[dropcap]ని[/dropcap]న్ను చూడగానే..
నా కళ్ళలో కోటి జ్యోతుల కాంతులు..!
నా తనువంతా ఒక పరవశపు పులకింత..!
నేను నిన్నింతగా ఇష్టపడుతున్నానా
అని నాకే ఆశ్చర్యం ఒకింత..!
నా ప్రియనేస్తం నన్ను
ఆహ్వానిస్తున్నట్టే ఉంటుంది మనసారా..!
నిన్ను సమీపించిన మరుక్షణం నన్ను నేను మరిచిపోతా..!
నీలోకి ప్రవేశించిన క్షణం
నన్ను నేను పోగొట్టుకున్నంత మైమరపు..!
అంతలోనే నాకు నేను
అర్థమైనంత తొలి వలపు..!
అక్షరాల వెంట నా కళ్ళు పరుగులు తీస్తుంటే..
కాగితపు పుటలు త్రిప్పుతూ నా చేతులు కదులుతుంటే..
కాలం ఎలా గడుస్తుందో
చెప్పడం ఎవరి తరమూ కాదు..
నీలోని అక్షరాలన్నీ
ఒక విజ్ఞానపు విందుకు దారి చూపుతాయి…
నవ వికాసపు మార్గానికి
త్రోవ చూపే నక్షత్రాల్లా అగుపిస్తాయి..
అంబర వీధిలో విహరించే
విహంగాల్లా రెక్కలు విప్పుకు సంచరిస్తాయి..
నా మస్తిష్కంలో ఒక
అనుభూతుల పరంపర వెల్లువెత్తుతుంది…!
ఏదో సాధించిన సంతృప్తి… మనసంతా ఆనందంతో నిండిన అనుభూతి..!
నువ్వంటే నాకంత మక్కువ..
ఎవరైనా నిన్ను తీసుకెళ్తానంటే..
భరించలేని గుండెకోత..
మరల నన్ను చేరగలవో లేవో అని..
నిన్ను ఆస్వాదిస్తూనే నా గుండెలపై
కన్న బిడ్డలా ఉంచుకుని నిద్రిస్తాను.
ఆప్యాయంగా నిన్ను నిమురుతూ
పరవశించి పోతాను..
నువ్వెప్పుడూ నా కళ్ళముందు
‘అట్ట’హాసంగా నవ్వుతూ ఉండాలి.
నిన్ను పూర్తిగా అవగాహన చేసుకున్నాక..
నా అలమరలో భద్రంగా ఉంచుతాను..
మరో నేస్తం కోసం వెతుక్కుంటాను ఆత్రంగా..
ఆ నేస్తం కనబడగానే
మరల నా ప్రయాణం మాములే..నీతో..!
అందుకే నువ్వు నాకు సాక్షాత్తూ
పరబ్రహ్మ సతీ స్వరూపం..!