గూఢచారుల జీవితచిత్రణ – ‘ది అమెరికన్స్’

0
3

[dropcap]1[/dropcap]947 నుంచి 1991 వరకు అమెరికా, సోవియెట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. ఎప్పుడు యుద్ధం వస్తుందో అన్నంత భయం కొన్ని సందర్భాలలో ఇరుదేశాలలోనే కాక ప్రపంచమంతా ఉండేది. నా చిన్నతనంలో మా సోషల్ స్టడీస్ అధ్యాపకుడు సమకాలీన పరిస్థితులపై అవగాహన ఉన్నవారు కావటంతో ప్రచ్ఛన్నయుద్ధం గురించి మాట్లాడేవారు. మన దేశం తటస్థంగా ఉంటూనే ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ లాగా సోవియెట్ యూనియన్ వైపు మొగ్గు చూపేదని అనేవారు. 1991లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం కావటంతో ప్రచ్ఛన్నయుద్ధం ముగిసింది. 1947 – 1991 మధ్య గూఢచర్యం విపరీతంగా జరిగింది. రష్యా నుంచి అమెరికాకు, అమెరికా నుంచి రష్యాకు గూఢచారులు వెళ్ళి అక్కడి పౌరుల్లాగే మెలిగి రహస్యాలను తమ దేశాలకు చేరవేసేవారు. అలాంటి గూఢచారుల కథే ‘ది అమెరికన్స్’ అనే వెబ్ సెరీస్. పేరులోనే వ్యంగ్యం ఉంది. ముఖ్య పాత్రధారులైన రష్యన్ గూఢచారుల జంట అమెరికా పౌరులుగా చలామణి అవుతుంటారు. వారు పైకి మాత్రమే అమెరికన్లు. ‘The Americans’ అనే పేరులో ‘c’ అక్షరానికి బదులు రష్యాకి గుర్తుగా సుత్తి, కొడవలి పెట్టడం కొసమెరుపు. ఈ సీరీస్ డిస్నీ+హాట్ స్టార్ లో అందుబాటు ఉంది. ఆరు సీజన్లు నడిచి 2018 లో ముగిసింది. ఈ సీరీస్ పెద్దలకి మాత్రమే. ఈ వ్యాసం ఆరో సీజన్ సమీక్ష. మొదటి ఐదు సీజన్లు చూడనివారికి కథ అంతా చెప్పకుండా ఉండేలా ఈ వ్యాసం వ్రాయటం జరిగింది.

1980లో మొదటి సీజన్ మొదలౌతుంది. ఎలిజబెత్, ఫిలిప్ అమెరికాలో ఉండే రష్యన్ గూఢచారులు. ఇరవై ఏళ్ళ క్రితమే దొంగపత్రాలతో వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఇద్దరూ కలిసి ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుంటారు, ఎవరికీ అనుమానం రాకుండా. వారికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేజ్, అబ్బాయి హెన్రీ. ఎలిజబెత్, ఫిలిప్ లకు వారి అధికారుల ద్వారా ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఆదేశాలు చేరవేయటానికి ఒక వ్యక్తి ఉంటారు. ఆ ఆదేశాల ప్రకారం రహస్యాలు సేకరించాలి, వాటి కోసం మోసాలు చేయాలి, మారువేషాలు వేయాలి, కొన్నిసార్లు హత్యలు కూడా చేయాలి. ఒక్కోసారి అమాయకులని కూడా చంపాల్సి వస్తుంది. ఇది నైతికమేనా అంటే వారి దృష్టిలో అది అనివార్యం కాబట్టి నైతికమే. రాజనీతి శాస్త్రం వేరు. చాణక్యుడు లాంటి వారు దేశం కోసం ఎన్నో హత్యలు చేయించారు. అది తప్పని వారు భావించలేదు. ఇలాంటి కథలతోనే సీరీస్ నడుస్తుంది.

మొదటి సీజన్‌లో పద్నాలుగేళ్ళ పేజ్‌కి తన తలిదండ్రుల మీద అనుమానం వస్తుంది. రెండో సీజన్లో ఇక తప్పదని ఆమెకి నిజం చెబుతారు ఆమె తలిదండ్రులు. ఆరో సీజన్ వచ్చేసరికి 21 ఏళ్ళ పేజ్ కూడా గూఢచర్యం మొదలుపెడుతుంది. గూఢచర్యం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో శిక్షణ, చాకచక్యం అవసరం. పేజ్‌కి శిక్షణ ఇస్తారు అమె తలిదండ్రులు. అమెరికన్ లాగా పెరిగిన పేజ్ పెట్టుబడిదారీ వ్యవస్థ నచ్చక త్వరగానే సామ్యవాదాన్ని వంటబట్టించుకుంటుంది. పేజ్ కంటే చిన్నవాడైన హెన్రీకి ఏమీ తెలియదు.

గూఢచర్యం అంటే తప్పుగా భావించేవారూ ఉన్నారు. కానీ శత్రువు వేసే వ్యూహాలు తెలుసుకోవాలంటే ఇది తప్పదు. వారు సైనికులకంటే తక్కువేమీ కాదు. దేశభక్తితో వారు తమ జీవితాలనే పణంగా పెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే వారు సామాన్య జీవితం గడపాలి. కొత్త భాష నేర్చుకోవాలి. పిల్లల్ని కనాలి. కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి అనే చింత ఉంటుంది. ఆ చింత కన్నా దేశప్రయోజనాలే వారికి ముఖ్యం. తమ ప్రాణమానాల్నే తాకట్టు పెట్టినవారు. ఏమన్నా తేడా వస్తే దేశం విడిచి పోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘ది అమెరికన్స్’లో ఒక సందర్భంలో అమెరికా వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చే సూచనలు కనపడతాయి. పేజ్ ఆందోళనగా ఉంటుంది. ఏంటి దారి అని అడుగుతుంది. రష్యాకి వెళ్ళిపోవటమే అంటారు తలిదండ్రులు. పేజ్‌కి మతి పోతుంది. “రష్యా గురించి నాకేం తెలియదు. అక్కడ ఎలా ఉండటం?” అని అడుగుతుంది. తలిదండ్రులు సముదాయిస్తారు. వీరింకా నయమే. కొందరు గూఢచారులు అమెరికన్ పౌరులను పెళ్ళి చేసుకుంటారు. వారు పూర్తిగా ఒంటరివారు. ఏం జరిగినా అన్నీ వదులుకుని పోవటమే దారి. వీరందరి జీవితాలు ఎలా ఉంటాయో తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇండియాలో పాక్ గూఢచారులు, పాక్‌లో ఇండియా గూఢచారులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 1970లలో జరిగిన గూఢచారి కథతో ‘రాజీ’ (2018) సినిమా కూడా వచ్చింది. ఆలియా భట్ గూఢచారిగా నటించింది. చివరికి అన్నీ వదులుకుని ఒంటరి జీవితం గడుపుతుంది. ఇలాంటి వారిని ప్రభుత్వం సంరక్షిస్తుంది. వారి త్యాగం నిరుపమానం.

‘ది అమెరికన్స్’ లో మొదటి సీజన్ లోనే ఎలిజబెత్, ఫిలిప్ ఇంటికి ఎదురుగా ఒక ఎఫ్.బి.ఐ. ఏజెంట్ కుటుంబం నివసించటానికి వస్తుంది. ఎఫ్.బి.ఐ. అంటే సీబీఐ లాగా ఒక దర్యాప్తు సంస్థ. ఆ ఏజెంట్ పేరు స్టాన్. అతను గూఢచారుల కార్యకలాపాలని దర్యాప్తు చేస్తుంటాడు. ఇంటి ఎదురుగా ఉంటాడు కాబట్టి అతనితో స్నేహం చేయక తప్పని పరిస్థితి. అయితే ఇందులో ఒక సౌలభ్యం ఉంది. అతని కదలికల బట్టి కొన్ని రహస్యాలు తెలుస్తాయి. కానీ అతనికి అనుమానం వస్తే వీరు చిక్కుల్లో పడ్డట్టే. కొన్నిసార్లు అతనికి తెలిసిపోతుందనే అనిపిస్తుంది. అయినా ఏడు సంవత్సరాలు అతనికి పెద్ద అనుమానం రాకుండానే గడిచిపోతాయి.

ఐదో సీజన్ చివరికి ఫిలిప్‌లో అంతర్మథనం మొదలౌతుంది. ఈ వంచనలు నేనిక చేయలేను అనే స్థితికి చేరుకుంటాడు. ఎలిజబెత్ అతన్ని గూఢచర్యం మానేయమంటుంది. తాను మాత్రం చేస్తానంటుంది. స్త్రీలు ఏ పనిలోనైనా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు. ఆరో సీజన్ మొదలయే సరికి అధికారుల అనుమతితో ఫిలిప్ గూఢచర్యం మానేసి ట్రావెల్ ఏజెన్సీ నడుపుకుంటూ ఉంటాడు. రెండు మూడేళ్ళు గడిచిపోతాయి. సోవియెట్ యూనియన్‌లో గోర్బచెవ్ హయాం మొదవలువుతుంది. రష్యా నిఘా సంస్థ కేజీబీకి గూఢచారుల మీద నియంత్రణ తగ్గుతూ ఉంటుంది. దాంతో కేజీబీలో గోర్బచెవ్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. వారు ఎలిజబెత్ లాంటి వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు. ఫిలిప్‌ని గోర్బచెవ్‌కి వ్యతిరేకంగా మార్చి అతని ద్వారా ఎలిజబెత్ కదలికలని తెలుసుకోవాలని వారి పథకం. దేశప్రయోజనాల కోసం ఇది అనివార్యమని అంటారు. అంటే ఇప్పుడు ఫిలిప్ చేత అతని భార్య పైనే గూఢచర్యం చేయించాలి!

ఇంతలో ఎలిజబెత్‌కి ఆమె అధికారులు ఒక టాప్ సీక్రెట్ చెబుతారు. అమెరికా దాడి చేసి రష్యా నాయకులను మట్టుపెడితే ఆటోమాటిక్‌గా అమెరికాని నేలమట్టం చేసే వ్యవస్థని రూపొందించినట్లు చెబుతారు. అయితే ఇంకా కొన్ని పరికరాల అవసరం ఉంటుంది. శాంతి కోసం జరుగుతున్న శిఖరాగ్ర సమావేశం కోసం వచ్చిన గోర్బచెవ్ ప్రతినిధి రహస్యంగా ఈ వ్యవస్థని అమెరికాకి అప్పగిస్తాడేమోనని ఎలిజబెత్ పై అధికారుల భయం. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆమెపై పడుతుంది. అంటే ఫిలిప్ లక్ష్యం, ఎలిజబెత్ లక్ష్యం ఒకటే – గోర్బచెవ్‌ని ఆపటం. అతిరహస్యం కావటంతో ఎలిజబెత్ ఫిలిప్‌కి చెప్పదు. ఫిలిప్ తనకు అందిన ఆదేశాల గురించి ఎలిజబెత్‌కి చెబుదామనుకుంటాడు కానీ ఆమె తీవ్రమైన ఒత్తిడి కారణంగా అతణ్ణి మాట్లాడనివ్వదు. అతను గూఢచర్యం మానేశాడు కాబట్టి తన పనికి అడ్డురావద్దని ఆమె చెప్పకనే చెబుతుంది.

వారి కొడుకు హెన్రీ ఒక ప్రతిష్ఠాత్మకమైన బోర్డింగ్ స్కూల్లో చదువుతుంటాడు. మన జూనియర్ కాలేజీల స్థాయిలో చదువుతుంటాడు. ఫీజు చాలా ఎక్కువ. అయినా అక్కడ చదివితే భవిష్యత్తు బావుంటుందని హెన్రీ కోరటంతో అతన్ని అక్కడ చేర్పిస్తారు. ఫీజు కట్టడం ఫిలిప్‌కి తలకు మించిన భారమౌతుంది. దాంతో అతను కూడా ఒత్తిడికి లోనౌతాడు. తన ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే వారి మీద అసహనం చూపిస్తుంటాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఫిలిప్ పెట్టుబడిదారీ విధానానికి లొంగిపోయాడు. రష్యా నుంచి అమెరికాకి వచ్చినపుడు అమెరికాని ద్వేషించిన అతను ఇప్పుడు అమెరికా జీవనవిధానానికి అలవాటు పడిపోయాడు. ఎలిజబెత్ తన దేశభద్రత కోసం ఒత్తిడి పడుతుంటే ఫిలిప్ తన కుటుంబం బావుంటే చాలని దాని కోసం ధనార్జనలో పడ్డాడు. ఇద్దరి భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరుకుంటాయి.

పేజ్ తల్లికి గూఢచర్యంలో సహకరిస్తూ ఉంటుంది. గూఢచర్యం గురించి పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఒకరోజు తల్లిని “గూఢచర్యంలో శృంగారం కూడా ఒక అస్త్రమా?” అని అడుగుతుంది. ఎలిజబెత్, ఫిలిప్ ఇద్దరూ కూడా రహస్య సమాచరం కోసం ఇతరులతో శృంగారంలో పాల్గొన్నవారే. దేశం కోసం తమ దేహాన్ని కూడా పావుగా వాడతారు. ఇది ధర్మమా అంటే దేశం కోసం ఏమైనా చేస్తామని అంటారు. ఒక రకంగా దేహాభిమానాన్ని వదులుకున్నారు. ఫిలిప్ అయితే ఒకామెని దొంగపెళ్ళి చేసుకున్నాడు. పేజ్ అడిగిన ప్రశ్నకి ఎలిజబెత్ కొంతమంది గూఢచారులు గీత దాటి ప్రవర్తించవచ్చు కానీ మామూలుగా అలా జరగదని అబద్ధం చెబుతుంది. అయినా నిజం బయటపడకుండా ఉంటుందా?

ఈ సీరీస్ ముగింపు ఎంతో ఉద్వేగకరంగా ఉంటుంది. ఫిలిప్, ఎలిజబెత్ పట్టుబడ్డారా లేదా అని అడిగితే దానికి అవును కాదని చెప్పలేనంత బాగా ముగింపుని తీర్చిదిద్దారు రచయిత, దర్శకులు. ఆ స్థితిలో వారికి దేశం వదిలి పారిపోవటం కన్నా వేరే దారి ఉంటుందా? పేజ్ ఏం చేస్తుంది? అసలేమీ తెలియని హెన్రీ ఏమౌతాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సీరీస్ చూడాల్సిందే. కొన్ని ఘట్టాలు నమ్మశక్యం కానట్టుగా ఉంటాయి. కానీ వాటి శాతం చాలా తక్కువ. గూఢచారులంటే జేమ్స్‌బాండ్ లాగా ఉంటారు అనుకునేవారికి జేమ్స్‌బాండ్ ఇంకో గూఢచారిని పెళ్ళి చేసుకుని, వారికి పిల్లలుంటే ఎలా ఉంటుంది అని చూపించే సీరీస్ ఇది.

ఎలిజబెత్‌గా కెరీ రసెల్, ఫిలిప్‌గా మాథ్యూ రీస్ నటించారు. ఇద్దరికీ నాల్గవ, ఐదవ, ఆరవ సీజన్లకు ఉత్తమ నటి, ఉత్తమ నటుడు విభాగాల్లో ఎమ్మీ అవార్డుల నామినేషన్లు వచ్చాయి. ఆరవ సీజన్‌కి మాథ్యూ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. అతను పోషించిన ఫిలిప్ పాత్ర గురించి ఇక్కడ ఎక్కువ ప్రస్తావించలేదు. కానీ ఈ అవార్డు అతనికి వచ్చిందంటే అతను ఎంత బాగా నటించాడో అర్థమౌతుంది. నాల్గవ, ఆరవ సీజన్లకు ఈ సీరీస్‌కి ఉత్తమ సీరీస్ నామినేషన్లు కూడా వచ్చాయి. అయితే అవార్డు దక్కలేదు. ఈ సీరీస్ చివరి ఎపిసోడ్‌కి గాను రచయితలు జోయెల్ ఫీల్డ్స్, జో వైస్బర్గ్‌కు ఉత్తమ రచన అవార్డు వచ్చింది. ఆ ఎపిసోడ్ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి ఈ అవార్డే నిదర్శనం. విమర్శకులు ఈ చివరి ఎపిసోడ్ ని “one of television’s best series finales” అని ప్రశంసించారు. ఆరవ సీజన్ తప్పక చూడాల్సినది. మొత్తం అన్ని సీజన్లు చూస్తే మరీ బావుంటుంది.

ఈ కింద ఆరవ సీజన్ లోని ఒక ఘట్టం ప్రస్తావించబడింది. ఇది రెండవ ఎపిసోడ్‌లో వస్తుంది. మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా కథ ఉంటుంది. పైగా ఈ ఘట్టం ముఖ్యకథ లోనిది కాదు. ఈ సీరీస్ లో ఎలాంటి ఘట్టాలు ఉంటాయో ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది.

ఒక అమెరికన్ మిలటరీ జనరల్ గతంలో ఫిలిప్‌కి కొంత సమాచారం ఇచ్చాడు. ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నాడు. ఇలాంటి దేశద్రోహులు కూడా ఉంటారు. అయితే తర్వాత ప్రమాదాన్ని గుర్తించి దూరంగా ఉంటాడు. ఎలిజబెత్ తమ ఆటోమాటిక్ వ్యవస్థ కోసం ఒక సెన్సర్ అవసరం కావటంతో ఆ జనరల్‌ని మళ్ళీ కలుస్తుంది. ఇలా ఇతరులని కలిసినపుడు ఆమె మారువేషంలో వెళుతుంది. సెన్సర్ తెచ్చి ఇవ్వమని, లేకపోతే అతను ఇంతకు ముందు చేసిన దేశద్రోహం బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒక పార్క్‌కి రాత్రి వేళ సెన్సర్ తీసుకురమ్మని చెబుతుంది. అనుకున్న సమయానికి అతన్ని కలవటానికి పార్క్‌కి వెళుతుంది. పేజ్ కారు పార్కింగ్ ప్రదేశంలో కారులో ఉండి పరిసరాలని గమనిస్తూ ఉంటుంది. ఏమైనా అనుమానం కలిగితే ఎలిజబెత్‌ని హెచ్చరించటం ఆమె పని. దాని కోసం వైర్‌లెస్ పరికరాలు ఉంటాయి. ఎలిజబెత్‌ని చూడగానే జనరల్ ఆమె మీదకి తూపాకీ గురి పెడతాడు. అమెని చంపేస్తే బయటపడవచ్చని అతని భావన. కానీ ఆమెని చంపేస్తే ఇంకా ప్రమాదంలో పడతాడని అతనికి కూడా తెలుసు. కానీ ముందు నుయ్యి వెనక గొయ్యి ఉంటే ఏం చేస్తాడు? ప్రస్తుతానికి ఆమెని చంపేస్తే తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాడు. ఎలిజబెత్ అతన్ని వేడుకుంటున్నట్టు మోకాళ్ళ మీద కూర్చుని అదను చూసి అతని పై లంఘించి తుపాకీ కోసం అతనితో పెనుగులాడుతుంది. అతను తుపాకీ వదలడు. చివరికి తుపాకీని అతని గడ్డం కింద వచ్చేలా పెట్టి గుండు పేల్చి అతన్ని చంపేస్తుంది. ఈ శబ్దం విని పేజ్ పరుగెత్తుకు వస్తుంది. ఎలిజబెత్ ముఖం రక్తంతో తడిసి ఉండటంతో పేజ్ ఆమెకి ఏమైనా అయిందేమోనని భయపడుతుంది. ఎలిజబెత్ ఆమెని వెంటనే వెళ్ళిపొమ్మని అరుస్తుంది. పేజ్ వెళ్ళిపోయాక ఎలిజబెత్ జనరల్ చేతిలో ఉన్న తుపాకీ మీద తన వేలిగుర్తులు చెరిపేస్తుంది.

తర్వాత పేజ్ తో ఎలిజబెత్ “ఏం జరిగినా అనుకున్న పథకం అమలు చేయాలి. నీ పని పరిసరాలని గమనించటమే. మీటింగ్ జరిగే చోటికి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ఉండకూడదు” అంటుంది. జనరల్ ఆత్మహత్య చేసుకున్నాడని అబద్ధం చెబుతుంది. అంటే తాను హత్యలు చేస్తానని కూడా పేజ్‌కి చెప్పదు. శిక్షణ పొందిన గూఢచారి కనక ఆమెకి అబద్ధాలు చెప్పటం కొత్త కాదు. కానీ తన కూతురికే అబద్ధాలు చెప్తుంటే నిజం తెలిసినపుడు ఆ అమ్మాయి తల్లిని గౌరవించగలదా? తల్లిగా ఎలిజబెత్ తన కూతురి మనసు చెదిరిపోకుండా ఉండటానికి అబద్ధాలు చెప్పింది. తన కూతురు కాకుండా వేరొక గూఢచారి అయితే నిజమే చెప్పేది. ఆ సంఘర్షణ ఆమె అనుభవించాల్సిందే. జనరల్ ఆత్మహత్య చేసుకోబోతుంటే తాను ఆపటానికి ప్రయత్నించానని చెబుతుంది. పోలీసులు కూపీ లాగుతారు కదా అంటుంది పేజ్. ఎలిజబెత్ “అంతా అనుకున్నట్టు జరిగితే పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటారు” అంటుంది. జాగ్రత్తగా గమనిస్తే అతను ఆత్మహత్య చేసుకోలేదని చూచాయగా చెబుతున్నట్టు అనిపిస్తుంది. “పోలీసులు అలా అనుకోకపోతే?” అంటుంది పేజ్. “అనుకోకపోతే ఇంకా కూపీ లాగుతారు. అన్నీ నేను ఊహించలేను కదా” అంటుంది ఎలిజబెత్. “నా దేశం కోసం నేను ఈ పనులు చేస్తున్నాను. నేను భయపడను. భయపడితే ఏమీ చేయలేం” అంటుంది.

ఎఫ్.బి.ఐ.లో పని చేసే స్టాన్, అతని పై అధికారి జనరల్ ఆత్మహత్య గురించి తెలిసి దాని గురించి మాట్లాడుకుంటారు. “నేనైతే పార్క్‌లో ఆత్మహత్య చేసుకోను” అంటాడు స్టాన్. నిజమే! పార్క్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు? పై అధికారి “అతనికి కుంగుబాటు (డిప్రెషన్) ఉన్నట్టు కూడా దాఖలాలు లేవు” అంటాడు. దర్యాప్తు చేసేవాళ్ళు ఎంత నిశితబుద్ధి కలిగి ఉంటారో మనకి అర్థమౌతుంది. కానీ గూఢచారులు దొంగ పేర్లతో, దొంగ ఐడీ కార్డులతో, మారువేషాలలో పని చేస్తుంటే వారికి తొందరగా పట్టుకోవటం కష్టం. వీళ్ళు మామూలు నేరస్థుల లాంటి వారు కాదు. ఎంతో శిక్షణ పొందినవారు.

దేశభక్తి పేరుతో తీవ్రవాదులను తయారు చేయటం తప్పే. కానీ గూఢచర్యం చేసేవారు తీవ్రవాదులు కాదు. వారు తమ దేశం బావుండాలని ఆ పని చేస్తారు. పాలకులు తమ ప్రయోజనాల కోసం గూఢచారులను తప్పుగా వాడుకోవచ్చు. అలాంటపుడు అది పాలకుల తప్పే అవుతుంది కానీ గూఢచారుల తప్పు కాదు. పాలకులు తప్పు దోవ పట్టిస్తున్నారని గూఢచారులకు తెలిసినపుడు వారు ఏం చేస్తారనేది వారి దేశభక్తికి కొలమానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here