‘ఎవ్వ రీమెకు సాటి’ – ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి ‘పారిజాతావతరణము’ పుస్తకానికి ముందుమాట

2
3

[dropcap]ఆ[/dropcap]చార్య అనుమాండ్ల భూమయ్య గారు కవిత్వం మరియు విమర్శ రంగంలో అనేక గ్రంథాలు వెలువరించారు. అయితే కేవలం రచయితగా రాసుకొంటూ వెళ్ళిపోవటమే కాకుండా “లోచూపు”తో పరిశోధనాత్మకంగా రాయటం వారి ప్రత్యేకత. ఒక కవి విమర్శకుడు కూడా అయితే – ఒక విమర్శకుడు కవి కూడా అయితే ఎంత ప్రయోజనం ఉంటుందో భూమయ్య గారి రచనలు చదివితే తెలుస్తుంది. ఒక కౌసల్య, ఒక త్రిజట, ఒక కబంధుడు, ఒక మకరి… యథాతథంగా పూర్వ కావ్యాలలో సృజింపబడినట్టు కాకుండా – వీరి కలం లోంచి కొత్త రూపు ధరించి, పాఠకుల ముందు నిలుస్తారు. తమ ఆవేదనని వెల్లడించి “ఏమంటారు” అని ప్రశ్నిస్తారు. “ఇలా కూడా ఆలోచించండి, న్యాయం చెప్పండి” అంటారు.

గతానుగతికంగా వచ్చిన కావ్యాలని ఆయా కవుల భావాలలోనే పఠించి, అదే ధోరణిలో ఆలోచించిన పాఠకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ‘ఈ కోణంలో నేనెందుకు ఆలోచించలేక పోయాను’ అనుకొంటాడు. ఆ విధంగా ఆలోచించి ఆవిష్కరించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి భావనకు పాఠకుడు “భేష్” అని కితాబు ఇవ్వకమానడు. అదుగో అలాంటి పరంపరలో వచ్చిన మరో పాత్ర “సత్యభామ”.

సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలోని నంది తిమ్మన విరచిత “పారిజాతాపహరణము”లో సత్యభామ ఒక సౌందర్య రాశిగా, శృంగారభామగా, శ్రీకృష్ణుని ఇష్టసఖిగా, సవతుల పట్ల అసూయ, అక్కసు కలిగిన అహంభావిగా కన్పిస్తుంది.

దేవలోకం నుండి నారదుడు పారిజాత పుష్పమును రుక్మిణీదేవి మందిరంలో ఉన్న శ్రీకృష్ణునికి ఇచ్చి, ‘ప్రియమైన’ వారికివ్వమని సూచించి “చక్కనిదాననంచు నెలజవ్వని నంచు జగంబులోన బేరెక్కిన దాననంచు” విర్రవీగెడి సత్యభామ గర్వం ఇక అణిగిపోతుందని ప్రకటించాడు. కలహభోజనుని అంచనా ప్రకారమే సత్యభామ చెలికత్తె ఈ ఉదంతాన్నంతయూ ఆమెకు చేరవేయడం, సత్య కోపోద్రిక్తయై, వ్రేటు వడ్డ ఉరగాంగనవోలె, నేయివోయ భగ్గను అగ్నికీల వలె లేచి, మాసిన చీర కట్టి, వాసెన కట్టు కట్టి, కోపగృహంలోనికి ప్రవేశించడం, శ్రీకృష్ణుడు విచ్చేసి పరిపరి విధముల బ్రతిమిలాడడం రసాత్మకంగా వర్ణించాడు నందితిమ్మన. చివరికి సత్య ఎడమకాలిచే ఆతని “శిరము తొలగం జేసెను” అని చెప్పి, “అట్లయగు నాథుల్ నేరముల్సేయ పేరలుకం జెందిన కాంతలెందు నుచిత వ్యాపారముల్ నేర్తురే” అని తాను కథలో ప్రవేశించి ఆ చర్యను సమర్థించాడు.

తరువాత కృష్ణుడు ఆమెను శాంతింప జేసి, దేవలోకము నుండి పారిజాత వృక్షాన్నే తెచ్చి సత్యభామ పెరటిలో నాటింపజేసెను. చివరిలో నారదుడు సర్వ జనులకు శుభం పలికి మంగళాశాసనం పలుకుతాడు. పరమ శాంత స్వభావానికీ, అపూర్వమైన సహనానికి రూఢమైన భూదేవి అంశతో పుట్టిన “సత్యభామ”ను అహంకారిగా, అసూయాగ్రస్తురాలిగా చిత్రించడం ఆచార్య భూమయ్య గారికి అసంతృప్తిగా అనిపించింది. ప్రియసఖుడైన శ్రీకృష్ణునిపై అలక, శిరమును తాచుట సవతి మీద పంతంతో దేవ పారిజాతమును తన పెరటిలో నాటించుట సత్యభామ వ్యక్తిత్వానికి తగదు అనిపించింది. అరణపు కవియైన నందితిమ్మన ‘అలా’ రచించడానికి నేపథ్యమైన కథ ప్రచారంలో ఉంది. కానీ సాత్రాజితిని స్వార్థపరురాలిగా కాక ప్రజా సంక్షేమ కాంక్షాపరురాలిగా చిత్రించారు భూమయ్య గారు తన “పారిజాతావతరణము”లో.

ఈ కావ్యమును రెండు భాగాలుగా చెప్పారు. పూర్వభాగము “శ్రీకృష్ణ సత్య”. ఉత్తరభాగము “పారిజాతము”. “దీనజన వత్సలుడైన” శ్రీకృష్ణుడు సంభ్రమమున సత్యభామ మందిరం చేరుసరికి చక్కని స్వాగత ఏర్పాట్లు చేసి, అందంగా అలంకరించుకొని ఎదురేగినదామె. “కృష్ణ భగవానుని నయనములు పారిజాతములయి మనోహరాకృతిని దాల్చె”. సత్సంకల్పముతో దృఢచిత్తయైన “సత్య హృదయమ్ము పారిజాతమై విరబూసి పరిమళించె”. ఇక వారికి ప్రత్యేకంగా పారిజాతములవసరమా! ఆమెది స్వార్థము కాదు, దీనజనరక్షణ. స్వచ్ఛమైన విశాల హృదయము. నారదుడు ఒక్క పుష్పమే తెచ్చినాడు. కృష్ణుడా సమయములో రుక్మిణీదేవి మందిరమున నుండుటచే ఆమెకు నిచ్చుట సమంజసమే. రెండు ఇచ్చినచో ఏ ఇరువురికి యివ్వవలె! పోనీ, ఎనిమిది తెచ్చినచో అష్ట భార్యల కివ్వవచ్చు! మరి పదహారు వేల మందికి తీసుకురాగలడా! అని పలుకుట ఆమె నిస్వార్థ చిత్తమునకు నిదర్శనం. పైగా, అత్యంత మహిమలు గల దేవ పారిజాతము సమస్త జీవులకు మేలు చేకూర్చవలయును కానీ ఒకానొక వ్యక్తికో, వ్యక్తులకో కాదు కదా అని యోచించి –

“నడువగా లేక ఇబ్బంది పడెడు వారు కలరు…. కలరు గ్రుడ్డివారీ పురి, కలరు చెవిటి వారు, మూగవారెందరో, వారి నుద్ధరింప లేరో! బాధల నివారింపలేరో! సర్వ జనులు సుఖమ్మున్న శాంతి, క్రాంతి. ఆయా దివ్యాంగులు దివ్య పారిజాతము వల్ల సుఖం పొందవలెనన్నది…” ఆమె ప్రగాఢ వాంఛ.

“ఇష్ట సఖులపుడపుడు కన్నీరు జాలువార తెలుపుచుండగా” సత్యభామకీ విషయములన్నీ తెలిసి, ఈ దీనుల బాధలను తీర్చుటెట్లని లోలోన యోజన చేయుచున్నది కాబోలు – ఈనాడు నారదుడు పారిజాత పుష్పము యొక్క దివ్యమైన మహిమలు వివరింపగా తెలిసికొన్నంతనే “ఒక్క పుష్పమునకే ఇంత మహిమలున్నచో, వృక్షమే ద్వారకా నగరమున ఉన్నచో, దీనుల, అభాగ్యుల సర్వబాధలు నివారింప బడతాయి కదా”యని తలచినది.

“సత్యవాక్కుకు కృష్ణుడు సంతసించె”. అంతలో విచ్చేసిన నారదుడు (భూమయ్య గారి సృజనలో అతడు కలహ భోజనుడు కాదు) ప్రజల ఆర్తి తొలగించు ఈ విశేష కార్యమును అమరేంద్రునకు తెలియజేయ నేగెను. సత్యాకృష్ణులు అమరపురి కేగుట, “ప్రజల క్షేమార్థమైన” వారి సత్సంకల్పమునకు అదితి, దేవేంద్రుడు, శచీదేవి సంతసించి పారిజాత వృక్షమును వారికప్పగించెను. శ్రీకృష్ణుడు ఈ భూమిపై ఉన్నంత వరకు ఆ దివ్య వృక్షము భువిపై నుండి, తదుపరి అమరపురికి చేరగలదు అనినాడు దేవేంద్రుడు.

‘పారిజాత వృక్షము భూలోకమునకు వచ్చినంతనే జనుల బాధలు తొలగిపోయెను. వారి బ్రతుకులో వెల్లు వరదలై పారెను. ఇంతటికి మూల మీ సత్యయే కదా!’ సర్వజనుల సౌఖ్యము గోరి సత్యభామ పారిజాతమ్ము నిట నిల్పె పతిని గూడి ఎవ్వరీమెకు సాటి! లేరెవ్వ రనగ పొంగి సత్యభామను ప్రజ పొగడె నిట్లు కన్నబిడ్డల బాధల గనిన తల్లి మది తపించి, బాధల నెల్ల మాన్పినట్లు, తెలుపకుండనె మా బాధ తెలిసికొనుట బాధ తొలగించుటెల్ల మా భాగ్యమమ్మ!

ఇదీ – సత్యభామ అనెడి ఒక స్త్రీ వ్యక్తిత్వం. భూదేవి అంశతో జనించిన కృష్ణసఖి కరుణార్ద్ర హృదయం. కోపము, అసూయ, పంతముగల సత్యభామను ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారు దర్శించిన విధము.

“ఎవ్వరీమెకు సాటి” అని మేటిగా చిత్రించిన విధానము. ప్రజల కష్టాలకు చలించిపోయి, తరుణోపాయం చేకూర్చినట్టు సత్యభామలోని మాతృ హృదయాన్ని ఆవిష్కరించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు ఆ శ్రీకృష్ణసత్యల ఆశీర్వచములు మెండుగా దండిగా పొందిన ధన్యులు.

డా. సిహెచ్. సుశీలమ్మ

ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (విశ్రాంత)

డిప్యూటీ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ

***

పారిజాతావతరణము
రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య
ప్రచురణ: మనస్వినీదేవి
పుటలు: 100
వెల: ₹ 100
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ – ఫోన్: 040-24652387
విశాలాంధ్ర అన్ని శాఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here