ముద్దాయి తీర్పు

0
3

రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.

***

అవతారిక

[dropcap]ఆ[/dropcap]మె పతివ్రతే అయినప్పటికీ అకారణంగా నింద మోపబడిన ఇల్లాలు. తనకు పాపం పున్నెం ఏమీ తెలియదని చెప్పుకోగలిగినా, శిక్ష నుండి తప్పించుకోగల శక్తి ఉన్నా తలవంచుకొని మౌనంగా ఎన్నో యుగాలు శిక్ష అనుభవించింది. తీరా శాపవిమోచన సమయాన వద్దని తిరస్కరించింది. ఎందుకు? ఎవరి కోసం?

***

ఇనకుల తిలకుడు శ్రీ రామచంద్రమూర్తి, విశ్వామిత్రుల వారి వెనుక తలవంచుకొని దీర్ఘాలోచనలో నడుస్తున్నాడు. తన వెంట తమ్ముడు లక్ష్మణుడూ నడుస్తున్నాడు. యజ్ఞయాగాదులు ఏ ఆటంకమూ లేకుండా జరగడం కోసం ఆయన కోరిక మేరకు తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను పాటించి చీమలు దూరని చిట్టడవులలో, కాకులు దూరని కారడవులలో పయనం సాగిస్తున్నారిద్దరూ. యజ్ఞ యాగాదుల వద్ద రక్తమాంసాలను పైనుంచి పోసి ఎలాగైనా తాపసులను కలవరపెడదామని రాక్షసుల ఆలోచన. నిన్నటి తాటకీ సంహారంతో, మొన్నటి మారీచ సుబాహుల గర్వభంగంతో వారికి కొంత భయం కలిగింది. సాహసించి ఏమైనా చేద్దామంటే రెండు కొండల్లా ఇద్దరు అన్నదమ్ములు. వారి చేతుల్లో ధనుర్బాణాలు తమ దగ్గరున్న వేలాది శస్త్రముల కంటే కూడా బలమైనవని వారికి అర్థమైపోయింది. అందుకేనేమో మిన్నక ఉండిపోయారు.

నడుస్తున్నాడే కాని రాముని మనసు మనసులో లేదు. నిన్నటి రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు గురువు గారు చెప్పిన విషయాలే గుర్తుకు వస్తున్నాయి. నడుస్తున్న దారిలో కాలికింద ఎండిన ఆకు విరిగినా, చిన్న రాయి బొటన వేలికి తగిలినా ఉలిక్కి పడుతున్నాడు. “జరిగిన సంఘటన అహల్యా మాత పూర్వ జన్మ ఫలితమా, స్వయంకృతమా! ఆమె తప్పు చేసిందనుకోవడానికి మనసొప్పుకోవడం లేదు. పూర్వజన్మ ప్రారబ్ధమేమో! ఒక వేళ అంతే అయితే ఆ విధంగా ఆమె నుదుట ఆ విధంగా రాయడానికి ఆ బ్రహ్మదేవుడి మనసెలా ఒప్పింది? ఇంత దయలేని వాడా సృష్టి కర్త!…..హు! అయ్యే ఉండవచ్చు! కారణమేమైతేనేం, విశ్వామిత్రుల ఆజ్ఞను కాదనలేని పరిస్థితిని సృష్టించి, తండ్రి నోటనే తనకు ఆజ్ఞనిప్పించి, వదలలేక విల విలలాడుతున్న తండ్రినీ తనంటే ప్రాణం పెట్టే ముగ్గురు అమ్మలనూ బలవంతంగా వదిలి వేసేటట్టు చేసి నన్ను కారడవుల పాలు చేయలేదా!” రాముని ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయి.

చింతాక్రాంతుడైన రాముని మోమును పరికించిన గురువుగారు విశ్వామిత్రుడు క్షణమాత్రాన పరిస్థితిని ఆకళింపు చేసుకొన్నాడు.

హెచ్చరించినట్టుగా ఒకింత గట్టిగా “రామా!” అని పిలిచాడు. తడబడి మునుపటి స్థితికి వచ్చిన రాముడు వినయంగా “ఆజ్ఞ గురువర్యా?” అన్నాడు.

“రామా! మానవుల జీవితమంతా విధి నిర్ణయం ప్రకారం జరిగేదే. ఎవరు ఏమి చేసినా, ఎక్కడ ఏమి జరిగినా అది ముందుగానే నిర్ణయింపబడిందని తెలుసుకో. అందరూ విధి చేతిలోని కీలుబొమ్మలే గాని ఎవరికీ స్వయంనిర్ణయాధికారము లేదు. ఇది తెలుసుకుంటే అనవసరమైన ఆలోచనలు తొలగిపోతాయి.” గంభీరముగా అన్నాడు గురువు గారు విశ్వామిత్రుడు. గురువు గారి గ్రహణ శక్తికి ఒకింత ఆశ్చర్యపోయినా రాముని సందేహమేమీ తీరలేదు. ఆతని ముఖం అయోమయముతో మరింత వెల వెల బోయింది. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వుకొన్నాడు. శ్రీరామచంద్రుడు ఎంతటి వాడైనా మానవావతారంలో ఉన్నందున ఆ విధి చేసే లీలలో చిక్కుకొనే ఉన్నాడు కదా!

“రఘురామా! మనుష్య కర్మలన్నీ విధికృతాలు. వాటిని మీరి ఎవరూ ఏమీ చేయలేరు. వేరే ధ్యాస వద్దు.” ఆదేశించాడు గురువు. తల ఊపాడు శిష్యుడు.

ఒక్క క్షణమాగి మరల విశ్వామిత్రుడన్నాడు. “ఇక్ష్వాకు కుల తిలకా! శ్రీ రామా! న్యాయాన్యాయ విచారణా, తీర్పివ్వడమూ నీ పని కాదు. నేను చెప్పిన పనులు చేసేటప్పుడు నీకు అనేకమైన సందేహాలు రావచ్చు. తడబాటు పడకుండా, మనసును చెదిరి పోనివ్వకుండా, నిశ్చయమైన పట్టుదలతో నీ మనసుకు సరి అని తోచిన పని చేయి. శుభం జరుగుతుంది.”

అలాగే అన్నట్టు అంగీకార సూచకంగా తలపంకించి ముందుకు సాగాడు శ్రీరాముడు.

***

కొండలూ, కోనలూ, నదులూ సెలయేళ్ళతో అడవి రమణీయంగా ఉంది. రాముని పద స్పర్శతో ఆ ప్రదేశమంతా బంగరు, పచ్చల కలయికతో వింత అందాలను సంతరించుకుంది. క్రూరమృగాలు తమ సహజ స్వభావాన్ని విడిచి నీల మేఘశ్యాముని రాకకై ఎదురు చూస్తున్నాయి. పక్షుల కుహుకుహు ధ్వనులు మోహనమైన రాగాలుగా వినిపిస్తున్నాయి. చిన్నారి జింకపిల్లలు తమ పరుగులను మాని మోరలెత్తి ఆశగా రాముడు వచ్చే వైపే దృష్టి నిలిపి చూస్తున్నాయి. పాములు తమ పుట్టలనుండీ, పక్షులు చెట్ల పైనుండీ ఆ నవమన్మధాకారుని, పురుషులనే మోహపరవశులను చేసే ఆ శ్రీరామచంద్రమూర్తిని చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నాయి. చెట్లూ తీగలూ అన్నీ కాలంతో సంబంధం లేకుండా మనోహరమూ సుగంధ భరితమూ అయిన పూవులతో రాముడు వచ్చేదారిని తివాచీలా కప్పి ఉంచాయి. సూర్యుని వేడి ఆ నీలమేఘశ్యాముని మీద పడకుండా కిరణ మార్గాన్ని తమ ఆకులతో, కొమ్మలతో, తీగలతో కప్పేశాయి. రఘురాముడు తన పవిత్ర పాదాలను ఏ జలాలలో ప్రక్షాళన చేసుకొంటాడో తెలియక నదులూ సెలయేళ్ళూ, నదీనదాలూ ఉప్పొంగి ఆ ఇనకుల తిలకుడు ఒక అడుగైనా కిందకు దిగనవసరం లేకుండా గట్టు వరకూ పొంగి వచ్చాయి. తమ జలాలనన్నిటినీ స్వచ్ఛంగా, చూడగానే ఆయన అందమైన ముఖం అందరికీ కనువిందు చేసేలా అద్దంలోలా కనిపించాలని జల జల పారే సెలయేరులు కూడా కదలకుండా ఆగిపోయాయి. కొండలూ, గుట్టలూ కనురెప్ప వేయకుండా రాముని రాక కోసం ఎదురు చూస్తున్నాయి. చల్లని గాలి మంద్రముగా వీచమనీ వాయుదేవుడి ఆజ్ఞ అయ్యింది. సూర్యభగవానుడు తన కిరణములను సూటిగా ప్రసరిస్తే ఎక్కడ రామునికి బాధ కలుగుతుందోనని తన మార్గంలోకి మబ్బులను అడ్డు రమ్మని బ్రతిమలాడుకున్నాడు. సుకుమారుని పాదాలకు కొంచెమైనా కష్టం కలుగకూడదని మార్గం లోని రాళ్ళూరప్పలూ తమంతట తామే దూరంగా దొర్లిపోయాయి. దూరంగా వెళ్ళిపోతే ఆయనను చూడలేమని తెలిసినా కోరికను మనసులోనే అణచుకొని తలలు వంచుకొని ఆయన రాకకై ఎదురు చూస్తున్నాయి. ప్రకృతి నిర్మలమైనది. దానికి ఏ పాపాలూ అంటవు. అందుకే ప్రకృతికీ, అందులోని సర్వజీవులకూ భగవంతుని రాక ముందుగానే తెలుస్తుంది. పాపచిత్తులమైన మానవులకు మాత్రమే వారిలోనే, వారితోనే తిరిగే రాముణ్ణైనా, దేముణ్ణైనా గుర్తించగలిగే శక్తి ఉండదు.

తనకు అన్ని విధాలుగా స్వాగతం పలుకుతున్న ప్రకృతినీ ప్రాణికోటినీ గమనించే స్థితిలో లేడు శ్రీ రామచంద్ర ప్రభువు. తొలుత రాజర్షియై, పిమ్మట మహర్షియైన గురువు విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహనీయుడు తనకు నచ్చచెప్పినా రాముని మనసు డోలాయమాన స్థితిలోనే ఉంది. గౌతమ మహర్షి ఉండిన ఆశ్రమం వైపే తమ ప్రయాణమనీ, తనవలన జరుగవలసిన కార్యమొకటి ఉందనీ ఆయన చెప్పాడు గానీ అది ఏమై ఉంటుందని చెప్పలేదు. అహల్యా గౌతముల కథనూ, ఇంద్రుని నయవంచననూ విన్న సమయము నుండీ రాముని మనసు కకావికలమైయున్నది. మానవునిగా అవతరించినా సహజముగా ఆయన కరుణాంతరంగుడే కదా! తాను అహల్యకు చేయగల న్యాయమున్నదా అనుకొంటూ పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్న రాముని ఎవరో ఎలుగెత్తి పిలిచినట్టు అనిపించింది. ఉలిక్కిపడి పరిసరాలను పరికించాడా ప్రభువు. చుట్టు ప్రక్కల ఎవరూ కనిపించలేదు. తనతోపాటు వచ్చిన తమ్ముడు లక్ష్మణునీ, గురువు విశ్వామిత్రుల వారినీ వదలి తానేదో ఆలోచనలో ఎంతో దూరం వచ్చినట్లు తెలిసింది. జరుగబోయే సంఘటనలో వారిద్దరి పాత్రా లేదనే విషయం ఆయనకు తెలియలేదు మరి.

అంతలో కనిపించింది, సుందర మనోహరమై, ప్రకృతిలో లీనమై పోయి చెట్టో, పుట్టో అన్నట్టుగా కనిపిస్తూ పచ్చందనమూ, బంగారువర్ణమూ కలబోసుకున్న కుటీరం. ఎన్నాళ్ల బట్టో మనుష్య సంచారం లేక వెలవెల బోతున్నది. ద్వారానికి కొద్దిగా ఇవతలే నారీ రూపములో శిల ఒకటి. తలవంచి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు. ఎవరామె? రాముడు మెల్లగా ఆ శిల దగ్గరకు వెళ్లాడు. ఇప్పుడు ఆమె ముఖం మరింత స్పష్టంగా కనిపించింది. ఆమె ఆశీర్వాదం తీసుకొంటున్నట్టుగా లేదు. అవమాన భారంతో తలదించుకున్నట్టున్నది. కంటివెంట ఏమది? కన్నీరా!? సందేహం లేదు. ఈమె దైవోపహతురాలూ, శాపగ్రస్తా, భర్తృపరిత్యజా అయిన అహల్యామాతయే. ఒక్కసారిగా రామచంద్రునికి గురువుగారు విశ్వామిత్రుడు సూచించిన మహత్కార్యం ఏమై ఉంటుందో మనసులో స్ఫురించింది. రాముని మనసు రాజోచితమైన గాంభీర్య స్థితిని వదలి, ఆర్త త్రాణ పరాయణునికి సహజమైన కరుణతో ఉప్పొంగింది. అప్రయత్నంగా ఒక్క అడుగు ఆ శిల వైపు వేశాడు.

“ఎవరది! ఆగండి! ఏం చేయబోతున్నారు?” ఆదుర్దాగా భయం భయంగా ఒక స్త్రీ గొంతు వినిపించింది. నీరవ నిశ్శబ్ద ప్రకృతిలో ఒక్కసారిగా వినిపించిన ఆ కంఠస్వరం విని రాముడు క్షణకాలం కళవళ పడ్డాడు. ఆ స్వరం శిలా రూపములో ఉన్న అహల్యామాత నుండే వస్తోందా? అనుమానం కలిగినా తన సహజ గంభీర స్వరంతో

“ఎవరు పిలిచినది? నేను.. దశరధసుతుడను…” అని ఒక్క క్షణమాగి… “రాముడను..” అన్నాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఒక్కసారిగా ఆ శిల నుండి గట్టిగా నవ్వు వినిపించింది. మరుక్షణం శిలలను సైతం కరిగించేటంతటి విషాద భరితమైన, హృదయవిదారకమైన శోకం వినిపించింది. రాముడు చకితుడయ్యాడు. అంతలో శోకమాపుకున్న ఒక దుఃఖపూరితమైన గొంతు వినబడింది.

“రామా! నీవేనా! ఇన్నాళ్లకు తీరిందా తండ్రీ! అబలను ఇక్కడ ఇలా శిలా రూపంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానే! ఇన్నాళ్లకు నీ దయ కలిగిందా! పోనీలే.. ఇప్పటికైనా వచ్చావు… అదే చాలు… ఎన్నో ఏళ్లుగా నీవు వస్తావనీ, నీకు నా బాధ చెప్పుకోవాలనీ ఎదురుచూస్తున్నాను రామా! నీవు సకల సద్గుణాభిరాముడవనీ, ధర్మాధర్మములు చక్కగా తెలిసినవానివనీ నీకు…. నీకే… చెప్పాలని…..” ఆమె గొంతు రుద్ధమైంది.

రాముని మనసు కళవళపడింది. మాట్లాడుతున్నది అహల్యయేయని తెలిసిన రాముడు “ఎవరమ్మా నీవు! నీవు శాపగ్రస్థురాలైన అహల్యవు కాదు కదా! ఏం చెప్పదలచుకున్నావు తల్లీ?” అన్నాడు.

ఆమె విరక్తిగా నవ్వి “బాగానే గుర్తు పట్టావు రామా! ఈ నిర్జనమైన అరణ్యంలో ఇన్ని యుగాల నుండి నీకై వేచి చూసేది అహల్యయని తెలిసీ అడుగుతున్నావే! ఎవరు చెప్పారు రామా నీకు నేను శాపగ్రస్తురాలినని?” కోపంగానో, బాధగానో వినిపించింది ఆమె స్వరం. వ్యంగ్యమో, అసహనమో అని కూడా రామునికి తోచింది. “కాదా మరి! నాకలాగే చెప్పారే?” అయోమయంగా అడిగాడు రామభద్రుడు.

“ఎవరా మాటన్నది? పురుషాహంకారులే కదా! నేను శాపగ్రస్తను కానే కాదు…కాదూ…కాదూ.. కాదు.” ఆమె గొంతు స్థిరంగా పలికింది. “మగవారి దృష్టి ఎల్లప్పుడూ ఒకలాగే ఉంటుంది ప్రభూ! అది మానవుడైనా, రాక్షసుడైనా చివరకు భగవంతుడైనా అంతే.”

“అంటే!?” మరింత విచలితుడై అడిగాడు రామచంద్రుడు.

“అంటే ఏముంది? నేను తప్పు చేశాననో, చేయలేదనో నిర్ణయించే అధికారం నా భర్తకు ఎవరిచ్చారు? ఆయన శాపమిచ్చాడని నీవనుకోవచ్చు. కానీ నేను వద్దనుకుంటే, కాదనుకుంటే…. నాకు శాపమివ్వడానికి ఆయన తపశ్శక్తి సరిపోతుందా?… అనుమానపు అంచుల మీద, అపనమ్మకపు పునాది మీద ఏర్పడిన శాపం ఫలిస్తుందా? నేనే అనుకుంటే ఆయనను ధిక్కరించి స్వేచ్ఛాజీవినై మనగలిగేదానిని కాదా? ఆయన శాపం వలన కాదు. ఈ ప్రపంచానికీ నీకూ కొన్ని నిజాలు, కొన్ని కర్తవ్యాలూ తెలియాలని….” ఆవేశంతో అహల్య అన్న మాటలు లోకపాలకుడు కాబోతున్న రామునికి శరాఘాతమయ్యాయి. అయినప్పటికీ తమాయించుకున్న రాముడు

“అదేమిటమ్మా! ఆయనను నీవు భర్తగా అంగీకరించావు కదా! ఆ రోజే ఆయనకు శాస్త్రాలు అన్ని అధికారాలనూ ఇచ్చాయి. సంఘము ఆమోదించినదే శాస్త్రమయ్యింది. ఆయన వాక్కు శాపమయ్యింది.” అని చెప్పాడు.

మరల విరక్తిగా నవ్వింది అహల్యారూపయైన ఆ శిల. “రామా! ఇదియే ఇన్నిరోజులుగా నేను లోకమంతటికీ చెప్పదలుచుకున్నది. సాక్షాత్ భగవత్ స్వరూపుడవు! నీకు తెలియని శాస్త్రములా! ‘నాతి చరామి’ అని ఇద్దరూ ప్రమాణం చేసిన క్షణం నుండి వివాహ విధులు ఇద్దరికీ సమాన గౌరవాన్నీ పరస్పర అభిమానాన్నీ ఇచ్చాయి. అంతే గాని భర్తకి అనుమానం వస్తే శపించమనీ అవమానించమనీ, మనసా వాచా కర్మణా తనను నమ్మి వచ్చిన సహధర్మచారిణిని లోకమునకు కళంకితగా పరిచయం చెయ్యమని చెప్పలేదు.” ఆమె ఒక క్షణం ఆగింది. రాముడు తన మాటలు వింటున్నాడా అని.

“అమ్మా! న్యాయాన్యాయ విచారణా, కార్యకారణ సంబంధాల అన్వేషణా చెయ్యవద్దని మా గురువుగారు చెప్పారు. నిందితులూ, శిక్షననుభవించువారూ వేయి ప్రశ్నలు వేస్తారనీ చెప్పియున్నారు. సరియైనదో కాదో కాని నీ భర్త నీకు శాపమిచ్చుట నిజం. అది నీవు అనుభవించినదీ అబద్ధం కాబోదు. శాప విమోచన నా ద్వారానే జరగాలని అప్పుడే భవిష్యద్దర్శనం చేసిన నీ భర్త చెప్పి ఉన్నాడు కదమ్మా! ఎందుకు ఈ వాదం? ఇన్ని యుగాల నీ నిరీక్షణ ఫలించింది కదా! ఎందుకీ తర్కము? ఎందుకు మరింత ఆలస్యము?” ఒకింత జాలిగా అన్నాడు దశరథ తనయుడు.

“ఓహో! నా భర్త కంటే మీ గురువుగారే ఎక్కువగా భవిష్యద్దర్శనము చేసినట్లున్నది. నేను ఈ ప్రశ్నలనడుగుతానని వారికి ముందే తెలుసు. వారికి మాత్రమే తెలిసి నీకు తెలియని విషయమేదో ఇప్పటికైనా నీకవగతమైనదా రామా?” వ్యంగ్యముగా ప్రశ్నించింది అహల్యా మాత. ఆశ్చర్యపోతూ సందేహముగా చూశాడు రాముడు. ఆమె కొనసాగించింది. “నిందితులందరూ నేరస్థులు కారు. నేరస్థులందరూ శిక్షననుభవింపరు. శిక్షనుభవించేవారూ, నిందితులూ నేరస్థులు కావలసిన అవసరమూ లేదు. నేను నేరస్థురాలిని కాదనే విషయము మీ గురువుగారికి తెలుసు. నీ సూక్ష్మబుద్ధికి ఆ విషయము అవగతమవ్వకపోవడం నా పూర్వ జన్మ దురదృష్టమే గాని ఇంకొకటి కాదు.” ఆమె గొంతు దుఃఖంతో రుద్ధమైంది.

శ్రీరాముడవాక్కయ్యాడు. జవాబేం చెప్పాలో వెంటనే స్ఫురించలేదు.. ఆయన కంఠం పూడుకు పోయింది. ఎట్టకేలకు తనను తాను సంబాళించుకొని “జరిగినది అన్యాయమని కళ్ళకు కట్టినట్టు చెప్పావు తల్లీ! ఏది ఏమయినా ఇన్ని వేల సంవత్సరములు శిక్ష అనుభవించావు కదా! ఈ రోజు మంచి రోజు. నీ శాప విముక్తి జరగాలని వ్రాసి ఉంది. ఈ రోజు కోసం, నా రాక కోసం వేచి ఉన్నావు కదా! జరిగిన అన్యాయమును సరిచేయటం కోసమే నేను పంపబడ్డాను. నువ్వెందుకు నన్ను ఆటంకపరుస్తున్నావు?” ఆవేదనతో ప్రశ్నించాడు కౌసల్యాసుతుడు.

అందుకు అహల్య “ఓ రామచంద్రప్రభూ! అవమానమంటే ఏమిటో నీకు తెలియదు. వేదకాలము నుండి ఆడవారు పడే కష్టాలేమిటో నీకు తెలియదు. ఇన్ని వేల సంవత్సరముల వ్యథ నీ ముందు వెళ్లబోసుకున్నాను. అయినా నా బాధ ఏమిటో నీకు తెలియనట్లే ఉన్నావు. నా భర్త నా పై నింద వేశాడు. అసలు తప్పు జరిగిందా లేదా విచారించనే లేదు. విచారణ చేయకుండానే శిక్ష విధించి శాపమిచ్చాడు. సాక్ష్యమూ సాక్షులూ ఎవరూ లేరు. తనంతట తానే శిక్ష విధించి తనే జాలి పడ్డట్టుగా శాపవిమోచనమూ చెప్పినాడు. మునులు జితేంద్రియులై ఉండాలి. నా భర్త క్షణికావేశమునకు లోనై తనను తాను నియంత్రించు కొనలేక పోయినాడు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానము తెలిసినవాడివి, సాక్షాత్ ధర్మ స్వరూపునివి, నీవు వచ్చి నా కథ వింటావనీ, ధర్మస్వరూపుడివైన నీవు అటువంటి తప్పు ఎన్నడూ చేయకుండా నీ ప్రజలందరికీ ఎల్లకాలాలూ తెలుస్తుందనే ఒకే ఆలోచనతో ఈ శాపం స్వీకరించాను. లేకపోతే నా పాతివ్రత్య శక్తితో సంకల్పిస్తే ఆయన శాపము నన్నేమీ చేసి ఉండేది కాదు. నేను స్వేచ్ఛాజీవినై ఉండే దానినే. కానీ లోకానికి నా మీద అనుమానం అలాగే ఉండేది కదా. అందుకే రామా! నా దీనగాధ నీవు వింటావనే ఇన్ని వేల ఏళ్ళూ ఎండల వేడిని తట్టుకొని, వర్షాలలో తడిచి, గాలినీ ధూళినీ తలకెత్తుకొని, నీవు వస్తావని, నన్ను తరింప చేస్తావని ఎదురు చూస్తున్నాను రామా!” వెక్కి వెక్కి ఏడుస్తున్నది అహల్య.

ఆర్త జన బాంధవుడు, కరుణాంతరంగుడు అయిన రామచంద్రప్రభువు మనసు కరిగిపోయింది. దయతో అన్నాడు. “అమ్మా! నీ దీన గాథ నన్ను కరిగించింది తల్లీ! ఏ విధమైన విచారణా లేకుండానే నీకు శిక్ష విధించారు. ఇది నేను గుర్తుంచుకుంటాను. నిందితులు ఎవరైనా, విచారణ చేయకుండా శిక్ష విధించడం తప్పని నేను తెలుసుకున్నాను. నీ కోరిక మేరకు అందరికీ తెలుపుతాను. ఇదుగో ఇప్పుడే నీకు శాపవిమోచనము కలిగిస్తున్నాను.” అని ముందుకు కదిలాడు.

“రామా! ఆగు. నా కథ విన్నావు కదా. నేను అహల్యను. (నాగలి తాకని భూమిని). నా పేరే నేనేమిటో చెపుతుంది. నేను వివాహితనైననూ కన్యనే. నీవా అచ్యుతునివి. పాపపుణ్యములంటని వాడివి. దేవుడివైనా నీ స్పర్శ నాకు వద్దు. దయతో నీ పాద ధూళి మాత్రం నాపై పడేటట్లు అనుగ్రహిస్తే ధన్యురాలనవుతాను.” అన్నది అహల్య.

ఆశ్చర్యచకితుడైన లోకబాంధవుడు ఆ విధంగానే కరుణించాడు. మరుక్షణమే ఇంద్రధనుస్సులోని ఏడు రంగులూ ఒక్కసారిగా విరజిమ్మినట్టు ఆ ప్రదేశమంతా వెలుగులతో నిండింది. శిల నుండి మారిన అహల్యా మాత సుందర నారీమణిగా శ్రీరామునికి నమస్కరిస్తూ నిలబడింది. అద్భుతమైన ఈ దృశ్యమును కళ్లారా చూడడానికి ఎంత పుణ్యం చేసుకున్నానో కదా అని ప్రకృతి పరవశించింది. మరుక్షణమే ఆకాశం నుండి పుష్ప వర్షము కురిసింది. జరుగుతున్న సంభాషణలన్నీ అన్ని లోకముల నుండీ వింటున్న దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర కింపురుషాదులూ, దిక్పాలకులూ,సకల మునిగణాలూ “బాగు! బాగు!” అంటూ తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. అందునుండి గౌతమ మహర్షి వచ్చి ఆనందంతో లోకపాలకుడైన రామునికి నమస్కరించి,అహల్యను సమీపించి,”రా సాధ్వీ! నీ వలన నా చరిత్ర లోక ప్రసిద్ధమైంది. ఇక సంసార సుఖాలను సంపూర్ణంగా అనుభవిద్దాం!” అని ఆమె చేయందుకోబోయాడు.

అనుకోని విధంగా ఆమె దూరం జరిగింది. రాముని వైపు తిరిగి ప్రార్ధనా పూర్వకంగా చేతులు జోడించి “రామచంద్ర ప్రభూ! నేను నీకు ముందే చెప్పి ఉన్నాను. వివాహమైనప్పటికీ నేనహల్యను. కన్నియను. అలాగే ఉండాలని నా కోరిక. సంసారసుఖమన్నా, ఐహిక బంధములన్నా నాకాశ లేదు. నన్ను దయతో స్త్రీకి ప్రతిరూపమైన జీవ నదిగా అనుగ్రహించు. నా నదీ జలములు పుచ్చుకున్న వెంటనే జనుల పాపాలన్నీ ప్రక్షాళన కావాలి.. నేను పారిన చోటల్లా క్షేత్రములన్నీ సుక్షేత్రాలై బంగారు పంటలుపండి లోకాల ఆకలి తీరాలి. ఒక్క మాట రామా! నదులన్నీ సముద్రునిలో కలుస్తాయి. కానీ పరపురుషుణ్ణి నేను తాకను. మా అక్కా, అమ్మల గన్నయమ్మ అయిన గోదావరిలోనే సంగమిస్తాను. మరియొక విషయము. నీకో ఇంకొకరికో నేను ఏ పాపం చేయలేదని తెలిసినంత మాత్రాన సరిపోదు. అహల్య అంటేనే పాపం చేసి శిల అయిందనే లోక వాక్కు చెరిగిపోనిది. అందుచేత అహల్యగా కాక పుణ్యప్రదాయినీ, గౌతమ మహర్షి భార్యా, గౌతమి గానే అందరికీ తెలియాలి.” వినమ్రంగా అన్నది.

రాముడు కొంత దూరమాలోచించి “తథాస్తు” అన్నాడు. గౌతమి నిరంతరాయంగా ప్రవహిస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here