సిద్ధం కాని ఆవకాయ
[dropcap]తె[/dropcap]స్తూ తెస్తూ… చింతకాయ పచ్చడి ఒకటే కాదుగా… వాటి చెలికత్తెలు ఉసిరి, నిమ్మ, దబ్బ, టమాటా లాంటి పచ్చళ్ళు తలా రెండు కేజీల చొప్పున పేకెట్లు కట్టించానని అత్తగారు ఫోన్ చేసి చెప్పారు.
“అసలైనదీ, ముఖ్యమైనది ఆవకాయ తేవడానికి, ఆవకాయకి మంచి పుల్లటి మామిడికాయలు ఇంకా రాలేదురా! ఏంటో… ఆవకాయ, మాగాయ, మెంతికాయ, తొక్కుడు పచ్చడి ఇవి తీసుకురాకుండా నాకు విమానం ఎక్కాలని లేదురా అచ్చిగా!” ఆవేదన నిండిన గొంతుతో ఆవిడ అనేసరికి, “ఆవకాయ సంగతి అలా ఉంచమ్మా! ఇక్కడికి వచ్చాక, అందరిలో నన్ను అచ్చిగా! పిచ్చిగా అంటూ పిలవకు. బావుండదు” అన్నారు శ్రీమాన్ అచ్యుత్ అనబడే మా ఆయన.
“ఆ మాత్రం నాకూ తెలుసులేరా అచ్చీ! ఏదో నీమీద ప్రేమెక్కువైనప్పుడేగా అలా అంటానూ… ఉట్టప్పుడు నిన్ను పిలిచేది అచ్యుతమా! అనేగా!” అన్నారు ఆవిడ.
“ఔను లేమ్మా! అది నాకు తెలుసులేవే… ఇక్కడ అచ్చిగా, పిచ్చిగా అని పిలవొద్దని అంటున్నాను” గంటులా పెట్టిన ఈయన ముఖం చూస్తోంటే నాకు నవ్వాగడం లేదు. అమెరికా వచ్చాక అచ్యుతరావు కాస్తా ఏ. చ్యుత్‌గా పేరు మార్చుకున్న మనిషిని అచ్చిగా అంటే ఉక్రోషం రాదు మరీ! అనుకున్నాను.
“అమ్మా! నీ బిపీ, సుగర్ టాబ్లెట్లు, ఇంకా నీకు అవసరమయిన అలవాటైన మందులు ఆరునెలలకి సరిపడా తెచ్చుకో. వాటితో పాటే డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ పెట్టుకోవడం మర్చిపోకు. పాస్‌పోర్టు జాగ్రత్త. ఎయిర్‌పోర్ట్‌లో చూపించిన వెంటనే బేగ్‌లో పెట్టేసుకో. నీకోసం వీల్ ఛైర్ ఏర్పాటు పెట్టాను. ఎక్కడా నీకు ఇబ్బంది అవుదులే.” అన్నారు.
“అన్నీ సిధ్దమే.. కానీ ఆవకాయ గురించే ఆలోచిస్తున్నా.. ఈ ప్రయాణం ఏదో రెండు నెలలాగాక ఉండుంటే అవన్నీ కూడా పట్టుకొచ్చేదాన్నే!” దిగాలుగా అంటున్నారు అత్తగారు.
ఇక నేను కల్పించుకోకపోతే బావుండదని, “ఫర్వాలేదు అత్తయ్య గారూ! ఇక్కడ కూడా మామిడికాయలు దొరుకుతాయి లెండి. మీరు వచ్చాక ఆవకాయ పెడుదురుగాని” అనేసరికి ఆవిడకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఇక ఆ తర్వాత చెప్పిన కబుర్లు అన్నీ వేటి గురించో వేరే చెప్పక్కర్లేదు కదూ!
(మళ్ళీ కలుద్దాం)