[dropcap]శ్రీ[/dropcap]కృష్ణ భగవానుడు భగవద్గీతలో ‘నా భక్తులు నన్నే విధముగా భావిస్తారో నేను అదే విధంగా వారికి దర్శనమిచ్చి వారి సకల కోరికలను తీరుస్తాన’ని ప్రవచించారు. కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృక్షం, సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయినాథులు తన భక్తులు తనను ఏ విధంగా భావించారో వారికి అదే రూపంలో దర్శనమిచ్చిన సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రలో అనేకం కనిపిస్తాయి. మారుతి, వెంకటేశ్వరుడు, దుర్గాదేవి, నరసింహ స్వామి, దత్తాత్రేయుడు ఇలా ఎందరో భక్తులు వారు భావించిన విధంగా దర్శనమిచ్చిన వైనం అద్వితీయం, అపూర్వం, అసామాన్యం అని చెప్పక తప్పదు. అట్లే కలియుగంలో ఈ భువిపై అవతరించిన శ్రీపాద శ్రీ వల్లభులు, నరసింహ సరస్వతి, రమణ మహర్షి, లాహిరి మహాశయులు ఇత్యాది సద్గురువులు తమ భక్తులకు ఇటువంటి మహత్తర అనుభవాలను ప్రసాదించారు. దీనినే శాస్త్రం యద్భావం తద్భవతి అని ప్రబోధిస్తోంది, అంటే భావం బట్టే ఫలితం.
మన మనసులో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో ఫలితాలు అదే విధంగా వుంటాయి అనడానికి ఉదాహరణ ఈ క్రింది కథ:
ఒక లోభి అయిన సన్యాసి తన గురువు వద్ద ఉపదేశం తీసుకొని భగవంతుని కోసం తీవ్రంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై తన మనస్సులో మూడు సార్లు ఏమైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని వరం ఇచ్చాడు.
వెంటనే ఆ సన్యాసి మహదానంద భరితుడై ఈ లోకంలోనే ఇప్పటి వరకు లేని విధంగా సకల సదుపాయాలు గల ఒక భవంతిని కావాలనుకున్నాడు. క్షణాలలో ఒక దివ్య భవంతి అక్కడ ప్రత్యక్షమయ్యింది. రెండు రోజులపాటు ఆ భవంతిలో సకల రాజ్య భోగాలు అనుభవించాక తనకు తోడుగా ఒక దేవ కన్య వుంటే ఈ సుఖాలను మరింత అద్భుతంగా, సంతృప్తికరంగా అనుభవించవచ్చునని కోరుకున్నాడు. వెంటనే జగదేక సుందరి అయిన ఒక దేవ కన్య ప్రత్యక్షమయ్యింది. ఆమె చూడగానే తన జన్మ ధన్యమయ్యిందని భావించి ఆమెతో శృంగార కార్యకలాపాలలో తేలిపోయాడు. రోజులు, వారాలు, నెలలుగా గడిచాయి. ఈ హడావిడిలో తనకు ఒకే కోరిక మాత్రం తీర్చుకోగలడన్న విషయం మరిచిపోయాడు ఆ సన్యాసి.
ఒక రోజు మధువు, మగువ మైకంలో వున్న అతడు “ఏ జన్మలోనో పుణ్యం చేసుకోబట్టి ఇంతటి అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నాను. ఒక వేళ పొరపాటునో గ్రహపాటునో ఈ సిరి సంపదలన్నీ మాయమైపోయి నేను ఇంతకు ముందు కంటే బికారిని అయిపోయి తిండి కూడా లేక కుక్క చావు చస్తేనో?” అని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఇచ్చిన వరం ఫలితంగా అతను అనుభవించే సిరి సంపదలు మొత్తం మాయమైపోయి ఒక్కసారిగా బికారి అయిపోయాడు. అంతే కాక తన ఆలోచన ఫలితంగా తిండికి కూడా గడవని పరిస్థితి వచ్చి నిజంగానే దుర్భరమైన మరణం పొందాడు.
అన్ని ఆలోచనలకూ మన మనస్సే కేంద్ర బిందువు. మంచి ఆలోచనలను మానవుల అభివృద్ధికి ప్రాణవాయువు వంటివి. అవి మనలను సన్మార్గంలో నడిపిస్తాయి. చెడ్డ ఆలోచనలు తులసివనంలో గంజాయి మొక్కల వంటివి. మానవాళిని అధః పాతాళానికి తొక్కివేస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక దేశాధినేతకు కలిగిన ఒక చెడ్డ ఆలోచన అణుబాంబును జపాన్ లోని హిరోషిమాపై వేసి లక్షలది మంది మరణానికి కారణమయ్యింది. అణుబాంబు లోని అదే ఇంధనాన్ని మానవాళికి ఉపయోగపడేలా చేయాలన్న అబ్దుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులకు కలిగిన ఒక మంచి ఆలోచనకు ప్రతిరూపం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. ఇక భవిష్యత్తులో మన దేశంలో ఇంధన కొరత వుండదని నిపుణులు భావిస్తున్నారు.
మనం ఈ సమాజానికి ఏది ఇస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది. ఇతరులకు దుఃఖం ఇస్తే దుఃఖం, ఆనందం ఇస్తే ఆనందం, సహాయం చేస్తే అదే సహాయం వెయ్యింతలై ఏదో ఒక రూపేణా మనకు లభిస్తుంది. మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాది. ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా’ అన్నది విజ్ఞుల ఉవాచ. మంచిని చేస్తే మనకు మంచే కలుగుతుంది. మంచిని చెయ్యాలంటే మంచి ఆలోచనల ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక మంచి ఆలోచన పరిధి ఎంతో గొప్పది. వైరస్ వలే త్వర త్వరగా ఇతరులకూ వ్యాపిస్తుంది. మంచి ఆలోచనలు తద్వారా మంచి పనుల వలన మనకు లభించే సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలను చూసి ఇతరులు కూడా స్ఫూర్తితో అటువంటి మంచి పనులను చేయడానికి ఉద్యుక్తులౌతారు. సత్కర్మల వలన విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. అప్పుడు ప్రపంచం ఒక నందనవనం అవుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు.
లోకాస్సమస్తా సుఖినోభవంతు.