[dropcap]ఆ[/dropcap]కాశం బద్దలైందా
తూట్లు పడ్డవా నీటి కోశాలకు
బహుశా సుస్తీ చేసిందేమో
అసాధారణ అతి వానకు
తడిసిన వానైంది బతుకు
నిద్ర పట్టడం లేదు
మంచంపై అటూ ఇటూ
దొర్లుతున్నది మనసు
నీరసం,నిస్సత్తువల్లో దేహం
ఊపిరి నడక తారట్లాడే…
రణగొణ ధ్వనుల్లేవు
సడీ సప్పుడూ లేక
రహదారులన్నీ మహా నిశ్శబ్దం
అతి ప్రమాదమేగా ఏ రూపంలోనూ
మనిషి నడకే సెలవంది
ఇక ప్రతి పనీ నెలవు తప్పింది
సుస్తీ చేసిందీ తడిసిన వానకు
బహుశా సుస్తీ ఉండదేమో
మట్టి వేళ్ళకు
మట్టి ఓ గొప్ప రక్షణ ఓషధి!
కానీ,ప్రకృతిపై మనిషి దాడే
ఈ రుగ్మతల హేతువు
గాయాల కోతలన్నీ ఎద అవనికే
శూన్యమైన మానవీయ యానంలో