యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 68 – 74 బూరగమంద, దేవళం పేట, జాండ్రపేట, కైలాస కోన, సింగిరికోన, కోసువారి పల్లె

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పలు ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

68 బూరగమంద – శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం

[dropcap]స[/dropcap]దం నుండి 4 కి.మీ.ల దూరంలో వున్న ఈ గ్రామం పూర్వం బూరగ మహా వృక్షాల మధ్య వుండటంచే బూరగమంద అనే పేరు వచ్చింది. ఇక్కడ అర్చక స్వామి పంపించిన ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఆలయం నిర్మించి 300 సంవత్సరాలు దాటిందనీ, దానికి సంబంధించిన ఒక విశేషం పూర్వీకులు చెప్పేవారనీ తెలియజేశారు. దాని ప్రకారం, అప్పట్లో పుంగనూరు జమీందార్లు ప్రస్తుతం వున్న ఆలయానికి 1 కి.మీ. దూరంలో ఆలయం నిర్మించాలని వెంకటేశ్వరస్వామి శ్రీదేవి, భూదేవి, ఆంజనేయస్వామి, విష్వక్సేనులవారి విగ్రహాలు తయారు చేయించి ఆ విగ్రహాలను బూరగమంద గ్రామంలో గ్రామోత్సవంగా ఊరేగిస్తూ తీసుకు వెళ్తున్నారుట. స్వామివారి రథం ప్రస్తుతం ఆలయం వున్న ప్రదేశంలో నిలిచిపోయింది. గ్రామస్థులు ఎంత ప్రయత్నించినప్పటికీ రథం కదలలేదు. అప్పుడు విగ్రహాలను కిందకి దించగా రథం వెంటనే కదిలింది. అప్పుడు జమీందార్లు, గ్రామస్తులు ఇక్కడే ఆలయం నిర్మించాలని, ఇది స్వామివారి అభీష్టమనుకుని ఇక్కడ ఆలయం నిర్మించారు.

అప్పటినుంచీ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు సాగుతున్నాయి. ప్రతి శుక్రవారం అభిషేకము, వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజున స్వామికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం రోజు విశేషంగా ఆలయం గోపురం ముందున్న దీప స్తంభంపై దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపం ఆ రోజు రాత్రంతా వెలిగితే ఆ సంవత్సరం వర్షాలు సమృధ్ధిగా పడతాయని, పాడి పంటలు సమృధ్ధిగా వుంటాయని గ్రామస్థుల నమ్మకం.

ఆలయం ముఖ మండపం స్తంభాలపై కొంత శిల్ప కళ కనబడుతంది. గర్భగుడిలో తిరుమలేశుని పోలిన మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 20-5-2013న ఈ పురాతన ఆలయాన్ని జీర్ణోధ్ధరణ గావించి పునః ప్రతిష్ఠ, కుంభాభిషేకం చేశారు.

ఆలయంలోని ఉత్సవ మూర్తులు రెండుమార్లు దొంగల పాలుకాగా కొత్తవి తయారు చేయించారు. మొదటి ప్ర్రాచీన విగ్రహాలు 75 కిలోలు వుండగా రెండవసారి 50 కిలోలు మూడవసారి మరీ చిన్నవై పోయాయి.

ఆలయంలో నిత్య పూజలు, విశేష పూజలు, వార్షిక పూజలేగాక ప్రతి వారం భజనలు కూడా జరుగుతాయి.

ఒకప్పుడు సమీప గ్రామాలకి ముఖ్య కేంద్రంగా వున్న ఈ ఊరిలో ఇంకా ప్రాచీన ఆలయాలు వున్నాయిట.

సాయంత్రం 4-45కి బయల్దేరి దేవళంపేట వెళ్ళాము.

69. దేవళం పేట – లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

ఇది పులిచెర్ల మండలంలోని ఊరు. 500 సంవత్సరాల క్రితం అహోబిల రాజులు కట్టించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వున్నది ఇక్కడ. ఇక్కడ అర్చక స్వామి శ్రీ అనంత కుమారాచార్యులు. ఈ ఆలయ చరిత్ర శ్రీ అనంత కుమారాచార్యులుగారు చెప్పిన దాని ప్రకారం..

పూర్వం ఇక్కడివారు లక్ష్మీ నరసింహస్వామిని సేవించాలంటే కదిరి వెళ్ళి అక్కడ స్వామిని అర్చించి వచ్చేవారు. ఈ ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం లేదు. ఇక్కడి వారందరూ అంత దూరం రాలేమని వేడుకుంటే ఇక్కడి పాలెగాళ్ళ కలలో కనిపించి ఫలానా చోట తానున్నానని చెబితే, ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయ నిర్మాణం గావించారు. అప్పుడు విగ్రహాలు సాలిగ్రామ రూపంలో వుండేవి.

అహోబిల రాజులలో ఒక రాజు వేటకి వెళ్ళి జంతువు అలికిడి విని బాణం వేయగా అది గోవుకి తగిలి గోవు చనిపోయింది. ఆ గో హత్యా పాపం నివారణకు ఆయన 108 వైష్ణవాలయాలు, ఈశాన్య మూలలో శివాలయం వుండేటట్లు కట్టించారు. ఇది 108వది.

తర్వాత కాలంలో శిధిలావస్థలో వున్న ఆలయాన్ని న్యూట్రిన్ ఫేక్టరీ అధినేత శ్రీ బీ.వీ. రెడ్డిగారు 2005లో పునర్నిర్మించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ (చిన్న జియర్ స్వామి) వారిచే 17-2-2005 న కుంభాభిషేకము పాంచరాత్రాగమం ప్రకారం జరుపబడినది.

శ్రీశ్రీశ్రీ చిన్న జియర్ స్వామే విగ్రహాలు వుంటే బాగుంటుందని ఈ విగ్రహాలు చేయించి ప్రతిష్ఠ చేయించారు. అంతకు ముందున్నవి భిన్నమయితే సముద్రంలో నిమజ్జనం చేశారుట.

ఆలయం చుట్టూ ప్రహరీ, లోపల ఖాళీ ప్రదేశం చక్కగా నిర్వహించబడుతున్నాయి. స్వామి వివిధ పుష్ప హారాలతో కళకళలాడుతున్నాడు.

ఇక్కడ వైశాఖ మాసంలో స్వామి కళ్యాణం, హోమం, ఇంగా ప్రతిష్ఠాపన దినోత్సవం, రథ సప్తమినాడు ఏడు వాహనాల మీద స్వామి ఊరేగింపు వైభవంగా జరుగుతాయి.

ఈ ఆలయం ప్రస్తుతం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటువారి ఆధీనంలో వున్నది.

శ్రీ అనంత కమారాచార్యులు సెల్ నెంబరు 9701423925.

స్వామి దర్శనమయ్యాక శ్రీ ఆచార్యులుగారు దగ్గరలోనే వున్న వారింటికి తీసుకువెళ్ళి కాఫీలిప్పించారు. వారి శ్రీమతి పసుపు కుంకుమలిచ్చి సాగనంపారు. ఆచార్యులుగారు మాతో మా తర్వాత మజిలీ జాండ్రపేట దాకా వచ్చారు. వీరు చూపిన ఆదరానికి కృతజ్ఞతా పూర్వక నెనరులు.

70. జాండ్రపేట, మల్లేశ్వరస్వామి ఆలయం

ఇక్కడ శ్రీ త్రిపుర సుందరీ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం వున్నది. ఇది కూడా పురాతన ఆలయమే. శిధిలావస్థలో వున్న ఆలయాన్ని న్యూట్రిన్ అధినేత శ్రీ బి.వి. రెడ్డిగారు పునర్నిర్మించారు. 6-3-2016న పునర్నిర్మింపబడ్డ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. పునర్నిర్మించేటప్పుడు కంచి స్వామి ఇక్కడ మల్లేశ్వరస్వామి స్వంయంభూ అనీ, 500 సంవత్సరాల క్రితం చోళరాజులు కట్టించిన దేవాలయమిది అనీ చెప్పారుట. కంచి స్వామిని పల్లకీలో తీసుకు వచ్చారుట. అప్పుడు ఆలయం శిధిలావస్థలో వున్నదిట.

నిత్య పూజలేగాక సోమవారాలు, కార్తీక మాసం, శివరాత్రి ఇంకా ఇతర పర్వదినాలలో విశేష కార్యక్రమాలు వుంటాయి.

ఇక్కడ అర్చక స్వామి శ్రీ హెచ్.ఎన్. రాజశేఖర్ దీక్షితులు సెల్ నెంబరు 9676557145.

మేము వెళ్ళే సమయానికి ఆయన వేరే కార్యక్రమంలో వుండటంవల్ల వారి కుమారుడు శ్రీ మల్లేష్ పూజ చేశాడు. అతను 10వ తరగతి చదువుతున్నాడు. స్కూలు అయ్యాక, అంత శ్రధ్ధగా పూజ చెయ్యటం చూసి ముచ్చట వేసింది.

అప్పటికే సమయం సాయంత్రం 6-50 అయింది. ఇంక ఈ రోజుకి యాత్ర ముగించి చిత్తూరులోని బసకి బయల్దేరాము.

71. కైలాస కోన – శ్రీ కామాక్షి అంబికా సమేత కైలాసనాధేశ్వరస్వామి ఆలయం

ఇవాళ మా యాత్రలో ఆఖరి రోజు. ఉదయం 7-45కే బయల్దేరి ముందు టి.పుత్తూరు కోదండ రామాలయానికి వెళ్ళాము. ఇంతకు ముందీ ఆలయం గురించి వివరిస్తూ మూడు కొబ్బరి చెట్ల గురించి చెప్పాను కదా. వాటిలో ఒకటి పడిపోతే వేరేదానిని పెట్టారుట. ఎదురుగా కొంతమంది యోగా చేస్తున్నారు. వాళ్ళొచ్చి ఆత్మీయంగా పలకరించారు. స్వామి దర్శనం తర్వాత అక్కడనుండి బయల్దేరి, విష్ణుభవన్‌లో టిఫెన్ తిని కైలాసకోన బయల్దేరాము.

ఈ అద్బుతమైన కోన పుత్తూరునుంచి చెన్నై వెళ్ళే మార్గంలో పుత్తూరుకు 12 కి.మీ.ల దూరంలో వున్నది. దీనిని కాకముక పర్వతం అంటారు. ఇక్కడ 100 అడుగుల పైన ఎత్తునుంచి దూకే జలపాతం, పక్కనే గుహలో శివలింగం, కామాక్షి అమ్మవారు. ప్రతిష్టించినదెవరో తెలుసా!? అక్కడ క్షేత్రంవాళ్ళు పెట్టిన బోర్డు ప్రకారం స్వయంగా శివుడు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి, పద్మావతి కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించారుట. వెంటనే దర్శించాలని వుంది కదూ. ఆగండాగండి. ముంది క్షేత్రం గురించి పూర్తి సమాచారం తెలుసుకుని వెళ్ళండి.

కొండపైకి వెళ్ళటానికి మెట్లు వున్నాయి. చిన్నగా వుంటాయి. అరవయ్యే. తేలికగా ఎక్కవచ్చు. దోవ పొడుగూతా చెట్లు, అందమైన వాతావరణం. నెమ్మదిగా ఆ వాతావరణాన్ని అనుభవిస్తూ ఎక్కవచ్చు (కొత్తగా వుందా మాట? వెళ్తే మీకే తెలుస్తుంది. ముఖ్యంగా పట్టణాలనుంచి వెళ్ళేవాళ్ళకి). మెట్ల చివరికి వెళ్తే పైనుంచి దూకే జలపాతం. దానికింద చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఇంక ఆగగలమా? దానికిందకి పరిగెత్తటమే తరువాయి. ఆ పని చెయ్యకుండా చాలా నిగ్రహించుకున్నాములెండి. సమయం లేదాయె. మీరు మాత్రం సమయం వుండేటట్లు వెళ్ళిరండి.

ఆ జలపాతాన్ని చూస్తూనే పక్కనే వున్న విశాలమైన గుహాలయానికి వెళ్ళాము. అక్కడ శివుడు పూజలందుకుంటున్నాడు. అన్నట్లు మీకు స్ధల పురాణం చెప్పలేదు కదూ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి, పద్మావతి వివాహానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. వీరి వివాహానికి వచ్చిన పార్వతీ పరమేశ్వరులకు ఈ కాకముక పర్వతం విడిదిగా ఇచ్చారు. అప్పుడు ఇక్కడ వున్న బిల్వవనం, జలపాతం.. ఈ ప్రాంతాల అందాన్ని చూసిన పరమశివుడు కైలాసాన్ని మరిపించేలా వున్నదని సంతోషించాడుట. తన తపోనిష్ఠకై పరమేశ్వరుడు తానే స్వయంగా ఇక్కడ లింగం ప్రతిష్ఠించాడుట. వెంకటేశ్వరస్వామి వివాహానికి వచ్చిన అగస్త్య మహాముని కూడా ఈ సంగతి తెలుసుకుని ఇక్కడకి వచ్చి జలపాతంలో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామి, పద్మావతి కూడా ఇక్కడికి వచ్చి, శివుడు ఒక్కడే వుండకూడదని అగస్త్యముని ఆధ్వర్యంలో స్వయంగా కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠించారుట. ఇది వెంకటేశ్వరస్వామి మహత్యంలో వున్నదిట. శ్రీకృష్ణదేవరాయల ఆస్ధానంలో వున్న అష్టదిగ్గజాలలో ధూర్జటి మహాకవి 108 శైవ క్షేత్రాల మహత్యం స్ధల పురాణం రచించారుట. అందులో కైలాసకోన స్ధల పురాణం వుంది. ఇది శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో వుంది.

మెట్లు ఎక్కుతుండగా దోవలో నాగాలమ్మ గుడి. అందులో నాగేంద్రుడి పుట్ట ఆకారంలో నిలువుగా పుట్ట, పక్కన పడగ విప్పిన నాగేంద్రుని పెద్ద విగ్రహం.

మేము వెళ్ళింది సెలవు రోజుకాకపోయినా జనం చాలామంది వున్నారు. ఎక్కువ సేపు గడపలేకపోయామే అనుకుంటూ కిందకి వచ్చేసరికి 12-40 అయింది. సమయం అవుతోంది కదా. కొండ కింద చక్రాలు, ముంతకింద పప్పు కొనుక్కుని తింటూ ఈ ప్రయాణంలో ఆఖరి మజిలీ, సింగిరికోనకి బయల్దేరాము.

ఆలయ దర్శన సమయాలు ఉదయం 6-30నుంచి సాయంత్రం 5 గంటలదాకా మాత్రమే.

72. సింగిరికోన- శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

ఈ ఆలయం కూడా జనారణ్యం లేని వనారణ్యంలో వున్నది… నాగిలేరు గ్రామం, నారాయణవనం మండలం… ఆలయంలో తప్ప చుట్టుపక్కల జన సంచారం లేదు. అందమైన అడవులు, కొండలు, ఆహ్లాదకరమైన గాలి, పొల్యూషన్ లేని పరిసరాలు, మనలాంటి వాళ్ళకి అద్భుతంగానే వుంటాయి కదా.

నరసింహస్వామి అంటే, ఈయన ఆలయాలు సాధారణంగా కొండలలో, కోనలలో వుంటాయి. నర మరియు సింహ స్వరూపం కదండీ. ఈయన రూపాలు అనేక ఆలయాలలో అనేక విధాలుగా, అంటే, నవ నారసింహులు (అహోబిలం), జలా నరసింహస్వామి (బీదర్, కర్ణాటక), పాదాన్ని మోపిన నరసింహస్వామి (పెన్నహోబిలం, అనంతపురం జిల్లా), వారానికి ఒక రోజే దర్శనమిచ్చే నరసింహస్వామి (మాల్యాద్రి, ప్రకాశం జిల్లా), రుబ్బుడు పత్రం (రాయి) లా వున్న నరసేంహస్వామి (సింగోటం, మహబూబ్ నగర్ జిల్లా), వరాహ నరసింహస్వామి (సింహాచలం) , ఇంకా, ఎన్నో రూపాలలో మీరు చూసి వుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషంతో వుంటారు.

చిత్తూరు జిల్లాలో మేము దర్శించిన ఈ నరసింహస్వామి ఆలయంలో కొన్ని విశేషాలు కనిపించాయి. వాటిని తెలియజేస్తాను. ఈ ఆలయానికి మేము అడవుల్లో, మట్టి రోడ్డులో దోవ వెతుక్కుంటూ వెళ్ళాము. ఇంత కష్టపడి ఈ ఆలయానికి రావటం చాలా కష్టమనిపించింది. కానీ సరైన దోవలో వెళ్తే అంత కష్టం కాదని దోవ చెప్పారు. చివర ఇస్తున్నాను.

ఇంక విశేషాలు. ఆలయం చిన్న కొండ మీద వున్నది. ఆలయం చిన్నదే. చుట్టూ చాలా ప్రదేశం వున్నది. పైదాకా వాహనాలు వెళ్తాయి. లేకపోయినా తేలికగా ఎక్కవచ్చు. కింద ఎడమ ప్రక్క చిన్న జలపాతం.. ఆ నీళ్ళన్నీ కింద కోనేరులో పడుతున్నాయి. ఈ జలపాతం నుంచే పైపుల ద్వారా పై ఆలయానికి, మిగతా అవసరాలకు నీటి సరఫరా చేస్తున్నారని చెప్పారు. నీళ్ళు బాగున్నాయి. కుడి వైపు చిన్న ఆలయం.

అతి పురాతనమైన ఆలయం. ఛైర్మన్ శ్రీ గుణవంతరావు, వారి పుత్రులు భాస్కర్ బాబు, గిరిబాబు గారు ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. వీరి కులదైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆలనా పాలనా లేని ఈ ఆలయానికి 25 సంవత్సరాల పైనుంచి వీరే సేవకులయ్యారు. వీరి ముగ్గురిలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఆలయంలో వుంటారుట. మేము వెళ్ళినప్పుడు శ్రీ భాస్కర్ బాబుగారు వున్నారు. ఆలయ నిర్వహణ చాలా బాగుందనిపించింది. ఇంకా ఎంతో అభివృధ్ధి చెయ్యాలనే తాపత్రయం భాస్కర్ గారి మాటల్లో కనబడింది. మేము వెళ్ళేసరికి కొందరు భక్తులు కూడా చిన్న పిల్లలతో సహా వున్నారు. మేము వచ్చిన త్రోవ గుర్తొచ్చి నాకు ఆశ్చర్యం వేసింది. ఈ అడవుల్లో చిన్న పిల్లలతో ఎలా వచ్చారని.

స్ధల పురాణం ఎవరికీ సరిగా తెలియదు. తంజావూరు గ్రంథాలయంలో వున్నదని తెలిసి దానిని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. స్వామి స్వయంభూ అంటారు. ఆరు అడుగుల ఎత్తులో నల్లరాతి విగ్రహాలు. స్వామి, ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి. ఇక్కడ మొదటి విశేషం ఇది. నరసింహస్వామికి ఇరువురు దేవేరులు శ్రీదేవి, భూదేవి. మాటల్లో చెప్పలేనంత అందం. అలా చూస్తూ నుంచుండి పోయాను. ఇంత మారుమూల, కొండమీద అంతంత విగ్రహాలు అశ్చర్యం వేసింది.

ఇంకో విశేషమేమిటంటే స్వామి నోరు తెరుచుకున్నట్లు వుంటుంది. దానికి వారూ ఇదమిత్థంగా చెప్పలేని కథ ఒకటి చెప్పారు. స్వామి వేటకు వచ్చి కొంచెం సేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారుట. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిందిట. అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అలాగే శిలలా అయ్యారుట. అంతేకాదు ఇంకొక కథ కూడా వుంది. నారాయణవనంలో వెంకటేశ్వరస్వామి పద్మావతిని చూస్తారు. ఆమె చెలికత్తెలు స్వామిని అదిలిస్తారు. ఒక ఏనుగు కూడా వెంటబడుతుంది. అప్పుడు ఇక్కడికొచ్చి, స్నానం చేసి ఈ స్వామిని దర్శించారని. ఏది ఎలా వున్నా అంత ఎత్తు విగ్రహాలు, అంత అందమైనవి, అంత మారుమూల అడవిలో దర్శించటం ఒక అద్భుతమే.

రోజూ ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం, గోపూజ వగైరాలు వుంటాయి. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు విశేష తిరుమంజనం, సుదర్శన నారసింహ మహా యాగం శాస్త్ర ప్రకారం జరుపబడతాయి. 2022 సంవత్సరానికి ఏ నెలలో స్వాతి నక్షత్రం వస్తుందో బోర్డు పెట్టారు. ఈ యాగం ఉదయం 8గంటలకి ప్రారంభం అవుతుంది. అంత పొద్దున్నే అక్కడికి చేరటం కష్టమనుకుంటే ముందు రోజే వెళ్ళి వుండవచ్చు. వసతి, భోజన సౌకర్యాలు ఆలయంవారు అక్కడే ఏర్పాటు చేస్తారు. కాటేజ్‌లు కట్టిస్తున్నారు.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే పూజా విధానం, పూజారిగారు. ఉదయం మంత్ర సహిత కార్యక్రమాలతో ప్రారంభం అయినా, తర్వాత అర్చనలు, స్వామికి పాట రూపంలో జరుగుతాయి. అర్చక స్వామి పూజ చేయించుకునే భక్తులను కూర్చోబెట్టి చక్కగా పాట రూపంలో స్వామికి విన్నవిస్తారు. భక్తులు ఎక్కడెక్కడినుంచో, ఎన్నో ప్రయాసలు పడి నీ దర్శనానికి వచ్చారు. వారి ఇబ్బందులు తొలగించి, సంతోషంగా వుండేటట్లు చెయ్యవయ్యా. ఎన్నో అవతారాలెత్తి (దశావతారాలు పాటలో వచ్చాయి) ఎంత మందినో కాపాడిన వాడివి నువ్వు అంటూ. ఈ పాటలు అర్చక స్వామి రాసుకుని, బాణీ కట్టి పాడేవి. ఈ పూజలలో ఎవరివీ గోత్ర నామాలు చెప్పరు. మనం చెప్పకపోతే స్వామికి తెలియదా అంటారు. స్వాతి నక్షత్రం రోజున జరిగే యాగానికి గోత్ర నామాలు చెప్తారనుకుంటా. ముందుగా నమోదు చేయించుకోమని బోర్డు పెట్టారు.

అర్చకస్వామి శ్రీ హరిబాబు. ఈయన గురించి ఇంకో విశేషం. ఈయనకి చేతులకి బ్రేస్ లెట్ లాగా, కట్టెవంకీలలాగా చాలా వెండి ఆభరణాలు వున్నాయి. మెడలో పెద్ద వెండి గొలుసు కూడా. అవ్వన్నీ భక్తులు తమ కోరికలు తీరిన సందర్భంలో ఇచ్చారుట. నాకో అనుమానం. కోరికలు తీర్చింది స్వామి కదా మరి ఏవైనా కానుకలిస్తే స్వామికి ఇవ్వాలిగానీ, అర్చక స్వామికెందుకు అని. దానికి వారు చెప్పిన సమాధానం మనం ఎంతో దూరాలనుంచీ స్వామి దర్శనానికి వచ్చామని ఆయనకి విన్నవించేది అర్చక స్వామేకదా. మీరింత చక్కగా విన్నవించారు గనుకే స్వామి మా కోరిక తీర్చాడని స్వామితోబాటు అర్చక స్వామికి కూడా కానుకలు. అది వింటే అనిపించింది. స్వామిని నమ్మిన భక్తులు చాలా ఎక్కువనీ, అర్చక స్వామి హృదయపూర్వకంగా మనల్ని దయ చూడమని స్వామిని వేడుకుంటారనీ.

కిందటి రోజు స్వామికి వేసిన పూల మాలలు నాకు, మాలా కుమార్‌కి వేశారు. ఎంత పెద్దవో. మర్నాటికి కూడా వాడి పోకుండా ఎంత తాజాగా ఎంత సువాసనలు వెదజల్లుతున్నాయో. ఏ జన్మలో మేము చేసుకున్న అదృష్టమో స్వామి ధరించిన మాల మమ్మల్ని తాకిందని పరవశించాము. అంతేకాదు. స్వామి చిత్రపటం కూడా నాకు బహుమతి.

గోశాల వున్నది. ప్రస్తుతం దానిలో 80 ఆవులున్నాయి.

ఇక్కడ ఏమీ దొరకవు. దూరాలనుంచి వచ్చే భక్తులకోసం ఆలయం వారే మూడు పూటలా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. రుచికరమైన ఆ భోజనాన్ని స్వామి ప్రసాదంగా భావించి స్వీకరించాము.

మార్గం

తిరుపతి నుంచి పుత్తూరు, నారాయణవనం, మీదుగా నాగిలేరు వెళ్ళే బస్‌లో వెళ్ళాలి నాగిలేరు దాకా. అక్కడనుండి ఆటోలలో వెళ్ళి రావచ్చు. అయితే ఆటోలు రానూ పోనూ మాట్లాడుకోవాలి.

ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో గడపాలన్నా, సుందరమైన విహార యాత్రకు వెళ్ళాలన్నా ఇది చక్కని ప్రదేశం. ఇలాంటి ఆలయాలను అభివృధ్ధి పరచటం మన కర్తవ్యం. అవకాశం వున్నవాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్రదేశం. ముందు ఆలయ పరిసర ప్రాంతాలవారు బయల్దేరండి.

శ్రీ భాస్కర బాబు సెల్ 7207577287

మధ్యాహ్నం 2-45 కి అక్కడనుండి బయల్దేరాము. సాయంత్రం 5 గంటలకి మా రైలు. సరిగ్గా 5 గంటలకి స్టేషన్‌కి వచ్చాము. దోవలో రూమ్ ఖాళీ చెయ్యటానికి కూడా దిగే సమయం లేదు. మా మిత్రులే వెళ్ళి సిధ్ధంగా వున్న సామాను తీసుకొచ్చేశారు. మా సంగతి తెలిసేనేమో రైలు కూడా మేము వెళ్ళాకే వచ్చింది. మొత్తానికి ఈ మారు యాత్ర కూడా అందరి సహకారంతో జయప్రదంగా పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము.

ఆగండాగండి. మేము వచ్చేశామని చిత్తూరు విశేషాలు అయిపోలేదు. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వారు కోసువారిపల్లి గ్రామంలో వున్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి చెప్పి, దానిని కూడా దర్శించి దాని గురించి కూడా రాయమని చరిత్ర పంపారు. అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ ఆలయం గురించి కూడా ఇస్తున్నాను.

73. కోసువారి పల్లె – శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం

ఈ ఆలయాన్ని మేము దర్శించలేక పోయామని చెప్పాను కదా. కానీ అర్చకులు శ్రీ పి. రాఘవేంద్ర మరియు శ్రీ టి. రమేష్ బాబు గారు ఈ పురాతన ఆలయం గురించి పంపిన వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాను.

ఇక్కడ వున్న ప్రసిధ్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి దేవాలయం వేంగీ చోళుల కాలంలో ప్రతిష్ఠ చేసినట్లు ప్రతీతి. ఈ దేవాలయాన్ని శాలివాహన శకం 14 – 62 వ సంవత్సరంలో శ్రీ అచ్యుత దేవరాయని కాలములో శ్రీ కంభం తిమ్మరాయుని వెంకటాద్రి నాయుడుగారు కట్టించారు. ఈ ఆలయంలో ధూప దీపనైవేద్యాలకి గాను గోడుగుబ్బ అను గ్రామాన్ని సర్వమానంగా ఇచ్చినట్లు శాసనం వున్నది. (శాసనము నెం. ఎసి నెం. 332 ఆఫ్ 1922).

తదుపరి శ్రీ వెంకటాద్రి నాయుడుగారి కుమారుడు వెంకటప్ప నాయుడుగారు కూడా ఈ దేవాలయానికి మాన్యాలు ఇచ్చారు. శాలివాహన శకం 1465 సంవత్సరంలో శ్రీ సదా శివరాయలు కూడా భూ దానం, సువర్ణ దానం ఇచ్చినట్లు ఈ దేవాలయ దక్షిణ దిక్కునగల గోడపై శాసనములు కానవచ్చుచున్నవి.

ఇక్కడ పూజా విధానం పాంచరాత్రాగమం ప్రకారం వుంటుంది.

శ్రీ అన్నమాచార్యులువారు ఈ స్వామిపై రచించిన కీర్తనలు తామ్ర శాసనం ప్రకారం 16వ సంపుటినందు 75 కీర్తనలు వున్నాయి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కల ఈ దేవాలయానికి ప్రస్తుతం 72 ఎకరాల భూమి వున్నది.

శిధిలమైన ఆలయ ప్రాకారం, గోపురాలు, కళ్యాణ మండపం శ్రీ ప్రభాకర రెడ్డి, మాజీ ఎమ్.ఎల్.ఏ. గారి సహకారంతో పునర్నిర్మింపబడ్డవి. ఇటీవల కాలంలో నూతన ధ్వజ స్తంభం కూడా ప్రతిష్ఠించబడినది.

2010వ సంవత్సరంలో ఎండౌమెంట్స్ వారినుండి తిరుమల తిరుపతి దేవస్ధానం వారు ఈ ఆలయ బాధ్యతలు స్వీకరించటం జరిగింది.

ఈ ఆలయంలో నిత్య, నైమిత్తిక కార్యక్రమములే కాక, ప్రతి ఏటా భాద్రపద మాసంలో పవిత్రోత్సవములు జరుగుతాయి. మాఘ మాసం, శ్రవణ నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆరవ రోజు రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. రధ సప్తమి పర్వదినమున రధోత్సవము మొదలగు కార్యక్రమములు జరుగును.

74. ముగింపు

ఇవ్వన్నీ చిత్తూరు జిల్లాలో మేము చూసిన ప్రదేశాలండీ. చూడని సుప్రసిధ్ధ క్షేత్రాలు ఇంకా వున్నాయి. అయితే అన్నింటికీ వెళ్ళటానికి అవకాశం, ఆర్ధిక వెసులుబాటు అన్నీ కావాలి కదండీ. అందుకని ప్రస్తుతం ఇక్కడితో ఆపుతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here