[dropcap]ప[/dropcap]సితనపు అమాయకత్వంతో
పువ్వుతొడిమ నుంచి అసంకల్పితంగా
నా పెదవులు పీల్చుకున్న తేనెచుక్క
గరికరేకులమధ్య
మంచుబిందువులు సూర్యోదయాన్ని
పట్టిచూపిన ఇంద్రచాపం
వసుధ ప్రసాదించిన అద్భుత వరం
చిన్నప్పటి అనుభవమిది
ఒకింత చలీ కాస్త వెచ్చదనమూ
దేహకణాల్ని మెలిపెట్టి వ్యాయామం చేయించిన
అనుభూతి చిన్నప్పటిది
వసంతానికి ముందే మొగ్గ తొడిగిన
వసివాడని మల్లెల సౌందర్యాన్ని
చిన్నప్పుడే చూశాను
చెట్లమధ్య పట్టపగలే అలముకున్న
చీకట్లోంచి మెలికలు తిరుగుతూ
పరుగులు తీసిన రహదార్లు
ఒకింత కళాతృష్ణ తీర్చేవి
ఇప్పుడు అనకొండల్లా
అడ్డంగా విస్తరించుకుని
చలివేంద్రాలు లేక
కనుచూపుమేరల్లో ఎండమావులెదురై
నాల్కలు పిడచకడుతున్నాయి
పేగులు ఎండగడుతున్నాయి
ఇప్పుడు వసుధ కేవలం
స్మృతుల సుచరిత
విత్తులు నాటి ప్రేమగా పెంచి
నీడనీ ఫలసాయాన్నీ అందుకోని
కోట్లాది కంసవంశీకుల్ని భరిస్తూ
బిడ్డలందిస్తున్న కర్బన ఉద్గారాల
కాలుష్యం సైతం ఇంకించుకుంటూ
మౌనంగా రోదిస్తూ పుడమితల్లి
నిజం, ప్రగతిని కాదనే జడుణ్ణి కాను
పెంకుటింటి చూరున వేలాడే గబ్బిలాన్నీ కాను
కూర్చున్న కొమ్మని నరుక్కునే
అతి తెలివీ లేదు
మట్టికణానికి శాశ్వతత్వం ఉంది
శాశ్వతత్వం లేని ఓ సామాన్యుణ్ణి నేను
మట్టిరేణువు కన్నా కనిష్టం వాణ్ణి
అందినదీ అందనిదీ కూడా నాదనే హక్కులేని వాణ్ణి
నేలతల్లి సిరిసంపదల్ని
నరులందరికీ పంచాలనే
వివేకమున్న అసామాన్యుణ్ణి
భూగోళాన్ని పదితరాలకు
పదిలంగా అందించడానికి బాధ్యుణ్ణి
అందుకే వనరక్షణే వసంతరక్షణగా
వృక్షరక్షణే సర్వజీవరక్షణగా
కవితా బృందగానం చేస్తున్నా
పర్యావరణహితమే మన శ్రేయస్సంటున్నా