[dropcap]ఆ[/dropcap] రోజు సాయంత్రం ఆ మర్రిచెట్టు కింద ఎప్పటినుంచో వింటున్న పురాతన కథ జనం నోళ్లలో మళ్ళీ నానింది…
మసక వెలుతురు రెండు కాలాలను ఏకం చేస్తోంది. అది బీడు భూమో ఎడారో అర్థంకాని విశాల మైదానం. దారి ఉన్నట్టే ఉంది కానీ ఎటు పోతుందో తెలియడం లేదు. అక్కడికి ఒంటరిగా వచ్చిన వారెరైనా తప్పిపోవాల్సిందే.
దూరం నుంచి గుర్రబ్బండిలో వస్తున్నాడతను.
రేగిన గాలి, ధూళి వస్తున్న అతడిని ఎటువైపు నెట్టింది. మైలురాయి దగ్గర ఆగాడు. అప్పటికే పాతిక మైళ్లు ప్రయాణించాడు. అతని వయసూ పాతికే. ఆ పక్కన ఉన్న రావి చెట్టు కింద రాళ్లగుట్ట మీద ఓ అమ్మాయి ఎదురుచూస్తోంది. అతన్ని చూసింది. అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు ఓ నవ్వు నవ్వింది. లేత ఆకుపచ్చ నవ్వు. ఆ కాంతికి అతని మతి చెదిరింది. అలాంటి నవ్వు ఎప్పుడూ చూళ్ళేదు. ఏమి ఆకర్షణ అనుకున్నాడు.
“ఆ లోపలి పల్లెలోకి వెళ్ళాలి, దారి ఎటో చెప్తారా?”
“చెప్పను” ఆమె.
బిత్తరపోయి చూసాడతను.
“దారి ఉంటే కదా చెప్పడానికి, ఆ దారి కొద్దికాలం క్రితం వరకూ ఉండేది. ఎవరో ధ్వంసం చేశారు”
“ఇప్పుడెలా మరి!”
“కాళ్ళు ఉన్నాయిగా, నాతో రండి కాలిబాటలో తీసుకెళ్తా”
అతను బండి దిగి, బండి వాడిని తిరిగి వచ్చేవరకు ఉండమని చెప్పి, డబ్బులిచ్చి కదిలాడు. ఆమెతో అలా వెళ్లడం అతనికి నచ్చింది. దారిలో నిశ్శబ్దాన్ని తరిమెందుకు ఆమె ముచ్చట్లు పెట్టింది. “ఏంటి మీరూ, పెళ్లి చూపులకు ఒంటరిగా వచ్చారు. మంది మార్బలం ఎక్కడ?”
ఆ సంగతి ఈమెకెలా! అని అవాక్కయ్యాడు. “వెనకే వస్తున్నారు” అన్నాడు.
అతని తరపువాళ్ళు వెనకాలే దారి పట్టారు.
ఇద్దరూ గుట్ట ఎక్కుతున్నారు.
“మీ పేరు?” అతను.
“అతిథి” ఆమె.
“మీది ఆ గ్రామమేగా, పెళ్లి కూతురు బాగుంటుందా!” అతను.
“నేనెలా ఉన్నాను, అచ్చం అలానే ఉంటుంది. ఇదే కట్టూ బొట్టూ, మాట కూడా”
కాసేపు కిందకీ మీదకి చూసాడు.
“మా ఊరు గుట్ట అవతల. బండ్లు పోవు. నడిచే పోవాలి. ఇలాగే ప్రయాణిస్తే గమ్యం తెలీక తప్పిపోతారు” వివరించింది.
“అవును నిజమే”
“నా ఇంటికి ఈ దారిలో వెళ్తే త్వరగా వెళ్లొచ్చు.” అని చెప్పి చేయి చాచింది. ఆమె చెయ్యి అతని తల పైన ఉంది. ఎత్తుగా దృడంగా ఉన్న ఆమెను చూస్తే కలిగిన విభ్రమ నుంచి ఇంకా తేరుకోలేదు.
ఆమె కురులు జలపాతపు ధారలా ఉన్నాయి. మాటల శబ్దాలు కెరటాల హోరులా ఉన్నాయి. ఆమె నడక కొండకోనల మధ్య పారే నదీ కాలువలా ఉంది. ఆమె కురులు నుంచి రాలిన ఒక కేశాన్ని గిజిగాడు పిట్ట వచ్చి పట్టుకెళ్ళింది. మరింత ఆశ్చర్యంతో పిట్టని చూస్తున్నాడు.
“ఆ పిట్ట వెళ్లి దాంతో గూడు కట్టుకుంటుంది” అని చెప్పింది. ఇంద్రజాలాన్ని చూసిన పిల్లాడిలా అయ్యాడు. ఆ వింత వాతావరణంలో ఆమె అతనితో ఉండటం అతనికి బాగుంది “నీలో ఇంత ఆకర్షణకి కారణమేంటి?” అడగకుండా ఉండలేకపోయాడు
“నేనింతే, పుట్టుకతో ఇలాగే ఉన్నా” ఆమె.
పరిశీలనగా చూసి “మీ వయసెంత?” అన్నాడు.
ఆమె “ఇప్పుడు అదెందుకూ? నీలాగే ఇంతకుముందు చాలా మంది ఇక్కడికి వచ్చారు, ఇలాగే లక్ష ప్రశ్నలు”
“అవునా, మరి ఏం జరిగింది?” మాట సాగడం కోసం అన్నాడు.
“జాగ్రత్తగా ఏలుకుంటాము అని వచ్చి పెత్తనం చేయబోయారు, రాచి రంపాన పెట్టారు. వాళ్ల మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. మోసాలు. దగాలు. ఇదిగో” అంటూ వాళ్ళ వల్ల తన ఒంటి మీద అయినా గాయాలు చూపించింది. కోసిన గాయాలూ, కొట్టిన గాయాలు, కందిన శరీరం, చిందిన రక్తం జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప కనపడవు.
“మరి వాళ్ళు ఏమయ్యారు?”
“శిక్షకి గురయ్యారు”
మర్మంగా ఉన్న ఆమె మరింత గుబులు రేపింది.
అతని కళ్ళలో భయాన్ని అతిథి గమనించింది. అది పోగొట్టడానికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. కానీ ఆ మాటలు అతని చెవికెక్కలేదు. ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తున్నాడు. ఏదో పాట పాడుతూ, రాగాలు తీస్తూ ఉన్నాడు.
“నీ సాంగత్యం బాగుంది. నువ్వు వాళ్లలా లేవు, ఇక్కడే ఉండిపోతావా?” అతిథి.
అతనికి గొంతు తడారిపోయింది. అతనికర్థమయింది… ఆమే పెళ్లి కూతురని.
“నీళ్లు” అన్నాడు. అతిథి సొరకాయ బుర్ర తీసి ఇచ్చింది. తాగి తిరిగిచ్చాడు. ముందుకు వెళ్లే కొద్దీ చలి సూదిలా గుచ్చేస్తోంది.
మెల్లగా “మరి నేను నీకు నచ్చినట్టేనా” అన్నాడు.
అతిథి “నేను నీకు ఒక పరీక్ష పెట్టాను. నువ్వు అది నెగ్గితే చెబుతాను” అంది.
“పరీక్షా! ఏం పరీక్ష” నొసలు కలిపాడు.
“చెప్పానుగా, చివరలో తెలుస్తుందిలే” అతిథి.
పరీక్ష దాకా వచ్చిందంటే ఎంతో కొంత నచ్చినట్టే అని తృప్తిపడ్డాడు. ఈ లోగా జాగ్రత్తగా ఉండాలని మనసుకి చెప్పుకున్నాడు. కాలం గడుస్తుండగా నెమ్మదిగా తలవాల్చి ఆమె ఒడిలో పడుకున్నాడు. “కాలం నెమ్మదిగా వెళితే బాగుండు” అన్నాడు. నవ్వింది.
ఆమె కళ్ళలోకి చూసి “నాకు మెరిసే నీ కళ్ళు కావాలి” అన్నాడు.
అతిథి తమాషా ఆపమని నవ్వింది.
“నిజంగానే కావాలి”
మరింత పెద్దగా నవ్వింది. ఆ కొండలు ప్రతిద్వనించేటట్టు “నువ్వు నాకు పరీక్ష పెడుతున్నావే!” అంది.
అతను ఏమి మాట్లాడలేదు. ఇంతలో ఇద్దరూ గ్రామానికి చేరుకున్నారు.
***
అందమైన ఆ ఊర్లో కలిసిమెలిసి తిరిగారు. నచ్చిన తిండి వండుకు తిన్నారు. అక్కడి వాతావరణానికి మనుషులకు బాగా దగ్గరయ్యారు. ఎవరూ లేని ఆమెను ఆ ఊరు జనం కొందరు అపురూపంగా చూసుకుంటారు. కొందరు మాత్రం అసలు లెక్కే చేయరు.
అతను తన ఊరు దూరమైనా సరే, గుర్రబ్బండి మీద తరచూ వెళ్లి వస్తూన్నాడు. ఆమెను కలవందే అతనికి పొద్దుపోదు. ఆమె ఎద మీద తలవాల్చి నిద్రపోనిదే చీకటి తెలవదు. రోజు రోజుకి ఆమె బాగా మెతక అని అర్థం చేసుకున్నాడు. తను పెట్టిన పరీక్ష ఏంటో? దాంట్లో విజయం సాధిస్తాడో లేదో అర్థం కావడం లేదతనికి.
రాతి గుట్టల మీద కబుర్లాడే వాళ్ల దగ్గరికి ఒక పిట్ట వచ్చింది. రెక్కలు రెపరెపలాడిస్తూ ఉంది.
చేతిలోకి తీసుకొని కూ.. కూ.. అంది.
పిట్ట మాత్రం కిచ్ కీచ్ మంది. మరోసారి.. ఇంకోసారి ప్రయత్నించాక పిట్ట మొదిసారిగా కూ.. అంది. కొండ కోనల్లో కూ.. కూ అని సంగీతాన్ని పలికిస్తూ తిరిగింది.
“ఆ పిట్టకు పాడటం నేర్పించింది నువ్వా?” ఆశ్చర్యంగా చూశాడు.
“నీకూ నేర్పనా?” అంది. నవ్వి ఊరుకున్నాడు.
“ఇంతకీ నా గురించి పెట్టిన పరీక్ష ఏమిటి?”
అతిథి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి “బాధ్యత, భావుకత” అంది గంభీరంగా.
“మరి అందులో నేనింకా ఏం నిరూపించుకోవాలి”
“అసలు ఇప్పటిదాకా ఏం చేసావని”
“సున్నితమైన నా మనసు, ప్రవర్తన ఏంటో తెలియలేదా?”
“పురుషుడు స్త్రీ దగ్గర తొలి దశలో ఇలాగే ఉంటాడు అసలు తత్వం బయటపడేది మలిదశలోనే” అతిథి.
“సరే, మలిదశ ఇప్పుడు ఎలా?” అతను.
“ఇప్పుడే, ఏది ఒక కవిత చెప్పు” అతిథి.
అతను చిరునవ్వు నవ్వి, రెండు నిమిషాలు ఆగి, ధ్యానముద్రంలోకి వెళ్ళినట్టుగా వెళ్లి, గొంతు సవరించి మొదలుపెట్టాడు…
“కాలాన్ని కొలుస్తూ తిరిగే మనసు గడియారం.
నీ కళ్ళకు పుట్టిన తారలు కాంతిని విరజిమ్మాయి.
మాటలకు దారాలు కట్టి నింగిలోకి ఎగరేశాము.
నవ్వులకు అత్తరు పూసి సువాసనలు ఆఘ్రానించాము.
చెవులకు పూసిన నీ కబుర్ల పుష్పాలకు లేపనం రాశావో,
నేను నువ్వుగా అయిన చోట,
మోహాన ఊపిరిని పచ్చబొట్టుగా వేసావు.
ధూళిని లోకానికి విభూది గా రాశావు,
నీ ఆటకు తోడుగా, పాటకు రాగంగా నేనున్నాను, మనమిద్దరం ఈ ఇంద్రజాలాన్ని మళ్లీ మళ్లీ చేద్దాం”
అది విని ఆమె కంట నుంచి జారిన ధార నేరుగా నదిలో బొట్టు బొట్టుగా పడింది. నదికి కదలిక వచ్చింది.
“ఇదంతా నిజమేనా? నువ్వు ఈ మాటల మీద నిలబడాలి” అంది
“నన్ను నువ్వు ఇంకా నమ్మడం లేదా?” చిన్న బుచ్చుకున్నాడు.
“చెప్పినవన్నీ బాధ్యతగా అనుసరించాలిగా!” అతిథి.
“నీతో వాదించకూడదు అనుకున్నాను. అయినా తప్పడం లేదు. మనుషులను నమ్మవా నువ్వు” అతను.
“ఒకప్పుడు నమ్మేదాన్ని,” అతిథి మెల్లగా అంది.
“అంతగా ఆలోచిస్తే లేనిపోని అపనమ్మకాలు బలపడతాయి, ఇలా రా” గుట్టల మీద నుంచి చెరువు దగ్గరికి తీసుకొచ్చాడు.
ఆరోజు చెరువులో విహారానికి వెళ్లి ఆమె అనుమానాలూ, దిగుళ్లు పోగొట్టాడు. సాయంత్రం దాకా సంతోషంగా గడిపారు. చీకటి పడుతుండగా “నువ్వు కూడా మునుపటి వాళ్ళలా కాక నాతో చాలా సున్నితంగా ప్రవర్తిస్తున్నావు. నీ లాంటి వాడిని చూడలేదు” అంది అతిథి.
ఇదే తను పెట్టిన పరీక్ష కాబోలు, అనుకొని “నువ్వు వాళ్లని ప్రేమించావా?” అన్నాడు.
“లేదు. వాళ్ళే నన్ను ప్రేమిస్తారు. నిజానికి అలా నాటకం ఆడతారు, పోతారు. వాళ్ల మీద ఏ ద్వేషం ఉండదు. విరక్తి తప్ప” దిగులుగా అంది.
మౌనంగా ఉన్నాడు.
ఏకాంతాలలో ఇద్దరి మధ్య దగ్గరతనం పెరిగింది. కొండగుట్ట మీద కూర్చొని ఉన్నారు ఇద్దరూ.
“అవునా” ఎత్తైన ఆమె వక్షం అతనికి సేద తీరుస్తోంది.
“నీ వక్షం అద్భుతం, అది నాకు కావాలి” అన్నాడు.
వింతగా చూసి “ఏమైంది నీకు? అది నాకు పుట్టుకతో వచ్చింది” అంది.
మొహం మాడ్చుకున్నాడు. పొడవాటి చెట్లను కోసుకుంటూ వచ్చే గాలి. అతిథి ఇంకేం మాట్లాడలేదు. చల్లటి వెన్నెలలో కాసేపటికి ఆమెకి నిద్రపట్టింది. మత్తు ఇచ్చి ఆమె వక్షాన్ని కోయడం మొదలుపెట్టాడు. కాసేపటికే కోత పూర్తయింది. రక్తం ధార పోతూ ఉంటే ఆమె వొళ్ళు బాగా తిమ్మిరెక్కింది. అతిథికి తనకి ఏం జరిగిందో అర్థమైంది. అతన్ని ఏమీ అనలేదు. నొప్పిని భరిస్తూ ఆకుపచ్చని ఆమె వస్త్రాన్ని రక్తానికి అడ్డుగా కట్టుకొని “మనం ఈ తెప్పలో నది అవతలికి వెళ్దాం” అతిథి గంభీరంగా అంది.
అతను రక్తపు చేతులు దాచుకున్నాడు. తనకేం తెలియదన్నట్టే ఉన్నాడు “ఎందుకు?” అన్నాడు.
అతని మొహాన్ని చూడకుండానే కిందకు దిగింది.
అనుసరించాడు. మొదటినుంచి ఈ ఒక్క చర్య మారట్లేదు.
***
కాసేపటికి నది ఒడ్డుకు చేరుకుంది. వడివడిగా వెళుతున్న ఆమెను తిప్పలు పడి అనుసరించాడు. ఆ నడిరాత్రిలో ఇద్దరూ తెప్పలో కూర్చుని బయలుదేరారు. తెప్పను ఆమె నడుపుతోంది. ఆమెకది అలవాటే. ఒంటి నుంచి రక్తం ధారగా నదిలో కలుస్తుంది. అతిథి నీరసపడుతోంది. అతడు జాలి లేనట్టే దర్జాగా కూర్చున్నాడు. హాయిగా ఉన్నాడు. తెప్ప వెళుతోంది. వెనకాల ఎవరో ఈదుతూ వస్తున్నారు. నిజానికి వెంబడిస్తున్నారు.
“మనం ఎక్కడికి వెళ్తున్నాము” అతను.
“నా పరీక్షలో నువ్వు ఓడిపోయావు. ఇక ముగింపు మిగిలి ఉంది” అతిథి.
తను చేసిన విపరీత చేష్ట దీనికి కారణమని అతనికీ అర్థమైంది. ఇప్పుడు ఏం చేయబోతుందో అర్థం కాలేదు.
ఈదుతూ వెంబడించిన వాడు దగ్గరకు వచ్చేసాడు. చూస్తే ఓ ముసలి వ్యక్తి. కోపంగా వస్తున్నాడు. అతను ఆమెని వేగంగా పొమ్మన్నాడు. “త్వరగా” కసిరాడు.
అతిథి నీళ్లలోకి చూసి “ఇతను మళ్ళీ వచ్చాడా” అంది కోపంగా
“ఎవరతను?”
“నీ కన్నా ముందు నా ఇంటి వాడు” అతిథి.
అతనికి చిర్రెత్తింది. ముసలోన్ని ముందుకు నెట్టాడు.
కొట్టాడు. అతని ఆగడానికి తెప్పంతా అతలాకుతలమైంది. ఆమె అతని కన్నా బలవంతురాలైనా, శక్తి ఉన్నా ఏమీ అనలేదు. ముసలోడు దగ్గరకు చేరుకున్నాడు. ఇద్దరి మధ్యా పోరు. గాయాలు ఆమెని హింస పెడుతున్నాయి. ధైర్యం సన్నగిల్లి ఏడుస్తుంది. ఆ ఏడుపు విని ఎక్కడో ఉన్న పక్షులొచ్చి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. తెప్ప చుట్టూ భీకరంగా అరుస్తూ తిరుగుతున్నాయి. వాటి స్పందన చూసి ఆశ్చర్యపోయాడతను.
ఆమె కళ్ళల్లో నదులు పొంగాయి. నీళ్లలో అలజడి, నింగిలో అలజడి. ఊగి ఊగి తెప్ప తిరగబడింది. ఆమె పూర్తిగా నీళ్లలోకి జారిపోయింది. అతను సైతం నీళ్లలో మునిగాడు.
***
నదిలో చంద్రుడి సాక్షిగా ఒంటరి తెప్ప తేలుతోంది. చాలాసేపటికి నీళ్లలో నుంచి బయటికి వచ్చారు ఇద్దరు పురుషులు.
అతిథి జాడ లేదు.
“ఏమైపోయింది అతిథి! తన ఆనవాలు ఎక్కడ? తనకు తిండి నీరు శక్తి అన్నీ ఇచ్చింది ఆమే” అతనికి గట్టిగా అరవాలని ఉంది. నెమ్మదిగా పరికించి చూసాడు. గట్టున అల్లంత దూరం వరకూ ఆమె అడుగులు ఉన్నాయి. అక్కడ నుంచి మాయమయ్యాయి. అక్కడిదాకా పరిగెత్తి చుట్టూ చూశాడు. ఎక్కడా ఆమె జాడే లేదు.
ముసలాయన “తప్పంతా నీదే, ఆమెను కొల్లగొట్టావు. దోచుకున్నావు. ఆమె మొత్తం నీ సొంతం అనుకున్నావు” అని రంకెలేశాడు. అంతలోనే దూరంగా అతిథి అడుగులు మాయమైన చోట భూమి నెర్రలు ఇచ్చింది. పచ్చని మొలకేదో మొలకెత్తింది. అది విరాట్ రూపంలా క్షణాల్లో ఆకాశానికి ఎదుగుతూ పోయింది. ఒళ్ళు విరుచుకున్న వృక్షం నుంచి తల దించి చూసింది అతిథి. తన కళ్ళలో నిప్పులు. తన చేతులు శాఖోపశాఖలుగా మారాయి. కురులు ఊడలుగా సాగాయి. ఊడలు వాళ్లదాకా పాకి ఆ ఇద్దర్నీ చెరో ఊడా చుట్టేసుకుంది. తన లోనికి లాక్కుంది. ఈ మహా ప్రళయానికి ఎలా స్పందించాలో ఇద్దరికీ అర్థం కాలేదు. హాహాకారాలు చేసారు. తప్పయిందని వేడుకున్నాడతను.
“నాకెందుకు శిక్ష?” అని అడిగాడు ముసలాయన.
అతిథి ఎవరికీ సమాధానం చెప్పలేదు. క్షణ క్షణానికీ ఊడలు బిగుసుకుని ఎముకలు పటపటలాడించాయి. మరింత బిగుసుకొని వాళ్ళ శరీర భాగాలు చిదిగిపోయాయి. ఇంకాస్త బిగుసుకొని రాలిన ఆకుల్లా తునాతునకలయ్యి పడ్డాయి. చుట్టూ మాంసపు ముద్దలు, కొన ఊపిరితో జవజవలాడుతున్నాయి.
పక్షులన్నీ తిరిగి ఆ చెట్టు మీదకి వచ్చి చేరాయి. నదిలోని నెత్తురు వెలసిపోయింది. అక్కడ ప్రశాంతత అలుముకుంది. మళ్లీ తెల్లవారితే నిండైన శరీరంతో, అదే ఆకర్షణతో పొలిమేర దగ్గరకి అతిథి చేరుకుంది… కొత్త వరుడి కోసం.