[dropcap]నే[/dropcap]ను చూశాను ఓ క్షణమందున
వలపుసొగసులతో “అభినయా”
లొలికంచు వయ్యారి “నర్తకి”ని
అల్లంత దూరాన పొంచున్నాడో
నూనూగు మీసాలు త్రిప్పుతూ ఆహ్లాదంగున్న ఓ”రంగజీవుడు”
కారుమబ్బులాకాశాన్నో క్షణం
ఆవరంచె ప్రకృతి ధర్మమంటూ
ఎరుపెక్కిన సూర్యూడు నేనేలని
చీకటికొండల్లో కనుమరుగాయె
విరబూసిన పలు పూతోటలు
సువాసనలు విరజిమ్ముతుంటే
పచ్చని పంటపొలాలు, ఎత్తైన
సరివి, తాడి, ఈతచెట్లెన్నోకలసి
సహజమైన ఓ రంగులదృశ్యమై
ఆరడుగుల నూనూగుమీసాల
“పౌరాణిక కథానాయకుడు”
“చెలీ నీ కోసమే నేను”న్నానంటూ
“సాత్వికాభినయంతో” నిలువెల్ల
“మూఖాభినయం” మేళవించి
కమనీయ కనుసైగలెన్నో చేస్తూ
ఉన్నాడు సుందరాంగుడా క్షణం
అంత వయ్యారి ఓ అందాలరాశి
“ఆంగికాలు” నిలువెల్లా చలించ
“జానపద” సినీ కథానాయకివలే
“ఆహార్యం”తో అదరగొడుతుండే
అంత ప్రకృతి పరవళ్లు త్రొక్కతూ
“స్వగతం”పలికె ఆ ప్రేమజంటకు
ఊరి చివర ఏకాకిగా నున్నరంగ
స్థలమైన ఓ పురాతన పూరిపాక
అంతనవ్య “నటన” మొదలాయె
ఆ ప్రేమజంట కనులపండుగగా
అంత యవనిక మెల్లగా జారసాగె
“ప్రేక్షకుల” కనులుకప్ప.. అల్లంత
దూరాన చెట్లకొమ్మలపైన దాగిన
ఓ కోవిలమ్మ మంచుతెరల నుండి
మధురాతి మధుర యుగళగీతం
ఆలపిస్తుండె ప్రేక్షకుల చప్పట్లతో
విశ్వంలో ప్రతిప్రాణి నటకులమే
అన్నట్లు మనదంత నటనన్నట్లు.