మరుగునపడ్డ మాణిక్యాలు – 3: క్వీన్ అండ్ స్లిమ్

0
13

[dropcap]2[/dropcap]020 మేలో అమెరికాలోని మినసోటా రాష్ట్రంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని నిగ్రహించే నెపంతో డెరెక్ షావిన్ అనే పోలీసు ఆఫీసర్ కింద పడేసి మెడపై మోకాలితో నొక్కి చంపేశాడు. జార్జ్ నల్లజాతివాడు కావటంతో అతనిపై అధిక బలప్రయోగం జరిగింది. తెల్లజాతి వాడు అయి ఉంటే అంత కర్కశంగా వ్యవహరించేవారు కాదు. ఇలాంటి పోలీసు జులుం అమెరికాలో కొత్త కాదు. కానీ ఈ ఉదంతంతో పోలీసు జులుంపై వ్యతిరేకత పరాకాష్టకు చేరింది. జార్జ్ 20 డాలర్ల దొంగ నోటు ఉపయోగించాడనే అనుమానంతో అతన్ని అరెస్ట్ చేయటానికి ప్రయత్నించారు నలుగురు పోలీసులు. తొమ్మిది నిమిషాలపాటు మెడ నొక్కి పెట్టడంతో అతను ఊపిరాడక మరణించాడు. “I can’t breathe” (నాకు ఊపిరి ఆడటం లేదు) అని అతను అంటున్నా డెరెక్ అతనిపై కనికరం చూపలేదు. ఈ ఉదంతంతో ప్రపంచమంతా జాతివివక్ష పై నిరసనలు చెలరేగాయి. “I can’t breathe” ఒక నినాదంగా మారింది. 2021 జూన్‌లో డెరెక్‌కి 22.5 ఏళ్ళ జైలు శిక్ష పడింది.

ఈ ఉదంతానికి ఆరు నెలల ముందు 2019లో ‘క్వీన్ & స్లిమ్’ చిత్రం వచ్చింది. పోలీసు జులుం ఎలా ఉంటుందో, ఒకవేళ అరెస్టయిన వ్యక్తి తిరగబడి పోలీసుని చంపితే ఎలా ఉంటుందో చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. పెద్దలకు మాత్రమే. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది. మనం కొన్ని సినిమాల ప్రచారంలో “ఆరంభం మిస్సవకండి” అనే హెచ్చరిక చూస్తుంటాం. అంటే మొదట్లో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయని అర్థం. ఈ సినిమాలో మొదటి పది నిమిషాల్లోనే అతి ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది. ఆ ఘట్టం అయ్యాకనే టైటిల్స్ వస్తాయి. అయినా కావలసిన సినిమాని ఏ సమయంలోనైనా మొదలుపెట్టి, ఆపుకుని చూసే ఈ రోజుల్లో ఈ హెచ్చరిక అవసరం లేదనుకోండి. కాకపోతే సినిమా పెట్టుకుని నెమ్మదిగా టీవీ ముందు కూర్చునేవారు మిస్సయ్యే అవకాశం ఉంది. కూర్చున్న తర్వాతే సినిమా పెట్టుకోండి.

ఒక రెస్టారెంట్లో సినిమా మొదలవుతుంది. క్వీన్, స్లిమ్ డేట్ మీద ఉంటారు. ఇద్దరూ నల్లజాతి వారే. ముప్ఫై ఏళ్ళ వయసుంటుంది. వాళ్ళిద్దరూ టిండర్ అనే డేటింగ్ యాప్‌లో కలిశారని, ఆమె ఒక లాయరని, దృఢమైన అభిప్రాయాలు కలదని, అతను ఒక సూపర్ మార్కెట్ లో పని చేస్తాడని, సున్నితమనస్కుడని, ఆమె కేవలం తన అలోచనల నుంచి దృష్టి మరల్చుకోవటానికి ఈ డేట్‌కి వచ్చిందని మాటల్లో తెలుస్తుంది. ఐదు నిమిషాల్లోనే ఇంత సమాచారం తెలియజేయటం స్క్రీన్ ప్లే రచయిత్రి ప్రతిభ. కారులో క్వీన్‌ని ఇంటి దగ్గర దించటానికి స్లిమ్ బయలుదేరుతాడు. ఆమె అతని మొబైల్ చూస్తుండటంతో అతను దాన్ని లాక్కునే ప్రయత్నంలో కారు ఊగిసలాడుతుంది. వెనకనే వస్తున్న పోలీసు వారి కారుని ఆపుతాడు. అమెరికాలో కారు నడుపుతూ చిన్న తప్పు చేసినా పోలీసుల కంటపడితే ఫైన్ వేస్తారు. చిన్న తప్పు అని వదిలేస్తే తర్వాత పెద్ద తప్పులు చేస్తారని ఆ పద్ధతి పెట్టారు. స్లిమ్ తాగి కారు నడుపుతున్నాడని అనుమానంతో పోలీసు అతన్ని కారు దిగమని ఒళ్ళంతా సోదా చేస్తాడు. కారు ట్రంక్ తెరవమంటాడు. అప్పటికే అసహనంగా ఉన్న క్వీన్ ట్రంక్ సోదా చేయటానికి వారంట్ ఉందా అని అడుగుతుంది. ఆమె లాయరు కాబట్టి ఆమెకి చట్టాలు బాగా తెలుసు. స్లిమ్ సోదాకి ఒప్పుకున్నాడు కనుక వారంట్ అవసరం లేదంటాడు పోలీసు. ట్రంక్‌లో షూ బాక్సులు ఉంటే వాటిని తెరిచి చూస్తాడు పోలీసు. బయట చలిగా ఉండటంతో స్లిమ్ “కాస్త త్వరగా ముగిస్తారా?” అని అడుగుతాడు. పోలీసుకి కోపం వచ్చి అతని మీద తుపాకీ గురిపెడతాడు. క్వీన్ ఇది అన్యాయమని, జరిగేదంతా రికార్డు చేయటం తన హక్కని మొబైల్ ఫోన్ తీస్తుంది. పోలీసు ఆమె కాలికి గురిపెట్టి కాలుస్తాడు. ఆమెకి గాయమౌతుంది. దాంతో స్లిమ్ పోలీసుతో పెనుగులాడి కింద పడిన తుపాకీ తీసి పోలీసుని కాలుస్తాడు. పోలీసు చనిపోతాడు.

తాగి కారు నడుపుతున్నాడనే అనుమానంతో వారి కారుని ఆపిన పోలీసు అతను తాగలేదని తెలిశాక ఇంకా సోదా చేయటం చట్టాలను అతిక్రమించటమే. కారు ఊగిసలాడిందనే చిన్న నెపంతో, నల్లజాతివారిపై ఉన్న దురభిప్రాయంతో అతను అతిగా ప్రవర్తించాడు. డ్రగ్స్ ఉన్నాయా అని అడిగి కారు ట్రంక్ సోదా చేయటం మొదలుపెడతాడు. అనుమానముంటే కారుని జప్తు చేసి తర్వాత సోదా చేయాలి. చట్టాలెన్ని ఉన్నా జాత్యహంకారం ఉంటే అవి అమలుకి నోచుకోవు. ఇంకొకరైతే మౌనంగా ఊరుకునేవారేమో! క్వీన్ ఈ అన్యాయాన్ని సహించలేక వారంట్ ఉందా అని అడుగుతుంది. దాంతో పోలీసుకి అసహనం పెరుగుతుంది. స్లిమ్ తొందరపెట్టడంతో అతని అహం దెబ్బ తింటుంది. తుపాకీ గురిపెడతాడు. ఇది అధికారమదం. ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి కనుకనే మొబైల్ ఫోన్లో జరిగేదంతా రికార్డు చేయవచ్చని కొత్త చట్టం చేశారు. క్వీన్ మొబైల్ ఫోన్ తీయబోతే తుపాకీ తీస్తుందేమోనని ఆమె కాలిపై కాలుస్తాడు. తుపాకీ సంస్కృతి పెరిగిన తర్వాత ఎవరి జేబులో ఏముందో అని అందరూ అనుమానపడే పరిస్థితి వచ్చింది. ఇదేనా అభివృద్ధి?

ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుందో క్వీన్‌కి బాగా తెలుసు. పోలీసులకి చిక్కితే తమలో ఒకడిని చంపినందుకు ఎన్కౌంటర్ చేసినా చేస్తారని ఆమెకి తెలుసు. తాము నల్లజాతి వారు కనుక కఠినంగా వ్యవహరిస్తారు. అందుకని పారిపోదామంటుంది. స్లిమ్ మొదట ఒప్పుకోడు. తన వాళ్ళకి ఫోన్ చేస్తానంటాడు. ఫోన్ చేస్తే తమ జాడ తెలిసిపోతుందని ఆమె అంటుంది. పట్టుబడితే తన వాళ్ళని ఇంకెప్పటికీ కలుసుకోలేడని అంటుంది. తన మావయ్య ఉండే ఊరికి వెళదామని అంటుంది. అక్కడ కొన్నాళ్ళు ఉండి తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చని అంటుంది. ఆమెకి అయిన గాయం చిన్నదే కావటంతో ఆసుపత్రికి వెళ్ళే అవసరం లేదని అంటుంది. తమ మొబైల్ ఫోన్లు పారేసి బయల్దేరుతారు. లాయరైన ఆమే పారిపోదామందంటే ఆమెకి కూడా న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం లేదని అర్థమౌతుంది. ఒక పోలీసు హత్య జరిగింది కాబట్టి అది ఆత్మరక్షణ కోసమే అయినా వారిని విడిచిపెట్టరని ఆమెకి తెలుసు.

తమ ఉనికి బయటపడకుండా ఉండే ప్రయత్నంలో అనుకోకుండా వచ్చిన అవకాశంతో తమ కారు విడిచిపెట్టి వేరే కారులో ప్రయాణం సాగిస్తారు. పోలీసు కారులో డాష్ బోర్డ్ మీద ఉండే కెమెరాలో రికార్డు అయిన వీడియో యూట్యూబ్ లో వైరల్ అయిందని తెలుస్తుంది. అందులో పోలీసు క్వీన్ ని కాల్చటం, ఆ తర్వాతి పెనుగులాట, స్లిమ్ పోలీసుని కాల్చటం రికార్డయి ఉంటాయి. దారిలో తారసపడ్డ ఒక నల్లజాతి వ్యక్తి ఆ వీడియో చూసి వీరిని గుర్తు పట్టి “బాగా చేశారు” అంటాడు. “మీరేదైనా దళంతో ఉన్నారా?” అని అడుగుతాడు. తర్వాత ఇంకో నల్లజాతి వ్యక్తి “మీరు చేసింది తప్పు” అంటాడు. సాధారణ వ్యక్తులు అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వారిని చూస్తారు. స్లిమ్ సున్నితమైన మనస్తత్వం కలవాడు కావటంతో క్వీన్‌తో “నీకిదంతా థ్రిల్‌గా ఉంది కదా” అంటాడు. ఆమె కావాలని ఏమీ చేయట్లేదు. వేరే దారి లేక చేస్తోంది. వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే ఇలాంటి వారు పుట్టుకొస్తారు. జాత్యహంకారానికి మొదటి కారణం తలిదండ్రులే. పిల్లలకి నూరిపోస్తే వాళ్ళు పెరిగి వివక్షని పెంచి పోషిస్తారు. రెండో కారణం ప్రభుత్వాలు. సరైన అవకాశాలు కల్పించకపోతే కొంతమంది నేరస్థులౌతారు. “వీళ్ళందరూ ఇంతే” అనే భావం పెరుగుతుంది. మూడో కారణం నేరాలకు ప్రేరేపించే మాఫియా. ఇదో విషవలయం.

కేవలం సామాజిక సమస్యలే కాక క్వీన్, స్లిమ్‌ల కుటుంబ విషయాలు కూడా స్పృశించారు రచయిత్రి, దర్శకురాలు. స్లిమ్ ఫోన్ చేస్తే అతని తండ్రి “నువ్వు ఇందులో ఎలా ఇరుక్కున్నావు?” అని అడుగుతాడు. చాకచక్యంగా పోలీసులకి సమాచారం అందకుండా చేస్తాడు. క్వీన్ చనిపోయిన తన తల్లి సమాధిని చూడాలంటే ఇద్దరూ అక్కడికి వెళతారు. తన కుటుంబం గురించి అతనికి చెబుతుంది ఆమె. పైకి గంభీరంగా ఉండే ఆమెలో ఎంత మానవత్వముందో ఈ సన్నివేశంలో తెలుస్తుంది. ఇద్దరు మంచి మనుషుల జీవితాలు ఒక్క సంఘటన వల్ల మారిపోయాయి. తనకు దేవుడంటే నమ్మకం లేదని చెప్పిన క్వీన్ ఒక సందర్భంలో దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది. “నా ఊపిరి, నేటి ఆహారం, పడుకోవటానికి చోటు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ ప్రయాణం ఎలా ముగిసినా కృతజ్ఞతలు” అంటుంది. ఆధ్యాత్మిక చింతనే చివరికి మనిషికి శాంతినిస్తుంది. అందుకే దేవుడి మీద విశ్వాసమున్న స్లిమ్ మొదటి నుంచి కాస్త కుదురుగా ఉంటాడు. ప్రయాణంలోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. సామాజిక సమస్యల నేపథ్యంలోనే ప్రేమకథను నడిపించటం స్క్రీన్ ప్లే రచయిత్రి లీనా వైత్ ప్రతిభకి నిదర్శనం.

ఇది దర్శకురాలు మెలినా మట్సూకాస్ మొదటి చిత్రమంటే నమ్మశక్యం కాదు. ఎక్కడా బోరు కొట్టకుండా కథ నడిపించటంలో స్కీన్ ప్లే వ్రాసిన లీనా వైత్, ఎడిటింగ్ చేసిన పీట్ బోడ్రో నేర్పు కనిపిస్తుంది. కాసేపు డాన్స్ చేద్దామని స్లిమ్ క్వీన్‌ని ఒక డాన్స్ క్లబ్‌కి తీసుకువెళ్ళిన సన్నివేశం కూడా ఆసక్తికరంగా నడుస్తుంది. అప్పటికే ఇద్దరి పేర్లు దేశమంతా మారుమోగి పోతుంటాయి. ఇద్దరూ తమను తేలికగా గుర్తుపట్టకుండా జుట్టు బాగా కురచగా కత్తిరించుకుని ఉంటారు. అయినా డ్రింక్స్ అందించే ఆమె స్లిమ్‌ని గుర్తుపడుతుంది. “నీకేం భయం లేదు” అంటుంది. క్వీన్ వెంటనే వెళ్ళిపోదామంటుంది. స్లిమ్ మాత్రం “ఏం పర్వాలేదు” అని కాసేపు ఆమెతో డాన్స్ చేస్తాడు. జరిగేది జరగక మానదు అనే అతని తత్త్వం ఆమె మనసుకి హత్తుకుంటుంది.

క్వీన్‌గా జోడీ టర్నర్-స్మిత్, స్లిమ్‌గా డానియెల్ కలూయా నటించారు. పాత్రల స్వభావాలని బాగా ఆకళింపు చేసుకుని నటించారు. డానియెల్ కలూయా అంతకు ముందు ‘గెట్ ఔట్’ చిత్రంలో నటించి ఆస్కార్ నామినేషన్ అందుకున్నాడు. ఇది హారర్ చిత్రమే అయినా డానియెల్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 2020లో విడుదలైన ‘జూడాస్ అండ్ ద బ్లాక్ మెసైయా’ చిత్రానికి డానియెల్ ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అందుకున్నాడు. ఈ చిత్రం కూడా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

ఈ కింద ‘క్వీన్ & స్లిమ్’ లోని కథ మరి కొంత ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. కథ ఇంకొంచెం కూడా తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు.

క్వీన్ మావయ్య ఎర్ల్ ఒక వ్యభిచారగృహం నడుపుతూ ఉంటాడు. గతి లేక స్లిమ్‌ని తీసుకుని అతని దగ్గరకు వెళుతుంది క్వీన్. తనకు కొంత డబ్బు, కారు కావాలని అడుగుతుంది. అతను ముందు నిరాకరిస్తాడు. “నువ్వు నాకు ఋణపడి ఉన్నావు” అంటుంది క్వీన్. అతను మెత్తబడతాడు. డబ్బు, కారు ఇచ్చి పంపిస్తాడు. తర్వాత తన తల్లి సమాధికి వెళ్ళి వచ్చాక అసలు సంగతి చెబుతుంది క్వీన్. తన అమ్మమ్మ ఒక ఇంటిని తన తల్లికి, మావయ్యకు ఆస్తిగా ఇచ్చిందని చెబుతుంది. ఆమె తల్లి ఆ ఇంటిని అమ్మేద్దామంటే మావయ్య ఆ ఇంటిలో ఉంటానని అంటాడు. ఇద్దరికీ గొడవ జరిగి మావయ్య తల్లిని తోయడంతో ఆమె మెట్ల పైనుంచి పడి చనిపోతుంది. అప్పుడే కొత్తగా లాయరైన క్వీన్ మావయ్య తరఫున వాదించి అతనికి శిక్ష పడకుండా చేస్తుంది. “అతని మీద కోపం రాలేదా” అని స్లిమ్ అంటే “అది ప్రమాదవశాత్తు జరిగింది కదా” అంటుంది. అలా ఎంతమంది ఆలోచిస్తారు? ఆమె మానవత్వం స్లిమ్‌ని అకట్టుకుంటుంది.

పైకి దృఢంగా కనిపించేవారి జీవితాలలో విషాదాలు ఉంటాయి. ఇది క్వీన్‌కే కాదు, ఆమె మావయ్యకి కూడా వర్తిస్తుంది. ఎవరినీ తొందరపడి అంచనా వేయకూడదు. తన మావయ్య ఇరాక్ యుద్ధంలో పోరాడి వచ్చాడని, ఆ మానసిక గాయాలు అతన్ని ఇంకా బాధిస్తున్నాయని అంటుంది. ఎవరూ పూర్తిగా చెడ్డవారుండరు. బుద్ధిః కర్మానుసారిణీ అనేది నిజం. అయితే చేసిన తప్పులకి ఫలితం అనుభవించకతప్పదు. అంతరాత్మ ప్రబోధాన్ని మార్గదర్శిగా చేసుకుంటే జీవితం సఫలమౌతుంది. కాదని భోగలాలసలో పడితే అధోగతి తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here