[dropcap]ముం[/dropcap]దుగా సంచిక, స్వాధ్యాయ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారికి నా అభివందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులు అందరికీ నా శుభాభినందనలు. నవలా రచనలో రచయిత పద్ధతి గురించి తెలియజేయమని ఏర్పాటు చేసిన ఈ సదస్సులో నన్ను కూడా మాట్లాడమని ఆహ్వానించిన మురళీకృష్ణ కస్తూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఎవరికైనా నవలలు చదవాలన్న ఆసక్తి ఉండడం వేరు. తాను కూడా నవల రాయాలన్న తపన ఉండడం వేరు. ఒకసారి ఆ తపన పుట్టిందంటే మనసు పరిపరివిధాల ఆలోచించడం సహజమే.
నవలలు రాయడానికి రకరకాల అంశాలు మన సమాజంలో కనపడుతూనే ఉన్నాయి.
ఆ తరంనుంచి ఈ తరం వరకూ కాలగతిలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
మనుషుల స్వభావాల్లో, ప్రవర్తనల్లో విపరీత ధోరణులు, వింత వింత పోకడలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకని తప్పులు చేసేవారిని సమర్థిస్తూ నవలలు రాయడం సమంజసం కాదని మనందరికీ తెలుసు.
తప్పులు పొరపాట్లు సరిదిద్దుకుని మంచిగా, మనిషి మనిషిలా బ్రతికేందుకు ఉపయుక్తంగా ఉండాలి తప్ప సమాజాన్ని తప్పుదారిలో నడిపించే విధంగా నవల రాయకూడదు. ఇది అందరూ ఒప్పుకునే సత్యమే. కానీ అంతమాత్రాన నవల ఒక సందేశాత్మక వ్యాసంలా ఉండకూడదు. రచయిత ఇచ్చే సందేశం కథలో అంతర్లీనంగా ఉండాలి. మన కళ్ళ ముందు చూస్తున్న దృశ్యకావ్యంలా ఉండాలి నవల.
ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకుని నవల రాయడం మొదలుపెట్టినప్పుడు ఆ అంశానికి ప్రధానపాత్ర ఎవరో వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి నవలలో. నేను అదే చేస్తాను.
నేను 1959-1960 మధ్య హైస్కూల్లో చదువుతున్నప్పుడే చిన్నచిన్న కవితలు, కథలు వై.జె. అనే పేరుతో రాయడం, మేము ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో స్థానిక పత్రికలకి పంపిచడం చేసేదాన్ని. ఏడాదికొక ఊరు బదిలీ అవుతుండేది మా నాన్నగారికి. ఊళ్ళు తిరుగుతుండడం వల్లనూ, నేను రాసినవి జాగ్రత్త పెట్టుకోవాలీ అన్నఆలోచన లేకపోవడం వల్లనూ ఏ ఊళ్ళో రచనలు ఆ ఊళ్ళోనే పోయేవి. అప్పుడు నా పేరు యర్రమిల్లి జానకి. పూర్తి పేరుతో రాయడానికి మొహమాటపడి వై.జె. అని పొడి అక్షరాలు పెట్టేదాన్ని. పి.యు.సి. చదివేటప్పుడు మంజువాణి అనే పత్రిక వారు రాష్ట్రంలో అన్ని కాలేజీలకి కలిపి విద్యార్ధినీ విద్యార్ధులకి కథల పోటీ పెట్టినప్పుడు నా కథకి బహుమతి వచ్చింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చిందో ఏమో ఆ రోజునుండీ వై. జానకి అనే పేరుతో రాయడం మొదలుపెట్టాను. పక్షపత్రిక చుక్కాని, మాసపత్రికలు యువ, జయశ్రీ, భరణి పత్రికల్లోనూ, స్థానికపత్రికల్లోనూ ప్రచురింపబడ్డాయి. 1965లో వివాహమయ్యాక తమిరిశ జానకి పేరుతో అన్నివార, మాసపత్రికల్లోనూ రాస్తున్నాను.
నా అదృష్టం ఏమిటంటే వివాహానికి ముందు నాన్నగారు, అమ్మ వివాహం అయ్యాక శ్రీవారు అందరూ కూడా నా రచనా వ్యాసంగాన్నిప్రోత్సహించారు, నిరుత్సాహపరచలేదు. అమ్మ భక్తి పాటలూ, లలితగీతాలూ రాసేది. రాయడంవరకే కాదు ఆ పాటలకి తనే స్వయంగా రాగాలు కట్టి పూజ చేసుకునేటప్పుడు పాడుకుంటూ ఉండేది. తన పెళ్ళికి ముందు సంగీతం నేర్చుకుంది. వీణ కూడా నేర్చుకుంది.
1965 నుండి వారానికి ఒక కథ నాది ఏదో ఒక పత్రికలో వస్తూనే ఉండేది. అంత విరివిగా రాసేదాన్ని. వారపత్రికలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభల్లోనూ, వనిత మాసపత్రికలోనూ నా కథలకి బహుమతులు వచ్చేవి.
నా కథల్లో ఎత్తుగడ, కొసమెరుపు తనకి చాలా నచ్చుతుందని ఒకసారి డా.సి.నారాయణరెడ్డిగారు అన్నారు నాతో.
ఆ మధ్య చాలారోజులక్రితం ఏదో సభలో ఒకసారి మండలి బుద్ధప్రసాద్ గారు కనిపించినప్పుడు “తన పదో ఏటనించే రచయిత్రిగా నా పేరు వారికి తెలుసు” అన్నారు. ఎంతో సంతోషం అనిపించింది. ఈమధ్య ఒకసారి తనికెళ్ళ భరణిగారు “జానకిగారూ మీ కథలు చదువుతూ పెరిగాము మేము” అన్నారు. సుధామగారు కూడా అదే అంటూ ఉంటారు. సీనియర్ రచయిత విహారి గారికి నా కథలు చాలా ఇష్టం. ఇంకా ఎంతమందో ప్రసిధ్ధులు ఏదో మొక్కుబడిగా కాక మనస్ఫూర్తిగా నాకు ఆశీస్సులు అభినందనలు అందించిన వారున్నారు. వీటికంటే గొప్ప పురస్కారాలు ఉండవేమో అనిపిస్తుంది నాకు.
నలభయ్ సంవత్సరాలక్రితం 1971లో నేను రాసిన నా మొదటి నవల ‘విశాలి’ ఆంధ్రప్రభ వారపత్రికలో 71-72 మధ్య సీరియల్‌గా వచ్చి పాఠకులచేత చాలా ఆదరణ పొందినది అని చెప్పడంలో సందేహం లేదు. మా వారి ఉద్యోగరీత్యా 1970 నుంచీ 73 దాకా మేము కోయంబత్తూర్ దగ్గిర ఉన్న మదుక్కరై అనే ఊళ్ళో ఉన్నాము. ఆ ఊరు కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉంది. అక్కడ మా కాలనీలో ఒకరింటికి పేరంటానికి వెళ్ళినప్పుడు ఒకావిడ నా పక్కనున్న మరొకామెకు ఒక చిన్నపిల్లను చూపించి ఆ పిల్ల నష్టజాతకురాలు. తల్లి గండాన పుట్టింది. తల్లి ప్రాణం తియ్యడానికే పుట్టింది. అందుకే పురిట్లోనే పోయింది ఆ తల్లి అని చెప్పడం వినిపించింది. చాలా బాధనిపించింది నాకు.
ఆ పిల్ల తప్పేముంది పాపం… ఇంక అస్తమానం జీవితాంతం ఆ పిల్లని ఆడిపోసుకుంటారు కాబోలు అనిపించి జాలి కలిగింది. ఇంటికి వెళ్ళినప్పటినుంచీ అదే ఆలోచన. అప్పుడనిపించింది ఆ అంశం మీద ఒక కథ రాయాలని. అదే ‘విశాలి’ నవలగా రూపుదిద్దుకుంది. సీరియల్ పూర్తయిన వెంటనే సినిమాగా తీశారు. 73 లో వచ్చింది సినిమా.
సినిమా వచ్చేసినా కూడా ఎమెస్కో వారు పుస్తకంగా ప్రచురించుకుంటాము ఇమ్మని ఉత్తరం రాశారు. ఇవ్వడం జరిగింది. పుస్తకంగా ప్రచురించారు. చిన్నా పెద్దా అందరికీ నచ్చింది ఆ నవల. అందులోని అంశం, రాసిన పద్ధతీ కూడా అందరినీ మెప్పించగలిగిందీ అంటే అంతకంటే ఏం కావాలి. నవల రాసే నా పద్ధతి సరియైనదే అని పాఠకులు తీర్పు ఇచ్చినట్టే భావించాను. ఆ వెంటనే ఆంధ్రపత్రిక వారపత్రిక వారు తమ పత్రికకు సీరియల్ రాయమని ఉత్తరం రాసారు. అదే రోజు ఎమెస్కో పబ్లిషర్స్ దగ్గరనుంచి కూడా డైరెక్ట్ నవల ఒకటి ఇవ్వండి మాకు అని ఉత్తరం వచ్చింది.
ఆంధ్రపత్రిక వారపత్రికకు సీరియల్ కోసం ‘వీడిన మబ్బులు’ అనే నవల, ఎమెస్కో వారికి ‘వెన్నెల విరిసింది’ అనే నవల రాసి పంపించాను. అవి ప్రచురించబడ్డాయి. అవి రాస్తున్నప్పుడే మధ్యమధ్యలో వివిధ పత్రికలకి కథలు కూడా రాసి పంపిస్తూ ఉండేదాన్ని.
ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అటు నవల ఇటు కథలు రోజులో కొంతసేపు నవల, కొంతసేపు కథలు రాసినా కూడా ఒకదానిలోని అంశాలు మరొకదానిలో కలగలుపు అయిపోకుండా రాసేదాన్ని. గందరగోళ పరిస్థితుల్లో నేను ఎప్పుడూ పడలేదు, పాఠకుల్ని పడెయ్యలేదు. ఈ మధ్య 2019లో నా ‘విశాలి’ నవల రెండవ ముద్రణ వచ్చింది ఎమెస్కో వారి నవలా విభాగం సాహితీ ప్రచురణల ద్వారా వారికి నా ధన్యవాదాలు.
ఏ నవలలు అయినా కాలమాన పరిస్థితులనిబట్టి రచనలు సాగుతూ ఉంటాయి. ఇదివరకటి తరం వాళ్ళ పద్ధతులు వేరు అలవాట్లు వేరు. ఆడపిల్లల్నిఎక్కువ చదివించేవారు కాదు. స్త్రీలని వంటింటికే పరిమితం చేశారు. ఆర్థిక స్వాతంత్ర్యం ఉండేది కాదు. అందుకని ఈ రోజుల్లో కూడా ఆ పద్ధతులే మంచివి అంటూ అలాంటి కధాంశాలతోనే నవలలు రాస్తానంటే కుదరదు. అలా రాయడం మహిళాభ్యుదయాన్ని అణిచిపెట్టడమే అవుతుంది. మహిళాభ్యుదయం అంటే విచ్చలవిడితనం అని నా ఉద్దేశం కాదు. నిజం చెప్పాలంటే విచ్చలవిడితనం పురుషులకీ ఉండకూడదు. ఒకరు తక్కువా మరొకరు ఎక్కువా కాదు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ.
1985లో ముప్ఫయ్ ఆరేళ్ళక్రితం ఆంధ్రపత్రిక వారి మహిళా పక్షపత్రిక కలువబాలలో మొదటి బహుమతి వచ్చిన నా నవల ‘రాజహంస’ లోనూ, 2010లో ఆంధ్రభూమి మాసపత్రికలో వచ్చిన నా నవల ‘సాగరి’ లోనూ ఇదే ముఖ్యమైన అంశంగా తీసుకున్నాను. ఈ సమాజంలో కొన్నికొన్ని పరిస్ధితుల్లో కొంతమంది స్త్రీలు పడే మానసిక సంఘర్షణలు అవి. రెండు నవలలూ స్త్రీ పరంగా సాగినవే అయినా కూడా ఒకేలాంటి కష్టాలు కాకుండా కథ రాయడమన్న పద్ధతి అనుసరించాలి కదా. అదే ఆ నవలల్లో చూపగలిగాను. ‘రాజహంస’ నవలలో ఒక వివాహిత స్త్రీ అనుభవించిన సంఘర్షణ చివరికి భర్త మంచివాడుగా మారడం, ‘సాగరి’ నవలలో ఒక అవివాహిత ఆత్మవిశ్వాసంతో అడుగువేసిన వైనం చెప్తూ రెండు రకాల పద్ధతులూ నవలల్లో చూపించే ప్రయత్నం చేశాను.
పురుషులందరూ చెడ్డవాళ్ళు స్త్రీలందరూ మంచివాళ్ళు అని గానీ, లేదా పురుషులందరూ మంచివాళ్ళు స్త్రీలందరూ చెడ్డవాళ్ళు అనిగానీ నేను అనను. ఇద్దరిలోనూ మంచివాళ్ళూ ఉంటారు చెడ్డవాళ్ళూ ఉంటారు. అందుకే ఆ పద్ధతిలోనే నా రచనలు ఇటూ ఉంటాయి అటూ ఉంటాయి.
ఇదేమిటి ఫలానా నవలలో స్త్రీని మంచిగానూ, పురుషుడిని చెడ్డవాడిగానూ చిత్రించిన ఈ రచయిత్రి మరొక నవలలో దానికి విరుద్ధంగా రాసిందేమిటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల స్వభావాలే ఒక్క రకంగా ఉండవు. అలాంటప్పుడు సమాజంలో అందరి స్వభావాలూ ఒక్కలా ఎందుకు ఉంటాయి.
నవల రాయాలంటే ఎక్కువ పేజీలు రాయాలి కాబట్టి అవసరం లేకపోయినా అనవసర పాత్రలు ఎక్కువగా సృష్టిస్తూ చదివే పాఠకులని గందరగోళంలో పెట్టే పద్ధతి మంచిది కాదనిపిస్తుంది నాకు.
ఎప్పుడైతే పేజీలు పెంచడంకోసం అనవసర పాత్రలు పెంచుతూ పోతారో అప్పుడు నవలలో ఉండాల్సినంత పటుత్వం ఉండకుండా పోయి పాఠకులు పేజీలు గబగబా తిప్పేసే పరిస్ధితి రావచ్చు. నిజమే కదా. రచయితలు పాఠకులని తక్కువ అంచనా వెయ్యకూడదు.
నవల రాయడం ఒక ఎత్తు. ఇలాంటి ముఖ్యవిషయాలు మనసులో పెట్టుకుని రాయడం ఒక ఎత్తు అనిపిస్తుంది నాకు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నా నవలల్లోనే కాదు నా కథల్లో కూడా తిట్లు రాయడం, అసభ్యకరమైన మాటలు రాయడం నా పద్ధతి కాదు. అలాంటివి నా నోటితో పలకడం కూడా ఇష్టం ఉండదు నాకు.
ప్రతి రచయితకీ వారి వారి శైలీ, ఒరవడి వారికున్నట్టే నా శైలీ నా ఒరవడి నావే. ఒకరిని అనుకరించడం, అనుసరించడం చెయ్యను. కొత్తగా నవలలు రాద్దామనుకున్నవారు తొందరగా పేరు తెచ్చేసుకోవాలనీ, నలుగురిలో తన పేరు వినపడాలనీ ఏ ప్రముఖ రచయితనో అనుకరిద్దామని అనుకోకూడదు. పుస్తకపఠనం మంచి అలవాటు. పుస్తకాలు బాగా చదువుతుండాలి. కానీ ఇతర రచయితలని గానీ వారి రచనల్నిగానీ అనుకరించే ప్రయత్నం చెయ్యకూడదు. అలా చెయ్యడంవల్ల తమలో ఉన్ననేర్పునీ, స్వీయప్రతిభనీ తామే అణిచిపెట్టినట్లవుతుంది. రచనలు చెయ్యడం మొదలు పెట్టినరోజు నుండీ నేను పాటించే పద్ధతి నా శైలి నాది, నా ఒరవడి నాది. అంతే. దేన్ని గురించి రాసినా నవలలో సందేశం నీతీ నిజాయితీలతో కూడుకుని ఉండాలి. పాఠకులని ఆలోచింపచేసేదిగా మంచివైపు నడిపించేదిగా ఉండాలి. ఇదే కదా సమాజానికి కావల్సినది. నేను హాస్య రచనలు కూడా చేస్తూ ఉంటాను. అందుకని నా నవలల్లో హాస్య సంభాషణలు కూడా గుప్పిస్తూ ఉంటాను.
ఇంక రచనల్లో భాష గురించి చెప్పాలీ అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యాస ఉంటుంది. రచయితలు తమకి నచ్చిన యాసలో తాము రచన చేసుకునే స్వతంత్ర్యం వారికి ఉంది. మాది పశ్చిమగోదావరి జిల్లా. వివాహానికి ముందు, వివాహం తర్వాత ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్టాలు తిరిగినా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ, బీహార్, బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నా కూడా నా భాష పశ్చిమగోదావరి జిల్లా భాషే. మారలేదు. అయినా కూడా తెలుగు వారికి అందరికీ అర్థమయ్యే రీతిలోనే రాస్తున్నానని అనుకుంటున్నాను. ఇన్నేళ్ళల్లో ఎప్పుడూ ఎవరూ కూడా నా నవలల్లోని పదాలు అర్ధం కాలేదని అనలేదు. చిన్నప్పటినించీ కూడా హిందీ చదవడం రాయడమే కాక మాట్లాడటం కూడా వచ్చు. హిందీ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు రాసిన రచనల్లో హిందీ పదాలు ఉపయోగించుకోడంగానీ, పదమూడేళ్ళు తమిళనాడులో ఉన్నప్పుడు తమిళం మాట్లాడటం అలవాటు అయినా కూడా నా రచనల్లో తమిళపదాలు వాడటంగానీ చెయ్యలేదు. అంటే ఇదేదో గొప్ప అన్న భావంతో చెప్పట్లేదు. నేను నవలలు రాసే పద్ధతిలో ఇది కూడా ఒక విషయమే కాబట్టి చెప్పాను.
నవలల్లో మంచిపాత్రలు ఉన్నట్టే చెడుపాత్రలూ ఉంటారు. కానీ వాళ్ళచెడ్డతనం చూపించేందుకు వాళ్ళు విపరీతమైన ఘోరాలూ, హింసలూ చేస్తున్నట్టు రాయడమూ, ఆ హింసలు ఏ పద్ధతుల్లో చేశారో, ఘోరాలు ఏ రకంగా చేశారో వివరణాత్మకంగా రాసెయ్యాలన్న దృష్టితో రచయితలు రాయడం మంచిపద్ధతి కాదు అని నా ఉద్దేశం.
ఏ నవల అయినా కూడా పదిమందీ చదువుకోగలిగే విధంగా ఉండాలి. ఇతరులు చూస్తున్నారేమో అని ఇబ్బందిపడుతూ చదివేలా ఉండకూడదు.
1990 ల్లో విజయవాడలోని ప్రచురణకర్తలు డైరెక్ట్ నవల ఇమ్మని ఉత్తరం రాశారు.
‘అందానికి సమాధి’ అనే నవల రాసి ఇచ్చాను. ప్రచురించారు. ఆ నవలలో నాయిక చాలా అందమైనది. తన అందానికి తగినవాడినే వివాహం చేసుకోవాలనుకుంటుంది. కానీ అనాకారితో వివాహమవుతుంది. అతన్ని ఏ మాత్రం ఇష్టపడదు. అసంతృప్తితో ఉంటుంది. అహంకారంతో అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ కొన్నాళ్ళు గడిచాక ఎప్పుడైతే అతని మంచితనాన్ని అర్థం చేసుకుంటుందో అప్పుడు తన తప్పుని తనే క్షమించుకోలేకపోతుంది. మానసికంగా బాధపడుతూ తన అందానికి తనే సమాధి కట్టుకోవాలన్ననిర్ణయంతో ఆత్మహత్య చేసుకుంటుంది. అదే తనకి సరియైన శిక్ష అనుకుంటుంది.
కానీ ముగింపు ఆత్మహత్య చేసుకున్నట్టు రాయకుండా ఉండవలసింది అని చాలా అనుకున్నాను పుస్తకం వచ్చేసిన తర్వాత. ఎందుకంటే ఆత్మహత్య సమస్యలకి పరిష్కారం కానే కాదు అని తమ రచనల్లో చెప్పవలసిన రచయితలు ఆత్మహత్య చేసుకున్నట్టు రాయడం మంచి పద్ధతి కాదు కదా. 1969 లోనో 1970 లోనో సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కానీ ఆంధ్రపత్రిక వారపత్రిక కథల పోటీలో ఎన్నిక అయిన ఆరు కథల్లో నా కథ ‘నిశ్శబ్దసంగీతం’ కూడా ఉంది. అందులో కూడా ఆత్మహత్య ఉదంతం ఉంది. ఇంక మళ్ళీ ఎప్పుడూ ముగింపు ఆ రకంగా రాయకూడదని అనుకున్నాను. ఎవరైనాసరే ఆత్మస్థైర్యంతో బ్రతికి సాధించాలిగానీ చచ్చి సాధించేది ఏమీ లేదు కదా.
మనసుకి మంచి దిశగా స్పందన కలిగించే రచనలు విరివిగా రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
***
ఈ రచనని రచయిత్రి స్వరంలో వినవచ్చు
https://www.youtube.com/watch?v=JaUvYJ92L4I