భూమాత నవ్వింది

0
3

[dropcap]ఆ[/dropcap] రోజు ఆదివారం.

మృగశిర కార్తె సగం పాదం దాటింది. నిన్న రాత్రి కురిసిన తొలకరి వాన జల్లులకు రైతుల గుండె ఉప్పొంగింది. రెండు నెలలుగా పని లేకుండా తిరిగిన వారికి చేతినిండా పని దొరికింది. రైతులందరు వారి వారి పొలాల్లో దుక్కి దున్నే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. భూమయ్య కూడా తన పొలములో దుక్కి దున్నేందుకు అనువుగా పొలంలోని ముళ్ళు. గుబురుగా పెరిగిన చెట్లను తీసి వేస్తున్నాడు.

ఇంతలో వేగంగా రెండు టాక్టర్లు పొలములోకి వచ్చి దున్నడం మొదలు పెట్టాయి. భూమయ్య ఆశ్చర్యపోయాడు. ఏమి జరుగుతోందో తెలుసుకునే లోగా మోటార్ బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చి ఏవేవో సైగలు చేసుకుంటూ పొలములో అటు ఇటు నడుస్తున్నారు. వారిని చూసి భూమయ్య ముందు భయపడినా క్రమంగా ధైర్యం తెచ్చుకొని “ఏమిటి రా ఈ పని” అడిగాడు.

ఎవరు మాట్లాడలేదు ట్రాక్టర్‌కు ఎదురుగా వెళ్ళాడు. ఇద్దరు యువకులు, ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు కలిసి భూమయ్య దగ్గరకు వచ్చి

“ఇది మా తాత జాగా, అడ్డు తప్పుకో” నలుగురు అన్నారు.

ఊహించని పరిణామానికి కొద్దిసేపు బొమ్మలా నిలబడిపోయాడు. తర్వాత తేరుకుని పక్కకు తప్పుకొని దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఇరుగు పొరుగు పొలాలలో రైతులు వారి పనులు ఆపి వింతగా చూస్తున్నారు కానీ భూమయ్యకు మద్దతుగా రావడం లేదు. ముప్పది నాలుగు సంవత్సరాల నుండి సాగుచేస్తున్న పొలంలోకి ఇనుప యంత్రాలు వచ్చి పొలం దున్నుతుంటే. ఆ నాగళ్లు తన గుండెలను చీల్చుకొని ఉన్నట్లుగా విలవిలలాడి భూమయ్య. ఆ నలుగురు భూమయ్యకు స్వయానా తమ్ముళ్ళ కుమారులు. వారు ఉడుకు రక్తంతో రగులుతున్నారు. తాను ముసలివాడు. ఇప్పుడు వారిని ఎదుర్కొనే శక్తిలేదు. మౌనంగా ఇంటిదారి పట్టాడు. కడుపులో దుఃఖాన్ని కళ్ళల్లో నీళ్ళు నింపుకొని అడుగులు వేయడానికి వణుకుతున్న కాళ్ళను అదిమి పట్టి వికలమైన మనసుతో ఇల్లు చేరాడు.

భూమయ్యకు ఇద్దరు తమ్ముళ్లు. భూమయ్య చిన్ననాటి నాటి నుండే తండ్రికి పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉండి పెద్ద కొడుకుగా తన ధర్మాన్ని నిర్వహించాడు. భూమయ్య చేతికి అందాక వారి తండ్రి ఇరవై ఎకరాలు ఆస్తి సంపాదించాడు. భూమయ్యకు పెద్ద తమ్మునికి వయసులో తేడా పన్నెండు సంవత్సరాలు. మధ్యలో ఇద్దరు ఆడపిల్లలు. కుటుంబం వేరు పడే నాటికి వారి ఆస్తి ముప్పయి ఎకరాలు దాటింది.

మూడు దశాబ్దాల క్రితం ఒక మంచిరోజు చూసి తన ఆస్తిని మూడు సమాన భాగాలుగా పంచాడు. ముప్పయి గుంటలు (ముప్పావు ఎకరం) పెద్ద కొడుకు ముందు పుట్టి కష్టించి పని చేసాడు కాబట్టి ఆనాడు ఉన్న సంప్రదాయం ప్రకారం భూమయ్యకు జ్యేష్ఠ పాలుగా ఈ అదనపు భూమిని కేటాయించారు వారి తండ్రి. ఆస్తి పంపకాన్ని జరిపించిన పెద్ద మనుషులు బంధువులు ఆ తండ్రి నిర్ణయాన్ని హర్షించారు. భూమయ్య ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. కానీ ఆనాడు సాంప్రదాయానికి భంగం కలిగిస్తే. ఊరిలో మిగతావారు మందలిస్తారు అనే భయంతో కాదనలేదు. పైగా పెద్ద మనుషులు జేష్ఠ పాలు పెద్దకొడుకు ముందుగా ఇస్తేనే మిగతా పంపకాలు చేద్దామని పట్టు పట్టడంతో ముప్పావు ఎకరం స్వీకరించవలసిన వచ్చింది. తను వారి కంటే పది సంవత్సరాల పాటు కుటుంబానికి సేవ చేసి, ఆస్తిపాస్తులు పెరగడానికి కారకుడినయ్యాననే కారణంగా జ్యేష్ఠ పాలు తీసుకోవడం న్యాయమే అనిపించింది ఆ క్షణాన.

ముప్పయి సంవత్సరాలుగా వేరువేరుగా ఉన్నప్పటికి అందరు కలిసి మెలసి ఉమ్మడి కుటుంబం లానే ఉండేవారు. చిన్న చిన్న పండుగలైన అందరూ ఒకే ఇంట్లో కలిసి తినేవారు. వీరి ఐక్యత చూసి చాలా మంది అసూయ చెందేవారు. ముగ్గురు అన్నదమ్ములకు ఇద్దరు కుమారులు మరియు ఒక్క కుమార్తె చొప్పున ఉన్నారు.

మొదటి తరమే కాదు, రెండవ తరమైన పిల్లలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తమ తాతగారు చనిపోయాక ఆయన పేరుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ పది మంది చేత మెప్పు పొందినారు. భూమయ్యకు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నత ఉద్యోగాలు సాధించి జీవితంలో ఎంతో మందికి మార్గదర్శకులు అయ్యారు.

భూమయ్య చిన్నతమ్ముడు గోపయ్య అందరి కంటే తనే తెలివైనవాడు అనే భ్రమలో ఉండేవాడు. రాజకీయంగా ఆదర్శంగా పలుకుబడి సంపాదించి, పంచాయతీలు చెప్పే పెద్దమనిషి స్థాయికి ఎదిగాడు. తన అన్న కుమారులు మంచి ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవ స్థాయిలో ఉంటే, తన కుమారులు ఉద్యోగాలు లేక చెడు తిరుగుళ్ళు తిరగడంతో అన్న కుటుంబంపై ద్వేషం పెంచుకున్నాడు.

అందరూ తమ వారే అనే భ్రమలో భూమయ్య కుటుంబం, గోపయ్య కుటుంబానికి ఎంతగానో సేవ చేసింది. గోపయ్య భార్య అనారోగ్యంగా ఉంటే, ఆ కుటుంబం అండగా నిలబడింది. గోపయ్య అతితెలివి వలన కూతురు పెళ్లి ప్రమాదంలో పడితే ఇద్దరు అన్నలు ముందుండి గోపయ్యను రక్షించారు. తిన్నింటి వాసాలు లెక్కించే ద్రోహిగా ఎప్పుడు అన్నల కుటుంబాలను విడదీయడానికి కుట్రలు పన్నేవాడు.

చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా గోపయ్య లాగా అతని కుమారులు తయారయ్యారు. అప్పులు చేసి తప్పించుకు తిరగడం, గొడవలు పడి ఇంటి మీదికి సమస్యలు తేవడం. తన కొడుకులను సరైన దారిలో పెట్టలేక. అన్న కుటుంబానికి సమాజంలో పెరుగుతున్న ఆదరణ చూసి భరించలేక దినదినానికి, ద్వేషముతో రగిలిపోయాడు.

మేక వన్నె పులి వేషాన్ని పసిగట్టని భూమయ్య కుటుంబము గోపయ్య కుటుంబానికి చేయూతనిస్తూనే ఉంది. భూమయ్య కుమారులు తమ వారు కూడా ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తమకు తెలిసిన విజ్ఞానాన్ని వారికి అందించేవారు. భూమయ్య పెద్ద తమ్ముని కొడుకుకి ఉద్యోగం వచ్చింది, గోపయ్యకు పిచ్చి పట్టి నట్లయింది.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజు రోజుకి గోపయ్య రాజకీయంగా శక్తివంతుడు అయ్యాడు. ఆర్థిక బలం, అంగ బలం పెరిగింది. భూమయ్య కుటుంబాన్ని దెబ్బ కొట్టడానికి పథకాలు రచిస్తూనే ఉన్నాడు. భూమయ్య పెద్ద తమ్ముని మరణంతో వారి కుమారులను తన వైపు తిప్పుకుని భూమయ్య ఇచ్చిన జేష్ఠ పాలు స్వాధీన పరిచే పథకాన్ని అమలు పరిచాడు.

భూమి విలువకు రెక్కలొచ్చాయి. వారికి డబ్బులపై ఆశలు కలిగాయి. గోపయ్య ఆడే చదరంగంలో పావులుగా మారి పెద్దనాన్నను బెదిరించి ప్రేమతో ఇచ్చిన జ్యేష్ఠ పాలు గల ముప్పావు ఎకరం తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాక్టర్లతో దున్నేసారు. ఏదో విజయం సాధించామని గర్వంతో దుమ్ము లేపుకుంటూ అక్కడి రైతులు అందరూ చూస్తుండగానే కేరింతలు పెడుతూ గెంతులేసారు ఆ నలుగురు.

“మా నాన్న నాకు ప్రేమగా కష్టానికి ప్రతిఫలంగా ఇచ్చాడు. నేను అడగలేదు కదా! ఇప్పుడు కూడా మా పెద్ద తమ్ముని కుమారులైన, చిన్న తమ్ముడైన జ్యేష్ఠ పాలు తిరిగి ఇవ్వుమని అడిగితే ఇచ్చే వాన్నిగా, ఇలా పెద్దా, చిన్నా మొహం చూడకుండా సరాసరి పొలంలోకి రావడం ఏమిటి?” బంధువులు, పెద్ద మనుషులు దగ్గర వాపోయాడు.

తన జాగా పోయినందుకు బాధ లేదు. తీసుకునే విధానాన్ని భరించలేక పోతున్నాడు.

“మాకు ఉద్యోగాలు ఉన్నాయి నాన్న, ఆ ఇరవై గుంటల పొలం గురించి మర్చిపో, అటువంటివి ఎన్నో సంపాదించగల విజ్ఞానాన్ని అందించావు.” కుమారులు ఇద్దరు నచ్చచెప్పారు.

భూమయ్య గుండె చెరువు అయింది తమ్ముని కుటుంబానికి, తను తన భార్య పిల్లలు ఎంతో సేవ చేశారు. కృతజ్ఞత మరిచి పోయినా పరవాలేదు. నమ్మకద్రోహం చేసాడు. ప్రేమగా అడిగితే తన ఆస్తి మొత్తం ఇచ్చేవాణ్ణి కదా. తన కంటే ఎక్కువ ఆస్తి ఉంది. కేవలం మానసింకంగా తనను బలహీన పరచడానికి ఈ కుట్రలు చేస్తున్నాడని అర్థమైంది.

ఒకప్పుడు పైసా ఖర్చు లేకుండా పంచాయతీలు నిర్వహించే పెద్ద మనుషులుండేవారు. ఇప్పుడు పైసలే పెద్ద మనుషుల చేత పంచాయతీ నడిపిస్తున్నాయి.

రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది.

“ఎప్పుడో ఇచ్చిన భూమి ఇప్పుడు తీసుకోవడం న్యాయం కాదు. మంచిది కాదు కూడా”

“ఇలా ఒక్కరు తిరగబడితే, మిగతావారికి దారి చూపినట్లయితది”

“మీ అన్న కష్టార్జితం. అది తిరిగి తీసుకుంటే మీ నాన్న గారి ఆత్మ క్షోభిస్తుంది”

“నలుగురికి తలా అయిదు గుంటల జాగా వస్తది. దానితో కోటలు కడతారా, భవంతులు నిర్మిస్తారా”

పెద్ద మనుషులు తలా ఒక మాట చెబుతున్నారు. కొందరు ఇది పద్దతి కాదని నచ్చచెప్పేలా చూసారు. నలుగురిని ముందు నిలబెట్టి గోపయ్య చక్రం తిప్పుతున్నాడు. అతని మాయలో మునిగిన వారు కృతజ్ఞత మరిచి మెండి వాదనకు దిగారు. అసలైన పెద్ద మనుషులు అప్పుడు వచ్చారు. పది రోజుల నుండి గోపయ్యతో తమకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని అతనికి అనుకూలంగా మాట్లాడటానికి ముందస్తు తాయిలాలు అందుకున్న నాయకులు. వచ్చి రావడంతోనే “జ్యేష్ఠ పాలు లేదు, గీష్ఠ పాలు లేదు. తండ్రికి ముగ్గురు కొడుకులు సమానమే. జాగా తిరిగి ఇవ్వాల్సిందే” గట్టిగా వాదించారు.

తర్జన భర్జన గొడవల మధ్య పంచాయితీ వచ్చే అదివారానికి వాయిదా పడింది. రెండు మూడు వారాలు కూడా గడిచైనా ఎటు తేలలేదు. పొలం ఇచ్చేస్తానని భూమయ్య చెప్పినా ఊరిలో కొంతమంది ఇది కొత్త సమస్యలకు దారి చూపుతుందని సర్ది చెప్పారు.

జ్యేష్ఠ పాలు తిరిగి ఇచ్చేస్తే తదనంతరం తమ తమ్ముళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారని పెద్ద కొడుకులందరు భూమయ్య వెంట నిలబడినారు. గోపయ్య గెలిస్తే తాము జ్యేష్ఠ పాలు భూములను తీసుకోవచ్చనే అత్యాశతో తమ్ముళ్ళందరు గోపయ్యను రెచ్చగొట్టారు.

భూమయ్య తరపున నలుగురు, గోపయ్య తరపున నలుగురు పంజీలు (పంచాయతీ పెద్దలు) ప్రతి ఆదివారం సమావేశమవుతూనే ఉన్నారు. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చవుతున్నాయి. ఊరు మొత్తం ఎటువంటి తీర్పు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నది. నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది.

ఒక్కడి స్వార్థ బుద్ధి పదిమందికి ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి కుటుంబ గౌరవాన్ని నడివీధిలో తూకం వేసి నవ్వుల పాలు చేసింది. నాలుగు రోజులుండి పోయే ఈ మనుషులకు తనపై ఇంత పిచ్చి ప్రేమెందుకోనని భూమాత ఫక్కున నవ్వింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here