నేను నవలలు ఎలా రాస్తాను?

1
3

[dropcap]“క[/dropcap]థ జీవితంలో ఒక శకలం అయితే నవల పూర్తిగా జీవితం.” అంటారు.

అంతేనా, అంటే ఇంకా చాలా ఉంది.

పూర్తిగా ఆదీ అంతం లేని జీవితం, మానవ సమాజం, అలా జరిగిపోతూనే ఉంటుంది.

And they lived happily ever after… అంటూ వారు తర్వాత సుఖంగా జీవించారు అని ముగిస్తే అయిపోతుందా?

కాదు. కానేకాదు. జీవితం నవల కంటే పెద్దది.

నవలలో ఒక జీవితం పూర్తిగా రాయవచ్చేమో గానీ అందరి జీవితాలు అన్ని విషయాలు పూర్తిగా రాయటం అసాధ్యం.

అదే సమయంలో ఒక చిన్న కథలో ఒక పెద్ద జీవితాన్ని కుదించటం కూడా సాధ్యమే. ఒక జీవితమంతా జరిగిన దాని గురించి రాసిన చిన్న, పెద్ద కథలు కూడా ఉంటాయి.

అయితే, మరి నవల అంటే ఏమిటి?

నిర్వచనం: నవల మనకి పాశ్చాత్య సాహిత్యం నుంచి వచ్చింది కాబట్టి వారి నిర్వచనమే చూద్దాం.

“నవల అంటే వచనంలో ఎక్కువ నిడివి ఉండి కొంత క్లిష్టంగా కూడా ఉండి ఊహాజనితమైన వ్యక్తుల జీవితాలు వారి జీవితంలోని సంఘటనలు ఒక ప్రత్యేకమైన వాతావరణం లేదా కాలంలో జరిగే జరిగినవి రాసే రచనా ప్రక్రియ.” (Encyclopedia Britannica)

దీన్ని బట్టి చూస్తే నవల అంటే ముఖ్యంగా నిడివి పెద్దది ఉండాలి. వచనంలో ఉండాలి. చిన్న చిన్న నవలలని నావల్లా, నావెలెట్ అని కూడా అంటారు.

కానీ నవల ముఖ్య లక్షణం నిడివిలో ఎక్కువగా ఉండి ఒక పుస్తకం నిండి ఉండేట్లు ఉండాలి అనే అందరూ అందరూ ఒప్పుకుంటారు.

మనకి తెలుగు సాహిత్యంలో 18వ శతాబ్దం, 19వ శతాబ్దంలో పద్య కావ్యాలు ఉండేవి. ఇతిహాసాలూ ప్రబంధాలూ అన్ని పద్యాల లోనే రాసేవారు. ఆ తర్వాత పాశ్చాత్య సాహిత్యంలో నావెల్, రొమాన్స్ నావెల్లా ఇలాంటి ప్రక్రియలు మొదలైనాక తెలుగులో కూడా నవలలు వ్రాయటం మొదలైంది. తెలుగులో ‘రాజశేఖర చరిత్ర’ మొదటి నవల.

నవలలలో వివిధ రకాలు ఉంటాయి. చారిత్రక నవల, ప్రేమని వర్ణించే రొమాంటిక్ నవల, సాహసాలను వర్ణించే నవలలు, అపరాధ పరిశోధన, ఫాంటసీ ఇలా వివిధ రకాల ఉప శాఖలు ఉన్నాయి. అయితే కల్పనా, నిడివి, వచనం అనేవి ముఖ్య లక్షణాలు అని నేననుకుంటాను. ఒక జీవిత చరిత్ర లేక పాపులర్ సైన్స్ గురించీ, ఓ రాజకీయ సిద్ధాంతం గురించీ, రాసే పుస్తకాలు-నవలలు కాదు. వాటిని నాన్-ఫిక్షన్ జీవిత చరిత్రలు, లేక వ్యాసాలు అనే పేర్లతో పిలవచ్చు.

ఇక, నేను నవల ఎలా రాస్తాను అనే ప్రశ్నకి సమాధానం ఇస్తాను.

నవలకి కావలసింది నాలుగు భాగాలు.

  1. ఇతివృత్తం (ప్లాట్)
  2. శిల్పం లేక కథనం (స్టైల్, లేక క్రాఫ్ట్)
  3. భాష, కాలం, ఆయా దేశ కాల మాన పరిస్థితులు.
  4. పాత్రలు. ఇవి సాధారణంగా మానవ పాత్రలే ఉంటాయి.పాత్రల వ్యక్తిత్వం.

1.ఇతివృత్తం లేక ప్లాట్ ముందుగా నా మనసులో ఆలోచించుకుంటాను. నవలల లోని వివిధ రకాలైన ఉపశాఖలు చరిత్ర, అపరాధ పరిశోధన, ఫాంటసీ, సాంఘిక నవలలు, థ్రిల్లర్లు, భయానక నవలలు, సైన్స్ ఫిక్షన్, ఇలా ఎలాంటి నవల రాయాలీ అనుకున్నామో అది ముందు నిర్ణయించుకోవాలి. నేను సైన్స్ ఫిక్షన్, మెడికల్ థ్రిల్లర్లు రాయటం ఎక్కువ ఇష్టపడ్డాను కాబట్టి ఆ శాఖ లోనే ఒక ప్లాట్ ఎన్నుకుంటాను. లేక సైన్స్ ఫిక్షన్ అంశాలు ఎన్నుకుంటాను.

ఒక ప్లాట్ ఉండి సాగిపోయే నవలలు గొప్పవి కావని సాహిత్య విమర్శకుల అభిప్రాయాలు ఉంటాయి. సాహిత్యపరంగా విలువలు ఉండేవి ఎక్కువ మనోవైజ్ఞానిక అంతరంగ సంఘర్షణ, వారికి సమాజంలో పడే ఇబ్బందులు ఇష్టాలు కష్టాలు ఇతివృత్తంగా ఉంటాయి. కొంత కథ నడిచిన తరువాత, ఒక వివేచన, క్లైమాక్స్‌లో ఒక ఎపిఫనీ (దీనికి తెలుగు మాట సరైనది లేదు… వివేకము, తెలుసుకోవడం కావచ్చు) లేక రియలైజేషన్ కలగటం వ్రాయబడి వుంటాయి.

ఇలాంటి వాటిని ఉన్నత సాహిత్య విలువలను ఉన్నవిగా భావిస్తుంటారు.

పాపులర్ నవలలు, ప్లాట్ నవలలలో, ఉదాహరణకి ప్రేమ నవలలు అయితే ప్రేమకు వచ్చే అడ్డంకులు వాటిని అధిగమించటం, చివరికి వారి ప్రేమ సఫలం కావడం, డిటెక్టివ్ నవల అయితే ఒక నేరం కానీ హత్య గాని జరగటం పరిశోధన చివరికి నేరస్థుడిని పట్టుకోవడం ఇలా ఉంటుంది. సాహిత్యపరమైన నవలలలో పాత్రల జీవితం వారి కాలంలోని సమాజం, ఆ సమాజంలోని పరిస్థితులతో సంఘర్షణ ఉంటాయి. విపరీతమైన వర్ణనలూ సంభాషణలు కూడా ఉండొచ్చు. దోస్తవిస్కీ రాసిన ‘నేరము శిక్ష’ నవలలో ఒక మనిషి నేరంచేయడం చేసిన పరిస్థితులు, ఆల్బర్ట్ కామూ ‘అవుట్‌సైడర్’ నవలలో ఒక వ్యక్తి హత్య చేయటం, అతని నిర్లిప్తత, అస్తిత్వవాదం (Existentialism) (అంటే వ్యక్తివాదము మన తెలుగు సాహిత్యంలోని అస్తిత్వవాదం వేరు,) ఆయా పాత్రల అంతరంగ ఘర్షణ, కోరుకునే గుర్తింపు, వారి వ్యక్తిగత జీవితం మనో విశ్లేషణ ఇలా వర్ణించబడి ఉంటాయి.

ఏది ఎన్నుకోవాలో అది మీ ఇష్టం. ఏమైనా మీకు తెలిసిన, మీరు రాయగలిగే ఇతివృత్తం ఎన్నుకోవాలి. మీరు రచనలు బాగా చదివి వుండాలి. సమాజ పరిశీలన, సహానుభూతి, (empathy) వుండాలి.

నేను పాపులర్ ఫిక్షన్ రాయాలి, థ్రిల్లర్ అది కూడా మెడికల్ సైన్స్ ఫిక్షన్ అని అనుకున్నాను. దాని కోసం ఈ విషయంలో ఒక ఇతివృత్తం, ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను.

నవలకి ఒక ప్రారంభం, మధ్యభాగం, ముగింపు లేక క్లైమాక్స్ ఉండాలి. విషయాన్ని అధ్యాయాలుగా విడగొట్టు కుంటాను. ఒకప్పుడు అధ్యాయాల పేర్లు కూడా పెట్టుకుంటాను. ఇదంతా చిన్న (సినాప్సిస్) ఉపోద్ఘాతం లాగా రాసుకుంటాను.

“ఒక యువ డాక్టర్ హాస్పిటల్లో చేరి అనుమానాస్పదంగా ఉన్న రోగుల మరణాలని స్టడీ చేయడం, ఆ మరణానికి కారణమైన ఒక చెడ్డ డాక్టర్ని పరిశోధన చేసి పట్టుకోవడం” (ఐసిసియు అనే నవలలో).

“ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఒక కొత్తగా పెళ్లైన జంట కాపురం పెట్టడం, అదే కాంప్లెక్స్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చి పడక గదుల్లోకి చూసే ‘వాయూరిజమ్’ అనే విపరీత ప్రవర్తన వున్న వ్యక్తి, అదే కాంప్లెక్స్‌లో మరొక ఫ్లాట్‌లో మానసికంగా, శారీరకంగా జబ్బు వుండి పైకి అందంగా కనిపించే, ఆడపిల్లలని మోసం చేసి హత్య చేసే ఒక హంతక గాయకుడు…” (ఔనా… నవలలోని ఇతివృత్తం.)

ఇవి ఉదాహరణలు మాత్రమే. సంఘటనలు, వర్ణనలు పాత్రలను సృష్టి. ఇదంతా వివరంగా అధ్యాయాలుగా మనసులోనైనా రాసుకుంటాను. ఒకొక్క సారి ఎలా ముందుకు పోవాలో తెలియక వారాల తరబడి ఆలోచనలో పడిన నవలలు కూడా వుంటాయి. అది ఒక తపన. ఒక తృప్తి.

సాంఘిక నవలలో కూడా ఇతివృత్తం రాసుకోవచ్చు. ఈ ఇతివృత్తం రచయిత చెప్పదలుచుకున్న సిద్ధాంతం మీద కావచ్చు. ఉదాహరణకి ‘ఫౌంటెన్ హెడ్’ – ‘Atlas Shrugged’ ఆబ్జెక్టివిజం అనే స్వార్థపర self interest అనే సిథ్థాంతం మీద రాయబడి ఇప్పటికీ ప్రాచుర్యంలో వుంది.

‘ఎలైస్ ఇన్ వండర్‌ల్యాండ్’, ‘గలివర్స్ ట్రావెల్స్, ‘ట్రెజర్ ఐలాండ్’ సాహసాలు, కల్పనల మీద రాయబడిన ఫాంటసీ నవలలు.

‘డాక్టర్ నో’, ‘క్యాసినో రాయల్’, ‘గోల్డ్ సింగర్’ ఇలాంటి జేమ్స్‌బాండ్ నవలలు గూఢచర్యం మీద. షెర్లాక్ హోమ్స్, పెర్రీ మాసన్, డిటెక్టివ్ యుగంధర్, షాడో… ఇలా ఒకే పాత్రతో రాయబడిన అపరాధ పరిశోధన, గూఢచారి నవలలు… డిటెక్టివ్ శరత్, మురళీకృష్ణ సృష్టి. విలన్ డాక్టర్ రావ్, హనీ ఆమ్రపాలి నేను సృజించినవి.

ఇలా ఒకే హీరోతో ఒకే టాపిక్ మీద రాసే నవలలు ఎన్నో ఉంటాయి. మనం ఏమి రాయాలి అనుకున్నామో క్లుప్తంగా రాసి పెట్టుకోవాలి. ఈ మధ్య ఒకే విషయం మీద పరిశోధన చేసి దాని గురించే రాసే నవలలు కూడా వచ్చాయి. దానికి మీరు ఆ విషయాల మీద పరిశోధన చేసి వివరాలు విశ్లేషణలు ఇంకా ప్లాటు రాసి పెట్టుకోవాలి. ఉదాహరణకి ‘ఎయిర్పోర్ట్’, ‘హోటల్’, ‘స్టాక్ ఎక్స్చేంజ్’ గురించి రాసిన ‘నాట్ ఎ పెన్నీ మోర్…’ ఇలాంటి నవలలు పరిశోధనాత్మక నవలలు అంటారు. ఇవి ఇంగ్లీషులో చాలా ఉన్నాయి. తెలుగులో కూడా చాలామంది రాశారు. ఉదాహరణకి ‘మోడల్’, ‘పాకుడురాళ్ళు’ ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలా అనుకున్న తర్వాత నవలని అధ్యాయాలుగా విడగొట్టుకుని రాయడం ప్రారంభించాలి.

2.భాష, కాలం, శిల్పం. మీరు ఎలాంటి భాష వాడాలి అనుకున్నారో అది ముందే నిర్ణయించుకోండి. ప్రామాణిక తెలుగు భాష అంటే (అందరూ మాదే ప్రామాణిక భాష) అంటారు, మీ ఇష్టం. సాధారణంగా పత్రికలలో టీవీలలో సినిమాల్లో వాడేది కావచ్చు లేక సరళ గ్రాంథికం కావచ్చు. నేను మామూలు భాష కథలు చెప్పటానికి మాండలికం లేక ఉచితమైన భాష ఆయా పాత్రల చేత చెప్పిస్తాను.

3. కాలం: నవల సృష్టించిన కాలం ప్రదేశం మీరు చెప్పే ఇతివృత్తానికి కథకి అనుగుణంగా ఉండాలి. చరిత్ర కథ రాసినప్పుడు విమానాలు రాకెట్లు ఉండవు కదా. ఆయా దేశ కాలమాన పరిస్థితులు నిర్ణయించుకోవాలి. కాలం భూతకాలం భవిష్యత్తు కాలం కూడా కావచ్చు. ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇలాంటి నవలలలో ఒక ప్రత్యేకమైన కాలం సృష్టించబడి ఉంటుంది. అది మధ్య యుగాల కాలం కావచ్చు, ప్రాచీనకాలం కావచ్చు. దీన్ని ‘వరల్డ్ బిల్డింగ్’ అంటారు. నేను రాసిన ‘కుజుడి కోసం’ నవల భవిష్యత్ కాలంలో ఊహించి వ్రాసినది. నాలుగో సహస్రాబ్దిలో ఊహించి వ్రాసినది. అంటే 3465 సంవత్సరం.

భవిష్యత్తు కొంత కల్పించవచ్చు కాని వర్తమానము, భూత కాలం మాత్రంలో సంఘటనలూ వర్ణనలూ కరెక్ట్‌గా ఉండాలి. ఉదాహరణకి 1947లో కంప్యూటర్లు వాడినట్లు రాయలేం కదా. ఇవి సరిచూసుకోవాలి. ప్రస్తుత కాలంలోనే కూడా ఎక్కువ నవలలు వుంటాయి.

శిల్పం: కథనంలో రెండు మూడు రకాలు. ఒకటి సర్వసాక్షి కథనం. అన్ని సంఘటనలు పడక గదుల్లోవీ, హత్యలు, హత్యా దృశ్యాలు కూడా… ఇలాంటివన్నీ రచయిత చూసి రాసినట్టుగా వర్ణిస్తాడు. దీంట్లో అంత ఇబ్బందులు లేవు. మరొకటి ఉత్తమ పురుష కథనం. ముఖ్య పాత్ర నేను అనుకుంటూ కథ చెప్పటం. ‘కుజుడి కోసం’ నవలాత్రయం నేను అనే సాగింది. నేను అంటే నాయకుడు ఆమ్రపాలి. ఇలా రాయటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేను చూడలేని సంఘటనలు రాయటం కుదరదు. ‘నువ్వు’తో చెప్పే కథలు నవలలు కూడా ఉన్నాయి అవి చాలా కష్టము, తక్కువ. నాకు తెలిసి అవి రాయకపోవడమే మంచిది.

ఏదైనా సరే నవలలో ముందు పాత్రలు ఎంచుకోవాలి.

ముఖ్య పాత్ర హీరో నాయకుడు protagonist అని కూడా అంటారు పాత్రధారిణి కూడా కావచ్చు పాపులర్ నవలల్లో హీరో గానీ హీరోయిన్ గానీ ఉంటారు. చివరిలో విజయం సాధిస్తారు. విలన్ లాంటి దుష్ట పాత్రలు, హాస్య పాత్రలు, మంచి చెడు కలిసిన పాత్రలూ, పరిస్థితులు కూడా ఉంటాయి.

సాహిత్య నవలల్లో హీరో మంచిగాను విలన్ చెడ్టగాను ఉండక్కర్లేదు. ముఖ్య పాత్ర బలహీనుడు, ఓడిపోయేవాడు కూడా కావచ్చు. ఉదాహరణకి ‘అల్పజీవి’, ‘అసమర్థుని జీవిత యాత్ర’, ‘ది అవుట్‌సైడర్’ నవల.

పాపులర్ ఫిక్షన్ నవలలలో ముందు ప్రారంభంలో పాత్రల సంఘర్షణ (conflict) చిక్కుముడులు ఏర్పర్చుకోవాలి. అవి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ప్రారంభంలో దృశ్యాలు ఆకర్షణీయంగా ఉండాలి. ఇంకా చదవాలని అనిపించే లాగా ఉండాలి.

నేను థ్రిల్లర్ నవలలు రాసాను కాబట్టి ముందు నుంచి సంఘటనలు వేగంగా నడపడం, కదలటం ఆసక్తికరంగా ఉండేట్లు చూసుకుంటాను. ఎన్నో మొదటిలో వేసిన చిక్కుముడులు చివరిలో ఒక్కొక్కటి విప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో పాఠకులు పేజీలు వేగంగా తిప్పాలి.

సాహిత్యపరమైన నవలలో ఉదాహరణకి ‘బ్రదర్స్ ఆఫ్ కర్మోజోవ్’, ‘వేయి పడగలు’, ‘వార్ అండ్ పీస్’ ఇలాంటి వాటిలో అంత వేగంగా కథ ఉండదు. వర్ణనలూ భాషా క్లిష్టంగా ఉండి మెల్లగా సాగిపోతుంటాయి. కొన్ని నవలలు అంతఃస్రవంతి (Stream of consciousness) పద్ధతిలో కథలోని సంఘటనలు పాత్ర మనోభావాలు వర్ణించుకుంటూ పోతాయి.

మీకు ఇష్టమైన పద్ధతి మీది.

4. పాత్రలు: ముందుగా చెప్పినట్లుగా ముఖ్య పాత్రలు నాయకానాయికలు సహ పాత్రలు విలన్ ఉంటే ఆ పాత్ర లేక పాత్రలు వారి వేషభాషలు ఆహార విహారాలు అన్ని రాసి పెట్టుకోవాలి. వర్ణన, ముఖ్యంగా సహజంగా ఉండాలి. హీరో వర్ణనలు “ఆజానుబాహువు, కండలు తిరిగిన దేహం నీలిరంగు సీటులో బ్రౌన్ టై ధరించాడు, గిరజాల జుట్టు” ఇలా వర్ణనలు చేస్తారు. ఇవి పాత్రలకి తగినట్లు ఉండాలి. మీకు ఒక శైలి వుండాలి. లేకపోతే మందిలో కలిసి పోతారు. అది అభ్యాసం మీద రావాలి. అందరు రచయితలను చదవడం, మీదైన శైలి ఏర్పరచు కోవడం మంచి గుర్తింపు ఇస్తుంది.

సాహిత్యపరమైన సర్రియలిస్టిక్ మ్యాజిక్ రియలిజం నవలలలో పాత్రలు ఎలాగైనా ఉండొచ్చు. పాత్రలు కీటకాలు కూడా అయి ఉండొచ్చు. పనికిరానివీ, బలహీనంగా కూడా ఉండొచ్చు.

మీ హీరో అన్ని మంచి లక్షణాలు ఉన్న వాడే అయి ఉండక్కర్లేదు. ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ అని సోమర్‌సెట్ మామ్ రాసిన నవలలో ముఖ్య పాత్రకి అంగవైకల్యం ఉంటుంది. సలీం గారు రాసిన ‘పడిలేచే కెరటం’ అనే నవలలో నాయకుడికి అంగవైకల్యం ఉంటుంది. ఇలా సహజసిద్ధమైన పాత్రని నాయకుడిగా కూడా పెట్టి కూడా రాయొచ్చు. వాటిని అధిగమించి వారు ఎలా జీవించాలో చెబుతాయి ఆ నవలలు. దానివల్ల పాఠకులకి వుత్తేజం కలుగుతుంది.

సైన్స్ ఫిక్షన్ నవలలలో పాత్రలు తగిన విధంగా వర్ణించాలి, సృష్టించాలి. గ్రహాంతరవాసులని వర్ణించాలి. ఆయా గ్రహాలలోని వాతావరణం సరిగా సైన్స్‌కి సరిపడిన విధంగా ఉండాలి. దానికి ఆ పరిజ్ఞానం రచయితకి ఉండాలి. అంతరిక్ష నౌకలు ఎలా ఉంటాయి, కాంతి ప్రయాణం ఎలా చేస్తారు, ఇలాంటివి సాధ్యమైనంత వరకూ సహజంగా సైన్స్‌కి సంబంధించినవిగా ఉండాలి. గ్రహాంతరవాసులకు తలమీద యాంటెన్నాలు పొడుగాటి చెవులు ఉన్నట్లు రాస్తూ ఉంటాము. ఎలాగైనా రాయొచ్చు. అయితే ఒక పాత్ర వ్యక్తిత్వాన్ని నిరూపించాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఉదాత్తమైనది, అల్పమైనది కూడా కావచ్చు. చెడ్డవి మంచివి కూడా కావచ్చు. ఏ వాతావరణమైనా, కథలో మానవతా విలువలు ఉండాలి. మంచిని పెంపొందించేగా ఉండాలి. చెడుని ప్రోత్సహించే విధంగా వుండకూడదు. బాడీ షేమింగ్, స్త్రీ పాత్రలు పిల్లల పాత్ర చిత్రణ అవమానకరంగా అశ్లీలమైనదిగా వుండకూడదు. ఏ రాజకీయ, సాంఘిక సిథ్థాంతమైనా, మానవతకీ, మానవహక్కులకు విరుద్ధంగా వుండరాదు. పేరు కోసమో, ఆర్థిక లాభం కోసం రాస్తే దాని పరిణామాలు ఎదుర్కొనటానికి సిథ్థపడాలి.

ఆ యా పాత్రల మాటలు సంభాషణలు సహజంగా ఉండాలి. కథలో వర్ణనలో ఎక్కువగా లోకల్ కలరింగ్ ఉంటే సహజత్వం ఉంటుంది.

లోకల్ కలరింగ్ అంటే ఏమిటి? ఉదాహరణకి “ఆబిడ్స్ తాజ్ మహల్ హోటల్‌లో ఫ్యామిలీ రూమ్‌లో కూర్చున్నారు వాళ్ళిద్దరు. సర్వర్ మెనూతో వచ్చి నిలబడ్డాడు.”

“రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్‌లో ఉన్నాడు. గేట్ నెంబర్ 21 దగ్గర చాలా కోలాహలంగా ఉంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులందరూ లైన్‌గా నిలబడి ఉన్నారు.” దీన్ని బట్టి నగరం హైదరాబాద్ అని తెలుస్తోంది కదా. అలా కాకుండా ఒక హోటల్లో వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ఒక ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తున్నారు అంటే చప్పగా ఉంటుంది.

అయితే లోకల్ కలరింగ్ ఇచ్చేటప్పుడు న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆయా హోటళ్ళు సంస్థల పేర్లు రాయటం వారికి ఇష్టం ఉండకపోవచ్చు. అది సరి చూసుకోవాలి. పాత్రల విషయంలో మనుషులు కాకుండా జంతువులు, పక్షులు చెప్పే కథలు కూడా ఉండొచ్చు. ప్రాచీన కాలంలో వీటిని ‘ఫేబుల్స్’ (పంచతంత్రం లాంటివి) అంటారు. అయితే పాత్ర లేకుండా కేవలం సంఘటనలతో కథ చెప్పే నవలలు చాలా అరుదు. జంతువులు అయినా కాని మానవుల కథ మానవుల పాత్రల లాగా శిల్పం శైలి నిడివి లేకపోతే నవల కాదేమో.

ముగింపు: దీనినే క్లైమాక్స్ కూడా అనొచ్చు. ముగింపు అర్థవంతంగా ఉండాలి. నా గురించి చెబుతున్నాను కాబట్టి చివరగా నవలలో క్లైమాక్స్‌లో, ప్రారంభంలో వర్ణించిన చిక్కుముడులు అన్నీ విడిపోయేలా రాస్తాను. హీరో కష్టపడి గెలవటం మంచి గెలిచినట్టుగా రాయడం నాకు ఇష్టం. త్యాగం, కరుణ, ప్రేమ మొదలైన విలువలు చూపిస్తాను. అయితే విషాదాంతాలు రాయకూడదని కాదు. విషాదాంతాలు కూడా పాఠకులని ఎక్కువ కదిలిస్తాయి. మన కథని పాఠకులు జ్ఞాపకం పెట్టుకునేటట్లు చేస్తాయి. ముగింపు నవలలలో ఒక పరిష్కారం చూపాలి. విషాదమైనా సరే సంతోషమైనా సరే. పరిష్కారం లేదని చెప్పడం కూడా ఒక పరిష్కారమే.

‘భూమి నుంచి ప్లూటో దాకా’ ఆఖరి నవలలో నాయకి ప్రకృతి విలన్ సమూరా చక్రవర్తిని ఆత్మాహుతి చేసుకుని చంపినట్లు రాశాను. ఆమె హీరో హనీ భార్య. అలా ముగింపు రాయటానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతో బాధ కలిగింది. ఒక వారం పట్టింది. భార్య పోయినందుకు హీరో హనీ ఎంతో బాధపడతాడు. మూడు నవలల తర్వాత పతాక సన్నివేశంలో ఆ మాత్రం త్యాగం చూపించకపోతే బాగుండదనిపించింది. హీరో హనీ ఎంతో బాధపడతాడు. ప్రేమించిన భార్య లేని వాడు అవుతాడు. అయితే ఆ త్యాగం ఆమె ప్రపంచ శాంతి కోసం చేస్తుంది కాబట్టి ఉదాత్తమైనదిగా నాకు అనిపించింది.

అది ఎందుకో అలానే రాయాలనిపించింది.

సాహిత్య నవలల్లో అయితే ఆయా పాత్రలకి జీవితం గురించి అవగాహన రావటం పరిస్థితులు మారటం వివేచన రావటం లేక రాకపోవడం ఇలా రాస్తూ ఉంటారు. లేదా ఏ ముగింపు లేని పరిస్థితి. పరిష్కారం ఉండొచ్చు లేదా పరిష్కారం లేకపోవచ్చు. విషాదం ఉండొచ్చు. ‘అసమర్ధుని జీవయాత్ర’లో సీతారామారావు చనిపోతాడు. ‘దేవదాసు’లో కూడా హీరో చనిపోతాడు. ‘చివరికి మిగిలేది’లో దయానిధి పాత్ర కూడా అంతే అనిపిస్తుంది. ఆ రోజుల్లో అన్ని విషాదాంతంగా ఉండేవి. సమాజంలో రచయితలలో ఒక నిర్వేదం నిరుత్సాహం ఉండేదేమో. ఆశావాదం, కార్యసాధన, వ్యక్తిగత వికాసం పట్టుదల ఉన్నట్లు చూపించాలని ప్రస్తుతం సమాజ పరిస్థితులకు అనుగుణంగా చూపించాలని అనుకుంటూ ఉంటాను. సమాజాన్ని ప్రతిబింబించడం, పరిష్కారం చూపటం వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలుగ చేయటం ఉత్తమ సాహిత్య లక్షణం అని నాకనిపిస్తుంది.

మంచి సాహిత్యం, మంచి నవల జీవితాన్ని మార్చేయగలదు. వీటిలో ప్రచార నవలలు అంటే ఒక సిద్ధాంతం కోసమే ప్రచారం చేసే నవలలు కూడా ఉంటాయి. అది ఏ వాదమైనా కావచ్చు. వారి సిథ్థాంతమే జీవితానికి పరిష్కారమని చూపించొచ్చు. ఆయా సబ్జెక్టు ఎన్నుకోవటం, విసుగు లేకుండా చదివేటట్లు రాయడం ఒక కళ. ప్రస్తుతం అనేక ఇతర వినోద సాధనాలు, టీవీ, సినిమా, ఓ.టి.టి అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందుకే అనుకుంటాను, నవలలను ఎవరూ సరిగా చదవటం లేదు. అందువల్ల మనం నవలలు వాటన్నింటికి మించి ఆసక్తికరంగా రాయాలి. అవి చదివించే విధంగా ఉండాలి. పాత పథ్థతులలో పెద్ద పెద్ద నవలలు రాసే రోజులు పోయాయి.

తెలుగులో ఇంగ్లీషులో పదమూడు నవలలు రాసిన రచయితగా, ఇవే నేను వినయ పూర్వకంగా చెప్పే కొన్ని సలహాలు. అవి కూడా యువ రచయితలకి మార్గదర్శకంగానే.

రచయిత నిరంకశుడు. చివరికి అతడు రాయదల్చినదే రాస్తాడు. దాని సాధకబాధకాలు పరిణామాలు అతనే ఎదుర్కోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here