పులి వేదన

0
3

[dropcap]ప్ర[/dropcap]శాంతంగా ఉన్న అడవి ఉలిక్కి పడింది. నిశ్చలంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా దూరంగా తుపాకీ శబ్దాలు (గన్ షాట్స్), పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. కంగారుపడిన పక్షులు (బర్డ్స్) పెద్ద సంఖ్యలో చెట్ల మీదనుండి ఆకాశం లోకి ఎగిరాయి అరుస్తూ.

చిన్న పెద్ద జంతువుల్లో భయం. అడవి ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. అలాంటి అడవిలో పెద్ద పెద్ద రాళ్ళ మధ్య సొరంగంలా ఉన్న ఒక డార్క్ టన్నెల్ లాంటి దానిలోకి ఒక పులుల కుటుంబం చిన్నపిల్లలతో వచ్చి శబ్దం కాకుండా దాక్కుంది.

అడవిలో పారుతున్న సెలయేరు (స్ట్రీమ్)లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడ నీళ్ళు తాగుతున్న పులి కుటుంబానికి తుపాకీ శబ్దాలు వినిపించగానే వాటికి తెలిసి పోయింది – వేటగాళ్లు (హంటర్స్), ప్రజలు పులిని వెతికి పట్టుకోవటానికి, వీలుకాకపోతే చంపటానికి వచ్చారని.

పులి కుటుంబం నిశ్శబ్దంగా తమ రహస్య స్థావరానికి వచ్చింది పులి పిల్లలతో.

కొద్దిసేపు పులి వేట జరిగింది. కానీ వేటగాళ్ళకి పులి దొరకలేదు. కనీసం కనిపించనే లేదు. విసుగెత్తిన వాళ్ళు అడవిలో బోను పెట్టి వెళ్లిపోయారు. ఇంతలో తెల్లవారింది.

అడవిలో పూర్తి నిశ్శబ్దం. కొన్ని గంటలకి అంతా సాధారణం అయింది. కానీ ఆ పులి కుటుంబం తమ రహస్య స్థావరం నుంచి బైటకి రాలేదు. పులి పిల్లలకి ఆకలి వేస్తే, తండ్రి పులి జాగ్రత్తగా వేటకి వెళ్ళాడు.

సొరంగంలో ఉన్న పులి పిల్లలకి బైటకి వెళ్లవద్దంటే విసుగు కలిగింది. అప్పుడు ఒక పులి పిల్ల అమ్మతో “అమ్మా! నేను ఎందుకు బయటకి పోవద్దు?” అని అడిగింది.

“ఎందుకంటే బయట ప్రమాదం ఉంది కనుక” అంది అమ్మ పులి.

“కానీ అన్ని జంతువులు సంతోషంగా అడవిలో తిరుగుతున్నాయి. నేను కూడా వెళ్తాను” అంది పిల్ల పులి.

“కుదరదు” అంది అమ్మ కోపంగా. కాసేపటికి అమ్మ కూడా బయటకు వెళ్ళింది.

ఇంతలో ఒక కుందేలు ఆ సొరంగం ముందుకి వచ్చింది. దాన్ని చూసిన పులి పిల్లలు సంతోషించాయి.

“ఓయ్ కుందేలూ! మాతో ఆడుకుంటావా?”

“సరే రండి” అంది కుందేలు.

“వద్దు! బయట ప్రమాదం ఉంది, బయటకి వెళ్ళద్దు అంది అమ్మ. మేము రాలేము” అన్నాయి పులి పిల్లలు విచారంగా.

“సరే అర్థం అయింది. మీరు లోపలే ఉండండి.” అంది కుందేలు.

“అవును, మనుషులతో పులులకి ఎందుకు ప్రమాదం?”

“ఓహ్ మీకు తెలీదా? మనుషులు అన్ని అడవి జంతువులకు శత్రువులు. నాక్కూడా.”

“ఎందుకు?”

“మీకు తెలియదా?”

“తెలీదు”

“చెప్తాను. వినండి” అంది కుందేలు. “మాకు మీ పులుల కథని భల్లూ మామ చెప్పాడు”.

“భల్లూ అంటే ఎవరు? మాకు ఏమవుతాడు?” అని అడిగాయి పులి పిల్లలు.

“భల్లూ తెలీదా? ఎలుగుబంటి. మీకూ మామే”

“సరే సరే” అంటూ అర్థమైనట్టు తల ఊపాయి.

“మీ పులులు అడవిలో తిరిగే పిల్లి జాతిలో అతి పెద్దవి.”

“అవునా?” అన్నాయి పులి పిల్లలు ఆశ్చర్యంగా

“అవునట. మీకు తెలుసా మీ నాన్న పులి బరువు ఎంతో?”

“తెలీదు. ఎంత?”

“ఎంత అంటే 300 కిలోలు. సగటున ఆరుగురు పల్లె ప్రజల బరువుకి సమానం”.

“వావ్”

“మీ నాన్న పులి పంజా చూసారా? ఒక్క దెబ్బ గట్టిగా పంజాతో కొడితే గట్టి దెబ్బలు తగులుతాయిట. అమ్మో! అందుకే ఇతర జంతువులం భయపడతాము” అంది భయంగా కుందేలు.

“నిజమా!” అంటూ పులి పిల్లలు వాటి పంజా వైపు చూశాయి.

“మీ పులులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. మిమ్మల్ని పెంచటానికి తల్లి పులికి సురక్షితమైన ప్రదేశం, బోలెడు ఆహారం దొరికే చోటు కావాలి. అందుకే మిమ్మల్ని సొరంగం లోపల దాచింది.”

“ఇప్పుడు తెలిసింది మాకు” అన్నాయి పిల్లలు

“మీరు పుట్టాక మీ అమ్మతో రెండు సంవత్సరాలు కలిసి ఉంటారుట. తరువాత మీ అంతట మీరు వేటాడుతూ బతికేస్తారు.”

“అయ్యో! మరి మేము దేన్ని తినాలి? ఆహారం ఎలా?”

“మీరు ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి ఖురిత జంతువులను (గిట్టలు కల జంతువులు) వేటాడి తింటారు. మీకు తెలుసా? 50-100 ఏళ్ళ క్రితం పులులు ప్రపంచంలో వేల, లక్షల సంఖ్యలో ఉండేవారని భల్లూ మామ చెప్పాడు.”

“మరి ఇప్పుడు?” అన్నాయి పులి పిల్లలు.

“ఇప్పుడు సుమారుగా 4000 పులులు మాత్రం ఉన్నాయి.”

“అంతేనా? అలా ఎందుకు?” అన్నాయి పులి పిల్లలు నిరాశగా.

కుందేలు ఒక్క నిముషం అలోచించి “మా భల్లూ మామ అన్నాడు – మనుషులు చాలా చెడ్డవాళ్ళు అని, నన్నే కాదు అడవిలో ఉండే అందర్నీ ఇబ్బంది పెడతారని.” అంది కోపంగా.

“అదేంటి?”

“అవును, వాళ్ళకి ఎక్కువ భూమి కావాలంటే అడవులు నరికేస్తారు, రకరకాల మాంసం తినాలంటే అడవి జంతువును, పక్షులని చంపి తినేస్తారు. కొన్ని జంతువులను సరదా కోసం తీసుకెళ్లి జంతుప్రదర్శనశాలలో పెడతారట.

అడవులు తగలబెట్టి, నరికి, ఖనిజాల కోసం తవ్వి తవ్వి పాడు చేస్తున్నారు. మనకి ఉండటానికి ఇల్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా చచ్చిపోతున్నాము.” అంది బాధగా.

“అయ్యో! మా గురించి చెప్పు” కుందేలుతో అంది ఒక పులి పిల్ల.

“మీకు తెలుసా మీరు పుట్టినప్పుడు మీకు చూపు ఉండదు. రెండు నెలలు అంధత్వంట. ఆ సమయంలో చాలా పులి పిల్లలు చనిపోతాయిట. చూపు ఉండదు కనుక అవి అమ్మ పులి శరీరం నుంచి వచ్చే వాసనని పీలుస్తూ అనుసరిస్తాయట. అంతే కాదు, ఒక్కోసారి మగ పులి పుట్టిన పిల్లల్ని తినేస్తుందిట.” అంది కుందేలు

ఆ మాటలు విని పులి పిల్లలు ఏడవటం మొదలుపెట్టాయి.

“ఏయ్. ఎందుకు ఏడుస్తున్నారు?” అంది కుందేలు.

“ఇప్పుడు అర్థం అయింది మా తమ్ముళ్లు ఏమయ్యారో అని.”

“పాపం!” అంది కుందేలు.

“చాలామంది పులులు రాత్రిపూట మాత్రమే వేటాడుతాయని అనుకుంటారు. అది నిజం కాదని భల్లూ మామ చెప్పాడు. మీరు మనుషులకు కనిపించకూడదని రాత్రిళ్ళు వేటాడుతారట.”

“అయ్యో! మా అమ్మ వేటకి వెళ్ళింది. ఇప్పుడు పగలు కదా” అన్నాయి పులి పిల్లలు కంగారుగా.

“మరేం పర్వాలేదు! అమ్మకి అన్ని తెలుసు.” అంటూ, “మీకు ఈదడమంటే భలే ఇష్టంట కదా?” అడిగింది కుందేలు.

“అవును. ఈత మాకిష్టం. ఒక్కోసారి పెద్ద చేపలు దొరుకుతాయి. భలే రుచి” అని గట్టిగా నవ్వాయి.

“మీ పులులు అడవిలో ఉన్న, ప్రదర్శనశాలలో ఉన్నా 20-25 ఏళ్ళు బతుకుతారుట. చాల మటుకు 20 ఏళ్ళ లోపలే చనిపోతారుట. మనుషులు మిమ్మల్ని వేటాడుతారు కదా. పాత రోజుల్లో రాజులు, కులీనులు, ధనవంతులకి పులి, ఎనుబోతు, జింక లాంటివాటిని అడవిలో వెతికి వెతికి వేటాడటం చాలా ఇష్టంట. వేట ఒక క్రీడ. ఎవరెన్ని పులి చర్మాలు, తల, గోర్లు సంపాదిస్తే అంత గొప్ప అంట. భల్లూ మామ చెప్పాడు. అందుకే మీ సంఖ్య తగ్గిపోయింది.” అంది కుందేలు.

“మనుషులంటే చెడ్డ అన్నమాట” అన్నాయి పులి పిల్లలు భయంగా.

“ఇంకో సంగతి తెలుసా? పులి ఒంటరిగా ఉండే జంతువు. మిమ్మల్ని బలవంతాన జంతుప్రదర్శన లాంటి చోట పెడితే ఇష్టపడవుట. మీ పులుల గుంపుని ఇంగ్లీషులో ambush or streak అంటారట. పులికి సింహానికి పుట్టిన పిల్లని Tigon అంటారట. మీ పులుల ఉమ్మి (saliva) లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. మీకు మీరే డాక్టర్.” అని నవ్వింది కుందేలు.

“పులి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మీ చర్మం మీద చారలు ఉంటాయట. మీ మూత్రం ‘బట్టర్ పాప్‌కార్న్’ స్మెల్ వస్తుందట. ‘పాప్‌కార్న్’ నాకు తెలీదు. అందుకని అడగద్దు” అంది కుందేలు చెవులు ఊపుతూ.

“సరే, కుందేలూ, మా ఆహారం తెలుసా?”

“తెలుసు. మీరు మాంసం తింటారు. దొరికిన దాన్ని వదలరు. ఎలుగుబంటి, జింక, ఎలుకలు, అడవిపంది, పక్షులు, ఖడ్గమృగం, మొసలి, దున్నపోతు, ఇంకా మీ జాతి అయిన చిరుత పులులను కూడా తింటారు. నీటిలోని చేపల్ని కూడా తింటారు.” చెప్పింది కుందేలు.

మళ్ళీ తనే మాట్లాడుతూ, “మీకు తెలుసా? పులులు భలే మిమిక్రీ చేస్తాయి. వేరే జంతువు స్వరాన్ని అనుకరించి అటు వచ్చిన జంతువులని వేటాడుతాయట. ఒకసారి మా భల్లూ మామ కూడా ఇలాగే మోసపోయి, ఎలాగొలా తన ప్రాణం కాపాడుకున్నాడు. పులులు సాధారణంగా మనుషులు ఉన్న చోటికి వెళ్లవు. అడవిలో మనిషికి కనపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాయి. కానీ మనిషి వాటిని రెచ్చగొట్టినా, వెంట పడినా దాడి చేస్తాయట.

మీకు తెలుసా? మీరు భారతదేశపు జాతీయ జంతువుట. మీరు మీ శరీరం రంగు, చారలతో భలే అందంగా ఉంటారు. ప్రపంచంలోని పులులలో 70% భారత్ లోనే ఉన్నాయిట.” అంది కుందేలు.

“అవునా? అంటే మమ్మల్ని చంపటం లేదా?” అన్నాయి పులి పిల్లలు.

“మిమ్మల్ని చంపటం, పెంచుకోవటం, అమ్మటం లాంటివి పెద్ద నేరమట. మీ కోసం ప్రత్యేకంగా పులుల అభయారణ్యాలు (రిజర్వు ఫారెస్ట్) ఉన్నాయిట. భారతదేశంలో పులుల అభయారణ్యాలు 1973లో ప్రారంభమయ్యాయి. వీటిని ‘ప్రాజెక్ట్ టైగర్’ పర్యవేక్షిస్తుంది. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నేతృత్వంలో పనిచేస్తుంది. 2018 వరకు – బందీపూర్, కన్హా, కార్బెట్, రాథంబోర్ వంటి 50 అభయారణ్యాలున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ వారి 2016 నాటి లెక్కల ప్రకారం భారతదేశంలో 3,890 పులులు ఉన్నాయి.

ఇక్కడ మిమ్మల్ని లెక్కిస్తారు. వేటగాళ్ళ నుండి రక్షిస్తారు. ప్రపంచంలో ఇంతకు ముందు 8 రకాల పులులు ఉండేవి. వీటిల్లో జావన్, బాలి, ఇంకా కాస్పియన్ పులులు అంతరించిపోయాయి. సైబీరియన్, సుమత్రాన్, ది గ్రేట్ బెంగాల్ టైగర్, సౌత్ చైనా, ఇండోనేసియన్ జాతుల పులులు అక్కడక్కడా ఉన్నాయిట.” అంది కుందేలు.

“పులుల సంరక్షణ కోసం ప్రతీ ఏడాది జూలై 29న ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’ జరుపుతారు. ఇది రష్యాలో 2010లో జరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమిట్ నుంచి ప్రారంభం అయింది. నాకు మీ గురించి తెలిసింది ఇంతే.” చెప్పింది కుందేలు.

“మా గురించి మాకు చాలా విషయాలు చెప్పావు” అంటూ పులి పిల్లలు కుందేలుకి ధన్యవాదాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here