అపురూప రాయి

0
3

[dropcap]రు[/dropcap]ద్ర, వంగ రాజ్యాల మధ్య ఒక పెద్ద కొండ ఉంది. చిత్రమేమిటంటే ఆ కొండను ఎవరూ పూర్తిగా అధిరోహించలేదు.

ఒక రోజు రుద్ర రాజ్యానికి చెందిన మేకలు మేపుకునే గోపయ్య మేకల్ని మేపుకుంటూ కొంత కొండ ఎక్కాడు. వాడికి కొండ ఆగ్ర భాగాన మెరుస్తున్న ఒక పెద్ద రాయి కనబడింది! దాని మెరుపులు చూసి వాడు ఆశ్చర్యపోయాడు. కానీ, మేకల్ని వదలి అంత ఎత్తుకు ఎక్కి దానిని చూడాలనే సాహసం వాడు చెయ్యలేక పోయాడు.

వాడు ఆ సాయంత్రమే పరుగు పరుగున వెళ్ళి రుద్ర రాజ్యం రాజుగారి భటుడికి మెరుపు రాయిని గురించి వివరించాడు. ఆ సంగతి భటుడు రాజు కాలసింహుడికి వివరించాడు.

ఆ రాయిని గురించి తెలిపిన గోపయ్యకు మంచి బహుమతి ఇచ్చాడు రాజు.

అ రాయిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని తన ఆస్థానంలో రాళ్ళ నాణ్యతను పరిశీలించే శాస్త్రజ్ఞడు సాంఖ్యవర్మను ఆదేశించాడు.

రాజుగారు, సాంఖ్యవర్మ పరివారాన్ని వెంటబెట్టుకుని కొండ వద్దకు వెళ్ళి అతి కష్టం మీద ఆ కొండ ఎక్కి ఆ మెరుపు రాయి వద్దకు చేరుకున్నారు. సాంఖ్యవర్మ ఆ రాయిని తన శాస్త్ర విజ్ఞానంతో పూర్తిగా విశ్లేషించి అది అపురూపమైన ‘లాలాజులి’ అనే శిలగా నిర్ధారించాడు. అది అపురూపమైనదని దాని వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, అది వైద్యంలో కూడా ఉపయోగ పడుతుందని, కొండలోపల ఇంకా రాయి ఉండవచ్చునని, దానిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అపారమైన విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని, తద్వారా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని సాంఖ్యవర్మ వివరించాడు.

మంచి విషయం చెప్పినందుకు సాంఖ్యవర్మకు పచ్చల హారం రాజు బహూకరించాడు.

తరువాత ఆ కొండను ఎవరూ ఎక్కకుండా చుట్టూ కందకం, కంచె వంటి ఏర్పాట్లు చేయించాడు రాజు కాలసింహుడు.

ఈ విషయం వంగ రాజ్యం రాజు దేవరాయలుకి తెలిసింది. వెంటనే దేవరాయలు తన రాజ్య చిత్రపటం తెప్పించి హద్దులు పరిశీలించాడు. అందులో ప్రస్ఫుటంగా ఆ కొండ తూర్పు వైపు భాగం కొంత తన రాజ్యంలో ఉంది. అంటే అది రెండు రాజ్యాలకి సంబంధించిన కొండ.

ఆ అరుదైన రాయిలో తమ రాజ్యానికి కూడా భాగం ఉందని సగం తమకు ఇవ్వాలని తన దూత ద్వారా కాలసింహుడికి కబురు పంపాడు. కానీ, అంత విలువైన రాయిని, కొండలో భాగాన్ని వంగరాజ్యానికి కాలసింహుడు ఇవ్వదలచుకోలేదు! పై పెచ్చు ఆ రాయిని తామే గుర్తించాము కనుక దానిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని లేఖ వ్రాయించి దేవరాయలుకి పంపాడు.

ప్రకృతిలో దొరకిన ఖనిజం, భూగర్భ సంపద వంటివి రెండు రాజ్యాల ప్రజలందరికీ చెందుతాయని కొండలోని ఆ విలువైన రాతి సంపద ఇరు రాజ్యాలకు చెందుతుందని దేవరాయలు మరొక లేఖ పంపాడు.

అయినా కాలసింహుడు ససేమిరా కొండలో భాగం ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

ఇక దేవరాయలు మంత్రులతో ఆలోచించి రుద్ర రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు!

ఇరు దేశాల సైన్యాలు ఆ కొండవద్దకే చేరుకున్నాయి. ఇక యుద్ధం మొదలవుతుంది అనుకొంటుండగా కొండమీద రాయి నుండి పెద్ద మెరుపు మెరిసింది! పెద్ద గాలి వీచింది. మెరుపులతో కూడిన రాక్షసుడు కొండ మీద నుండి దిగి వచ్చాడు. ఆ భీకర మెరుపుల ఆకారాన్ని చూసి ఇరు దేశాల రాజులు, సైన్యాలు ఆశ్చర్యపోయి, భయపడిపోయారు!

ఇరు సైన్యాల మధ్య నిలబడి ఆ మెరుపుల రాక్షసుడు ఈ విధంగా చెప్పాడు.

“ఒక విలువైన రాయి కోసం మీ దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి! రాయి ప్రకృతి ప్రసాదించినది. దాని వలన లాభాలు ఇరు దేశాలకు లభిస్తాయి. ఇరు దేశాల ప్రజలు బాగు పడుతారు. ఈ విషయంలో దేవరాయల ఆలోచన బాగుంది. కాలసింహుడు కేవలం స్వార్థంతో ఆ రాయిని, కొండను తీసుకోవాలనుకున్నాడు. అది తప్పు. నేను కొన్ని వేల ఏళ్ళ క్రితం ఈ రాయి కోసం కొంతమందిని చంపిన కిరాతకుణ్ణి! వారికి చేసిన అన్యాయం వలన నేను మెరుపుల రాక్షసుడిగా మారిపోయాను. దీనిని ఎవరైనా కనిపెట్టి దీని వలన లభించే లాభాలు ప్రజలకు పంచి పెట్టిన రోజున నాకు శాప విముక్తి కలుగుతుంది. ఈ కొండను పంచుకుంటే మీ ఇరు రాజ్యాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. అందుకే యుద్ధం మాని ఒకరికి ఒకరు సహకరించుకోండి. లేకపోతే ఇద్దరు రాజులు మెరుపు రాక్షసులుగా మారిపోతారు” అని గట్టిగా చెప్పాడు.

ఇరు దేశాల రాజులు ఈ విషయం మీద సామరస్యంగా చర్చించి యుద్ధం విరమించారు. ఇరు దేశాలు కలసి కొండను త్రవ్వించి అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు.

వీరి ఆలోచనలు గమనించిన మెరుపుల రాక్షసుడు అందరినీ ఆశీర్వదించి మెరుస్తూ ఆకాశానికేసి వెళ్ళిపోయాడు.

అప్పటినుండి రుద్ర, వంగ రాజ్యాలు అనేక విషయాల్లో అభివృద్ధి చెంది, ప్రపంచానికి ఆదర్శంగా నిలచిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here