[dropcap]రం[/dropcap]గులు చిలకరించుకుంటూ
దారంతా నవ్వులను చల్లుకుంటూపోతారు.
తూనీగలను చూస్తూ ఆకాశంలోకి చూసి
మబ్బుపట్టిందని అనుకుంటారు.
వర్షమొస్తే ఇక తడిచిపోలేక
రంగురంగుల గొడుగుల్లో దాగి సాగుదామనుకుంటారు.
హఠాత్తుగా గాలివేగం పెరిగి గొడుగులు తిరగపడతాయ్.
మరి ఇక ఉన్నపళాన ఏ చెట్టునీడనో దాగుదామనుకుంటారు.
ఎప్పటికో గాలివేగం నెమ్మదిస్తుంది.
వాన ఆగిపోతుంది.
ముందుకు వెళ్ళడం గురించి ఆలోచించలేక
వెనుకకు మరలుతారు.
చీకటి పడుతుంది, వీధి దీపాలు
లెక్కపెట్టుకుంటూ అసలుకు పోతారు.
పంతమంతా పసిగా నవ్వుతుంది.
ఇక రాత్రి కలలో రంగురంగుల దీపాలు
ఏవేవో గొణిగినట్లు అవుతది.
మళ్ళీ కూడా ప్రయాణం గురించి యోచిస్తునే ఉంటారు.
వాళ్ళు నిలకడలో అనుకూలతను మాత్రమే నమ్ముకున్నవాళ్ళు.
ప్రతికూలతలో నిదానమయ్యేవాళ్ళు.
పొసగనిచోటుల్లో సీతాకోచిలుకలైపోయేవాళ్ళు.
పక్షుల ఈకలంత మృదుత్వాన్ని, సుతారంగా
చూపులతో నేసేవాళ్ళు.
వాళ్ళు మామూలువాళ్ళు, అతి నిదానంగా
అడుగులు మార్చుకునేవాళ్ళు.
ఏ గుబులు నిమిషానో కుప్పకూలేవాళ్ళు.