వెలుగు నీడలు
[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిది గంటలు అయింది. పార్థసారథి పూజా కార్యక్రమం ప్రారంభించాడు. గొంతెత్తి స్వచ్ఛంగా ఉచ్చస్వరంతో స్పష్టంగా మంత్రం చదివితేగాని ఆయనకు తృప్తిగా ఉండదు. కొంత మంది సగం సగం మింగేసి పూజ అయిందనిపిస్తారు. కానీ పార్థసారథికి అలా నచ్చదు.
వీభూతి దట్టించాడు. మధ్యలో కుంకుమ బొట్టు మొహానికి వెలుగునిచ్చేలా ఉంది.
‘శివాం గిరి త్రతాం….’ అంటూ పూజ ప్రారంభించాడు. అభిషేకం చేస్తున్నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో.
పక్కనే ఉన్న సెల్ ఫోన్ మోగింది.
“హలో…” అన్నాడు పార్థసారథి నెంబరు చూసుకుని.
“నేను కుమారస్వామిని సర్…”
“చెప్పు”
“మా బిల్లు చాలా రోజులుగా మీ దగ్గర ఉండిపోయింది…”
“ఆఫీసుకొచ్చి కలువు…” ఫోన్ డిస్‌కనెక్ట్ చేసి ఆగిపోయిన పూజకు కనెక్ట్ అయ్యాడు.
“నమస్తే… అస్తు భగవన్విశ్వేశరాయ మహాదేవాయ…”
రెండు నిముషాల తరువాత మళ్లీ ఫోన్…
“నేను మినిస్టర్ గారి పి.యస్.ని… పదకొండు గంటలకు మినిస్టర్ గారి దగ్గర మీటింగ్…”
“అలాగే…”
మంత్రం స్పీడ్ పెంచాడు. పది నిముషాల్లో పూజ అయిపోయిందనిపించాడు.
“ఏమేవ్… అర్జంటు… ఆఫీసుకు వెళ్లాలి… వంట అయిందా?” అని అరిచాడు.
“ఇదుగో, అయిపోయింది…” అన్నది ఛాయాదేవి హడావుడి పడుతూ.
“రోజూ చేసే వంటే గదా.. ఎందుకింత ఆలస్యం? అవతల మీటింగుల మీద మీటింగులు… ఫోన్లు మీద ఫోన్లు…” అంటూ విసుక్కున్నాడు పట్టు బట్టలు విప్పి, ఫాంటూ, షర్టూ ధరించి.
ఛాయాదేవి ఆయనకు వడ్డించింది. ఆయన భోంచేస్తున్నాడు. ఆయనతో ఏదన్నా మాట్లాడాలంటే, ఈ పావుగంట మాత్రమే ఆమెకు వీలవుతుంది. ఆఫీసుకు వెళ్తే ఆయన ఏ అర్ధరాత్రికోగాని తిరిగిరాడు.
“వచ్చే నెలలో కామేశ్వరి పెళ్లి అండి. గాజులు చేయించుకంటానండి… చేతులు బోసిగా ఉన్నయి…”
“చేయించుకో, నన్నడగటం దేనికి?”
“మీరు డబ్బు ఇవ్వాలిగదా…”
“డబ్బు ఏమన్నా చెట్టుకు కాస్తుందనుకుంటున్నావా?” అని కోపంగా చూస్తూ అన్నాడు.
“చెట్టుకు కాకపోయినా, ఫైల్స్‌కు కాస్తుంది గదా…”
“నేను అలాంటి వాడిని కాదు. చాలా స్ట్రిక్ట్… ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. పార్థసారథిగారంటే, నిప్పు…” అన్నాడు.
భోజనం ముగించి వచ్చి సోఫాలో కూర్చుని టి.వి. ఆన్ చేశాడు.
“ఏసిబికి చిక్కిన పెద్ద చేప…” అంటూ వార్తలు చదువుతున్నాడు.
“ఈ చేపలు పట్టేవాళ్లకి వీళ్లే కనిపిస్తారు. అక్కడ గండిపడి కొట్టుకుపోతున్న ప్రవాహాలు కనిపించవు…” అని గొణుక్కున్నాడు.
డ్రైవర్ సింహాద్రి గుమ్మంలో నిలబడి శాల్యూట్ కొట్టాడు.
భార్యకు వినపడేట్టు పెద్దగా అన్నాడు పార్థసారథి.
“సింహాద్రీ, ఇవాళ చాలా మీటింగులున్నాయి. రాత్రి ఇంటికి రావటానికి లేటు అవుతుంది…”
“యస్సార్…” అన్నాడు సింహాద్రి వినయంగా.
సింహాద్రి బయట కొచ్చి కారు దగ్గర నిలబడ్డాడు కార్ డోర్ తీసి పట్టుకొని.
పార్థసారథి ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వచ్చి, ఇరుగు పొరుగు వారు తన వైభోగాన్ని చూసి కుళ్లుకునేలా ఖంగుఖంగుమని దగ్గి, రెండు నిముషాలు దిక్కులు చూసి వెళ్లి కారులో కూర్చున్నాడు.
మంత్రిగారు ఛేంబర్‍లో మీటింగ్ ప్రారంభం అయింది. మిగిలిన ఆఫీసర్స్ మధ్యలో పార్థసారథి కూర్చున్నాడు. నుదుట వీభూతి పట్టీలు, కుంకుమ బొట్లు, ఆయనకున్న భక్తి తత్పరతనూ, పాపభీతినీ స్పష్టంగా తెలియజేస్తూ, ఆయన పట్ల సద్భావాన్ని ఇనుమండింప చేస్తున్నాయి.
“వర్షాకాలం వచ్చేసింది. వానలు, వరదలు వస్తున్నాయి. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నయి. గండ్లు పడి, ఇళ్లూ, వాకిళ్లూ మునిగిపోతున్నయి. ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోండి. ఫండ్స్ గురించి మీరు ఆలోచించ వద్దు. అదనంగా కొన్ని ఫండ్స్ తెప్పిద్దాం…” అన్నారు మంత్రిగారు.
అలాగేనన్నారు, ఆఫీసర్స్. మీటింగ్ అయిపోయింది.
పార్థసారథి ఆఫీసులోకి వచ్చి తన రూంలో కూర్చున్నాడు. సీట్లో కూర్చున్నాక, రోజూ ఒక విడత ఒక్కొక్కరినీ పిలిచి, పులిలా మీద పడిపోతాడు. ఇవాళ అదే పరిస్థితి.
“రెండు రోజుల నుంచీ చెబుతున్నాను. ఎస్టిమేట్స్ తయారు చేయమని. ఎందుకు చేయలేదు… యూస్‌లెస్ ఫెలో…”
“ఎందుకూ పనికి రాని వాళ్లంతా ఇక్కడ వచ్చి పడ్డారు. ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్… ”
“ఎప్పటికి పని నేర్చుకుంటారయ్యా మీరంతా… పై వాళ్లకు సర్ది చెప్పలేక చచ్చిపోతున్నాను…”
“మీకు మెమోలు ఇస్తేగాని, దారికి రారు… ఒకరిద్దర్ని సస్పెండ్ చేస్తేగాని మీరు మారరు…”
అంటూ ఆఫీసులో అందర్నీ ఒక విడత తిట్టేసి, తను ఎంత గొప్ప పనిమంతుడో నిరూపించుకుంటాడు పార్థసారథి.
నాలుగు గంటలకు కాంట్రాక్టర్ సూర్యారావు వచ్చి వినయంగా వంగి నమస్కారం చేసి ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. చాలా బిజీగా ఉన్నట్లు కనిపించటం కోసం, ఒక పావుగంట ఫైల్స్ అటూ ఇటూ తిరగేసి, తరువాత సూర్యారావు వంక చూశాడు.
“సర్ సాయంత్రం… మా ఇంటికి దయచేయాలి మీరు…”
“అబ్బెబ్బె… నేను ఎక్కడికీ వెళ్లను. ఆఫీసు, ఇల్లూ… అంతే… ఇంకెక్కడికీ వెళ్లను. వెడితే ఆంజనేయస్వామి గుడికి వెళ్తాను… అంతే…” అన్నాడు పార్థసారథి.
“అయ్యో తమ సంగతి నాకు తెలవదాండీ… అందుకే హోటల్లో కాకుండా మా ఇంట్లో అరేంజ్ చేశానండి. కొత్త కాండిటేట్. బంగారం బొమ్మలా మిసమిసలాడిపోతుంది. మీ గురించి చెబితే, ఓ పాలి పరిచయం చెయ్యమని ఒకటే గోల… ఇవాళ తీసుకొస్తే గాని ఒప్పుకోనని నన్ను చంపేస్తోంది…”
“నాకు ఇలాంటి వేషాలు అస్సలు నచ్చవు… ఆఫీసు… ఆఫీసు… పని… పని… ఇవి తప్ప ఇంకో లోకం లేదు… దీనితోనే తలమునకలు అవుతున్నా… పొద్దున్న మంత్రిగారు ఈ వానాకాలంలో ఏవేం చేయాలో చెప్పారు. అడిషనల్ ఫండ్స్ కూడా ఇస్తాం… అవసరమైన పనులన్నీ చేయించమన్నారు. దానితో ఊపిరాడటం లేదు…”
“నాకు తెలవదా సార్… తవరెంత బిజీనో… ఊరికే అది పోరతా ఉంటే, మీ చెవిన వేసి పోదామని వచ్చినా…”
“సర్లే… నువ్వెళ్లు…” అన్నాడు పార్థసారథి.
అవినీతి పనులు చేసే వాళ్లకు భయం ఎక్కువ. ఎక్కడ, ఎప్పుడు తాము పట్టుపడతామోనన్న ఆలోచనలతో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పైకి తాము ఎంతో నీతిమంతులుగా కనిపించాలన్న అభిప్రాయంతో, అవసరమైన విద్యలన్నీ ప్రదర్శిస్తుంటారు. కానీ మనిషిలో ఉండే ప్రలోభాలకు లోనవుతూనే ఉంటారు.
రాత్రి ఏడు గంటలకు పార్థసారథి ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు. కారులో కూర్చున్నాడు.
కాంట్రాక్టర్ సుర్యారావుకి ఫోన్ చేశాడు.
“ఏంటి సూర్యారావు? ఆఫీసులో గోడలకు చెవులుంటాయి. మనం ఏం చేస్తున్నామో, వెయ్యి కళ్లతో కనిపెడుతుంటారు… ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో చోట పాగా వేసి చూస్తుంటారు…”
“తప్పేనండి… ఇంకోసారి అలా చేయనండి… ఈ పాలికి మన్నించి మా ఇంటికి రండి… మరదలు పిల్ల ఓ గొడవ పెట్టేస్తోంది…” అన్నాడు సూర్యారావు.
ఒక గంట తరువాత పార్థసారథి సూర్యారావు ఇంట్లో, హాల్లో రిలాక్స్ అయి మాట్లాడుతున్నాడు.
మరదలు పిల్ల గ్లాసులు అందిస్తోంది వయ్యారాలు పోతూ.
“ఇప్పటిదాకా ఎదురు చూసి, ఎదురు చూసి కళ్లు కాయలు కాసి పొయ్యాయి…” అన్నది సులోచన సోఫాలో ఆయన పక్కన చేరి.