[dropcap]తె[/dropcap]లియనితనమో
తెలుసుకోలేని తనమో
తెలియదు
నీ ఇష్టాన్ని మాత్రమే గమనించుకున్నావు
అంతే
నా మనసేం కోరుతోందో తెలుసుకోలేదు
మనకు పొసగదని నాకనిపించినా
తండ్రి ఆదేశం కదా-తలొగ్గాను
ఎదురు పలకలేక పోయాను
నీవో దివ్యర్షివి
గ్రహిస్తావనుకున్నాను
నీ జపమూ తపమూ నీదే
నా మనసేంటో నీకు పట్టనే లేదు
నీలా శరీరాన్ని జయించగల తాపసిని కాదుకదా
నీవు తినిపించింది కందమూలాలైనా
నాదీ పంచభూతాత్మకమైన తనువు కదా
పూజకు తెచ్చిన పూలనే నీవు చూశావు
నేను వాటి కోమలతను పరిమళాన్నీ తాకాను
నీటిని నీవు మంత్రించడానికే వాడావు
నేను దాని చల్లదనపు మంత్రశక్తిని చూశాను
నేను నీ ముందే వున్నా
ఈ అడవిలో నీవో నిర్మానుష్య ప్రశాంతతను వెతికావు
నేను గాలి స్పర్శను
పక్షుల పాటను
జింకల కళ్ళలో మమకారాన్నీ
ప్రేమను ఆనందించడాన్నీ ఆలింగనం చేసుకున్నాను
తొలిజాముకై నీ మెలకువా తెలుసు
నీ జప ధ్యాసా తెలుసు
జాముల లెక్క తెలీని
నిదురపోనీని నా అలజడీ తెలుసు
తొందరపెడుతున్న మనసు ఆరాటమూ తెలుసు
మన ఇద్దరి అడుగులూ ఒకే వైపు కాలేవనీ తెలుసు
ఒకరు తపోభూమి వైపు
మరొకరు మనోభూమి వైపు
నట్ట నడుమ
ఒక శాపం నుంచీ
ఇంకో శాపం లోకి
విచలితనై
అచలితగా
హల్యనై ఇలా
శాప నివృత్తికై …