[dropcap]తె[/dropcap]ల్లారిందని
ఐదు గంటలకు ఫిక్స్ చేసిన
అలారం మోతతో,
తెలివి వస్తుంది.
బద్ధకం బాహువుల్లోనించి
బయట పడలేని స్టితిలో,
శరీరం అటు ఇటు కదులుతూ,
ఒళ్ళు విరుచుకుంటుంది!
విశ్వాసం గల శునక రాజంలా ,
అలారం గంట మరోమారు,
తన విధిని నిర్వర్తిస్తుంది.
బలవంతంగా దాని నోరు నొక్కి
లేవడానికి ప్రయత్నం చేస్తానా,
రాత్రి మల్టి పిన్ ప్లగ్‌కు తగిలించిన,
చార్జర్ గుర్తుకు వస్తుంది.
అయ్యో.. అనవసరంగా
రాత్రంతా ఉంచేసానే అని,
మొబైల్‌ని చార్జర్ నుండి
ఒక్క లాగు లాగి,
బల్ల మీద పెట్టబోతానా…
పాడు ఆరాటం
క్షణం సేపు నన్ను
అక్కడే…. ఆపి,
ఒకసారి ఫేస్‌బుక్ చూడు..
అని..
గుచ్చి.. గుచ్చి పొడుస్తుంది.
క్షణం ఆలశ్యం కాకుండా
ఫేస్‌బుక్ ఓపెన్ అయిపోతుంది.
ఒకదాని తరవాత ఒకటి,
లైకులు… కామెంట్లతో,
స్క్రోలింగ్ అయిపోతుంది.
మద్యలో ఎవరో…
ముఖ్యుడో… అతిముఖ్యుడో…
ఒక వీడియో పొస్ట్ చేస్తాడు,
నా.. కళ్ళు మళ్ళీ…
అందులోకి పరిగెడతాయి.
ఇక అది సముద్రం…
చేదే కొద్ది…
బావిలో నీళ్ళు వూరినట్టు,
ఆ.. మెసేజ్‌లు చూడడానికి
రిప్లైలు ఇవ్వడానికి
ఒక అంతం ఉండదు.
శ్రీమతి ఒకసారి వచ్చి
సీరియస్‌గా
చూసి వెళ్ళిపోతుంది.
ఆ.. చూపులో….
వాకింగ్‌కు వెళ్లడం లేదా…
అన్న గంభీర స్వరం కనిపిస్తుంది.
బుద్ధిమంతుడిలా
మొబైల్ మళ్లీ చార్జింగ్‌కు పెట్టి,
అసలు దినచర్యలోకి
అడుగు పెడతాను..!
అమూల్యమయిన
సమయం అంతా..
మొబైల్ ముచ్చట్ల తోనే
ముగిసిపోతుంది!!