నేను!

0
3

[dropcap]అ[/dropcap]హం బ్రహ్మాస్మి అంటే అన్నీ నేనే అని అర్థం. కన్నతల్లి కడుపులోంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి… పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే ‘నేను’.

ఈ ‘నేను’ ప్రాణశక్తి అయిన ‘ఊపిరి’కి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా ‘నేను’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది….

జననమరణాల మధ్య కాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలు చేస్తుంది. అది దాని నైజం.

నేను చనిపోయాను. అవును. నిజం. అరగంట క్రితం నేను చనిపోయాను. అంటే పద్దెనిమిది వందల క్షణాలయింది నేను చనిపోయి. మీకో నిజం చెప్పాలంటే పద్దెనిమిది వందల రోజుల క్రితం… అంటే సుమారు ఆరు సవంత్సరాల క్రితం నేను దాదాపు చచ్చి బ్రతికాను. అప్పుడు నేను బ్రతుకుతానని ఎవ్వరూ అనుకోలేదు. కానీ బ్రతికాను. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా చనిపోతానని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ చనిపోయాను. అందుకు సూచనగా నా మరణానికి సుమారు నాలుగైదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో నాకు సంబంధం తెగిపోయింది.

నా అరికాళ్లని పాదాలనీ గమనించింది నా భార్య. అవి చల్లబడుతున్నయ్యని గమనించింది. ఆమెకు దుఖం ఆగటం లేదు. ఉబికి వస్తున్న ఏడుపుని బలవంతాన ఆపుకోవటానికి విఫలయత్నం చేయసాగింది.

పిల్లలకి కబురు చేయటానికి ఉపక్రమించింది. మాటలు పెగలటం లేదు. అతి కష్టం మీద నా మరణం గురించి వాళ్ళతో చెప్పగలిగింది. వాళ్ళ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూడసాగింది.

ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోయింది. ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగిందో, నా శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకి వచ్చేసింది. కానీ ఇంతకాలం ప్రేమించిన ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ నా శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. నన్ను గనుక ఎవరైనా మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే, నా ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాలలోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటివరకు శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది. నా విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. శరీరంలో ఉన్నప్పటిలాగే నా ఆత్మా నాకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడుతున్నది, నేను మరణించలేదు అని చెబుతున్నది. కానీ నా ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడటం లేదు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలయింది తాను ఇక నా శరీరంలో జేరలేనని. శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి, ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము మొదలుపెట్టింది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంతవరకూ ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగులు శరీరానికి పైన వుంటుందట.

నేను చెబుతున్నా మీరు అర్థం చేసుకోండి, ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతోంది అంటే, అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి, అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ, వింటూ ఒక సాక్షిభూతంగా వుంటుంది. చచ్చినవాడిని ఎటూ చచ్చాను. ఇంకా అబద్దాలు ఎక్కడ చెప్పి చచ్చేది? నిజమే చెబుతున్నాను. నన్ను నమ్మండి.

మా అబ్బాయిలు ఇద్దరూ వచ్చారు. కోడళ్ళు, మనవళ్లు వచ్చారు. ఒక్కగానొక్క కూతురు అల్లుడూ వచ్చారు. స్నేహితులు, బంధువులు ఒక్కరొక్కరే వస్తున్నారు. అందరూ నా భార్యని, నా పిల్లల్ని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళూ బాధపడుతున్నారు. వాళ్ళకి నే చేసిన చిన్న చిన్న సహాయాలు చెప్పుకుంటున్నారు కొందరు. వాళ్ళు నాకు చేసిన ఆర్థిక సాయాల గురించి కొందరు, మాట సాయం గురించి కొందరు చెప్పుకుంటున్నారు. నా మాట తీరు గురించి కొందరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. మొత్తం మీదా అందరూ నా గురించి మంచిగానే మాట్లాడుకోవటం నాకు కొంతలో కొంత సంతోషంగానే అనిపించింది.

పురోహితుడు వచ్చాడు. ఏర్పాట్లు మొదలుపెట్టారు. నా భార్య, పిల్లలూ పెద్దగా ఏడవసాగారు. దగ్గరి బంధువులు ఆమెని పట్టుకున్నారు. పిల్లలు కూడా తల్లి చుట్టూ చేరారు. వాళ్ళని చూస్తున్న నాకూ దుఃఖం ఆగలేదు. పాపం వాళ్ళు నన్ను చాలా బాగా ప్రేమించారు. ప్రాణంగా చూసుకున్నారు.

మహాప్రస్థానానికి తరలించే ప్రక్రియ ప్రారంభం అయింది. అక్కడ కూడా నా స్నేహితుడు తిరుమలరావని ఒకాయన మేనేజరుగా పనిచేస్తున్నాడు. అందుకని మా వాళ్ళకి అక్కడ దోపిడీకి గురికాకుండా పనులు సులభంగా పూర్తి అయినై. నా భౌతిక కాయం చూసి అతను కూడా బావురుమన్నాడు పాపం. మాది నలభై ఏళ్ల స్నేహం మరి!

ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక, ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తను దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన, ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. అందుకే నా ఆత్మ నా బాల్యం గడిచిన వూరు వెళ్లింది. ముందుగా. అక్కడ నేను నిక్కరు తొడుక్కుని గాను తిప్పుకుంటూ పరుగిడిన రోడ్లన్నీ చూసుకుంది. నా స్నేహితుల ఇళ్ల వైపు తేరిపార చూసింది. కొందరు పోయారు. కొందరు వేరే వూళ్ళకి వెళ్ళిపోయారు. కొద్దిమంది వున్నా రూపురేఖలన్ని మారిపోయినై. మేము అద్దెకి వున్న ఇల్లు పడకొట్టి కొత్తగా మార్చి కట్టుకున్నారు. ఆ ఇంటిని చూసి ఇంటి పక్కనే నేను ఆడుకున్న వేణుగోపాలస్వామి గుడి అంతా కలియ తిరిగింది నా ఆత్మ. అక్కడినుంచి ఇప్పుడే నేను వుంటున్న వూరికి వచ్చి మా అక్కయ్యా వాళ్ళ ఇల్లు, మా మేనమాల ఇళ్ళు, నా స్నేహితుల ఇళ్ళు నేను పనిచేసిన ఆఫీసు బిల్డింగు చూసి తృప్తి పడింది. నేను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమెను చూసింది. 7 రోజులు ముగిసాక, మా కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని, భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోయింది నా ఆత్మ.

ఆత్మల లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి వుంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మా వాళ్ళు జరుపవలసిన కార్యక్రమాలు చక్కగ నెరవేర్చసాగారు. నా కొడుకులు ఇద్దరూ, కోడళ్ళు, నా శ్రీమతి వాళ్ళు తెలిసో తెలియాకో చేసిన తప్పులను క్షమించమని నా ఆత్మని అడగడము ప్రార్థించడము నాకు అర్థమవుతూనే వుంది.. అంత్యక్రియల తరువాత జరుపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకానికి అడుగుపెడుతున్నాను అన్న సూచనగా, మార్గం యొక్క ముగింపులో నా ఆత్మకి ఒక అతి పెద్ద వెలుగు కనపడింది. 11వ మరియు 12వ రోజున జరుపబడే ఇతర కార్యక్రమాల వలన, ఆత్మ మా పూర్వీకులను, ఆప్త మిత్రులను, బంధువులను మరియు నాకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలసుకోవడం నాకు భలే సంతోషాన్ని కలుగచేసింది. మనం భౌతికంగా ఎలాగైతే, మన దూరపు బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగిలించుకుంటామో, అదే విధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మా పూర్వీకులు నా ఆత్మని అహ్వానించి మనస్పూర్తిగా కౌగిలించుకున్నారు. అలా కౌగిలించుకున్నవాళ్ళల్లో నా మేనమామలు, మా పెద్దమ్మ, అమ్మనాన్న మా మామయ్య కొడుకు, ఇద్దరు స్నేహితులు, మా పెద్దత్త వున్నారు. ఆ తర్వాత నా ఆత్మ మార్గనిర్దేశకులు, ఆత్మని తను భూలోకంలో, బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి, ఒక పెద్ద వెలుగువంటి బోర్డ్ ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. దీనినే కార్మిక్ బోర్డ్ అంటారని చెప్పారు. ఈ బోర్డ్‌లో గత జన్మలో జరిగినదంతా సినిమాలాగా చూపించబడింది. నేను చేసిన మంచి పనులు, చెడ్డ పనులు, తొందరపడి ఇతరులను దూషించిన సంఘటనలు, నేను అవమానపడిన సందర్భాలు, సంతోష పడిన సంఘటనలు, బాధపడిన సన్నివేశాలు… అన్నీ… అన్నీ చూపించటం జరిగింది. నాకు ఒక్కసారే బాధ, ఆనందం కలిగినై.

ఇక్కడ అంక్ష పెట్టేవారు, నిర్ణయించేవారు ఎవరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో అలాగ ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పు చేసానని ఫీల్ అవుతుంది. తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందటానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా,

రాబోయే తన జీవితానికి ఒక బ్లూప్రింట్ అంటే నఖలు లేదా ఒక ప్లాను వేసుకుంటుంది. ఏలాంటి సంఘటనలని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలెంజ్ లను ఎదుర్కొనాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి. ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నఖలు తయారుచేసుకుంది నా ఆత్మ. ఇంకా చెప్పాలంటే, నిమిషాలతో సహా, వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కొనవలసినవి రచించుకుంది.

ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అదే ఏమిటంటే, మనం ఒక తప్పు చేసే దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా భాదపడవలసి వస్తుంది అంటారుకదా. అది నిజం కాదు. కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షని విధించుకుంటుంది. ఒకోసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధపెట్టి వుంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది. అందువలనే, మనం భావోద్వేగాలని సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ వుంటారు ఎందుకంటే, అవే తర్వాత కూడా మోసుకునిపోబడతాయి కాబట్టి అని నాకు ఇప్పుడు అర్థం అయింది. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారుచేసుకున్నాక ప్రశాంతత కలిగింది నా ఆత్మకి.

మన మరుజన్మ ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నఖలుపై ఆధారపడి ఉంటుంది.

జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము ఒకోసారి తల్లిగర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో లేక గర్భం దాల్చిన 4,5 నెలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందో ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. నేను మళ్ళీ మా అమానాన్నలకే పుట్టాలని కోరుకున్నాను.

ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలమునకు తగినట్టు గ్రహములు అమర్చబడినై. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడను, నాకు అదృష్టం లేదని కానీ అసలు విషయం ఏమిటంటే, మన జీవితం మొత్తం కూడా, మనం ఆత్మల లోకంలో తయారుచేసుకున్న నఖలు లేదా బ్లూప్రింట్ మాత్రమే.

ఒకసారి మరుజన్మ తీసుకున్నాక, 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబందించిన జ్ఞాపకాలు అన్నీ కలిగివుంటుంది. అందువలనే ఒకోసారి సంబంధం లేకుండా నవ్వడమూ లేక ఏడ్వడమూ జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత, గత జన్మకి సంబందించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమెటిక్‌గా తుడిచివేయబడి, అసలు నాకు గతజన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము. నాకూ అదే జరిగింది.

ఇక అప్పటినుండి నఖలులో లిఖించుకున్నది పూర్తిగా అమలులోకి రావడం మొదలవుతుంది … ఇక అప్పటి నుండి, జరిగే మన సంఘటనలు తలచుకుని, ఇతరులను మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మనం ఇంకొకరిని వేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, ఇతరులందరూ మన నఖలులో మనం ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మనకు సహాయం చేస్తున్నారని. మనము ఏదైతే ముందరే జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతోంది. తలిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామీ అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకువస్తున్నారంటే, వారు అలా రావాలని మనమే నిర్ణయించుకున్నాము కాబట్టి. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే వీటన్నింటికీ మనం భగవంతుడు కారణం అనుకుంటుంటాం. కానీ కాదు. మనమే కారణం. ఇది నిజం.

మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్న పళంగా మరణం సంభవించడము. ఏది ఏమైనప్పటికి ఆత్మకి పన్నెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. ఆ రోజుల తర్వాత కొంతకాలం ఆగి, ఆత్మల లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది.

మనకి మరణం లేదు. మరణం అనేది అంతం కాదు. మళ్ళీ మనం కలుసుకోవడానికి అది ఒక విడిది సమయం మాత్రమే అనిపించింది. జీవితంలో మనకి జరిగే శుభాశుభాలకి మనమే కారణం అనిపించింది. అంతేకాదు, మరణానికి భయపడాల్సిన పనిలేదని తెలిసింది.

అందుకే అదృష్టదేవత, ఆరాధ్యదేవత, ఐశ్వర్య దేవత అన్నట్లే మృత్యుదేవత అన్నారు. కలలో చచ్చినవాడిని ఎటూ చచ్చాను. అది కలేగా కల్లేగా! అయినా ఇంకా అబద్ధాలెక్కడ చెప్పి చచ్చేది గానీ, నిజం చెబుతున్నాను. నేను చావలేదు. బతికేవున్నాను. కలలో చచ్చి అవన్నీ చూసొచ్చాను. అందుక్కారణం పడుకునే ముందు ‘మరణం తరువాత’ అని నేను వాట్సప్‌లో చదివిన మెసేజే ఆ కల రప్పించింది. నా చేత ఇంత చెప్పించింది.

కానీ నా ఆత్మ భూమిపై తిరగటం లేదు. కలలో తిరుగుతున్నదని అర్థం అయింది. మా ఆవిడ ఒక్క కుదుపు కుదిపే సరికి కళ్ళు తెరిస్తే ఏముంది. అంతా మాయ. జగమే మాయ. పరంలో నుంచి ఇహం లోకి వచ్చాను. ఇంకేముంది ఇహంలోకి వచ్చీ రాగానే అహం కమ్మేసింది.

అహం బ్రహ్మాస్మి అనుకున్నాను. మళ్ళీ మొదలే. ఊపిరితో మొదలై ఊపిరితో ఆగి, ఊపిరి తోనే సాగుతున్న ‘నేను’ కథ అలా కొనసాగుతున్నది.

ఈ ‘నేను’ లోంచే ‘నాది’ అనే భావన పుడుతుంది! ఈ ‘నాది’ లోంచి నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రతిభ, నా ప్రజ్ఞ, నా గొప్ప… అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ ‘నేను’ అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి ‘అహం’గా ప్రజ్వరిల్లుతుంది.

‘అహం’ అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ ‘నేను’ – ‘నేనే సర్వాంతర్యామిని’ అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలు పలుకుతుంది. ఎప్పటిదాకా…. వచ్చిన కల నిజమయ్యేదాకా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here