[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హిట్లర్ అభిమాని, అలనాటి జర్మన్ సినీ దిగ్గజం లెనీ రీఫెన్‍స్టాల్:
లెనీ రీఫెన్‍స్టాల్ (Leni Riefenstahl) అసలు పేరు Helene Bertha Amalie Riefenstahl. ఈమె జర్మనీకి చెందిన సినీ దర్శకురాలు, నిర్మాత, ఫొటోగ్రాఫర్, నటి. నాజీ ఉద్యమాన్ని ప్రభావశీలంగా ప్రచారం చేసిన వ్యక్తి. ఈమె 22 ఆగస్టు 1902న బెర్లిన్‍లో జన్మించారు. 101 ఏళ్ళ వయసులో 2003లో మృతి చెందారు.
ఈమె తండ్రి Alfred Theodor Paul Riefenstahl ఒక హీటింగ్ వెంటిలేషన్ కంపెనీని విజయవంతంగా నడిపేవారు. తన కూతురు వ్యాపారరంగంలో రాణించాలని కోరుకున్నారు. చాలా కాలం వరకూ లెనీ ఒక్కర్తే సంతానం కావడంతో ఆమె కుటుంబం పేరు నిలపాలనీ, కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన కోరుకున్నారు. కానీ ఆమె తల్లి బెర్తా మరోలా తలచారు. తన కూతురు షో-బిజినెస్‍లో మెరుగ్గా రాణిస్తుందని భావించారు. లెనీకి ఓ తమ్ముడు ఉండేవాడు. 39 ఏళ్ళ వయసులో అతను సోవియట్ యూనియన్‍తో నాజీ యుద్ధంలో మరణించాడు.
లెనీ చిన్నప్పటి నుంచే కళల పట్ల ఇష్టం పెంచుకున్నారు. నాలుగేళ్ళ వయసులోనే చిత్రకళ, కవిత్వంలో ఆసక్తి కనబరిచారు. శరీరం అథ్లెటిక్స్‌కి అనువుగా ఉండడంతో పన్నెండేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ క్లబ్‍లలో చేరారు. కళల రంగంలో తన కూతురు విశేషంగా రాణిస్తుందని ఆమె తల్లి గట్టిగా నమ్మారు. తనయకి పూర్తి మద్దతు నిచ్చారు. కానీ తండ్రికి ఇవన్నీ ఇష్టం లేదు. 1918లో 16 ఏళ్ళ వయసులో లెనీ ఒక కార్యక్రమానికి హజరై నృత్యం నేర్చుకోవాలని ప్రేరణ పొందారు. కానీ ఆమె తండ్రి మాత్రం బాగా చదువుకుని గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకోమని చెప్పారు. కానీ ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించారు. భర్తకి తెలియకుండా కూతుర్ని బెర్లిన్ లోని ఒక డాన్స్ స్కూలులో చేర్పించారు. అక్కడ లెనీ బాగా పేరు తెచ్చుకున్నారు. పలు డాన్సింగ్ అకాడమీలలో చేరి యూరప్ అంతా పర్యటించారు. కానీ దురదృష్టవశాత్తు పాదాలు పదే పదే గాయలవడంతో నృత్యం విడవాల్సి వచ్చింది. ఒక రోజు ఓ డాక్టర్‍ని కలవడానికి వెడుతూ 1924 నాటి ‘మౌంటెన్ ఆఫ్ డెస్టినీ’ సినిమా పోస్టర్ చూశారు. సినీరంగంలోకి ప్రవేశించాలన్న కోరిక కలిగింది. థియేటర్లకి, ఫిల్మ్ షోలకి వెళ్ళి సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. ఒకరోజు లెనీ ‘మౌంటెన్ ఆఫ్ డెస్టినీ’ సినిమాలో నటించిన లూయిస్ ట్రెంకర్‍ని కలుసుకున్నారు. అలాగే Gunther Rahn ని, ‘మౌంటెన్ ఆఫ్ డెస్టినీ’ సినిమా దర్శకులు, పర్వాతారోహ చిత్రాల పథగామి అయిన ఆర్నాల్డ్ ఫాంక్‌ని కలిసారు. అప్పట్లో ఫాంక్ బెర్లిన్‍లో ఒక సినిమాకి పని చేస్తున్నారు. ఆయన అంటే తన కెంత అభిమానమో, నటన అంటే ఎంత ఆసక్తో వివరించారు. తనకి ఒక అవకాశమీయవలసిందిగా కోరారు. అప్పుడు ఫాంక్ 1926 నాటి సినిమా ‘ది హోలీ మౌంటెన్’ చిత్రం స్క్రిప్ట్ ఆమెకు పంపారు. ఆయన వద్ద నటనలోనూ, ఫిల్మ్ ఎడిటింగ్ లోనూ శిక్షణ పొంది, పలు చిత్రాలు అందించారు లెనీ. ఆమె కీర్తి జర్మనీ బయట దేశాలకూ పాకింది. 1932లో లెనీ సొంతంగా ‘ది బ్లూ లైట్’ అనే సినిమా తీశారు. ఈ సినిమాకి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో రజత పతకం లభించింది. కానీ యూదు విమర్శకుల కారణంగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రాలేదని అంటారు. 1938లో ఈ సినిమాని మళ్ళీ విడుదల చేసినప్పుడు – క్రెడిట్స్ నుంచి కొన్ని యూదుల పేర్లు తొలగించారట. ఇందుకు లెనీనే కారణమని కొందరు ఆరోపిస్తారు. ఈ సినిమాలో లెనీ ఓ అమాయక గ్రామీణ యువతి పాత్ర పోషించారు. ఆమెని గ్రామంలో అందరూ ఆమెను దుష్టురాలని అసహ్యించుకుంటారు. ఆమె ఒక కొండ గుహలో తలదాచుకుంటుంది. ఈ సినిమా హిట్లర్‍కి బాగా నచ్చింది. లెనీని ఆదర్శ జర్మన్ మహిళగా భావించారు. ఆమెలోని ప్రతిభని గుర్తించి ఆమెతో సమావేశమయ్యారు. ఈ విధంగా 1932లో ఒక ఎన్నికల ర్యాలీలో హిట్లర్‌ని ఆమె చూశారు. ఆయన ప్రసంగానికి ఆమె అబ్బురపడ్డారు. ఒక సందర్భంలో ఆ ప్రసంగం గురించి అద్భుతంగా గుర్తు చేసుకున్నారు. ఆ ప్రసంగం గురించి ఒక నాజీ పత్రికకి ఉత్తరం రాసి, హిట్లర్‍ని కలవాలనే అభిలాష వ్యక్తం చేశారు. ఆ మరుసటి ఏడాది ఆమెకి అవకాశం లభించింది. హిట్లర్‍ని కలవగలిగారు. వారి స్నేహం పెరిగింది. 1933లో లక్షలాది మంది జర్మన్‍లు హజరైన ఒక ర్యాలీని చిత్రీకరించే బాధ్యతని ఆమెకి అప్పగించగా, అయిష్టంగానే అంగీకరించారు. హిట్లర్‍తో ఆమె బంధం సుమారు 12 ఏళ్ళు కొనసాగింది. వారి అనుబంధంపై రకరకాల వదంతులున్నాయి. లెనీ జర్మనీ ప్రసారశాఖ మంత్రికీ, ఆయన భార్యకీ సన్నిహితమయ్యారు. నాజీ ఉద్యమం గురించి గొప్ప చిత్రం నిర్మించాల్సింది కోరి, ఆమె కోరినంత బడ్జెట్, కళాకారులను సిద్ధం చేశారు హిట్లర్. ఈ క్రమంలో రూపొందిన ‘Triumph of the Will ‘ చిత్రాన్ని ఈనాటికీ గొప్ప ప్రచార చిత్రంగా చెప్పుకుంటారు.
1936లో బెర్లిన్‍లో జరగనున్న ఒలింపిక్ క్రీడలని చిత్రీకరించవలసిందిగా హిట్లర్ లెనీని కోరారు. ఆటల ప్రారంభం సందర్భంగా వెలిగించే క్రీడా జ్యోతి ఫుటేజ్ తీసుకునేందుకు ఆమె గ్రీస్ వెళ్ళారు. క్రీడల అసలు స్థలం ఒలింపియాను సందర్శించారు. వీటన్నిటితో ఆమె తీసిన ‘ఒలింపియా’ ఒక విజయవంతమైన చిత్రం అయింది. సాంకేతికంగా, దృశ్యపరంగా అద్భుతంగా ఉన్న చిత్రమైంది. అథ్లెట్ల కదలికల ఆధారంగా రెయిల్స్ మీద కెమెరా పెట్టి ట్రాకింగ్ షాట్లు గొప్పగా తీశారు లెనీ. ఈ డాక్యుమెంటరీ స్లో-మోషన్ షాట్‍లకి ప్రసిద్ధి. లెనీ – స్లో మోషన్ షాట్లు, అండర్‍వాటర్ డైవింగ్ షాట్లు, అత్యంత హైయాంగిల్స్, అత్యంత లో-యాంగిల్స్ బాగా తీశారు. ఆ కాలంలో ఇటువంటి షాట్‍ల గురించి ఎవరూ విని ఉండలేదు. అందుకే ఆధునిక క్రీడల ఫొటోగ్రఫీపై ‘ఒలింపియా’ ప్రభావం ఉండి తీరుతుంది. లెనీ అన్ని జాతుల క్రీడాకారులనూ చిత్రీకరించారు. ఆఫ్రికన్-అమెరికన్ జెస్సీ ఓవెన్స్ లాంగ్ జంప్ వీడియో సుప్రసిద్ధ ఫుటేజ్‍గా నిలిచింది. ఈ వీడియో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ఉత్తమ విదేశీ చిత్రంగా ప్రత్యేక అవార్డు గెలుచుకుంది. 8.06 మీటర్ల దూరం దూకే క్రమంలో ఓవెన్స్ గాలిలో ఉండగా తీసిన ఒక షాట్‌ని లెనీ పట్టుపట్టడం వల్లే వీడియోలో ఉంచారట. అది ఆమె కళాత్మక దృష్టికి నిదర్శనం.
ఇదిలా ఉంటే, హిట్లర్ పట్ల ఆమె ఆరాధన కొనసాగింది. 1938లో అమెరికా పర్యటన సందర్భంగా లెనీ ఓ విలేఖరితో మాట్లాడుతూ, హిట్లర్‍ని అమితంగా పొగిడారు. కానీ అది సందర్భోచితం కాలేదు. అదే సమయంలో జర్మనీలో ‘క్రిస్టల్‌నాచ్’ ఘటన జరిగింది. జర్మన్లు యూదుల 1000 ‘సినొగోగ్’ లను తగులబెట్టారు, 30,000 మంది యూదులను ఖైదు చేశారు. ఫలితంగా హాలీవుడ్ నుంచి లెనీకి అందిన ఆహ్వానాలు వెనక్కి మళ్ళాయి. ఆమె కేవలం వాల్ట్ డిస్నీని మాత్రమే కలవగలిగారు. వాల్ట్ డిస్నీపై యాంటీ-సెమిటిజమ్ ఆరోపణలున్నాయి. ఇవి పూర్తిగా సత్యదూరం కాదు. 1938లో ‘క్రిస్టల్‌నాచ్’ ఘటన జరిగిన కొద్దిరోజులకే వాల్ట్ డిస్నీ లెనీని అమెరికాకి ఆహ్వానించారు. ‘ది నైట్ ఆఫ్ ది బ్రోకెన్ గ్లాస్’ అని పేరుబడిన ఈ దుర్ఘటన – నాజీ ప్రభుత్వం సృష్టించిన భీభత్సకాండకు సాక్ష్యం. యూదుల దుకాణాల అద్దాలు బద్దలుకొట్టబడ్డాయి, వందలాది యూదులు చంపబడ్డారు. వాల్ట్ డిస్నీని యాంటీ-సెమిట్ అని అన్నా, లెనీని అభిమానించారన్నది వాస్తవం.
1 సెప్టెంబరు 1939 నాడు జర్మనీ పోలాండ్‌పై దాడి చేసినప్పుడు – లెనీ – మిలిటరీ దుస్తులు ధరించి బెల్ట్‌కి తుపాకీ పెట్టుకుని జర్మనీ సైనికులతో కలిసి – వార్ కరెస్పాండెంట్‌గా – పోలాండ్ వెళ్లారు. Konskie అనే ఊరిలో జర్మన్ సైనికులపై దాడి చేసినందుకు గాను 30 మంది స్థానికులకి మరణశిక్ష విధించడం పట్ల ఆమె కలత చెంది అక్కడికి వెళ్ళగా, ఉద్రేకంగా ఉన్న జర్మన్ సైనికొకడు ఆమెకి తుపాకీ గురిపెట్టి అక్కడికక్కడే చంపుతానని బెదిరించాడట. బాధితులు యూదులన్న సంగతి ఆమె గ్రహించలేదట. 5 అక్టోబరు 1939 నాడు వార్సాలో జరిగిన హిట్లర్ విక్టరీ పెరేడ్‍కు ఆమె హాజరయ్యారు. ఆ తరువాఅత ఆమె నాజీ-సంబంధిత చిత్రాలను నిర్మించకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ జర్మన్‍లు పారిస్‍ని ఆక్రమించుకున్నప్పుడు హిట్లర్‍ని పొగుడుతూ మాట్లాడారు. ఈ ఘటనని మెచ్చుకుంటూ హిట్లర్‍కి ఓ టెలిగ్రామ్ కూడా పంపారు. హిట్లర్‌తో ఆమె స్నేహం 12 ఏళ్ళు కొనసాగింది. అయితే 1944లో రష్యాతో జరిగిన యుద్ధంలో ఆమె తమ్ముడు మరణించడంతో, హిట్లర్‍తో ఆమె సంబంధాలు దెబ్బతిన్నాయి.
హిట్లర్‍కి ఇష్టమైన నవల ఆధారంగా నిర్మించిన Tiefland (Lowland) అనే సినిమాలో ఒక జిప్సీ-డిటెన్షన్ క్యాంపుకి చెందిన ఎక్స్‌ట్రాలను ఉపయోగించుకున్నారు లెనీ. యుద్ధం ముగిసే సమయానికి వారు జీవించే ఉన్నారనీ, తరువాత వారిలో కొందరిని తాను కలిసానని ఆమె అన్నారు. ఈ విషయంలో ఆమె చనిపోవడానికి సంవత్సరం ముందుగా 2002లో ఆమె క్షమాపణ చెప్పేవరకూ వివాదం కొనసాగుతూనే ఉంది.
యుద్ధం అయ్యాకా, లెనీని అరెస్టు చేశారు. నాజీ యుద్ధ నేరాల గురించి తనకేమీ తెలియదన్నారామె. Tiefland (Lowland) సినిమాలో నటించిన రోమా, సింటీ అనే ఎక్స్‌ట్రాలు తరువాత ఆస్విజ్‍లో చంపబడ్డారన్న సంగతి తనకి తెలియదని అన్నారు. హిట్లర్ అంటే అభిమానం ఉన్నా, నాజీల నేర కార్యకలాపాలలో తను భాగం పంచుకోలేదని అన్నారు. నాలుగు విచారణల అనంతరం ఆమెను – సహ ప్రయాణీకురాలుగా- భావించి వదిలేశారు. హిట్లర్‍ని కలవడమే తన జీవితంలో అతి పెద్ద పొరపాటని ఆమె తరువాత పేరొన్నారు. తనని అందరూ నాజీ అంటున్నారని బాధ పడ్డారు. అయితే ఆమెపై నాజీ నేరాల క్రింద దాదాపు 50 కేసులు నమోదయ్యాయి.
గోబెల్స్ డైరీల ప్రకారం ఆమె సంపూర్ణంగా ఇష్టపడి నాజీల తరఫున పని చేయలేదు. “Artistically she is a genius, and politically she is a nitwit.” అని ఫిల్మ్ హిస్టోరియన్ లియమ్ ఓ లీరీ పేర్కొన్నారు.
22 ఆగస్టు 2003న లెనీ తన 101వ పుట్టినరోజు వేడుకలు తన ఇంటికి సమీపంలోని ఒక హోటల్‍లో జరుపుకున్నారు. ఆ తరువాత ఆమె జబ్బు పడ్డారు. అప్పటికే గత కొద్ది కాలంగా ఆమె కాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆ తర్వాతి నుంచి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. బాగా బలహీనమైపోయిన ఆమె కొన్ని పెయిన్-కిల్లర్స్ వాడారు. 8 సెప్టెంబరు 2003 రాత్రి పది గంటలకు నిద్రలోనే కన్నుమూశారు.
పలు పత్రికలు ఆమె మరణవార్తను ప్రచురించాయి. సినిమాలలో ఆమె చూపిన ప్రతిభను ప్రశంసించాయి. ఆర్సన్ వెల్స్, ఆల్‍ఫ్రెడ్ హిచ్‌కాక్ వంటి వారి తరువాత లెనీ రీఫెన్‌స్టాల్ – అత్యంత ప్రతిభాశాలియైన నిర్మాత అని గౌరవించాయి.
తన చివరి ఇంటర్వ్యూలో – కళలు, రాజకీయాలు వేరు వేరని గట్టిగా నొక్కి చెప్పారు.
మేటి స్వరకర్త గులాం హైదర్:
సాటిలేని మేటి స్వరకర్త మాస్టర్ గులాం హైదర్. దేశ విభజన అనంతరం – ఎందరో విజయవంతమైన, సుప్రసిద్ధ వ్యక్తులకు – వారికి రావల్సినంత కీర్తి ప్రతిష్ఠలు దక్కకపోవడం నేడెంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాకిస్తాన్ ముస్లిం ప్రసిద్ధుల విషయంలో ఇది మరింత ఆశ్చర్యకరం, ఎందుకంటే బ్రిటీష్ ఇండియా – భారత్ -పాకిస్తాన్‌లా విడిపోవడానికి ఒక కారణం తమకి సొంత దేశం ఉంటే తమ ప్రతిభ కాపాడబడుతుందని, రక్షించబడుతుందని, ప్రోత్సాహించబడుతుందని అక్కడి ముస్లింలు భావించడం కూడా!
1947 తర్వాత పాకిస్తాన్‌కు వెళ్ళిపోయిన షౌకత్ హుస్సేన్ రిజ్వీ, ఇంతియాజ్ అలీ తాజ్ వంటి వారు తమ ఘనతని కోల్పోయి – అలనాటి తమ ప్రతిభకు ఛాయలుగా మిగిలారు. గులామ్ హైదర్ కూడా వారికి తోడయ్యారు.
మాస్టర్ గులామ్ హైదర్‍ని సినీ సంగీతపు పథగామిగా పరిగణిస్తారు. మాస్టర్ ఝండే ఖాన్, ఇంకా పలువురు బెంగాలీ స్వరకర్తలు ఆరంభించిన పద్ధతిని కొనసాగిస్తూ, ఆ ఆవిర్భావాన్ని మరింత దృఢతరం చేసి, సినీ సంగీతానికి నియమాలు ప్రమాణాలు ఏర్పర్చినది గులామ్ హైదర్.
నూర్జహాన్, లతా మంగేష్కర్ వంటి సుమధుర గాయనీమణులను పరిచయం చేసిన ఘనత గులామ్ హైదర్‍కే దక్కుతుంది. నూర్జహాన్‌ని ఆయన తొలిసారి గమనించినప్పుడు ఆమె ఓ బాలిక. తన సోదరీమణులతో కలిసి ‘ఆజా పత్తన్ చనా దా యార్’ అనే పాట పాడారామె. ఆమె గాత్రం ఎంతో బాగుంది. వెంటనే హైదర్ ఆమెతో ‘గుల్ బకౌలి’ (1939) సినిమాలో సోలోగా పాడించారు. 1930 దశకం చివర్లో ఆయన ఆమెకు అనేక అవకాశాలు కల్పించారు. ‘శాలా జవానియన్ మానె’ పాట ఆమెకి పేరు తెచ్చింది. ‘ఖాన్‌దాన్’ (1942) సినిమాకి పని చేసిన తరువాత వీరిద్దరికీ గాయనీ, సంగీత దర్శకులుగా బాగా డిమాండు పెరిగింది. ప్రతిభావంతులైన సంగీత దర్శకులతో పని చేస్తూ ఎల్.కె. సైగల్ తో కలిసి నూర్జహాన్ సినీ సంగీతాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారనడలో సందేహం లేదు.
లతా మంగేష్కర్ ప్రతిభని తొలిసారిగా పసిగట్టినది హైదర్ గారే. ఒక కోరస్ బృందం సభ్యురాలిగా, చిన్న పాత్రలు పోషించే నటిగా లత పరిచమయ్యారు ఆయనకు. లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నిర్వహించే నాటక సంస్థకి నష్టాలు రావడం వల్ల ఆయన అప్పులపాలయ్యారు. తండ్రి మరణం తర్వాత తానే ముందుండి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత లతపై పడింది. తనకి మరో మార్గం లేదని గ్రహించిన లత – మొదట్లో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించారు. ఆమెకి ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని గ్రహించిన హైదర్, ఆమె సోలోగా పాడాలని భావించారు. ఆ కాలంలోని నిర్మాత దర్శకులు – ఒక టీనేజ్ బాలిక – సన్నని స్వరం గల అమ్మాయికి అవకాశాలివ్వడానికి సంశయించారు. వారి ప్రతిస్పందన పట్ల హైదర్‍కి కోపం వచ్చింది, కానీ లతకి మంచి బ్రేక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అట్లాంటి పాట మజ్బూర్ (1948) సినిమాలోది – ‘అబ్ కోయీ జీ కే క్యా కరే’ [వీరిద్దరి కాంబినేషన్‌లో నాకు బాగా నచ్చే పాట ఇది]. ఈ పాటని గొప్ప సంగీత దర్శకులు – ఖేమ్‍చంద్ ప్రకాశ్, హుస్న్‌లాల్ భగత్‌రామ్, నౌషాద్, శంకర్ జైకిషన్, అనిల్ బిస్వాస్ వంటి వారు మెచ్చుకున్నారు. తర్వాతి దశాబ్దాలలో వీరంతా లతకెన్నో అవకాశాలు కల్పించారు.
సింధ్ రాష్ట్రంలో పుట్టి, పంజాబ్‌బో పెరిగిన గులామ్ హైదర్ – ఆనాటి ఎందరో సంగీత దర్శకుల లానే – తొలుత రంగస్థలానికి పని చేశారు. ఆయన హార్మోనియం వాయించేవారు. వచ్చిన కొద్ది నెలలలోనే టాకీ సినిమాలు పేరు పొందడంతో ఆయన సినీరంగంవైపు అడుగులు వేశారు. ఉపఖండపు సినీరంగం ఊపు అందుకుంటున్న రోజులవి.
బ్రిటీషు, యూరపియన్‍ల నేతృత్వంలోని ఆర్కెస్ట్రాలు, థియేటర్లు – సంగీత వాయిద్యాలు నిర్వహించే సంగీతకారులకి, స్వరకర్తలకి – యూరోపియన్ టైటిల్ మేస్ట్రో లాగా – మాస్టర్ అనే బిరుదు నివ్వడం పరిపాటి. మన పరిభాషలో ఉస్తాద్ లేదా పండిట్ వలె.
తన స్వరాలలోని లయ కారణంగా గులామ్ హైదర్ పేరుపొందారు. ఆయన సంగీతంలో పాశ్చాత్య వాయిద్యాల అమరిక – శాస్త్రీయంగా కాకపోయినా – జాజ్, ఫోక్ మ్యూజిక్ జాడలు కూడా ఉంటాయి. అప్పటికే కొందరు భారతీయ స్వరకర్తలు వీటి వాడకాన్ని అధికం చేస్తున్నారు. మరోలా చెప్పాలంటే ఆయన ఆర్.సి. బొరాల్, తైమీర్ బారన్, పంకజ్ మల్లిక్ వంటి బెంగాలీ స్వరకర్తల వలె Purist కాదు. వీరంతా బెంగాలీ జానపద సంగీతంతో గొప్పగా ప్రభావితం అయినవారు. రబీంద్ర సంగీత్ నుంచి ప్రేరణ పొందినవారు. జనాలు టాగోర్‌ని భగవంతుడిలా భావించినందుకు ఆయనను విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయిన అరవై ఏళ్ళ తర్వాత కూడా కుష్వంత్ సింగ్ ఈ విషయంలో బాధ పడ్డారు.
మాస్టర్ గులామ్ పంజాబీ, సింధీ జానపద సంగీతాన్ని అమితంగా ఇష్టపడేవారు. తన బాణీలలో ఆ సంగీతాన్ని ఉపయోగించేవారు. సినీ సంగీతాన్ని బెంగాలీ సంగీతానికి కాస్త దూరంగా తీసుకువెళ్లారు.
ఖయాల్, ఠుమ్రీలు జనరంజకంగా ఉన్న రోజుల్లో – రబ్బీ సంప్రదాయానికి చెందిన హైదర్, ఇతర రబ్బీల వలె – లలిత గీతాలను అద్భుతంగా సృజించేవారు. వీరి కుటుంబం పంజాబ్‌లోని తరన్ తరన్‌కి చెందినది. జపగ్రంథ సంబంధిత సంగీతం రక్తంలో ఉండడంతో – రంగస్థలం కోసం, సినిమాల కోసం అద్భుతమైన బాణీలను హైదర్ అందించారు.
1947 తర్వాత పాకిస్తాన్‌కి వెళ్ళిపోయిన ఆయన కీర్తి, అవకాశాలు లేక మసకబారింది. వనరులు తక్కువగా ఉండి, తక్కువ సంఖ్యలో ఉన్న గాయనీగాయకులతో పనిచేయాల్సి వచ్చింది. ఇది ఆయన ప్రతిభనూ, ఆకాంక్షలను దెబ్బ తీసింది. పాకిస్తాన్‍లో ఆయన తన మాజీ సహచరుడు షౌకత్ హుస్సేన్ రిజ్వీతో కలిసి – షాహిదా, గుల్నార్ వంటి సినిమాలకు సంగీతం అందిచారు, కానీ వాటి విజయం పరిమితం. యాభై వసంతాలు నిండకుండానే హైదర్ 9 నవంబరు 1953న కన్నుమూశారు.