[dropcap]ఆ[/dropcap] పార్కులో కరుణ రోజూ వాకింగ్ చేస్తూ వాళ్ళిద్దరిని నెల రోజులుగా గమనిస్తోంది.
పెళ్లి అయిన భార్యాభర్తలు కూడా అంత చొరవగా మసలుకోరు. చివరికి భరించలేక వాళ్ళని పలకరించింది.
“హలో నా పేరు కరుణ. మీరిద్దరూ వైఫ్ అండ్ హజ్బండ్స్ కాదు. …. కాని అలా ప్రవర్తిస్తున్నారు. ఇట్స్ టూ బాడ్. మీరు లవర్స్ అనుకుంటా….” అంది.
“అవును….” అన్నారు ఇద్దరూ ఒకేసారి.
“ఓకే చదువుకుంటున్నారా, ఉద్యోగాలా?”
“ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలు చేస్తున్నాం…” అన్నాడు అబ్బాయి.
“మరి ఇకనేం పెళ్లి చేసుకోవచ్చుగా.. మీ పరిచయం పెద్దవారికి తెలుసా?”
అమ్మాయి మాటాడలేదు.
అబ్బాయి “తెలుసు. మాకు కొన్ని బాధ్యతలు వున్నాయి. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాం.” అన్నాడు.
“మీ పేర్లు?
“నా పేరు ధర్మ తేజ…” అన్నాడతను. అమ్మాయి చెప్పలేదు.
“చూడమ్మా నువ్వు స్నేహం పేరుతో హద్దులు మీరుతున్నావు. త్వరగా పెళ్లి చేసుకోండి. ఇద్దరు సంపాదిస్తున్నారు కదా!” అంది కరుణ.
“నేను తేజ చేయి పట్టుకున్నాను. భుజం మీద తలవాల్చి హాగ్ చేసుకున్న తప్పా…” అంది పొగరుగా.
“తప్పే! పెళ్లికానివారు ఇలా వికృత చేష్టలు చేయడం తప్పే! చూసేవారికి అసహ్యంగా వుంది. ఫ్రెండ్షిప్ కూడా పవిత్రంగా ఉండాలి. నిజమైన లవర్స్ ఐతే నిలబెట్టుకోండి. మీరు కొద్దీ కాలం తర్వాత ఏ పాపో బాబో పుట్టి పార్క్‌కి వస్తే నేను చాల సంతోషిస్తాను.” అంది కరుణ.
వాళ్ళు మాటాడలేదు కానీ కరుణ మాటలు తేజలో కొంత మార్పు తెచ్చినట్టు తోచింది.
“తేజా మీరిద్దరూ ఇంత చొరవగా ఉండటం ప్రేమ కాదు. అట్రాక్షన్. మీ మేలుకోరి చెబుతున్నా. ఎందరో యువతీ యువకుల జీవితాలు చూసాను. వివిధ దేశాలు తిరిగాను. ఇద్దరు వ్యక్తులు కొన్ని ఏళ్లపాటు ఒకేచోట కలిసి వున్నప్పుడు కానీ స్వభావాలు తెలుసుకోడం వీలుకాదు. ఇలా పరిచయం ఉన్నంతలో జరిగేది ఒక్కటే…. తొందరపాటు… మీకు నా మాటలు నచ్చితే రోజూ కాసేపు మాటాడుకుందాం” అని చెప్పి వచ్చేసింది కరుణ.
మర్నాడు పార్కులో తేజ ఒక్కడే కనిపించాడు.
“నీ ఫ్రెండ్ రాలేదా..” అని పలకరించింది కరుణ.
“రాలేదు. ఒక్కడినే వచ్చాను కూర్చోండి ఆంటీ…” అన్నాడు బెంచ్ మీద దూరంగా జరిగి చోటిస్తూ.
“నీ ఫ్రెండ్‌కి నా మీద కోపం వచ్చిందిలే. నాకు తెలుసు. నువ్వు మాత్రం గుడ్ బోయ్‌వి. నేను చెప్పేది వినాలను కుంటున్నావ్! వెల్డన్. నీ కుటుంబం ఎలాంటిదో తెలియదు కానీ…. ప్రతి తల్లి తండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తారు. నీకు చెల్లి లేదా తమ్ముడు ఉంటే వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకుని అమ్మ నాన్నలను ఆదుకుంటావని ఆశిస్తారు. ప్రేమ అని ఎవరో అమ్మాయి కోసం సమయం డబ్బు ఖర్చుచేస్తావని అనుకోరు. నీ ఫ్రెండుతో చెప్పిచూడు. ‘పెళ్లి చేసుకుని బాధ్యతలు పంచుకుందాం. నువ్వు అంగీకరిస్తే నిన్ను మరింతగా ప్రేమిస్తాను’ అని. ఒప్పుకుంటే అదే అసలు ప్రేమ మీ బంధం మరింతగా బలపడుతుంది.”
కరుణకి వాళ్ళు రోజూ కనిపిస్తూనే వున్నారు.
తేజ విష్ చేస్తాడు. ఆ అమ్మాయి మొహం తిప్పుకుంటుంది.
అప్పుడప్పుడు ఆ అమ్మాయి తీవ్రంగా గట్టిగా అరిచేది.
తేజ నెమ్మదిగా అనునయంగా మాటాడేవాడు. మరీ చులకన చేసేది.
ఆమ్మో ఈ పిల్లకి చాల పొగరు అనుకుంది కరుణ.
ఇంకోరోజు తేజ రాలేదు. ఆ అమ్మాయి ఒక్కతే వచ్చింది.
“చూడమ్మా నీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావ్? తేజ రాలేదేం ఈరోజు?” అడిగింది కరుణ.
“నాకేం భయం! నా పేరు సారిక….” విసురుగా చెప్పింది.
“నేను నీతో కాసేపు మాటాడవచ్చా?” అడిగింది కరుణ.
సారిక మాటాడలేదు పక్కనే కూచుని, “తేజా చాలా మంచివాడు. వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడు. మీ స్నేహం వాళ్ళకి తెలుసా?” అడిగింది
“అసలు మా గురించి మీకు ఇంట్రస్ట్ ఎందుకు? వదిలిపెట్టండి ప్లీజ్!”
“ఏమో సారికా మీరిద్దరూ కనిపించినపుడు మీరిద్దరూ చక్కని జంట. ఒకటైతే బాగుండును.. అనిపించింది. అంతకుమించి నాకు ఒరిగేది లేదు. అమ్మాయిలకు అమ్మ నాన్నలు ఇచ్చిన స్వాతంత్రం మీ మీద వారికీ వున్న భరోసా…. దుర్వినియోగం చేయద్దు. మిమ్మల్ని మీరు కాపాడుకోడం, మంచి నిర్ణయాలు తీసుకోడం అవసరం. ఇదే ఈ తరానికి నేను చెప్పాలనుకున్నా! తేజ బుద్ధిమంతుడు. అతడిని నీ అహంకారంతో దూరం చేసుకోవద్దు. గుడ్ లక్.” అంటూ లేచి వచ్చింది కరుణ.
సుమారు నెల రోజుల తర్వాత కనిపించాడు తేజ. అతడితోబాటు వీల్ చెయిర్‌లో వున్న అమ్మాయి ఎవరో కనిపించింది.
“అరే ఏమైపోయావ్ తేజా…. నువ్వు చాల రోజులుగా కనబడలేదు!” అని పలకరించింది.
“మీ వాకింగ్ పూర్తి చేసి రండి ఆంటీ. చెబుతాను” అన్నాడు తేజ వీల్ చెయిర్ అమ్మయిని కూడా పార్కులో తిప్పుతూ.
గంట తర్వాత వచ్చి కూర్చున్న కరుణకి ఆ అమ్మాయి గురించి చెప్పాడు.
“ఈ అమ్మాయి పేరు చకోరి. మా నాన్నకి దూరపు బంధువు. మా వూరు వెళ్ళాను ఆంటీ. అక్కడ ఈ అమ్మాయి కనబడింది. ఎవరు బంధువా.. అని అమ్మని అడిగాను. అప్పుడు మా నాన్న చెప్పారు. ‘అవునురా తేజా! మనకి తెలిసినవారే. చకోరి అమ్మ నానా మన పొలం చూస్తూవుంటారు. వాళ్ళకి అదే ఆధారం. మనపొలం గట్టున ఇల్లుకట్టి ఇచ్చాను. పంటలో కొంత ఇచ్చేవాడిని. చకోరి పుట్టుక నుంచే దివ్యాంగురాలు. డిగ్రీ చదివి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. అంగన్వాడీ టీచర్‌గా మన వూళ్ళో పనిచేస్తోంది. ఇదిగో మాయదారి కరోనా వచ్చి చకోరి అమ్మ నాన్న చనిపోయారు. స్కూల్ మూతబడింది. ఆడబిడ్డ ఊరిచివర ఒంటరిగా ఉండటం మంచిది కాదని మన ఇంటికి తెచ్చింది మీ అమ్మ. ఇంటిపని కూడా చేయగలదు. నీతోబాటు తీసుకెళ్లి ఏదో దారి చూపించు’ అన్నాడు. మా వూర్లో పొలం వున్నా చోట ప్రభుత్వం ఏదో ఫెక్టరీ కడుతూ భూమికి డబ్బు చెల్లించి తీసుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాదులో ఇల్లు కొన్నాను. నాన్నచేత వ్యాపారం పెట్టించాను. అందరమూ ఓకే చోట ఉంటాం. చకోరి బాధ్యత నేను ఆనందంగా స్వీయకరించాను.” అంటూ చెప్పాడు.
“చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ కంగ్రాచులేషన్….” అంటూ మెచ్చుకుంది కరుణ.
సారిక గురించి అడిగే సందర్భం కాదు. కానీ ఇద్దరికీ బ్రేకప్ అయినట్టు అర్థం అవుతూనేవుంది.
కొద్దికాలం తర్వాత పెళ్ళికి పిలవడానికి వచ్చాడు తేజ! అప్పుడు వివరంగా చెప్పేడు.
“సారికకు నా కంటే ఎక్కువ సంపాదించే బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అతను లండన్‌లో ఉంటాడు. నేను పెళ్లి గురించి ఎప్పుడు అడిగిన ఇప్పుడు కాదు కొంతకాలం పోనీ… అంటూ వాయిదా వేసేది. చివరికి ఒకరోజు చెప్పింది. – ‘మా నాన్న చిన్న ఉద్యోగి. మీ నాన్నకి అసలు ఉద్యోగమే లేదు. నువ్వు నేను లోను తీసుకుని చదివాం. అది తీరేసరికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. మన ఇద్దరి మీద మన అమ్మ నాన్నలు పూర్తిగా ఆధారపడి వున్నారు. ఇవి కాకుండా తమ్ముళ్లు చెల్లెలు బాధ్యతలు. ఇక మనకి ఎంజాయ్‌మెంటు అంటూ ఈ జన్మకి ఉండదు. ఐ హేట్ థిస్ లైఫ్. అందుకే నేను రాబర్ట్స్‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతనికి భార్య ఇద్దరు కొడుకులు వున్నారు. వారితో విడిపోయాడు. పరిచయం ఐన ఏడాదికే కారు, ఫ్లాట్ కొని ఇచ్చాడు. వెడ్డింగ్‌కి డైమండ్ నగలు కొంటాడు. ఇంకా దేశాలు తిప్పుతాడు. నా ఆశలు తీర్చగల వాడితో హాయిగా వుంటాను!’ అంటూ నాకు బై బై చెప్పేసింది.
స్థిరత్వం అనుబంధం అవసరం లేని సారిక కంటే చకోరి నాకు తగిన భాగస్వామి అని గ్రహించాను. మీరు తప్పక రావాలి” అంటూ ఇన్విటేషన్ ఇచ్చాడు.
“తేజ గ్రేట్ డిసిషన్! హార్టీ కంగ్రాచులేషన్స్. అవును చకోరికి నీ సహకారం, అండా అవసరం. ఆమెకు కొత్త జీవితం ఇచ్చావు. నీ తల్లి తండ్రులకు తగిన బిడ్డవి అనిపించావ్…. తప్పకుండా వస్తాను” అంటూ చెప్పింది కరుణ… మనస్ఫూర్తిగా అతడిని అభినందిస్తూ.