వాళ్ళు అరుదు

0
4

[dropcap]బ[/dropcap]స్సు బయల్దేరింది. “టికెట్ తీసుకోండి, టికెట్” అంటూ లేచి టిక్కెట్స్ ఇవ్వడం ప్రారంభించాడు కండక్టర్.

“సునందా, అనకాపల్లికి నాకూ ఓ టికెట్ తీయవూ. నా దగ్గర చిల్లర లేదు. దారిలో పూలు కనిపిస్తే కొనేసి పెట్టుకున్నాను” చెప్పింది లలిత చక్కగా నవ్వుతూ.

ఆ మాట వింటూనే, ‘నాకీ శాస్తి జరగాల్సిందే, ఉత్సాహంగా నన్ను చూసి పక పకా నవ్వితే, పక్క పక్క ఇళ్ళ వాళ్ళం కదా అని పొరబాట్న పళ్ళికిలించి పక్కన కూర్చోవడం నా తప్పైంది’ అని మనసులో అనుకుని, “సరే అక్కా” అంటూ అవదం మొహంతో టికెట్ తీసింది సునంద.

“డబ్బులు నీకు తరువాత ఇస్తాలే” అంది లలిత.

సునంద సరే అన్నట్టు తలూపి, ‘నీ మొహం సంతకెళ్ళా, ఇలా ఎన్ని సార్లు చెప్పి అఘోరిస్తావ్! మొన్నేగా ఆకుకూరల వాడికి ఇవ్వడానికి చిల్లర లేదని పది రూపాయిలు తీసుకున్నావ్. మొన్నోసారి కూరగాయలకని తీసుకున్నావ్. ఆ తర్వాత పూలూ, పళ్లూ కొనేప్పుడు తీసుకు తగలడ్డావ్, ఇలా చాలా సార్లు. అప్పటికీ ఓ సారి, లేవు అక్కా అని మొహం మీదే కొట్టినట్టు చెప్పేసాను. అప్పుడు అయినా అర్థం చేసుకోవాలి కదా. అబ్బే మళ్ళీ అదే తంతు. ఛ’ అనుకుంది మనసులో.

మరుసటి రోజు కూరగాయలావిడ రాగానే, “రా కొండమ్మా రా. నీ కోసమే చూస్తున్నాను. నాకు ఆఫీసుకి టైమ్ అయిపోతోంది. కొంచెం ఆ మునిసిపల్ కొలాయి తిప్పి, ఆ నాలుగు స్టీల్ బిందెలలో నీళ్ళు పట్టవూ” అడిగింది లలిత.

“వాట్ ఈస్ దిస్ అమ్మగోరూ! రోజూనా. మీ బిందంటే పడతాను కానీ, ఈ గ్రూపు హౌస్‌లో అందరివీ పట్టాలంటే చెడ్డ డిఫికల్ట్ అమ్మగారూ” .

“పడుదూ, ఏం పోయింది. ఈ సారి వాళ్ళు నీ దగ్గర కూరగాయలు కొంటే, బేరం ఆడకుండా కొనమని అడుగు” అంటూ నవ్వి, “అలాగే రెండు రకాల కాయగూరలు, అరకేజీ చప్పున బయట ఆ ప్లాస్టిక్ బుట్టలో వేసి మూత పెట్టు. అలానే, మీ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడూ సరే. అందుకని నువ్విలా ఇంగ్లీష్ని, జుంగ్లీష్ బాషగా మార్చనక్కరలేదు.” అనేసి చెప్పులు వేసుకుని ఆఫీసుకి బయల్దేరబోతోంది.

అప్పుడే గుమ్మం దగ్గర, “అమ్మా, కొంచెం ధర్మం చేయండమ్మా” అరిచాడో ముష్టోడు కాస్త నిర్లక్ష్యంగా గడ్డం నిమురుకుంటూ.

అతని వంక ఎగాదిగా దీర్ఘంగా చూసిన లలిత, అక్కడ ఉన్న కాస్త పొడుగు కర్ర తీసుకుని, వాడి వైపుకు వేగంగా నడిచింది. అది చూసిన ఆ ముష్టోడు ‘వారి దేవుడో, ఈమె వాలకం చూస్తుంటే నన్ను ఆ కర్రతో చితక్కొట్టి చంపేసేలా ఉందిరా బాబోయ్. ఇపుడు నేనేం చేయాలి, దగ్గరకి వచ్చేసింది.ఇపుడు గానీ నేను వెనక్కి తిరిగితే, ఆ కర్రతో వెంటపడి మరీ నన్ను బర్రెని బాదినట్టు బాదే అవకాశం ఉంది’ అని ఒక కాలు పైకెత్తి పరిగెత్తాలా వద్దా అని ఆలోచిస్తుండగా

“స్టాప్, ఎత్తిన కాలు దించి అక్కడే ఆగు” అంది లలిత.

“అమ్మగారు, అమ్మగారూ, చిల్లర వేయకపోతే పోయింది కానీ, ఆ కర్రతో మాత్రం చితక్కొట్టకండి” అంటూ చేతిలో బొచ్చె కింద పడేసి గజగజా వణికిపోసాగాడు వాడు.

“భయపడకు, ఈ కర్ర తీసుకో. ఈ కాలువ సరిగా పారక ఒకటే దుర్వాసన. కొంచెం ఈ కర్రతో ఈ కాలువ పూడిక తీయి. డబ్బులు రేపు ఇస్తాలే” చెప్పి ముందుకు నడిచింది లలిత.

లలిత వెళ్లిపోయాక, కాయగూరలు కొనడానికి వచ్చిన సునంద, “చూశావా కొండమ్మా, ఆఖరికి ముష్టివాడ్ని కూడా వదల్లేదు. ఆమె వాడుక అలా ఇలా ఉండదు. అందుకే ఆమె కూరలు, పళ్ళు కొనేటప్పుడు నేను రావడం మానేసాను. ఈ మధ్య కాస్త దూరంగా కూడా ఉంటున్నాను. వాళ్ళాయన కూడా ఈమె బాధ పడలేకే హైదరాబాద్ వదిలి రావడం లేదు కాబోలు” అంటూ నవ్వింది.

తర్వాత రెండ్రోజులకి, సునంద ఇంట్లోకి చనువుగా వచ్చిన లలిత, “సునందా ఈ చీర ఎలా ఉందో చూడు” అడిగింది, కవర్ లోనుండి చీర బయటకి తీస్తూ.

“బావుంది, కానీ ఎందుకక్కా” అడిగింది సునంద.

“ఏం లేదురా. నాకు హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయింది. మీ బావగారు అక్కడే ఉంటున్నారు కదా, అందుకే ఎప్పటినుండో అడిగితే ఇప్పుడు మా కంపెనీ వాళ్ళు కనికరించారు. మా చెల్లి కూడా నల్గొండలోనే ఉంటోంది. దానికీ ఓ చీర కొన్నాను. నువ్వూ నాకు చెల్లెలివే, అందుకే నీకు ఈ చీర కొన్నాను. నీ దగ్గర నేను అప్పుడప్పుడూ తీసుకున్న మొత్తం ఎనబై రూపాయిలు. అవి నేను తిరిగి ఇవ్వను.ఎందుకంటే, నువ్వు నా దగ్గర నుండి నూనె బాటిల్ తీసుకుని డబ్బులు ఇవ్వడం మరిచిపోయావు. అయితే, నూనె ఎవరి దగ్గరనుండీ ఊరికే తీసుకోకూడదని అంటారు. అందుకే, ఆ మొత్తం నేరుగా అడిగితే ఏమైనా అనుకుంటావని, అలా నీ వద్ద నుండి వసూలు చేశాను. నువ్వు ఏం పట్టించుకోవని తెలుసు. నేనే ఉండబట్టలేక విషయం చెప్తున్నాను” చెప్పింది లలిత.

సునందకి నోట మాట రాలేదు. బిక్క మొహం వేసి చెక్క బొమ్మలా చూస్తుండిపోయింది. కాసేపటికి, లలితని పట్టుకు ముద్దు పెట్టుకుని “సారీ అక్కా, బోలెడు సారీలు. నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు” అంది.

“సరే, నీ పెళ్ళికి మర్చిపోకుండా పిలువు. తప్పకుండా వస్తాను” చెప్పి అక్కడినుండి వచ్చేసింది లలిత.

అప్పటికే కొండమ్మ వచ్చి, కొలాయి నీళ్ళు పట్టేసి, ఇంటి బయట లలిత కోసం చూస్తోంది. లలిత వచ్చి, “ఈ చీర నీకు” అంటూ అందించింది.

కొండమ్మ ఎంతో సంతోషపడిపోయి “చాలా థాంక్యూలమ్మగారూ. నైస్ రంగు అండ్ హంగు”

తర్వాత కాసేపటికి, “అమ్మగారూ” అంటూ పిలిచిన ముష్టోడి దగ్గరకి వెళ్ళి, “ఉండు అన్నం తెస్తాను” అంది.

“వద్దమ్మ గారూ, మీ దయవల్ల ముష్టెత్తుకునే అలవాటు తప్పిపోయింది. అన్ని వీధుల్లోనూ వారానికో మారు ఇలా కాలువ పూడిక తీయడం చేస్తున్నాను. అందరూ ఎంతో కొంత ఇస్తున్నారు. ఇదంతా మీ చలువే. ఇదిగోoడి మీ కాలువ చెత్త పూడిక తీసేసాను” చెప్పాడు తల గోక్కుంటూ.

“శభాష్. ఇలాగే కొనసాగు, ఇదిగో ఈ యాభై ఉంచుకో” అంటూ డబ్బులిచ్చిందామె.తర్వాత రెండ్రోజులకి లలిత హైదరాబాద్ వెళ్లిపోయింది.

సునంద కాయగూరలు కొంటోంది. “లలితక్క బోళా మనిషి కొండమ్మా. లలితక్క ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి కొద్ది రోజులే అయినా, నెలలు అయినట్టు ఉంది.ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు అరుదు” చెప్పి అక్కడినుండి కదలబోయింది.

“యెస్ అమ్మగారూ, ఇది వరకు నా దగ్గర ఈ ఇళ్ళలో ఎవరూ వెజిటబిల్స్ కొనేవారు కాదు. గత వారంగా అందరూ పర్చేసింగ్. ఆ విషయమే వాళ్ళని అడిగితే, హర్రీ బర్రీలో ఇది వరకు, టాప్ వాటర్ కొన్ని సార్లు పట్టలేక పోతే కొనుక్కునేవారట.ఈ మధ్య నేను టాప్ వాటర్ పడుతున్నాగా. వారు ఇప్పుడు నీళ్ళు కొనుక్కోవడం లేదట. ఇంత హెల్పింగ్ చేస్తున్నావ్, మరి నీ దగ్గర కాయగూరలు కొనకపోతే ఎలా అన్నారు వారు. లలితమ్మగారు ఏం చేసినా ఓ అర్థం ఉంటాదండీ.” చెప్పింది కొండమ్మ.

“అవును, రేపు అక్కకి ఫోన్ చేస్తాను. ఇద్దరం మాట్లాడదాం” చిరునవ్వుతో చెప్పి అక్కడినుండి కదిలింది సునంద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here