[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[పొలం అమ్మిన డబ్బుతో ముందుగా బ్యాంక్ లోను కట్టేస్తారు. శెట్టి బాకీ కూడా తీర్చేస్తారు. ఇంటిని బాగు చేయించుకుంటారు. వాగ్దేవికి స్త్రీ ధనం కొంత ఇస్తారు. ముగ్గురు అన్నదమ్ములు, మహితల పేర ‘సుందరం ఫైనాన్స్’లో ఫిక్స్‌డ్ వేస్తారు. కర్నూలు శివార్లలో స్థలం కొంటారు. ఎం.ఎ. పరీక్షలకి హైదరాబాదు వెళ్తాడు పతంజలి. అక్క వాళ్ళింట్లో దిగుతాడు. పొలం అమ్మిన విషయం, ట్యూటోరియల్స్ నిర్వహణ గురించి బావతో చర్చిస్తాడు. అన్ని పరీక్షలు బాగా రాస్తాడు పతంజలి. పరీక్షలయిపోయాకా, అక్కా బావా పిల్లలలో జూ పార్కుకి వెడతారు. మర్నాడు బయల్దేరి కర్నూలు వస్తాడు పతంజలి. సెవెన్త్ పరీక్షలు వస్తున్న సందర్భంగా బిట్ బ్యాంకులు తయారుచేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తుంది పతంజలికి. సెవెన్త్‌కి, టెంత్‌కి ఇంగ్లీషు గ్రామర్ కూడా పుస్తకంలా వేస్తే బావుంటుందని అనిపించి ‘ఉజ్జ్వల’ ప్రెస్ శ్యామ్‌సుందర్ గారిని సంప్రదిస్తాడు. ఆయన విజయవాడలో ముద్రించమని చెప్పి అరుణోదయ ప్రెస్ యజమాని లెనిన్ గారితో ఫోన్‍లో మాట్లాడిపిస్తాడు. ఒకసారి విజయవాడ వచ్చి కలవంటారు ఆయన. వీలు చేసుకుని బస్‍లో విజయవాడ చేరి లాడ్జ్‌లో దిగుతాడు పతంజలి. కంపెనీ కావాలంటే అమ్మాయిలున్నారన్న లాడ్జ్ బోయ్‍ని తిడతాడు. – ఇక చదవండి.]
[dropcap]బా[/dropcap]య్ నిరాశగా వెళ్లిపోయాడు.
పతంజలి పంచె కట్టుకొని మీద టవలు కప్పుకొని కాలకృత్యాలు తీర్చుకొని వచ్చాడు. బాత్‌రూముల దగ్గరే ఒక మూల రెండు వాష్ బేసిన్లున్నాయి. ముఖం కడుక్కొని క్రిందికి వెళ్లి కాఫీ తాగి వచ్చాడు. రోడ్డు దాటగానే ‘కృష్ణా విలాస్’ ఉంది. కాఫీ బాగుంది.
కాసేపు పడుకుందామని మంచం మీద వాలాడు. అంతే బడలిక వల్ల నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి తొమ్మిది దాటింది. బలవంతాన లేచి, స్నానం చేసి బట్టలు మార్చుకుని డబ్బు జాగ్రత్తగా పెట్టుకొని క్రిందికి వచ్చాడు. కృష్ణా విలాస్‌లో టిఫిన్ చేశాడు. చాలా బాగుంది. ప్రతి ఐటంకు రెండు రకాల చట్నీలు, చాలా రుచిగా ఉన్నాయి.
‘అరుణోదయ ప్రెస్’ దగ్గరలోనే ఉంది. మిషన్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ముందు గదిలో ఆఫీసు లాంటిది ఉంది.
“లెనిన్ గారిని కలవాలండీ” అన్నాడు అక్కడున్నతనితో.
“కూచోండి. కాసేపట్లో వత్తారు” అన్నాడతను. కూర్చొని అక్కడున్న ‘ఈనాడు’ చదవసాగాడు. పావుగంటకు ఒకాయన వచ్చాడు. తెల్లని మల్లెపూవులాంటి లాల్చీ పైజామా వేసుకున్నాడు. సన్నగా, తెల్లగా ఉన్నాడు. జుట్టంతా వెనక్కు దువ్వాడు. మెడచుట్టూ మఫ్లర్ ఉంది.
“ఈనెవరో తవరి కోసం వచ్చాడయ్యా” అని చెప్పాడతను.
పతంజలి లేచి, “నమస్తే లెనిన్‌గారు! నేను పతంజలిని. పదిరోజుల క్రితం మనం ఫోన్‌లో మాట్లాడుకున్నాం. కర్నూలు మాది. ‘ఉజ్జ్వల’ శ్యామసుందర్‌గారు మీతో మాట్లాడించారు..”
“ఆ.. గుర్తొచ్చింది. చెప్పండి. స్క్రిప్టులు తెచ్చారా?”
“తెచ్చానండి. మనమనుకున్న రెండు కాక మరొకటి కూడ వేయాలి” అంటూ మూడు పుస్తకాలూ చూపించాడు. తాత్కాలికంగా ట్వయిన్ దారంతో దబ్బనంతో కుట్టాడు వాటిని ఉస్మాన్.
ఆయన మూడూ తిరగేసి చూశాడు. “రైటింగ్ బాగుంది మీరే రాశారా?” అనడిగాడు.
“అవునండి”
“హ్యాండ్ రైటింగ్‌ను బట్టి మనస్తత్వాలను తెలిపే శాస్త్రమొకటుంది తెలుసాండి. గాంధియన్ థాట్‌లో మహాత్ముడు చక్కని చేతివ్రాతను అలవర్చుకోవాలని చెప్పాడు. చిన్నతనంలోనే ఏర్పడకపోతే, తర్వాత ఎంత ప్రాక్టీసు చేసినా రాదన్నాడు. ఆ మహానుభావుడు. ఇంతకూ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సెట్టింగ్ చేసేవాళ్లకు పని సులభం అవుతుంది రైటింగ్ బాగుంటే”
ఆయన మాట తీరును బట్టి సంస్కారవంతుడని అర్థమయింది. టీ తెప్పించాడాయన.
“మీరు కమ్యూనిస్టులా సార్!” అని అడిగాడు పతంజలి.
ఆయన నవ్వి అన్నాడు. “మా నాన్నగారు కమ్యూనిస్టులెండి. ఆయనే నాకీ పేరు పెట్టారట. నాకా పేరే మిగిలింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఎ. పొలిటికల్ సైన్సు చదివాను. ఈ ప్రెస్ మా మామయ్యగారిది. ఆయనకు మా ఆవిడ ఒక్కటే కూతురు. ఒక రకంగా ఇల్లరికం అనుకోండి. ఆయన పోయింతర్వాత ఈ ప్రెస్ నేనే నడుపుకుంటున్నాను. సరైన పనివారు దొరకడమే కష్టం. ఆర్డర్లు బాగానే ఉంటాయి”.
లోపల్నించి ఇద్దర్ని పిలిపించాడు. మూడు టైటిల్స్‌కీ లెక్క వేయమన్నాడు. ఒక్కొక్క దానికీ మూడు వేల కాపీల చొప్పున లెక్క వేసి బైండింగ్‌తో సహా పదమూడు వేలకు కొంచెం అటో యిటో అవ్వొచ్చునని చెప్పి వాళ్లు వెళ్లిపోయారు.
“మనం ఎన్నిరోజుల్లో చేసివ్వగలం?” అనడిగాడాయన ఒకాయన్ను వెనక్కు పిలిచి. ఏడెనిమిది రోజలు పడుతుందన్నాడతను.
“పతంజలిగారు. సగం డబ్బు ఇవ్వండి మిగతా సగం పనయింతర్వాత ఇద్దురుగాని, బైండింగ్ ఒకరోజు పనే. పూర్తవగానే మీకు నేను ఫోన్ చేస్తాను. మీ సంస్థకు ఫోనుంది కదా!” అన్నాడాయన.
“ఇంకా ఆ స్థాయికి ఎదగలేదుసార్!” అన్నాడు పతంజలి.
“మీది ఏ సబ్జక్టు ఎమ్.ఎ.లో?”
“ఇంగ్లీషండి. మొన్ననే ప్రీవియస్ వ్రాశాను. వచ్చే నవంబరులో ఫైనల్ వ్రాస్తాను”
“మంచి డిమాండున్న సబ్జెక్టండి. మా విజయవాడలో గంటకింత అని తీసుకుంటారు ఇంగ్లీషు మాస్టర్లు. గుంటూరు విజయవాడల్లో ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పి మేడలు కట్టినవాళ్లున్నారు. నామాట విని ఎమ్.ఎ తర్వాత ఇక్కడకొచ్చేయండి. మీ రాయలసీమలో ఫీజులు ఇవ్వలేరు. బ్యాక్‌వర్డ్ ఏరియా కదా!” అన్నాడాయన.
‘తన ప్రాంతాన్నలా అంటాడే’ అని పతంజలి మనస్సు బాధపడింది. కానీ ఆయనన్న దాంట్లో నిజముంది.
“మరి మాకేమయినా తగ్గిస్తే, మీకు ఋణపడి ఉంటాము”
లెనిన్‌గారు కాసేపు ఆలోచించి అన్నాడు. “సరే వెయ్యి రూపాయలు తగ్గించి ఇవ్వండి. పన్నెండు వేలు. ఒకవేళ పదమూడు దాటినా మిమ్మల్నడగను లెండి”
“వెరీ కైండ్ ఆఫ్‌యు సర్” అన్నాడు పతంజలి.
“దాందేముంది లెండి” అన్నాడాయన. “ఒకపని చేయండి. ఇన్ని రోజులు ఇక్కడ ఏం చేస్తారు. ఖర్చులు దండగ. మీరు కర్నూలు వెళ్లిపోండి. మీరిచ్చిన ఫోన్ నంబరుకు పని పూర్తయిందని తెలుపుతాను. అప్పటికి ప్రూఫ్ రీడింగ్ కూడ పూర్తయి సెక్షన్స్ (ప్రింటెడ్ పార్ట్) పూర్తయి ఉంటాయి. మూడింటికీ మూడు కవరు పేజీలు వేర్వేరు రంగుల్లో వేద్దాము. వన్ ఎం.ఎం. మందం డ్రాయింగ్ పేపరు వేద్దాము. కలర్స్ సెలెక్ట్ చేయండి.”
లోపల్నించి ఐదారు రంగుల డ్రాయింగ్ షీట్లు తెచ్చారు. సెవెంత్ బిట్ బ్యాంకుకు లేత గులాబీ, టెంత్‌కు లేత నీలం, గ్రామర్ ఎక్సర్‌సైజులకు లేత పసుపురంగులు సెలెక్ట్ చేశారు. బ్లాక్ కలర్ అక్షరాలు బాగుంటాయన్నాడాయన. ఒక వైట్ పేపరిచ్చి టైటిలు పేజి క్యాపిటల్స్‌లో వ్రాసిమ్మన్నాడు.
One Thousand Bit gems
for
VII Std.
compiled by
Patanjali Sarma, Minikumar, Usman
Success Publishers
Opp: S.T.B.C College
Kurnool
గ్రామరు పుస్తకానికి -Add Glamour to your Grammar
for
VIII, IX & S.S.C. Students
compiled by
Patanjali Sarma
(M.A), (Litt) (OSM)
అని రాసిచ్చాడు. “సార్ ఒక చిన్న రిక్వెస్టు” అన్నాడు. “టైటిల్ పేజీ మధ్యలో లక్ష్మీనరసింహస్వామి వారి బొమ్మ ముద్రించగలరా?”
“అదేం భాగ్యం? తప్పకుండా!” అన్నాడాయన. ఆయనకు రాధాసారు ఫోన్ నంబరు, దేవ సహాయంగారి ఫోన్ నంబరు రాసిచ్చాడు. ఆరువేలు చెల్లించాడు. “మరి నేను వెళ్లిరానా?” అన్నాడు. చేతులు జోడించి.
“వెళ్లిరండి. వారం రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తాను. మా ఫోన్ నంబరు కూడ ఉంచుకోండి” అని ఒక కార్డు యిచ్చాడు.
పతంజలి రూముకు వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కృష్ణావిలాస్‌లో భోజనం చేశారు. లాడ్జి వాళ్ల నడిగి రాత్రి 9 గంటలకు గుంటూరు గదగ్ ప్యాసింజరుందని తెలుసుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటలకు ఇంద్రకీలాద్రి మీద వెలసిన దుర్గమ్మను దర్శించుకొని రూము ఖాళీ చేసి, నాన్‌స్టాప్ బస్సులో గుంటూరు చేరుకున్నాడు. గుంటూర్లో ఎనిమిదికి దిగాడు. స్టేషన్ దగ్గర టిఫిన్ చేసి, ప్లాటుఫారం మీద సిద్ధంగా ఉన్న గదగ్ ప్యాసింజర్ ఎక్కాడు. జనం పెద్దగా లేరు. పైన సామాన్లు పెట్టుకొనే బల్ల మీదకెక్కి పడుకొని నిద్రపోయాడు. బస్సు ఛార్జీకి, రైలు ఛార్జీకి హస్తిమశకాంతర భేదముందని అనుకున్నాడు.
ఉదయం ఐదున్నరకు ద్రోణాచలంలో దిగి, కర్నూలు లోకల్ ఎక్కాడు. ఆరు నలభైఐదుకు వెల్దుర్తిలో ఇంట్లో ఉన్నాడు.
ఇంట్లో వాళ్లకు పతంజలి విజయవాడకు వెళ్లినట్లు తెలియదు. అంత పొద్దునే వచ్చేసరికి ఆశ్చర్యపోయారు. అందరూ వంటిట్లో బొగ్గుల పొయ్యి చుట్టూ కూర్చుని కాఫీలు తాగుతూండగా, పుస్తకాల ముద్రణ గురించి వాళ్లకు వివరించాడు.
“పుస్తకాలు స్కూళ్లకు తీసుకుపోయి అమ్ముతామంటే వాళ్లు ఒప్పుకుంటారా? అసలా విధానం నీకు ఎందుకు తోచింది?” అన్నాడు నాన్న.
“నేను స్కూల్లో చదువుకొనేటప్పుడు అలా మా స్కూలుకు కొందరు వచ్చేవారు నాన్నా! చాలామంది పిల్లలు కొనుక్కొనేవారు. ఒకవేళ కొందరు హెడ్ మాస్టర్లు కుదరదంటే టెన్ పర్సెంట్ కమీషన్ ఆఫర్ చేస్తాం. ‘నిరుద్యోగులము. ఉపాధి కోసం ఈ పని చేస్తున్నాము’ అని మర్యాదగా అడిగితే ఎవరూ కాదనరు” అన్నాడు పతంజలి.
పిల్లలకు తాను విజయవాడ నుండి తెచ్చిన పూతరేకులు ఇచ్చాడు. అందరూ బాగున్నాయన్నారు కాని చిన్నోడు ‘ప్లాస్టిక్ కాయితం, చక్కెర కలిపి నమిలినట్లుంది. ఏం బాలేవన్నయ్యా” అని చెప్పి అందర్నీ నవ్వించాడు.
అమ్మ బియ్యం నూక ఉప్మా చేసింది. మధ్యాహ్నం అన్నం మాత్రం చేసుకొమ్మని, మామిడి అల్లం పప్పు, ఉర్లగడ్డ ముద్దకూర రెండు గిన్నెల్లో పెట్టిచ్చింది. ఉప్మా తిని, బయలుదేరాడు.
ఇన్‌స్టిట్యూట్ చేరేసరికి స్నేహితులిద్దరూ చెరొక క్లాసులో ఉన్నారు. పతంజలి మెట్లెక్కుతూ వెల్డింగ్ షాపు వాళ్లు ఖాళీ చేస్తూండడం గమనించాడు. ఆఫీసులో కూర్చొని ఇద్దరు స్పోకెన్ ఇంగ్లీష్ వారిని నెక్ట్స్ బ్యాచ్‌లో జాయిన్ చేసుకుని అడ్వాన్సు కట్టించుకున్నాడు. ఇప్పుడు నడుస్తున్న బ్యాచ్ వచ్చే నెల రెండవవారంలో ముగియబోతుంది.
పదిగంటలకు ఇంటర్మీడియట్ వాళ్లకు ఇంగ్లీషు క్లాసుంది. ప్రైవేటుగా ఇంటరు కట్టినవారు వాళ్లు. క్లాసుకు బయలుదేరబోతూంటే ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు వచ్చారు. కూర్చోబెట్టి “హౌకెన్ ఐ హెల్ప్ యు? సర్!” అనడిగాడు.
“సార్! మేం బ్యాంక్ ఎంప్లాయీస్ అండీ. సి.ఎ.ఐ.ఐ.బి అని ఒక పరీక్ష ఉంటుంది మాకు. డిపార్టుమెంటల్ టెస్ట్. అందులో ఒక పేపరు ‘ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫిసియన్సీ’ అని ఉంటుంది. అంతా డిస్‌క్రిప్టివ్ టైపులో ఉంటుంది. దానికి మీరు కోచింగ్ యివ్వగలరా?”
“తప్పకుండా, సిలబస్, మాడల్ క్వశ్చన్ పేపర్ తెచ్చారా?”
ఒకాయన అవి రెండూ పతంజలికిచ్చాడు. అవి చూస్తూంటే ముని వచ్చి “ప్రైవేటు యింటరు పిల్లలు ఎదురు చూస్తున్నారు సార్” అన్నాడు. స్టూడెంట్స్ ముందు ముగ్గురూ సార్ అనే పరస్పరం సంబోధించుకుంటారు. పిల్లలు గోలగోలగా మాట్లాడుకుంటూన్న శబ్దం వినపడుతూంది.
“ప్లీజ్ మ్యానేజ్ దేమ్ ఫరె ప్యూ మినిట్స్” అని మునికి చెప్పాడు.
సిలబస్‌లో తెలియనివేమీ లేవు. ఎస్సే, ప్రెసీ, కాంప్రెహెన్షన్, ట్రాన్స్‌ఫర్‌మేషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, వన్‌వర్డ్ సబ్ స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మొదలైనవి. వాళ్లతో అన్నాడు.
“మీరొక పనిచేయండి. నేను గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్‌కోర్సు ఒకటి రెగ్యులర్‌గా రన్ చేస్తున్నాను. మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. బేసిక్స్ ముందు పర్‌ఫెక్ట్‌గా రావాలి. అది మూడు నెలల కోర్సు. చివర్లో ఒక నెల రోజులు సి.ఎ.ఐ.ఐ.బి కోసం స్పెసిఫిక్ క్లాసులు తీసుకుంటాను.”
కన్షల్టేషన్ చేస్తూన్నప్పుడు పతంజలి ముఖంలో కాన్ఫిడెన్స్ ఉట్టిపడూతూంటూంది. చక్కని యాక్సెంట్‌తో అతడు మాట్లాడే భాష, అతని ఉచ్చారణ, అతని బాడీ లాంగ్వేజ్ ఎవరినైనా ఆకట్టుకుంటాయి.
“ఫీజెంత తీసుకుంటారు సర్!”
“రెగ్యులర్ కోర్సుకు త్రీహండ్రెడ్. మీకు వన్ మంత్ అదనంగా చెప్పాలి కాబట్టి టోటల్‌గా ఫోర్ హండ్రెడ్ ఇవ్వండి”
వాళ్లు సంతోషంగా ఒప్పుకొని, తలా వందరూపాయలు అడ్వాన్స్ కట్టి, అడ్మిషన్ ఫారం నింపి, వెళ్లిపోయారు.
పతంజలి క్లాసుకు వెళ్లేసరికి ముని వాళ్లకు ఇంగ్లీషు నాన్‌డిటైల్డ్ ఎస్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. పతంజలిని చూసి క్లాస్ హాండోవర్ చేశాడు. పతంజలి మునిని చూసి ప్రశంసగా అన్నాడు ‘గుడ్ జాబ్’.
వాళ్లు పద్నాలుగు మంది. కొందరు ప్రభుత్వోద్యోగులు. ఇద్దరు గృహిణులు. స్టేట్ గవర్నమెంట్ జూనియర్ అసిస్టెంట్ కంటైపిస్టు పోస్టుకు ఇంటర్ కనీసార్హత చేసింది. దాంతో అటెండర్‌లు రికార్డ్ అసిస్టెంట్స్ కూడ ప్రమోషన్ కోసం ఇంటర్మీడియట్‌కు ప్రయివేటుగా కడుతున్నారు.
పన్నెండు వరకు పిల్లలు అంతా వెళ్లిపోయారు. అదేమిటో గాని, స్టూడెంట్స్ ఎంత పెద్దవాళ్లయినా, వాళ్లను ‘పిల్లలు’ అనే వ్యవహరిస్తారు ముగ్గురూ. విద్యార్థుల పట్ల వాత్సల్య భావం అలా అనిపిస్తూందేమో మరి.
ఉస్మాన్ “నేను భోజనానికి వెళ్తాను. విజయవాడ విశేషాలు చెప్పు శర్మ” అంటూ రూములోనికి వచ్చాడు. పతంజలి అమ్మ పంపిన గిన్నెలు మూతలు తీస్తున్నాడు. కొంచెం గాలి పారుతుందని. ఉస్మాన్‌కు ఘుమ ఘుమ వాసన కమ్మగా ముక్కు పుటాలకు తగిలింది.
“అబ్బ! వాసన అదిరిపోయింది. నేనూ ఇక్కడే తింటా. మునీ! నాకు కూడ పిడికెడు బియ్యం ఎక్కువెయ్యి” అన్నాడు.
“అంతకంటేనా” అన్నాడు పతంజలి.
“ఒక పిడికెడు కాదు డజను పిడికెళ్లు అను” అన్నాడు ముని నవ్వుతూ.
ఉస్మాన్ భోజన ప్రియుడు. సుష్టుగా తింటాడు. మొహమాటపడడు.
“నేను వెళ్లి పెరుగు, ఉల్లిపాయ పకోడీ తెస్తానుండండి” అని క్రిందకు వెళ్లి పది నిమిషాల్లో వచ్చేశాడు. ఈ మధ్య పాత స్టవ్ తీసేసి ‘నూతన్ కంపెనీ’ది కొత్త స్టవ్ పెద్దది కొన్నారు. పెద్ద నీలిరంగు ఫ్లేమ్ వస్తుంది. ఇరవై నిమిషాలలో అన్నం అవుతుంది.
‘మూడు టైటిల్స్‌కు ఆర్డరిచ్చి వచ్చాననీ, సగం అడ్వాన్సు ఇచ్చాననీ, వారం రోజుల తర్వాత బుక్స్ పూర్తవుతాయనీ, అవగానే ఫోన్ చేస్తారనీ’ చెప్పాడు. ముగ్గురూ భోజనం చేస్తూన్నారు. పతంజలి అన్నాడు “క్రింద వెల్డింగ్ షాపు వెకేట్ చేస్తున్నట్లున్నారు?”
“అవును వాళ్లు బైపాస్ రోడ్డులో సొంత షెడ్ పెట్టుకుంటున్నారట. ఇక్కడ ఇరుకైపోయి, రోడ్ అంచువరకూ గ్రిల్స్, అవీ పెడుతూంటే ప్రక్కషాపుల వాళ్లు అభ్యంతరం చెబుతున్నారట. ట్రాఫిక్ పోలీసులు మాటిమాటికి మామూళ్లు అడుగుతున్నారట.”
“నాకో ఆలోచన వస్తూంది” అన్నాడు పతంజలి. “ఆ షాపు దేవసహాయంగారినడిగి మనం తీసుకొని, బుక్స్ అండ్ స్టేషనరీ షాపు ఓపెన్ చేస్తే ఎలా వుంటుంది? కౌంటర్లో ఒక అబ్బాయినెవర్నయినా నమ్మకస్తుడిని అపాయింట్ చేసుకుంటే సరి. మనమంతా ఇక్కడే వుంటాము కాబట్టి సూపర్‌వైజ్ చేయవచ్చు. ఆ బిజినెస్ మార్జిన్ ఎక్కువ అని విన్నాను. గైడ్స్ మీద 40% వరకూ ఇస్తారట. స్టేషనరీ మీద 100% లాభం ఉంటుందట.”
“మరి ‘రవిప్రకాష్’ హోటలు సమీపంలోనే’ కర్నూలు బుక్ సెంటర్’ ఉందే. మనకు గట్టిగా వందమీటర్ల దూరం కూడ ఉండదు. రెండు షాపులయితే జరగడం కష్టమేమో?”
“ఎవరి బిజినెస్ వారిదే” అన్నాడు ముని.
రాత్రి ముగ్గురూ దేవసహాయంగారి వద్దకు వెళ్లారు. “సార్ క్రింద షాపు ఖాళీ అయింది కదా మాకిప్పిస్తే బుక్ షాపు పెట్టుకుంటాము” అన్నారు.
“అంతేగదమరి” అన్నాడాయన యథాప్రకారంగా. “కాని అది కమర్షియల్ పర్పస్ క్రిందికి వస్తుంది. దానికి మున్సిపల్ టాక్స్ చాలా ఎక్కువ కడుతున్నాను. కరెంటు ఛార్జీలు స్లాబు కూడ ఎక్కువే. మరి బాడుగ ఎక్కువగా ఉంటుంది. మీరివ్వగలరా?”
“మీ ఆశీస్సులుంటే ఎందుకివ్వలేముసార్! మీ దయవల్లే కదా బాగుపడ్డాము” అన్నాడు పతంజలి. అందులో ముఖస్తుతి అణుమాత్రం లేదు. మేడమ్‌గారు లోపల్నించి వచ్చారు. అంతా వింటున్నట్లున్నారు. భర్తతో అన్నారు.
“మన పిల్లల్లాంటివాళ్లు. షాపువాళ్లకిచ్చేయండి. మంచివాళ్లు పాపం” అన్నదామె.
“నీవు రెకమెండేషన్ చేయకపోతే ఇవ్వనా ఏమి?”
“ఏమో! టాక్స్, స్లాబు అంటూ పిల్లలను బెదరగొడుతున్నారు కదా!”
“అసలు విషయం తెలుసా మీకు. షాపులు, మీరున్న బిల్డింగ్ మేడమ్‌గారి పేరున ఉన్నాయి. ఆమె చెప్పినట్లు వినకపోతే నాకు కూడు దొరకదు”
“కూడు దొరక్క బక్కచిక్కిపోయినాడు పాపం మీ సారు” అన్నదామె.
సారు లావుగా పుష్టిగా ఉంటాడు. వాళ్లిద్దరి అన్యోన్యత చూసి ముగ్గురికీ ముచ్చటేసింది.
“సరేనయ్యా! హైకమాండ్ ఆర్డర్సు, మామూలుగా అయితే ఐదువేలు అడ్వాన్సు, నెలకు వెయ్యిరూపాయలు బాడుగ అడుగుతాను. మీరు మా వాండ్లు కాబట్టి అడ్వాన్సేమీ వద్దు,. నెలకు ఎనిమిదివందలు బాడుగివ్వండి చాలు” అన్నాడాయన. వెంటనే ఒక నెల అడ్వాన్సు ఆయనకిచ్చాడు పతంజలి. మేడమ్‌గారిని రమ్మని సారు ప్రక్కన కూర్చోమని కోరారు. “ఎందుకయ్యా” అంది ఆమె సిగ్గుపడుతూ.
“కూర్చోండమ్మా చెబుతాను” అంటూ, ఆమె కూర్చున్న తరువాత ఇద్దరికీ పాదాభివందనం చేశారు ముగ్గురూ.
“ఆల్ ది బెస్ట్” అని ఆశీర్వదించారా పుణ్యదంపతులు.
రెండ్రోజుల్లో షాపు శుభ్రం చేయించి, పెయింట్స్ వేసి సిద్ధం చేయించాడు దేవసహాయంసారు. అంతకుముందు మామూలు తలుపులుండేవి. అవి తొలగించి రోలింగ్ షట్టర్స్ పెట్టించాడు. చక్రాల షోకేసు కం కౌంటరు అమర్చుకునేందుకు అనువుగా నేలలో పట్టాలు తయారు చేయించాడు. పగలంతా షోకేసు బయట పెట్టుకొని రాత్రి షాపులోనికి లాక్కోవచ్చు.
మొత్తం ఎంత పెట్టుబడి అవసరమో ఒక అవగాహనకు రావాలి. షాపులో ఫాల్స్ సీలింగ్, దాంట్లోనే లైట్లు క్రింద ప్లోరంతా వెల్డింగ్ వాళ్లు పాడు చేశారు. కాబట్టి ఆ ఫ్లోరింగ్ తీసివేసి బేతంచెర్ల పాలిష్ బండలు పరిపించాలి. షాపు పెద్దదే పన్నెండడుగులు వెడల్పు, పద్దెనిమిదడుగుల పొడవు ఉంది. ఎత్తు కూడ పన్నెండడుగులు వుంది. ఆ కొలతలు తీసుకొని వెళ్లి గాద్రెజ్ కంపెనీ షోరూం వారికి చూపించి, రెడీమెడ్ ప్లెక్సిబుల్ స్టీల్ రాక్స్ ఎన్ని పడతాయో అడిగారు. మూడడుగుల పొడవు ఒకటిన్నర అడుగు వెడల్పుగల ట్రేలు రంద్రాలు వేసి పోల్స్‌కు ఫిక్స్ చేసి యిస్తారట. వాటిని సులభంగా నట్లు విడదీసి కావలసినంత గ్యాప్‌లో ట్రేలను అమర్చుకోవచ్చు. వస్తువులు జారి పడిపోకుండా ట్రేలు అంగుళం ఎత్తున చుట్టూ బార్డర్ ఉంది.
పోల్స్ ఒక్కోటి పదడుగుల ఎత్తున్నాయి. రెండడుగలకొక ట్రే చొప్పున బిగించుకోవచ్చు. మూడు గోడలనానుకొని కొన్నీ, షాపు మధ్యలో కొన్నీ మొత్తం పద్నాలుగు ర్యాక్స్ పడతాయి. వాళ్ల దగ్గర కొటేషన్ తీసుకున్నాడు. వాళ్ల పనివాళ్లే వచ్చి బిగిస్తారు. షాపు ముందు కూడ ఫ్లోరింగ్ పాడయింది. మొత్తం అన్ని షాపుల ముందూ తానే నీట్‌గా ప్లాస్టరింగ్ చేయిస్తానన్నాడు దేవ సహాయంసారు.
విక్టరీ టాకీసు దగ్గర పెద్దది మార్వాడీల స్టేషనరీ షాపుంది. హోల్‌సేల్ షాపది. అక్కడికి వెళ్లి విచారించారు. సేఠ్ చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆయన పేరు హరిచరణ్‌లాల్ అట. ఆయన చెప్పాడు.
“మా దగ్గర కొంటే మార్జిన్ చాలా తక్కువుంటుంది. మీరు మద్రాసు నుండి గాని, విజయవాడ నుండి గాని ‘మాల్’ తెచ్చుకోండి. కొత్త షాపు అంటున్నారు కాబట్టి చాలా మాల్ అవసరం.”
“దయచేసి షాపుకవసరమయిన స్టేషనరీ ఎంత? హోల్‌సేల్‌గా కొంటే ఎంతవుతుంది ఒక ఎస్టిమేట్ యివ్వగలరా?” అని అడిగాడు పతంజలి. ఆయన అరగంట సేపు స్టేషనరీ సామాన్లు, కావలసిన సంఖ్య గ్రోసుల్లో (గ్రోసు అంటే పన్నెండు డజన్లు), సుమారు ధర క్యాల్కులేట్ చేసి యిచ్చాడు.
“నోట్ బుక్స్, రిజిస్టర్స్, గైడ్స్, ఇవన్నీ కూడ విజయవాడలోనే పెద్ద పెద్ద డీలర్లున్నారు. వారి దగ్గర తీసుకోండి.” అని చెప్పాడాయన. బీసెంటు రోడ్డులో ఉన్నాయని కూడ చెప్పాడు. కార్పెంటర్‌ను పిలిపించారు. షో కేసు కొలతలు చూపించి, ఎంతవుతుందని అడిగితే గ్లాస్ టాప్ చేయించుకోండి, కస్టమర్సుకు అన్నీ కనబడతాయన్నాడతను. అతనూ తన కొటేషన్ ఇచ్చాడు.
మొత్తం యాభై వేల వరకు అవుతుంది. రాధాసారు బ్యాంక్ లోన్ తీసుకోమని, వడ్డీ తక్కువని, అన్ ఎంప్లాయిడ్ యూత్‌కు పథకాలున్నాయని, నెలనెలా షాపు నుండి వచ్చే ఆదాయంలోనే కంతులు (ఇన్‌స్టాల్‌మెంట్స్) కట్టుకోవచ్చనీ చెప్పాడు. మీ బావ బ్యాంక్ ఆషీసరే కదా ఒకసారి ఆయనకు ఫోన్ చేయమన్నాడు.
ఆఫీసు అవర్స్‌లో రామ్మూర్తి బావకు ఫోన్ చేశాడు పతంజలి. రాధాసారు యింటినుండే. బావ పలికాడు.
“ఏమిటి ప్రిన్సిపాల్ గారికి మా మీద గాలి మళ్లింది?” అన్నాడు.
యోగక్షేమాలయిన తర్వాత, విషయమంతా చెప్పాడు బావకు. ఆయన చాలా సంతోషించాడు.
“కర్నూల్లో మా బ్రాంచి బాస్టియన్ రోడ్‌లో ఉంది. నేను మా మేనేజరుతో కర్నూలు మేనేజరుకు ఈ రోజే చెప్పిస్తాను. నీవు వెళ్లి కలువు. షాపులోని సరుకంతా బ్యాంకుకే తాకట్టు పెట్టమంటారు. ‘స్టాక్స్ ప్లెడ్జ్‌డ్ టు కెనరా బ్యాంక్’ అనీ, ‘ఫైనాన్స్‌డ్ బై కెనరా బ్యాంక్’ అనీ చిన్న బోర్డులు తగిలించుకోవాలి. టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ మనం పెట్టుకోవాలి. నేరుగా మీకు డబ్బివ్వము. కొటేషన్స్ ప్రకారం సప్లయర్స్‌కు వాళ్ల పేరిట చెక్కులిస్తామంటారు. ‘చీఫ్ మినిస్టర్స్ యూత్ ఎంపవర్‌మెంట్’ అని ఒక స్కీముంది. దాంట్లో అయితే వడ్డీ చాలా తక్కువ పడుతుంది” అని వివరంగా చెప్పాడు.
“చాలా థ్యాంక్స్ బావా” అన్నాడు పతంజలి.
“నీ మొహంలే, థ్యాంక్సట థ్యాంక్సు. తంతాను ఆ మాటంటే” అన్నాడాయన. ఆయన గొంతులో బావమరిది పట్ల అభిమానం తెలుస్తుంది. “ఒరేయ్ పతంజలీ! నీ ప్రస్థానం చూస్తూంటే పోతనగారి వామనావతార ఘట్టంలో, ‘ఇంతింతై వటుడింతయై’ అన్న పద్యం గుర్తొస్తుంది రోయ్” అన్నాడు. “గో అహెడ్. స్కై ఈజ్ యువర్ లిమిట్” అని డిస్కనెక్ట్ చేశాడు బావ. పతంజలి కళ్లు చెమ్మగిల్లాయి.
మరుసటి రోజు బాస్టియన్ రోడ్‌లోని కెనరా బ్యాంక్‌కు వెళ్లాడు. మేనేజరు క్యాబిన్ డోర్ వద్ద నిలబడి “మే ఐ కమిన్ సర్” అన్నాడు. ఆయన “రండి కూర్చోండి” అని ఆహ్వానించాడు. “చెప్పండి” అన్నాడు.
“అయాం పతంజలి శర్మ. ప్రిన్సిపాల్ ఆఫ్ సక్సెస్ ట్యుటోరియల్స్” అని పరిచయం చేసుకున్నాడు.
క్యాబిన్ బయటే పేరు చూశాడు. “వేదుల శ్రీపాద శాస్త్రి, బి.కాం, సి.ఎ.ఐ.ఐ.బి, బ్రాంచ్ మేనేజర్” అని ఆయనకు నలభై ఐదేండ్లుంటాయి. గులాబీ రంగు శరీరం. పూర్తిగా బట్టతల మీసాలు ఒత్తుగా నల్లగా ఉన్నాయి. నుదుట విభూతి రేఖలు, భ్రూమధ్యంలో గంధం కుంకుమ ధరించాడు. మంచి దైవభక్తి పరుడిలా ఉన్నాడు. టేబుల్ మీద దత్తాత్రేయస్వామివారి చిన్న ఫోటో ఫ్రేం ఉంది.
“మీకు తెలుగు వచ్చుకదా” అన్నాడాయన. “నాకు కొద్దో గొప్పో ఇంగ్లీషు వచ్చు” అన్నాడాయన.
పతంజలి బిత్తరపోయాడు ఆయన నవ్వి, “జోక్ అంతే” అన్నాడు. హైదరాబాదు నుండి జేమ్స్ స్ట్రీట్ బ్రాంచి మేనేజర్ నిన్న మీ గురించే మాట్లాడాడు. రామ్మూర్తిగారు మీ బావట కదా! ఆయన నాకంటే ఐదారేళ్లు జూనియర్. రెండేళ్లలో మ్యానేజరు అవుతాడు. మీ బుక్ షాపుకు నేను లోనిస్తా. నో డవుట్ అబౌట్ ఇట్. మార్జిన్ మనీ అసరం లేదు. ష్యూరిటీ మీ బావది పనికి రాదు. ఎవరయినా లోకల్ వాళ్లది కావాలి. కోటేషన్స్ తెచ్చారా? స్టాక్స్ ఎక్కడనుండి తెస్తారు? ఎంతమంది పార్టనర్స్? మా బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరవాలి”. టేబుల్ మీద బజరు మోగించి అటెండరును పిలిచాడు. “కాఫీ తీసుకురా” అని చెప్పి “కొంపతీసి మీరు టీ తాగుతారా?” అనడిగి బ్రాహ్మలు టీ తాగడమేమిటీ?” అని దీర్ఘం తీసి, “సో, ఎక్కడున్నాం?” అన్నాడు.
“జాయింట్ అకౌంట్ దగ్గరున్నాం సార్” అన్నాడు పతంజలి. “స్టాక్స్ విజయవాడలో తెస్తాము. ముగ్గురం పార్టనర్స్.”
“ఓ.కె. స్టాక్స్ మాకే ప్లెడ్జ్ చేయాలి. వేరే బ్యాంకులో లోన్ తీసుకోకూడదు” అంటూ ఫీల్డాఫీసర్‌ను పిలిపించి – “సి.ఎం. యూత్ స్కీంలో వీళ్లకు ఒక షాపుకు లోనిస్తున్నాం. డాక్యుమెంట్లన్నీ రడీ చేయండి” అని చెప్పాడు.
పతంజలితో “మీరు ముగ్గురు భాగస్వాములు గ్యారంటార్‌ను తీసుకొని రేపు ఇదే సమయానికి రండి. ముగ్గురివీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, షాపుది అడ్రస్ ప్రూప్, షాపు ఓనరుతో మీరు అద్దెకు తీసుకున్నట్లు రెంటల్ అగ్రిమెంటు షాపుకు మున్సిపాలిటీ వారి పర్మిషన్ తెచ్చుకోండి” అన్నాడు.
“కొంచెం వ్యవధి…” అంటూ పతంజలి చెప్పబోతూంటే.
“అవును. ఒక వారం రోజుల్లో అన్నీ సబ్మిట్ చేస్తే సరి ఈలోగా లోన్ ప్రాసెస్ చేయిస్తా. ముందు మీ సంతకాలు, గ్యారంటీ ఇచ్చే వారి సంతకాలు అయిపోతే మంచిది.”
కాఫీలు వచ్చాయి. కాఫీ తాగుతూ అన్నాడాయన. “మీరు స్వతంత్రంగా ట్యుటోరియల్స్, బుక్‌షాపు ఇలా వ్యాపారంలో ముందుకు సాగుతున్నందుకు నా అభినందనలు. మనవాళ్లల్లో ఈ దృక్పథం తక్కువ. ఎంతసేపూ ఏదో ఒక ఉద్యోగం కోసమే పాకులాడుతారు.”
“లోన్ రీపేమెంట్ గడువు ఎంత ఉంటుంది సార్”
“ముఫ్పై ఆరు లేదా నలభై ఎనిమిది నెలలు. చిన్న మొత్తమే కదా! మూడేండ్లు పెట్టుకోండి.” అని చిన్న స్లిప్ మీద ఏవో లెక్కలు వేసి “లోన్ వడ్డీతో సహా అరవైరెండు వేలు అవుతుంది. నెలనెలా రెండువేలు కడితే సరిపోతుంది. పదిలక్షల వరకు ఇవ్వడానికి నాకు అధికారముంది కాబట్టి వెంటనే సాంక్షన్ చేసేస్తాను. ఈ కొటేషన్స్ చెక్కులు బెడద మీకు లేకుండా మీ అకౌంట్‌లో లోన్ అమౌంట్ వేసేస్తాము. ఎందుకయినా మంచిది కొటేషన్స్, డిటెయిల్డ్ ఎస్టిమేట్ పట్టుకొని వచ్చేయండి.”
(సశేషం)