[dropcap]వా[/dropcap]నాకాలపు సాయంత్రం
ఆకాశం పలుచబడింది
నేల తడిసి ముద్దయింది
గాలి సువాసనతో బరువెక్కింది
తెరిపిన బడ్డ మనసు
మెల్లి మెల్లిగా స్థిరపడుతున్నది
నాలుగు రోజులుగా దర్శనమివ్వని
సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తూ
రేఖా మాత్రంగా కనిపిస్తున్నాడు
చిట పట చినుకుల సవ్వడి
క్రమంగా దూరమవుతూ
మంద్రంగా నా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నది
క్రమంగా చలి
చాపలా చుట్టేస్తున్నది
అప్పటిదాకా నాలోపల
మౌనంగా వున్న పక్షి
పంజరాన్ని ఛేదించుకుని
గాల్లోకి ఎగిరింది గానం చేసింది
లక్షలాది దీపాల్ని వెలిగించింది
తానే వెలుగై లోకాన్ని చుట్టేసింది.