ఒక ప్రాక్టికల్ గైడ్ – ‘ఆలోచన మారితే జీవితం మారుతుంది’

2
3

[dropcap]‘ఆ[/dropcap]లోచన మారితే జీవితం మారుతుంది’ ఈ పుస్తకం శీర్షిక ఈ పుస్తకం యొక్క ఆత్మని దర్శనం చేయిస్తుంది. ఈ పుస్తకం తాలూకు విషయం మొత్తం ఈ ఒకే  ఒక్క వాక్యంలో మనకు తెలిసిపోతుంది.

తెలుగులో ఇలాంటి ఆంగ్ల పుస్తకాల అనువాదాలు వచ్చాయి కానీ, ఒక తెలుగు వ్యక్తి తన జీవిత అనుభవాలతో వ్రాసిన ఇలాంటి మొదటి తెలుగు పుస్తకం ఇది.

మనలో ఎవ్వరైనా సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే వందకోట్లు సంపాయించవచ్చు అన్నది ఈయన నినాదం. ఉత్తిగా ఏదో పగటి కలలు కనటం కాదు, అందుకు సరి అయిన ఆర్థిక ప్రణాళిక పట్టిక వేసి మరీ ఇస్తాడు మీకు. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన మొదటి ఆలోచన, ఈ పుస్తకం నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నాకు లభించి ఉంటే నేను ఈపాటికి సునాయాసంగా కోట్లు సంపాయించి ఉండేవాడిని కద, అని అనిపించింది.

చాలా మందిలో కొన్ని స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. అవేంటి అంటే ‘డబ్బు చెడ్డది. డబ్బు సంపాయించటంలో ఎన్నో అక్రమ మార్గాలు తొక్కిన వారు మాత్రమే ధనవంతులు అవుతారు. సామాన్యులు ధనవంతులు అవటం కల్ల’ ఇలా ఉంటాయి ఈ ఆలోచనలు.  ఈ అపోహలని తొలగించే ఒక మంచి ప్రయత్నం ఈ పుస్తకం.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ‘మహాత్రియా రా’ గారు ఏమి చెబుతారంటే, డబ్బుకి కేవలం రెండే గమ్యాలు ఉన్నాయి.

ఒకటి: శీలవంతులయిన మంచి వారి వద్దకు చేరటం. వీరెలాగు దాన్ని సద్వినియోగం చేసి సమాజాన్ని బాగు చేస్తారు.

రెండు: చెడు ఆలోచనలు నిండిన దుర్మార్గుల వద్దకు చేరటం. వీరి వద్ద ధనం కూడా తోడైతే సమాజాన్ని నాశనం చేస్తారు.

కాబట్టి మంచి వారందరూ అపోహలు మాని కోటీశ్వరులు అవటం సమాజానికి ఒక మంచి పరిణామం.

’ది సీక్రెట్’ అనే పుస్తకంలో రోండా బైర్నే అనే రచయిత్రి కూడా ఇదే విషయం చెబుతారు. పరిమితి అనేది మన మానసిక భావన. ‘ఈ విశ్వం నీకు అపరిమితమైన అవకాశాలు ఇస్తుంది. అనంతంగా నీవు సంపాయించగలవు.దానికి ఒక పరిమితి అన్నది లేనే లేదు’ అని. అందుకు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ప్రతి గంటాకి కొన్ని కోట్ల డాలర్లు  సంపాయిస్తున్న ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకెర్ బర్గ్.

ఒక్క జుకెర్ బర్గ్ మాత్రమే కాదు మన కళ్ళ ఎదురుగా ఎన్నో ఉదాహరణలు.

ధనం సంపాయించటం అనేది ఒక పాపపు ఆలోచన అని అనుకుంటుంటారు చాలా మంది.

వారు ఒక రకంగా కరెక్టే. అక్రమ మార్గాలలో, అనైతిక పద్ధతుల ద్వారా సంపాయించటం ముమ్మాటికీ తప్పే.

కానీ ఈ గ్రంథ రచయిత ఈ గ్రంథంలో చెప్పిన సలహాలు ఏవి అనైతిక పద్ధతులు కాదు. నైతికంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా వందకోట్లు ఎలా సంపాయించాలి అన్న విషయం సవివరంగా వ్రాశారు.

ఒకరు ధనవంతులు అవ్వాలంటే ఇంకొకరు పేదవాడుగా మారాలి. ఇది అపరిపక్వమైన పాశ్చాత్య ఆలోచనాధోరణి. అందుకే ఎత్తులు పై ఎత్తులు వేసే సాహిత్యం మనకు అక్కడ అందుబాటులో ఉంది. కానీ నిజానికి అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండవచ్చు. మన వాల్మీకి రామాయణంలో చెప్పిన రామరాజ్యం భావన ఇదే. దీనికి ధర్మం పునాది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అపరిమితమైన ఐశ్వర్యవంతులుగా ఉండవచ్చు.  వాల్మీకి రామాయణంలో ప్రారంభంలో దశరధుడి రాజ్యం తాలూకు ఐశ్వర్యం గూర్చి చదువుతుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది.

అలాంటి రామరాజ్యం భావన ఊహ కాదు. ఈ ‘ఆలోచన మారితే జీవితం మారుతుంది’ ఆ దిశగా ఒక ప్రాక్టికల్ గైడ్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

మొదటగా మున్నూరు నాగరాజు గురించి:

ఈ పుస్తక రచయిత శ్రీ మున్నూరు నాగరాజుగారు. వీరు నాకు అత్యంత ఆప్తులు. మూడేళ్ళ క్రితం ఒక హాస్య పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వీరి పరిచయం అయింది. ఆ రోజు నేను చూసిన నాగరాజు గారు వేరు. ఆ రోజు నాకు ఆయన లో సాహిత్యాభిమాని కనిపించారు. హైదరాబాద్‍కి కొత్త అయిన ఆ హాస్య పుస్తక రచయితలకి అన్నీ తానే అయి ఆ పుస్తక రచయితలకి ఎన్నో ఏర్పాట్లు చేసి పెట్టటంలో ఒక స్నేహశీలి, ఒక  సాహిత్యాభిమాని నాకు కనిపించారు.

వ్యాస రచయిత డా. రాయపెద్ది వివేకానంద్‌తో పుస్తక రచయిత శ్రీ మున్నూరు నాగరాజు

ఆ తరువాత, కరోనా సమయంలో ఎందరో దినసరి కార్మికులకు ఆహారం సమకూర్చటం, వసతి ఏర్పాట్లు, ఆర్థిక సాయం అందిచటంలో ఆయనలోని మానవత్వం నిండిన ఒక మంచి మనిషి కనిపించాడు.

ఎన్నారైలు కొందరు ఏర్పాటు చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి ఆయన్ని కలిశాను. ఆయనలో నిండిఉన్న సనాతన ధర్మ అభిమానాన్ని ఆ రోజు చూశాను.

వ్యాస రచయిత డా. రాయపెద్ది వివేకానంద్‌తో పుస్తక రచయిత శ్రీ మున్నూరు నాగరాజు

ఈయన గొప్ప స్థితిమంతుడు, దేనికీ కొదవలేదు అన్నది నిర్వివాదాంశం. ఇంగ్లీష్‌లో బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని ఒక వాడుక పదం ఉంది. అలా ఈయన పుట్టటమే ఐశ్వర్యం నిండిన కుటుంబంలో పుట్టాడేమో అని అనుకున్నాను.

కానీ కాదు. నిజానికి ఈయన జీవితం ’రాగ్స్ టు రిచెస్’ కి ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

దారిద్య్ర రేఖకి దిగువన ఉండే కుటుంబంలో పుట్టారు ఈయన.

ఈ పుస్తక ప్రారంభంలో రచయిత బాల్యం గురించి చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి. ట్యూయిషన్ ఫీజ్ కట్టాల్సిన పదుల రూపాయలు ఈయన పొరపాట్న పోగొట్టుకుని వస్తే వీళ్ళ తల్లి ఈయనని శిక్షించిన వైనం చదివితే ఏడుపు వస్తుంది.

సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణతో శ్రీ మున్నూరు నాగరాజు

ఆ తర్వాత ఒక పెళ్ళింట్లో వీళ్ళ అమ్మగారు అక్కడ రోజు కూలికి పాత్రలు కడుగుతూ దర్శనం ఇచ్చిన సందర్భం చదివి మనకు ఎంతో బాధ అవుతుంది.

పరీక్ష ఫీజు కట్టటానికి, స్కాలర్ షిప్ అప్లై చేసుకోవటానికి ఈయన పడ్డ అవస్థలు చదువుతుంటే మనకు దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉంటాడు అనిపిస్తుంది.

ఆ తరువాత ఆయన ఎంబీఏ లో చేరాలనుకున్నా ఆర్థిక కారణాల వల్ల చేరలేకపోవటం, ఎంకాం లో చేరి కూడా సీనియర్ల్ రాగింగ్ భరించలేక తిరగబడ్డ విధానం మనకు ఒకచలన చిత్రం చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది.

భార్యా పిల్లలతో శ్రీ మున్నూరు నాగరాజు

ఈయన సీనియర్లతో తిరగబడ్డ విధానంలోనే జీవితంపై తిరగబడ్డాడు ఆ వివరాలన్నీ మనకు స్ఫూర్తిదాయకం.

ఇక పుస్తకం గూర్చి:

ఈయన శైలి అనితర సాధ్యం. ఒక చేయి తిరిగిన రచయితని మించి వ్రాశాడు. నిజం చెప్పద్దూ ఈయనే వ్రాశారా, ఇది ఎవరైన పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్ప రచయిత పుస్తకమా అని ఒకటికి పది సార్లు, ఈ పుస్తకం ముఖ చిత్రం చూడాల్సి వచ్చింది.  అంత గొప్పగా ఉంది ఈయన శైలి.

ఆ తర్వాత కర్ణాటకకి వెళ్ళి పోయి మార్కెటింగ్ ఉద్యోగంలో జీవితాన్ని ప్రారంభించటం ఆయన జీవితంలో ఒక మేలిమలుపు.

ఆయన ఆ సందర్భంలో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి శిరోధార్యం.

“కంపెనీలు ఎంతో అలోచన చేసుకుని ఒక ఆర్థిక ప్రణాళిక ప్రకారం టార్గేట్ ఇస్తారు. దాన్ని అఛీవ్ చేయటానికి మనం అహరహం కష్టపడతాం. మనకంటూ మన జీవితానికి ఒక ఆర్థిక ప్రణాళిక వద్దా? మనకంటూ ఒక ప్రణాళిక ఉంటే మనం ఆడుతూ పాడుతూ వందకోట్లు సంపాయించటం పెద్ద సంగతి కాదు” అంటారు. ఈయన మాటలు విని నమ్మలేక నిర్ఘాంతపోతాడు కర్ణాటకలోని జోషి అనే మిత్రుడు. ఒక్క జోషీ ఏంటి బుక్ చదువుతూ మనం అందరూ అలాగే నిర్ఘాంతపోతాము.

ఈయన వేసిచ్చిన ప్లాన్ పూర్తిగా ఆచరణీయం. ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు రచయిత.

ఇంతకూ ఈ పుస్తకంలో ఏముంది?

ఇందులో కేవలం 5 అధ్యాయాలు ఉన్నాయి.

మొదటి రెండు అధ్యాయాలు వీరి బాల్యం గూర్చి, స్కూలు చదువు, కాలేజి చదువు గూర్చి, మొదటి ఉగ్యోగంలో చేరిన వైనం గూర్చి ఉన్నాయి.

ఎంతో నిజాయితీ ఉంటే తప్ప ఇంత ధైర్యంగా ఈ విషయాలు వ్రాయలేరు. రచయితని కౌగిలించుకుని ఓదార్చాలి అనిపించింది ఈ అధ్యాయాలు చదివితే.

చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతారు, ఒక దగ్గర. అల్లుడు అంటే మామగారిని ఏడిపించుకుని తినే దశమగ్రహం కాదు, మామగారికి కన్న కొడుకులాగా  సేవచేసే బాధ్యతలు ఉంటాయి అల్లుడికి నిజానికి అని. ఈ మాటలకి నిలువెత్తు సాక్షాత్కారం రచయిత. ఈయన వ్యవసాయ రంగంలో ఉండి ఇబ్బందులు పడుతున్న మామగారిని ఎలా ఆదుకున్నాడో దాని ద్వారా తను  కొత్త వ్యాపారావకాశాల గూర్చి ఎలా తెలుసుకున్నాడో కూడా మనకు తెలుస్తుంది.

మూడో అధ్యాయం:

ఇక్కడ నుంచి అసలు విషయం ప్రారంభం అవుతుంది. డబ్బు సంపాయించే ఆదాయ మార్గాలు, మనల్ని ఐశ్వర్యవంతులని చేసే ఆస్తులు, సులువైన ఆర్థిక ప్రణాళికలు ఇస్తారు.

ఈయన ఇచ్చిన SCR ప్రణాళిక చూసి, ఇతని మిత్రుడు జోషీ, గీతా బోధ విన్న అర్జునుడిలా స్థాణువు అయిపోతాడు ఆశ్చర్యానందాలతో. ’నీవు నా మిత్రుడు అయినందుకు గర్విస్తున్నాను’ అని ఒకే మాట అంటాడు జోషి.

మనం కూడా అంతే ఆనందాశ్చార్యాలకి గురవుతాము  ఈ ప్రణాళిక చూసి.

S: అంటే సేఫ్టీ ప్లాన్

C: అంటే కంఫర్ట్ ప్లాన్

R: రిచ్ ప్లాన్

అంటే మన జీవితంలో ఎటువంటి రిస్క్ లేకుండా ఆరోగ్యం, సౌఖ్యాలు, సంపద ఎలా సంపాయించవచ్చు అని సవివరంగా చెబుతారు రచయిత.

నాలుగో అధ్యాయం:

ఈ అధ్యాయంలో ఆర్థికాభివృద్ధికి పునాది ఏమిటి, డబ్బు గూర్చి ఆలోచనలు వాటి గూర్చి వాస్తవాలు తెలుపుతారు. సంపద సృష్టి నైపుణ్యాలు తెలియజేస్తారు.

పేదరికానికి కారణాలు తెలుసుకుంటాం ఇక్కడ.

ఆర్హికాభివృద్ధికి అడ్డంకులు మరియు ధనవంతులు ఎలా విభిన్నమైన పనులు చేస్తారు అన్నది తెలియజేస్తారు.

అయిదో అధ్యాయం:

ఈ అధ్యాయం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని మొదలు పెట్టుకుని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఎన్నో అమూల్యమైన విషయాలని తెలుపుతారు.

అనుబంధం:

మనం అందరం చదవాల్సిన గొప్ప పుస్తకాల పట్టిక కూడా చివర అనుబంధం రూపంలో ఇచ్చారు రచయిత.

ఈ పుస్తకం వెల నిజానికి అమూల్యం అని చెప్పవచ్చు. అయినా ఈ పుస్తకం ధర చాలా అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ధర కేవలం ₹.499. ఒక రోజు మిత్రులతో వెళ్ళి మొదటి రోజు, మొదటి ఆట సినిమా చూసినా, లేదా కుటుంబంతో కల్సి హోటల్ కెళ్ళి ఫలహారం తిన్నా కూడా ఈ పుస్తకం ధరకంటే ఎక్కువే ఖర్చు చేస్తాం మనం.

ఈ రచయిత నిత్య అధ్యయనశీలి. ఈయన మనకు ఈ జ్ఞానం అందించటానికి ముందు తాను అనేక శిక్షణా కార్యక్రమాలకి ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చి తాను నేర్చుకున్నారు ఈ జ్ఞానాన్ని. మనకు ఈ జ్ఞానం ఆయన ఉచితంగా అందించాలి అని ఆశించటం తప్పేమో. తుమ్మెద ఎంతో శ్రమకోర్చి వేలాది పుష్పాల నుంచి సేకరించిన మకరందాన్ని మనం ఉచితంగా స్వీకరించి ఎంతో తప్పు చేశాం. ఈ గ్రంథం విషయంలో అలాంటి తప్పు చేయవద్దు. దీనిని కొని చదవండి. ఇది పదికాలాల పాటు దాచి ఉంచుకుని చదువుకొనదగిన పుస్తకం.

 ఈ పుస్తకం అందరూ కొని చదవదగ్గది. అంతే కాదు ఈ పుస్తకానికి సంబంధించి ప్రతి స్కూల్లో సదస్సులు, చర్చావేదికలూ నిర్వహించాలి. ఈ పుస్తకాన్ని మీ పిల్లలతో చదివించండి.

కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వాలి.

***

ఆలోచన మారితే జీవితం మారుతుంది
రచన: మున్నూరు నాగరాజు
ప్రచురణ: ఎకిమీడా పబ్లికేషన్స్,
పుటలు: 246
వెల: ₹ 499
ప్రతులకు:
ఫోన్: 9948935484
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
ఆన్‍లైన్‌లో
https://www.amazon.in/gp/product/B09TKCCHHG

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here