అడిగినవన్నీ దేముడు ఇచ్చేస్తే!

0
3

[dropcap]భ[/dropcap]ళ్ళు మంటూ పెద్ద శబ్దం. క్రింద గిన్నెలు పడినట్టు.. కాదు పడేసినట్టు. వంటింట్లో సరస్వతి ఆగ్రహంతో రగిలిపోతోంది.

“దిక్కుమాలిన జీవితం, అసలు ఎదుగూ లేదు బొదుగూ లేదు. పెళ్ళయి పదిహేను ఏళ్లు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ఎవరైనా జీవితంలో ఎదగటానికి ప్రయత్నం చేస్తారు. మన దరిద్రం, ఉన్నచోటే స్థాణువులా ఉండిపోయాం” మాటలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే  మొగుడికి వినిపించేలా అరుస్తోంది. కిమ్మనకుండా గెడ్డం గీసుకుంటున్నాడు నారాయణ.

ఇదేమీ కొత్త కాదు. తప్పించుకునే పరిస్థితి లేదు. ఏమీ చేయలేక మౌనంగా భరిస్తున్నాడు. ఈ అసహనం

సరస్వతిలో ఇది వరకటి కన్నా ఈ మధ్య ఎక్కువ అయ్యింది. ఆ మధ్య పాత స్నేహితులందరూ కలసిన దగ్గర నుండి వాళ్ళ జీవితంతో పోలిక చూసిన దగ్గర నుండి ఇదే వ్యవహారం.

నారాయణ స్టేట్ గవర్నమెంట్ ఉన్నతాధికారి. బాగా లంచాలు అవీ దొరుకుతాయని అనుకుంటున్నారేమో, అవకాశం ఉన్నా, ఒక్క జీతం తప్ప మరి ఏదీ తీసుకొని, నియమం కలిగిన స్థితప్రజ్ఞడు. అవకాశాలు కళ్ళ ముందే ఉన్నా, కాళ్ళ మీద పడినా ఇన్నాళ్ళూ నిప్పులా బ్రతికాడు.

అతని ఆఫీసులో  అందరూ లంచాలు తీసుకుని బాగా ఎదిగిపోయినా తాను మాత్రం జీతం తీసుకుని, గీతం పై ఎలాంటి ఆపేక్ష లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న మంచి వ్యక్తి. అతని ధర్మపత్ని సరస్వతి.

గవర్నమెంట్ ఉద్యోగం, బాగా పై డబ్బులు వచ్చే శాఖ,  పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటూ, అద్దాల మేడలో అంగరంగ వైభవంగా జీవితం ఉంటుంది అంటూ పెళ్లి చేసేశారు.

ఎంతో గొప్పగా ఉంటుందని  ఊహించుకుంటూ తానూ ఒప్పేసుకుంది. కానీ నారాయణ నీతి, నిజాయితీ, రెక్కల కష్టం, పాపం, పుణ్యం అంటూ మడి బట్టలు కట్టుకుని వచ్చే జీతంతో గడిపేస్తున్నాడు. ఎంత సాధారణంగా ఉండాలో అంతలా ఉండటం అతనికి చాలా ఇష్టం. దానికి పూర్తి విరుద్ధం సరస్వతి. వాళ్ళకు పుట్టిన ఇద్దరు పిల్లలు బాగా చదువుకుంటున్నా, ఒక పదిహేను సంవత్సరాలు సంసారం అయినా ఎక్కడా ఆర్థికంగా ఎదగకుండా అదే గొర్రె బెత్తెడు తోక మాదిరి జీవితం చూసే సరస్వతిలో అసహనం పెరిగి పోయింది.

పుండుపై కారం చల్లినట్లు మొన్నా మధ్య వాళ్ళ క్లాస్‌మేట్.. పూర్వ విద్యార్ధుల కలయిక అంటూ జరపటం,  అక్కడ తన తోటి స్నేహితుల వైభవాలు చూసిన దగ్గర నుండి కంటి మీద కునుకు లేదు. అందరూ ఆ సమ్మేళనానికి కారుల్లో దిగితే తాను మాత్రం పల్లె వెలుగు బస్సులో దిగటం,  అంతా నగలు వేసుకుని ఉల్లాసంగా వస్తే, తాను మాత్రం చిన్న ముత్యాల హారం వేసుకుని ఉసూరుమంటూ రావటం అంతా గుర్తుకు వస్తే దహించుకుపోతోంది. అప్పటి నుండి కష్టాలు మరిన్ని కఠిన మాటలు నారాయణకు దక్కాయి.

ఈవేళ మరీ ఉగ్రరూపం దాల్చింది.  నారాయణకు శలవు దినం కావటం ఇంట్లో ఉండటం మరీ నరకప్రాయంగా ఉంది. మరి తదుపరి ఏమిటో….

***

ముసుగుతన్ని నిద్రపోతున్న పిల్లలు తెలివి వచ్చినా అమ్మ కోపం అర్థం అయ్యిందేమో మళ్ళీ నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నారు. అన్నీ వింటున్నా, చూస్తున్నా, నోరు మెదప కుండా ఏమీ పట్టనట్టు తన పని తాను చేసుకుపోతున్న నారాయణన చూసి మరీ మండిపోయింది. అసలు ఈయన వింటున్నారా? లేక నన్ను పిచ్చిదానిలాగ భావించి పట్టించుకోకుండా వదిలేశారా? అలా ఆలోచన కలగగానే మరింత అసహనం చెలరేగి చేతిలో ఉన్న వాటితో చప్పుడు చేస్తూ నోటితో అరుస్తూ గయ్యాళి గంపలా తయారయ్యింది.

“హాయిగా దర్జాగా బతకాల్సిన జీవితం, డిబ్బీలు తడుముకుంటూ బతుకుతోంది. అంతా నా ఖర్మ. సిద్దాంతం అంటూ పట్టుకు కూర్చుంటే, ఇంక ఎక్కడ ఎదగగలం? మనం ఒక్కళ్ళమేనా మడి కట్టుకు ఉండవలసింది. మొత్తం డిపార్ట్మెంట్ అంతా అలాగే ఉన్నారా? ఎవరి సంపాదన వారిది. గవర్నమెంట్ ఉద్యోగం జీతంతో పాటు పై సంపాదన ఏదో కొంత వస్తుంది అని అంటే చేసుకున్నాను. పెళ్ళికి ముందూ బెత్తెడు జీవితమే, పెళ్లి అయ్యాక అదే. ఎక్కడా ఎదుగుదల లేదు.  అందగత్తెను, ఇది కాకుంటే ఇంకో సంబంధం వచ్చేదేమో.  ఏం చేస్తాంలే? సుఖపడాలి అని రాసి ఉండాలి. చిల్లర డబ్బులు కోసం నెలాఖరుకు డబ్బాలు తడిమే అదృష్టం మనది. ఏం చేస్తాం?” సరస్వతి నోటికి అదుపు లేకుండా మాట్లాడుతోంది. ఎంత మౌనంగా ఉన్న ఇక భరించలేక నారాయణ పెదవి విప్పాడు.

“అది కాదే సరూ!.. ఇప్పుడు ఏమయ్యిందని? మనం బాగా ఉన్నాంగా? భగవంతుని దయవల్ల మనకు ఏమీ లోటు లేదు. పిల్లలు బాగా తెలివైన వాళ్ళు. ఇలాగే చక్కగా చదివితే మంచి అభివృద్ధిలోకి వస్తారు. నేను రిటైర్ అయ్యేలోపు, ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం. దేముడి దయవల్ల ఆరోగ్య సమస్యలు ఏమీలేవు. మనం తప్పు చేయకుండా బతుకుతున్నాం. సమాజంలో కొద్దో, గొప్పో పలుకుబడి ఉంది. ఇంకేమి కావాలి? ఏదో అర్థం కాని అసంతృప్తితో ఇలా రాద్దాంతం  చేస్తావ్.” అంటూ అనునయంగా పలికాడు.

అతని నెమ్మదితనం  ఆమెను మరింత పేట్రేగేలా చేసింది. పెద్దగా అరుస్తూ చేతులు, మెటికలు విరుస్తూ వంటింట్లోంచి బయటకు వచ్చి నారాయణ ఎదురుగా నిలిచి

“ఇదీ ఒక జీవితమేనా? నిత్యం రేపటి గురించి బెంగే. ఓ సౌకర్యం లేదు, ఓ సుఖమూ లేదు. మనం ఎదుగుతున్నాం అంటే మన ఆర్థిక పరిస్థితి మరింత పెరగాలి. జీతం తప్ప మరోటి లేదు. ఒకటో తారీఖు విందులు.. నాలుగో తారీఖు నుండి అన్నీ బందులు.. ప్రతీదీ లెక్క వేసుకుని, బడ్జెట్ రాసుకుని కొనుక్కోవాలి. మీ స్థాయి హోదా కలిగిన వాళ్ళంతా మీలాగే నిక్కచ్చిగా ఉంటారా? పనికిమాలిన సిద్దాంతాలు  ఎదగటానికి అవరోధాలు.  మీకు అర్థం అయ్యేటప్పటికి అనుభవించాల్సిన వయసు పోయి అన్నం కూడా అరగని వృద్దాప్యం వచ్చేస్తుంది.

అయినా మిమ్మల్ని అనుకుని ఏం లాభం. ఇదంతా నా  ప్రారబ్ధం. అన్నీ అందరికీ బాగా రాసిన దేముడు నాకు ఈ దరిద్రం ఇచ్చాడు. జీవితంలో ఓ అచ్చటా, ముచ్చటా రాయలేదు. పుట్టిన ఇంటిలోనూ అదే పరిస్థితి.. పెళ్ళయి మెట్టిన ఇంటిలోనూ అదే స్థితి. కోరుకున్నవి కొన్ని అయినా జీవితంలో ఉండాలి కదా. పెద్ద బంగ్లాలో ఉండాలని, కారులో తిరగాలని, మంచి హోదా అనుభవించాలని, పర్సు నిండా డబ్బులు ఉండాలని, ఏవి కొందామన్నా,  ఆలోచన రాగానే కొనేలా జీవితం ఉండాలని అనిపించదా? ఇవేమైనా పెద్ద విషయాలా? ఒక సాధారణ గృహిణి ఊహించేవే కదా! దేముడు అందరికీ అన్నీ ఇచ్చేయవచ్చు కదా? ఆయన కూడా ఒక పక్షపాతే.

డబ్బులు బాగా ఉన్నవాడికే లాటరీ తగిలేలా చేస్తాడు. అదేదో లాటరీ అమ్మేవాడికే వస్తే వాడికి ఇలా లాటరీలు అమ్ముకునే స్థితి ఉండదు కదా. అందాలన్నీ ఒకచోటే ఉంచకపోతే అన్నిచోట్లా పరచవచ్చు కదా. తినలేని వాడికే పరమాన్నం పెడతారు. వంటి మీద బట్ట మోయలేని వారికే బీరువా నిండా బట్టలు ఉంటాయి.

కళ్ళు లేనివాడికే చుట్టూ రంగుల ప్రపంచం నిలబెడతారు. అర్థం కాదు. ఏదైనా అంటే ఖర్మ సిద్దాంతం, పాపం, పుణ్యం అంటారు. తలరాత రాసింది వాడే కదా. మరి రాసినదాన్ని బట్టే కదా జరుగుతుంది.  అయినా ఏమిటో మనకే పాప, పుణ్యాలు అంటగట్టారు. నాకు దేముడిని అడిగే అవకాశం, పలకరించే సమయం వస్తే నిలదీస్తాను. ఆయన ఆగడాలను ఎండ కడతాను”..

అంటూ ఇంతలో వంటింట్లోంచి కుక్కర్ ఈల వినబడగానే అక్కడితో సంభాషణ ఆపేసి గబగబా లోపలకి వెళ్ళిపోయింది సరస్వతి.

భార్య నోటినుండి ధారాళంగా కురిసిన మాటలకు నోటమాట రాలేదు నారాయణకు. ఆమె మాటలు  కాస్త

సబబుగా అనిపించి ఒప్పేసుకున్నాడు.  ఈమె మాటల్లో చాలా లాజిక్ ఉంది

కానీ, ఈమె ఇలాగే కొనసాగితే జీవితం మరింత దుర్భరమే.  అవును.. నా ఒక్కడి వల్ల ఏమైనా జరుగుతుందా. నేనే ఎందుకు అంత నిక్కచ్చిగా ఉండాలి. పాపాలు చేస్తున్న వాళ్ళంతా సుఖంగానే ఉన్నారుగా. మరి నాకు ఎందుకు అంత భయం అని అనుకుంటూ తన ఆశయాలకి భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా కాసేపు ఆలోచించిన తరువాత ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలాగా బయటకు వెడుతున్నానని చెప్పి అలా ఊరిలోకి వెళ్ళిపోయాడు.

అలా వెళ్ళిన నారాయణ చాలా సేపటికి కానీ ఇంటికి రాలేదు. సరస్వతి భర్త కోసం ఎదురు చూసి ఇక ఆగలేక భోజనం ముగించింది.

అలా బయటకు వెళ్ళిన నారాయణ ఆలస్యంగా తిరిగి వచ్చాడు. “సరస్వతి.. సాయంత్రం నా స్నేహితుడు రమేష్ ఇంటికి వెడదాం. సిద్దంగా ఉండు.” అంటూ హుషారుగా మాట్లాడి భోజనానికి కూర్చున్నాడు.

భర్త ఎక్కడికి వెళ్లాడో, అతని ధోరణి ఏమిటో, తనకు తెలియని ఈ కొత్త స్నేహితుడు ఎక్కడనుండి పుట్టుకు

వచ్చాడో అర్థం కాలేదు. పొద్దున్నే తాను అన్న మాటలకు ఏమి అనుకున్నాడో, అనవసరంగా నోరు పారేసుకున్నాను అని ఆలోచిస్తూ సరస్వతి ముఖంలో ఒక అపరాధ భావన తొణికిసలాడింది. అది పైకి తెలియకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ మౌనంగా తల ఊపి సాయంత్రం వెళ్ళవలసినది ఎక్కడికా అంటూ ఆలోచిస్తూ  తనపనిలో తాను నిమగ్నమయ్యింది.

అనుకున్నట్టుగానే నారాయణ సాయంత్రం తన స్నేహితుడు రమేష్ ఇంటికి కుటుంబంతో సహ వచ్చాడు. ఎప్పుడూ డొక్కు స్కూటర్ తీసే నారాయణ  ఈ సారి కారు అద్దెకు మాట్లాడుకుని మరీ బయలుదేరి,  ఒక పెద్ద బంగాళా దగ్గర దిగాడు. భర్తలో వచ్చిన ఈ కొత్తమార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు సరస్వతికి.

రమేష్ ఇంటిలోకి ప్రవేశించగానే అర్థం అయ్యింది అది చాలా ధనవంతుల ఇల్లని. చుట్టూ పరికించింది, అందమైన గదులు, ఖరీదయిన సోఫాలు, చుట్టూ గార్డెన్ ఐశ్వర్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

అదే సమయంలో రమేష్ భార్య, పిల్లలు వచ్చి పలకరించారు. తన భర్తకు ఇంత ధనవంతుడైన స్నేహితుడు ఉన్నట్టు ఇన్నాళ్లూ తనకు తెలియదు. వాళ్ళతో పెద్దగా పరిచయం లేకపోయినా అందరూ కల్పించుకుని సరదాగా మాట్లాడుతూ ఉండటంలో చాలా ఆనందం వేసింది సరస్వతికి.

గొప్పోళ్ళ ఇళ్ళల్లో ఇంత సరదాగా గడిచిపోతుందా. ఇదే మన ఇంట్లో అయితే జుట్టు చెరిగి, మసిబొగ్గు ముఖాలు వేసుకుని కూర్చుంటాం. అంతేలే ఎంతైనా భాగ్యం.. భాగ్యమే. ఆమె ఆ ఇంట్లో ఉన్నంతసేపు రమేష్ ఆమెను అణువణువు పరిశీలించడం మొదలు పెట్టాడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు తదేకంగా చూడటం, ఏదో రకంగా తన వైపు ఆకర్షణ అయ్యేలా ప్రయత్నం చేస్తూ, ఆమెకు ఇష్టమైన విషయాలు మాట్లాడుతూ, ఆమెను మాటిమాటికి ప్రశంసించడం మొదలు పెట్టాడు.  కొత్తలో సరదాగా అనిపించినా సరస్వతికి కాసేపటికి ఏదో తెలియని ఇబ్బంది మనసులో కలగటం జరిగింది. అక్కడ నుండి ఇక ఎప్పుడు ఇంటికి వెడదామా అన్న ఆలోచనలో పడింది. ఇదంతా గమనిస్తున్న నారాయణ మౌనంగా ఉన్నాడు.

అక్కడ రాత్రి డిన్నర్ కూడా చేసి నెమ్మదిగా ఇంటికి వచ్చారు. ఎందుకో ఇంటికి వచ్చిన దగ్గరనుండి సరస్వతి మౌనంగా ఉండి, ఎప్పటిలాగా కాకుండా వెంటనే నిద్రలోకి జారుకుంది. నారాయణ భార్య పరిస్థితి గమనిస్తూ, ఆమె నిద్రపోయింది అన్న నిర్ధారణకు వచ్చిన తరువాత ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి తానూ నిద్రకు ఉపక్రమించాడు.

***

సరస్వతి ముఖంపై పెద్ద కాంతి పడడంతో చూడలేక కళ్ళు మూసుకొంటూ “ఎవరు…. నా మీద అంత పెద్ద లైట్ వేశారు” అంటూ గట్టిగా అరిచింది.  ఆమె అరుపు వినగానే అంత పెద్దగా ఉన్న కాంతి కాస్త మందగించి నెమ్మదిగా ఎవరో మాట్లాడుతూ ఉండటం వినిపించింది.

“సరస్వతీ… నేను దేముడను. నీతో మాట్లాడదామని వచ్చాను” అంటూ మెల్లగా దేముడు.

“దేముడా.. మరి అంత కాంతి ఏమిటీ? ఏదో పెద్ద లైట్ హౌస్ లాగ. రూపం ఏమీ లేదా? ఇంతకూ నాతో మాట్లాడవలసినది ఏముంది?” అంటూ నిక్కచ్చిగా అడిగింది సరస్వతి.

“అదా సంగతి…. నీవు ఏ రూపంలో కొలుస్తావో అలాగే ఉంటాను. నువ్వు ఎలా నన్ను తలుస్తున్నావో? అర్థంకాక అలా వచ్చాను. నువ్వు నిన్న ఉదయం మీ ఆయనతో దెబ్బలాడుతూ చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి. అందుకే మరోసారి నీతో మాట్లాడి ఏం చేయాలో ఒక నిర్ణయానికి వద్దామని వచ్చాను” అంటూ నిర్మలంగా అన్నాడు  దేముడు.

“అలాగా… అయితే మా మధ్య తిరిగే మనిషిలా కనిపించండి చాలు. నిజంగా నా మాటలు నచ్చాయా? నా సిద్ధాంతం దేముడికే సబబు అనిపించిందా? నిజమే కదా స్వామి. ఏవో అడియాశలు పెట్టుకుని, అవి రాక భంగపడి ఉండేకన్నా, నిన్ను అడగంగానే అన్నీ ఇచ్చేస్తే లోకంలో అందరి కోరికలు తీరిపోతాయిగా. అప్పుడు అశాంతి అన్నది ఉండదు కదా. ఒక్కసారి ఆలోచించు.  ఏమిటో పాపం, ప్రాప్తం అంటావు.  పుణ్యం కొద్దీ భోగాలు అంటావు. ఎవ్వరికీ అర్థం కాని ఈ విషయాల వల్ల ఉపయోగం ఏముంటుంది.” అంటూ చాలా గొప్పగా దేమునికే ఉపన్యాసం ఇచ్చింది సరస్వతి.

“అలాగంటావా… సరస్వతి. అంటే ఈ లోకంలో ఎవ్వరు అడిగిన కోర్కెలు వారికి తీర్చేస్తే అశాంతి ఉండదంటావ్? నీకు ఇంత బాగా అర్థం అయిన విషయం నాకు ఎందుకు అర్థం కాలేదో?   సరే తథాస్తు. ఇక నుండి నువ్వు ఏమి కోరుకుంటే అదే జరుగుతుంది. కానీ నాకు కాస్త కుతూహలంగా ఉంది. మొదటగా నీవు ఏమి కోరుకుంటావోనని” అంటూ వరం ఇచ్చేస్తూ అడిగాడు దేముడు.

“నిజమా… స్వామి. నువ్వు అంత దయార్ద్ర హృదయం కలవాడివి. అయితే నేను ఇక కోరుకోవడం మొదలు పెట్టొచ్చా. ముందుగా నాకు ఎంతో కాలం నుండి ఒక మూడుగదుల ఫ్లాట్ ఉండాలని కోరిక. అలాగే సొంత కారు కొనుక్కుని ఊరంతా తిరగాలని ఆశ. ముందు ఇవి రెండూ సమకూర్చు. ఇవి తనివితీరిన తరువాత తీరిగ్గా మిగతావి అడుగుతాను” అంటూ ఆనందంగాను, అనుమానంగాను అడిగింది సరస్వతి.

“అలాగే…తథాస్తు!…నీవు అనుకున్నట్లే అవుతుంది” అని నవ్వుతూ అంతర్ధాన మయ్యాడు దేముడు.

చిరు చెమటలు పోస్తూ ఉండటంతో సరస్వతి ఒక్కసారి ఉలిక్కిపడి మంచం మీద నుండి నిద్ర లేచింది. అంతా కలలో జరిగిందని అర్థం అయ్యింది. అయ్యో… ఇదంతా కలనా…. అయినా నిజం ఎప్పుడు అవుతుందిలే అని అనుకుంటూ సమయం ఇంకా తెల్లవారక పోవటం వల్ల మళ్లీ నిద్రలోకి జారిపోయింది.

***

“సరూ…ఇవాళ నేను ఆఫీసుకు శలవు. మనం వేరే పని మీద బయటకు వెడుతున్నాం. త్వరగా నిద్ర లేచి సిద్ధంకామరి.” అంటూ సరస్వతి బుగ్గపై చిటికె వేస్తూ నవ్వాడు నారాయణ.

నిన్న సాయంత్రం నుండి భర్తలో వచ్చిన మార్పు ఏమిటో అర్థంకాక, అంచనా వేయలేక సిద్ధం కావటానికి

వెళ్ళిపోయింది. అలా ఒక గంట తరువాత కారు బుకింగ్ చేసుకుని వెళ్లారు.  అలా వెళుతూ ఊరిలో కొత్తగా తయారవుతున్న ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగారు. సరస్వతికి ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. ఇంకో రెండు, మూడు నెలల్లో పూర్తిగా సిద్ధం అయ్యే ఫ్లాట్ దగ్గర ఆగాడు నారాయణ.

“సరూ…. నీ చిరకాల కోరిక. ఇదిగో ఈ మూడు గదులు ఉన్న ఫ్లాట్ మనదే. ఇంకో రెండు నెలల్లో ఆ చిన్న ఇంటిలో నుండి ఇక్కడకు మనం వచ్చేద్దాం. ఈ ఫ్లాట్‌కు అన్నీ దగ్గరగా ఉన్నాయి. పిల్లల స్కూల్, నా ఆఫీసు, ఊళ్ళో సినిమా హాళ్లు అన్నీ దగ్గరే. సంతోషంగా ఉందా? ఎన్నాళ్ల నుండి కలలు కంటున్నావో” అంటూ చుట్టూ కలయ తిరుగుతూ  చూపించాడు.

సరస్వతికి మతిపోయింది. అంటే నిన్న రాత్రి కలలో దేముడు వచ్చిన మాట వాస్తవమే నన్నమాట. ఇది నిజంగా మేము కొంటున్న ఇల్లేనా, ఇది నిజమేనా, లేక కలా… ఒకవేళ నిజం అయితే కాకతాళీయంగా జరిగినదా… అర్థం కాలేదు. కానీ ఏదో అబ్బురంగా, ఆనందంగా ఉంది.

నిన్నటి విసుగు,  నారాయణ మీద ఉన్న అలుసు రెండూ పోయాయి. అమాంతం ప్రేమ పుట్టుకొచ్చి చుట్టూ ఎవ్వరూ లేకపోవటం చూసి నారాయణ ను గట్టిగా కాగిలించి ముద్దు పెట్టేసింది.

నారాయణ ఆశ్చర్యంగా నవ్వుతూ “ఏమిటి…. దీనికే ఇంత సంబరమా!” అని అంటూ ఇక వెళదాం పద అన్నట్టు ముందుకు నడిచాడు. సరస్వతి తన కొత్త ఇల్లు తనివితీరా చూసుకున్న తర్వాత ఇద్దరూ మరల కారులో బయలుదేరి మంచి హోటల్లో భోజనం చేసి ఒక కారు షోరూం ముందు ఆగారు. సరస్వతికి గుండె గతుక్కుమంది.

‘ఏమిటీ.. కొంపతీసి ఈయన కారు కొనేస్తాడా… అంటే నా రెండో కోరిక అదే దేముడితో కలలో అడిగింది అయిపోతోందా??? అయినా తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయి అంటారు, ఇదేనేమో. అంటే నాకు అడిగినవన్నీ ఇచ్చే వరం దేముడు ఇచ్చాడేమో. ఈ కోరిక కూడా తీరుతోంది’ అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా షోరూం లోకి అడుగుపెట్టింది.

నారాయణ లోపలకు వెళ్లి అక్కడ వారితో ఏదో మాట్లాడి, సరస్వతిని ఎర్రగా ఉన్న కొత్త కారు దగ్గరకు తీసుకు వెళ్ళాడు.

“సరూ… ఇదిగో నీవు ఎన్నాళ్లనుండో కలలు కన్న కారు. రంగు బాగుంది కదా. ఇకనుండి మనం ఎక్కడకు వెళ్లినా కారులోనే… చివరకు మన వీధి చివర పాల బూత్‌కు కూడా.” అంటూ కొంటెగా నవ్వాడు.

ప్రొద్దుట నుండి సంఘటనలు అన్నీ కలలో వరం ఇచ్చినట్లుగానే జరగటం చూస్తే సరస్వతికి మతిపోయింది. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి నెమ్మదిగా ఇది కలా.. నిజమా… ఏమిటా అన్నది ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో కొత్త కారు సిద్ధం కావడం నారాయణ, సరస్వతి దంపతులు అందులో ఇంటికి రావటం చేశారు. గలగలా మాట్లాడే సరస్వతి మాటలు పెగలక మౌనంగా ఉండటం చూసి నారాయణ

“ఏమయ్యింది సరూ! నీకు నచ్చినవి ఇచ్చినా మౌనం ఏల?.. ఇది నీ స్వభావానికి విరుద్ధం. ఇంకా ఇదేమిటి. ముందు, ముందు ఇంకా చూస్తావ్. కంగారు పడకు” అంటూ అల్లరి చేసాడు.

ఆ రోజు గడిచి పోయింది. సరస్వతి నిజమా.. కలా అన్న అనుమానంతో కొత్తగా ఇల్లు, కారు కొన్న ఆనందంలో ఇంకొరోజు గడిచిపోయింది. నారాయణ ఆఫీసుకు వెడుతుంటే నవ్వుతూ పంపించింది. నారాయణ ఆఫీసుకు వెళ్లగానే పూజ గదిలో దూరి దేముడికి కృతజ్ఞతతో దండం పెడుతూ “స్వామీ…. నీ దయవల్ల అన్నీ అనుకున్నట్టు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా అందరికీ వాళ్లకు ఇష్టమైన కోరికలు తీరేట్టు వరం ఇవ్వు. అలాగే ఇంకో చిన్న కోరిక నాలో ఉండి పోయింది. నేనేమీ గొంతెమ్మ కోరికలు అడగను. జరిగేవి, తీరేవి, మాత్రమే అడుగుతున్నాను. నా ఈ అందమైన మెడకు కాస్త రవ్వల నెక్లెస్ పెట్టుకోవాలని ఎన్నాళ్ల కోరికో…ఆ కోరిక కూడా తీర్చు స్వామి.” అంటూ తన మూడో కోరిక చెప్పింది.

దేముడు తథాస్తు  అన్నాడేమో అన్నట్టుగా పటానికి ఉన్న మందారపువ్వు రివ్వున క్రిందపడి సంకేతంలా

కనిపించింది. సంతోషంగా అక్కడ నుండి లేచి తన పనులు ముగించుకుని టీవీలో సీరియల్ చూడటం మెదలు పెట్టింది.

ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం… ఎవరై ఉంటారు… ఈ వేళ.. ఏమో ఆలోచిస్తూ… వెళ్లి వీధి తలుపు తీసింది సరస్వతి. ఎదురుగా నారాయణ స్నేహితుడు రమేష్ నవ్వుతూ… “సరస్వతి గారు…బాగున్నారా. గుర్తుపట్టారా?…” అంటూ చొరవగా లోపలికి వచ్చాడు.

సరస్వతి అప్రయత్నంగానే “రండి…కూర్చోండి..” అంటూ లోపలికి దారి తీసింది.

లోపలకి వచ్చి కూర్చున్న రమేష్ నెమ్మదిగా ఇంటిని, పరిసరాలని పరిశీలనగా చూసాడు. నారాయణ జీవితం మధ్యతరగతి ముఖచిత్రాన్ని ప్రతిబింబచేస్తూ కనిపించింది.

అతని నిజాయితీకి తార్కాణంగా సాధారణ జీవితం ప్రస్ఫుటంగా నిదర్శనంగా నిలిచింది. ఇంతలో లోపలికి వెళ్లిన సరస్వతి ఒక గ్లాసులో మంచినీళ్లు, ఇంకో గ్లాసులో జ్యూస్ తీసుకుని వచ్చింది.

“హాయ్ సరస్వతి… ఎలా ఉన్నారు? ఇదా మీరు ఉండే ఇల్లు. ఏమీ బాగాలేదు. ఇవాళ నా పుట్టినరోజు, ఈ సందర్భంగా నేను మీకు ఒక బహుమానం ఇస్తున్నాను. మరి బదులుగా నాకేమి ఇస్తారో?” అంటూ అదో రకమైన నవ్వుతో చేతిలో ఉన్న పెట్టి తెరిచి ధగధగలాడుతున్న మంచి  నెక్లెస్ ముందు పెట్టాడు.

బంగారు నెక్లెస్ చూడంగానే సరస్వతి గుండె జల్లుమంది. ఇదేమిటి ఇందాకే కదా…. దేముడి దగ్గర అనుకున్నది.

అప్పుడే తీర్చేసాడా? కానీ ఈయన ఇది తీసుకురావటం, చూపించే విధానం ఎందుకో అనుమానాస్పదంగా అనిపించింది. వెంటనే సర్దుకుని గొంతు సవరించుకుని

“రమేష్ గారు… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు… అయినా మీ పుట్టినరోజుకు నాకు బహుమతి ఏమిటి? పైగా ఇంత ఖరీదైనది. మా ఆయన లేకుండా మీరు ఇలా వచ్చి ఇవ్వడం ఏమీ బాగోలేదు.” అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది.

“అదేంటి.. సరూ!… నీకోసం ప్రత్యేకంగా కొని తెప్పించిన రవ్వల నెక్లెస్. నువ్వు కాదనకు. నీ అందమైన మెడకు అద్బుతంగా ఉంటుంది. నీలాంటి అందగత్తెలకు ఇలాంటివి మరింత వన్నె తెస్తాయ్. ఈ నగ నీకోసమే పుట్టింది.  ఇంత అందగత్తెవు ఎలాంటి భోగభాగ్యాలు అనుభవించాలి. అలాంటిది ఇలాంటి కొంపలోనా. ఛా….ఏమీ బాగోలేదు. అయినా ఇవాళ దేముడు నాకు కలలో కనబడి ఈ నగ నీ దగ్గరకు పట్టుకు వెళ్ళమన్నాడు. దీని వల్ల నీ కోరిక తీరుతుందిట, నేను కోరుకున్నది నాకు దక్కుతుందిట. నా పుట్టినరోజు ఇలా కాదనడం ఏమీ బాగోలేదు. ఈ నగ నువ్వు తీసుకుని, నా కానుక నాకు ఇచ్చేయి. ఎందుకంటే మనం అడిగినవన్నీ దేముడు ఇస్తున్నాడుగా. నువ్వంటే నాకు ఇష్టం… చచ్చేంత మోజు. అసలు నీలాంటి అందగత్తె నాలాంటి వాడికి భార్యగా రావాలి. మా నారాయణ లాంటి మొద్దు అవతారానికి కాదు. ఇప్పటికైనా ఏమీ పోలేదు. నువ్వు ఏది అడిగితే అది ఇవ్వగలను, నన్ను మరిపించు, నిన్ను నేను మురిపిస్తాను. దేముడు ఇచ్చిన వరాన్ని కాదనకు. మోజుపడి ఆడిగావుగా ఈ నగను ధరించు. నీ అందమైన మెడ ఎలా ఉంటుందో చూడాలని ఉంది” అంటూ దాచుకున్న మల్లెల దండ నగపై పెట్టి విచిత్రంగా నవ్వాడు…. రమేష్.

రమేష్ మాటలకు విస్తుపోయిన సరస్వతి అంతలోనే తేరుకుని ముఖం కందిపోయి రోషం పొడుచుకు వస్తుండగా “రమేష్ గారు ఏమి మాట్లాడుతున్నారో… అర్థం అవుతోందా? కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇంత ఖరీదైన కానుక తేవడం, బదులుగా ఏదో ఆశించడం అసలు ఉచ్చం… నీచం తారతమ్యం తెలుసా?… మాకు డబ్బులు లేకపోవచ్చు. మీ అంత ఘనంగా జీవితం ఉండకపోవచ్చు…. కానీ నైతికత ఇంకా దిగజారలేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. ఇక్కడితో ఇది ఆపకపోతే అరచి గీ పెడతాను” అంటూ గుమ్మం వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది.

“అది కాదు సరూ! ఏ దేముడైతే నీకు వరం ఇచ్చాడో, ఆయనే నాకూ ఈ వరం ఇచ్చాడు. నీకు నగల మోజు ఉంది… నాకు నీమీద మోజులు ఉన్నాయి. మన ఇద్దరి కోరికలు తీరే అవకాశం మనకు ఇలా ముడి పెట్టాడు. అనవసర రాద్ధాంతం చేయకు. రా.. వచ్చేయి. అడిగినవన్నీ దేముడు ఇవ్వడం అంటే మాటలా… ఎంత అదృష్టం ఉండాలి. అలాంటి వరం మనకు దక్కింది. ఊరికినే టైంవేస్ట్  చేయకు. ఈ తెచ్చుకున్న మల్లెలు వాడిపోయే లోగా మనం సంబరాలు కానిద్దాం. కాదనకు” అంటూ నగల పెట్టెపై ఉన్న మల్లెల దండను వాసన చూస్తూ సరస్వతి పైకి విసిరాడు.

సరస్వతి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీడు వదిలి పెట్టెలాగ లేడు. అరచి గోల చేసేలోపు తలుపులు మూసేలాగా ఉన్నాడని ఒక్క క్షణం ఆలోచించి గబగబా బెడ్ రూంలోకి వెళ్లి తలుపు గట్టిగా బిగించుకుంది.

“ఒరేయ్.. పోరా.. పిచ్చి వెధవా… పిచ్చివాగుడు నువ్వూను. ఏమైనా తాగి వచ్చావా?” అని బిగ్గరగా అరచి నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఏడుస్తూ కూర్చోండిపోయింది.

బయట రమేష్… “సరూ…తలువు తియ్యి…అర్థం చేసుకో. ఇది మనం కోరుకున్నదే” అంటూ  ఏదో రకంగా సముదాయించడానికి ప్రయత్నం చేసాడు.

బెడ్ రూంలో భయపడి ఏడుస్తూ, కూర్చున్న సరస్వతికి ఎదురుగా ఉన్న దేముడి విగ్రహం చూసి ఆగ్రహం తట్టుకోలేక ఎక్కిళ్ళతో కూడిన మాటలతో “దేముడా! ఇదెక్కడి న్యాయం?..నేను ఏదైనా కోరుకో అనగానే ఇలాంటి పరిస్థితులు తారసపడటం ఏమిటి? నేను అడిగింది ఇమ్మన్నాను….అంత మాత్రం చేత ఇలాంటి నీతి మాలిన పనులు చేస్తానా?…” అంటూ ఏదో చెప్పబోయింది సరస్వతి.

సరస్వతి కళ్ళ ముందు దేముడు ప్రత్యక్షమయ్యి “ఏమిటి సరస్వతి? నన్ను నిందిస్తున్నావు.  నీకు అడిగినవన్నీ ఇస్తున్నాననేగా… నీకు ఏమి లోటు ఉండదు. వరం ఇచ్చినా కూడా నాపై ఆగ్రహమా? అర్థం కావటం లేదు” అంటూ కొంటెగా నవ్వాడు.

“అదేంటి స్వామీ…. ఏదో అడిగినవన్నీ ఇస్తాను అన్నావు కదా అని అడిగాను. అంతమాత్రాన ఇలాంటి ప్రమాదాలు నాకు ముంచుకొస్తాయని ఎలా తెలుస్తుంది. ఆ రమేష్ గాడు నగ తేవటం ఏమిటి, నేను వాడికి మోజులు తీర్చటం ఏమిటి, ఇలా అర్థంకాని మెలికలు పెట్టి ఇబ్బందులలోకి నెట్టేస్తున్నావ్., వాడి కోరిక తీరాలంటే ఇంకో దారి లేదా? నన్ను ఎందుకు ఇరకాటంలోకి లాగావ్?” అంటూ గద్గద స్వరంతో అడిగింది.

చిన్నగా నవ్విన దేముడు “సరస్వతి నీకు ఒక విషయం అర్థం అయినట్లు లేదు. నేను నీకే కాదు. అందరికీ దేముడ్నే. కోరికలు తీర్చేవాడినే. నువ్వు ఒక సిద్ధాంతం చెప్పావుగా. అందరికీ అడిగినవన్నీ ఇచ్చేస్తే ఈ అశాంతి  ఉండదని. ఆ సూత్రం నాకు బాగా అనిపించింది. ఇన్నాళ్లూ కలగని ఇంత మంచి ఆలోచన ఇలా నీ నోటి వెంట రావటం, దానిని తక్షణమే అమలు పరచాలని  అనిపించింది. నీకు రవ్వల నెక్లెస్ కావాలి అని కోరావు.అందుకే దాన్ని నీకు అందేలా చేసాను. నీలాగే ఆ రమేష్ గాడు నన్ను కోరుకున్నాడు ఎంత ఖరీదైనా పరవాలేదు, నీ పొందు కావాలని. అందుకే వాడి కోరిక తీర్చడం కోసం ఇలా చేసాను. నిన్న నీకు ఇల్లు ఎలా వచ్చిందనుకుంటున్నావు? ఆ బిల్డర్ కాగితాలు మీ ఆయన దగ్గర పెండింగులో ఉన్నాయి. మీ ఆయన నిజాయితీ వల్ల వాడికి చాలా నష్టం వస్తోంది. మీ ఆయన ఎలాగైనా ఒప్పుకోవాలని, అవసరం అయితే ఒక ఫ్లాట్ రాసి ఇచ్చేస్తానని వాడి కోరిక. అలా వాడి కోరిక ప్రకారం కాగితాలు సంతకం అవ్వటం వల్ల నీకు ఫ్లాట్ వచ్చింది.

మరి కారు కోరిక ఎలా తీరిందో తెలుసా… ఆ షోరూమ్ వాడికి ఈ నెలలో ఒక్క బేరం కూడా ఇంకా రాలేదు. దేముడా ఇవ్వాళ అయినా ఒక్క కారు అయితే బాగుండును అని అనుకొంటే మీ ఆయనకు ఇంకో సాయం పొందిన వ్యక్తి కారుకొని ఇచ్చాడు.  మరో విషయం చెప్పనా… ఈ సాయంత్రం మీ ఆయన కాలు విరగ కొట్టుకుని వస్తాడు. ఎందుకో తెలుసా? నిన్న మీరు కొత్త కారు డ్రైవింగ్ మోజులో స్పీడుగా నడపడం వల్ల ఒక కోడి కాలు విరిగింది. ఆ కోడి బాధపడుతూ మీ ఆయనకు కాలు విరగాలని కోరింది. ఆ కోరిక సాయంత్రం తీరుతుంది. నేను దేముడిని కదా.. ఎవ్వరినీ కాదనలేను. నాకు అంతా సమానమే. మీ ఆయన పెట్టిన సంతకం వల్ల నష్టపోయిన కొంతమంది మీ ఆయన్ని చంపేసి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.

వారి కోరిక కూడా ఈ వారాంతంలో తీరుతుంది. ఏం చేస్తాను… అందరి కోరికలు తీర్చటంలో ఇంత మజా ఉంటుందని ఇన్నాళ్లకు గ్రహించాను. నువ్వు చెప్పిన సూత్రం పాటిస్తూ అందరికీ అన్నీ ఇచ్చేస్తూ నేను మంచివాడిగా మిగిలి పోతున్నా. ఏమంటావు… సరస్వతి?” అంటూ తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించాడు.

దేముని మాటలకు సరస్వతికి నోట మాట రాలేదు. అంతలోనే తేరుకుని “గొప్పవాడివయ్యా స్వామీ! అడిగాడు కదా అని ఇచ్చేయడం అంటే, అవతలవాళ్ళ ఇష్టాలు చూడవా? దుర్మార్గులకు ఎలాంటి వరాలు ఇవ్వాలో, మంచివాళ్లకు ఎలాంటివి తీర్చాలో తెలియదా నీకు? మరీ ఇంతలా తథాస్తు అని అనేయటమేనా?” అంటూ ఏడుస్తూ అడిగింది.

చిన్నగా నవ్విన దేముడు “మరి నిన్నటిదాకా పాప పుణ్యాలు లెక్కించి పుణ్యం బట్టి మంచి వరాలు ఇచ్చి, లేని వాళ్లకు వాళ్ళ ప్రారబ్దానికి వదిలేసాను. కానీ నువ్వు అందరికీ అడిగినవన్నీ దేముడు ఇచ్చేస్తే అని మొదలు పెట్టావు. బహుశా ఇబ్బంది ఏమిటో నీకు అర్థం అయ్యింది అనుకుంటా. లేదు ఇదే బాగుంది అంటే ఇలాగే వదిలేస్తాను….ఇక నీ ఇష్టం” అంటూ ముక్తాయింపు ఇచ్చాడు.

సరస్వతికి దేముని మనోగతం అర్థం అయ్యింది. లెంపలు  వేసుకుంటూ “వద్దులే స్వామి! అర్థం అయ్యింది. మాకు వాటంతట అవే వచ్చేవరకు కష్టపడతాం. అంతేకానీ ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరం. చల్లటి నీ నీడలో నీ దయతో హాయిగా జీవితం వెళ్ళిపోతే చాలు. నీ కరుణ ఉంటే చాలు. కాస్త ఆలశ్యం అయినా అన్నీ సాధిస్తాము. ఆ మాట ఇవ్వు. నువ్వు సరే అనే వరకు నిన్ను వదలను.” అంటూ చేతులు జోడిస్తూ ఏడవ సాగింది.

***

“సరూ… ఏమిటి… ఎవరికీ దండం పెట్టి ఏడుస్తున్నావ్? ఏమయ్యింది. ఏమిటా కంగారు?” అంటూ భార్యను

కుదుపుతున్న నారాయణను చూసి తెలివిలోకి వచ్చింది. తన పిల్లలు, భర్త, పక్కింటి పిన్ని గారు అంతా

ఆత్రంగా చూస్తున్నారు.

“ఏమయ్యింది… మీరు అంతా ఇలా నా చుట్టూ” అంటున్న సరస్వతి తల నిమురుతూ “ఏమీ లేదులే. తలుపులు వేసేసి ఇంట్లో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు.  కిటికీ గుండా నేను లోపలకి వచ్చి తలుపు తీసాను. ఇంతకూ ఏమయ్యింది నీకు. ఏదో కలత చెందుతున్నావ్. ఇదిగో నీ కోసం ఏమి తెచ్చానో చూడు” అంటూ రవ్వల నెక్లెస్ బాక్స్ తెరచి జిగెలు మనే నగను ఒకటి ముందు పెట్టాడు నారాయణ.

సరస్వతికి ఆ నగను చూడంగానే గుండె ఝల్లుమంది. కలలో చూసిన నెక్లెస్ అదే.. అంటే జరిగిన ఘటన కలా… నిజమా.

“నీ అందమైన మెడకు మరింత వన్నె తెచ్చే జిగిని… బాగుందా?” అంటూ నారాయణ ఏదో ముద్దు చేయబోతే వారించింది.

“ఏమండీ…ఇవి అన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి. మీరు ఎలా తీసుకువస్తున్నారు. ఇన్ని డబ్బులు ఎక్కడివి? కొంపతీసి మీరు మారి లంచాలు తీసుకుంటున్నారా? ఇలాంటి పాపపు కూడు మనకు వద్దు. ధర్మంగా ఉందాం. దానివల్ల మనకు ప్రమాదం ఉండదు” అంటూ జాలిగా మాట్లాడింది సరస్వతి.

“సరూ… అమ్మో… నేనా… లంచాలు తీసుకోవటమా? ఇవి అలా  వచ్చాయని అనుకుంటున్నావా? నిన్న మనం చూసిన ఫ్లాట్, బ్యాంక్ లోను తీసుకుని కొన్నది. ఇవిగో దానికి సంబంధించిన కాగితాలు. ఇక కారు అంటావా… నిన్ను ఆనందపరుద్దామని రహస్యంగా బుకింగ్ చేసి దాచుకున్న డబ్బులతో కొన్నది అది. ఆ కారుకు పెట్టిన లాటరీలో మొదటి బహుమతిగా దొరికిన నెక్లెస్ ఇది. మనకు కారుతో పాటు లాటరీ కూడా తగిలింది. ఇన్నాళ్లకు దేముడు మనకు అదృష్టం కలిగేలా వరం ఇచ్చాడేమో. అంతేకానీ నేను ఎప్పుడూ తప్పు చేయను. ఉన్నంతలో హాయిగా సద్దుకు బతుకుదాం. మనం చేసిన మంచి పనులే మనకు శ్రీరామరక్ష” అంటూ సరస్వతి బుగ్గ పట్టుకుని అనునయించాడు.

జీవితంపై దృక్పథం మారిన సరస్వతి భర్త మాటలకు సంతోషంగా తలూపి నారాయణను గట్టిగా కౌగిలించుకుంది.

***

“ఒరేయ్… రమేష్… థాంక్యూ రా. మా ఆవిడ పూర్తిగా మారింది. నీ దయవల్ల మా సంసారం బాగుంది. ఇన్నాళ్లూ నీ విద్యను నేను చులకనగా చూసాను. కానీ అదే నాకు ఇవాళ ఉపయోగ పడింది. నీ మేలు మరువను” అంటూ నారాయణ ఫోనులో.

“అదేమీ లేదు.నా చదువు, విద్య ఇన్నాళ్లకు నీకు ఉపయోగపడటం నాకూ ఆనందంగా ఉంది. నేను మళ్లీ ఇండియా వచ్చేవరకు నా గురించి చెల్లాయి సరస్వతి దగ్గర ప్రస్తావన తేకు. అప్పటిదాకా నేను ఎవరో అజ్ఞాతంగా ఉంచు. కానీ నీకు ఒక విషయం తెలియాలి. అప్పుడప్పుడు భార్యలకు చిన్న, చిన్న సరదాలు తీర్చాలి. ఎప్పుడూ యాంత్రిక జీవనంలో ఉంచకూడదు. చిన్న కానుకలు ఇస్తూ, చిన్ని ఆనందాలు కూరుస్తూ ఉండాలి. ఇక నీ భార్యకు ఈ సమస్య రాదు. తను అడిగితే తప్ప నా గురించి ఏమీ చెప్పకు. నా విజిటింగ్ కార్డు ఉంది కదా… అది కూడా బయట పాడేయి.”…అంటూ ఫోన్ లోనే శలవు తీసుకున్నాడు రమేష్.

నారాయణ గట్టిగా నిట్టూర్పువిడుస్తూ.. చేతిలో ఉన్న రమేష్ విజిటింగ్ కార్డు చూసి “రమేష్… హిప్నాటిస్ట్ మరియు సైకాలజిస్ట్” అంటూ మరోసారి చదివి చింపి దూరంగా పడేసి ఆనందంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here