగిణికి లభించకపోవటానికి కారణాలు కూడా జోనరాజ రాజతరంగిణిని అధ్యయనం చేస్తుంటే స్పష్టం అవుతాయి. అయితే, జోనరాజు రాజతరంగిణిని రచించిన కాలంలోనే, పర్షియన్ చరిత్ర రచయితలు పర్షియా భాషలో కశ్మీరు చరిత్ర రచించారు. భారతదేశంపై ఇస్లామీయులు ఆధిక్యం సాధించిన విధానాన్ని వివరిస్తూ రచనలు చేశారు. జైనులాబిదీన్ ఆదేశాల మేరకు రాజతరంగిణిని పర్షియా భాషలోకి అనువదించారు. అయితే, ఈ పర్షియన్ భాషలలోని రచనలను ప్రామాణికంగా తీసుకుని మన చరిత్రను రచించారు తప్ప, జోనరాజు వంటి వారి రచనలను ప్రామాణికంగా పరిగణించలేదు. కానీ ఈ జోనరాజ రాజతరంగిణి అనువాదంలో మాత్రం జోనరాజు రచనను ప్రామాణికంగా భావిస్తూ, ఇతర రచనలలోని అంశాలను జోనరాజు రచనతో పోలుస్తూ, విశ్లేషిస్తు, వ్యాఖ్యానించటం వుంటుంది.  జోనరాజ రాజతరంగిణి ప్రాధాన్యాన్ని కె.ఎన్. ధర్ స్పష్టం చేశాడు – “The subsequent Persian chronicles, without any exception, have profusely drawn from him (Jona Raja), and then only built, their respective thesis.  Kashmiris owe a debt to Jona Raja for erecting the contours of Light House of accurate history which reduces to nullity thankless past time of groping in the dark”. ఇలాంటి దీపస్తంభం లాంటి జోనరాజ రాజతరంగిణిని తెలుగులో తొలిసారిగా అందించే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ, గర్విస్తూ, ఇంత కాలం ఈ రచన తెలుగువారికి దూరంగా ఉన్నందుకు బాధపడుతూ, వ్యాఖ్యాన సహితంగా జోనరాజ రాజతరంగిణిని తెలుగు సమాజానికి అందిస్తున్నాను సంచిక ద్వారా, వెబ్ పత్రిక ద్వారా!
గతంలో సంచిక వెబ్ పత్రిక ద్వారా అందించిన నీలమత పురాణం విశేష పాఠకాదరణ పొందుతూ, అత్యంత ఉపయుక్తమైన రచనగా గుర్తింపు పొందుతోంది. ఇటీవలే పూర్తయిన కల్హణ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత్య అనువాదం త్వరలో పుస్తకరూపంలో వస్తోంది. ఆ రెండు రచనలను ఆదరించిన రీతిలోనే ఈ జోనరాజ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here