స్వాతంత్ర్య సమర యోధులకు శతాధిక కవుల కవితా హారతి – ‘సాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ పుస్తకానికి ముందుమాట

0
5

[‘సాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ పుస్తకానికి డా. ఆచార్య ఫణీంద్ర వ్రాసిన ముందుమాట]

[dropcap]75 [/dropcap]ఏళ్ళుగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, భారతీయులు అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాల వెనుక ఎంత మంది సమర యోధుల పోరాటం, తెగువ, త్యాగం దాగి ఉన్నాయో వివరించాలంటే చరిత్ర పుటలు సరిపోవు. అయితే … ఈ భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా చరిత్ర కెక్కిన మహాయోధుల సంస్మరణనైనా చేయడం ప్రతి భారత పౌరుని కనీస కర్తవ్యం! అట్లాంటి ఉదాత్త లక్ష్యంతో ఒక మహత్తర కార్యానికి పూనుకొన్నారు ఈ గ్రంథ సంపాదకులు, ముద్రాపకులు శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్. ఆయనకు ఇతోధికంగా సహకరించిన వారు శ్రీ కె. ఫణి ప్రసన్న కుమార్. కోడీహళ్ళి వారు పూనుకొన్న ఆ మహత్తర కార్యమే ఈ మనోజ్ఞ కావ్యంగా రూపు దిద్దుకొనేందుకు దోహద పడింది.

ఈ కృతిలో శతాధిక స్వాతంత్ర్య సమర యోధులపై శతాధిక పద్య కవులతో నీరాజన పద్యాలను రచింపజేసి పొందుపరిచారు. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి గారి నుండి అస్మదాదుల వరకు ఎందరో లబ్ధ ప్రతిష్ఠ కవులు ఈ బృహత్ యజ్ఞంలో పాలు పంచుకొన్నారు. ఒక్కొక్క కవి ఒక్కొక్క స్వాతంత్ర్య యోధునికి నివాళులెత్తారు. ఆ యా కవులు రచించిన ఆ పద్యాలన్నింటికీ ఒక ఆలంకారికమైన లంకె వేసి ముడి వేయించారు. ఆ ముడి ముక్తపదగ్రస్తం. మొదటి నుండి చివరి వరకు ప్రతి పద్యం అంత్య పదాన్ని తదుపరి పద్యం ఆద్య పదంగా స్వీకరిస్తూ ఈ పద్యాల నిర్మాణం జరిగింది. విశేషమేమంటే .. ఈ సంకలనంలోని చివరి పద్యం చివరి పదం కూడ ప్రథమ పద్యం ప్రథమ పదంతో సరిపోలడంతో – ఈ పద్య కృతి కొసలు ముడి వేసిన వెలుగు పువ్వుల హారంగా రూపు దిద్దుకొని భరత మాత గళంలో అలంకరించ బడేందుకు అనువుగా అమరింది. మురళీమోహన్ గారు ఈ బృహత్తర కార్యంలో నన్ను భాగస్వామిని చేస్తూ, పద్యాల పరిష్కరణతోబాటు, గౌరవ సంపాదకత్వం నిర్వహించవలసిందిగా కోరారు. అది ఈ అమృతోత్సవాల సందర్భంగా మన దేశమాతకు ఘటించే అంజలిగా భావించి నేను నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను.

స్వాతంత్ర్య భారతికి పట్టిన మంగళ హారతిగా వెలసిన ఈ గ్రంథంలో ప్రథమ స్వాతంత్ర్య యోధుడు మంగళ్ పాండే పై అల్లిన పద్యం నుండి మొదలుకొని, మంగళం పలికే పద్యం వరకు – శతాధిక వీరుల ఘన కీర్తిని చిత్రించబడింది. అట్లా ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మహనీయ వ్యక్తిని కీర్తించిన ముక్తక పద్య సంకలన కృతిగా ఇది అలరింది. మొత్తంగా ఇది ఒక సీస పద్య సమాహారంగా రూపొందడం మరొక విశేషం. మచ్చుకు కొన్ని వివరిస్తాను‌ –

ఆంగ్లేయ సేనలో అతి ధైర్యవంతుడౌ
“మంగళ పాండె” ధీమాన్యు డొకడు
తెల్ల దొరల పైనె తిరుగుబాటును చేసె –
ప్రథమ స్వతంత్ర సంగ్రామ యోద్ధ!

“ఝాన్సి లక్ష్మీబాయి” – సార్థ నామ
సుతుని మృతికి కూలి పతియు మృతిని చెంద –
ఆంగ్ల పాలకులు దురాక్రమణము సేయ –
వీర నారి యగుచు పోరు సల్పె!

స్వాతంత్ర్యమే తన జన్మహక్కని చాటి
వీరోచితమ్ముగా పోరు సల్పె –
పరుగులెత్తించె రక్తమున్ పౌరులందు –
“బాల గంగాధర తిలకు” భరత భూమి!

కాషాయమును పైన, కలుగ శ్వేతము మధ్య
హరిత వర్ణ మమర అడుగునందు –
పిదప జాతీయ జండగా వెలసె మనకు
దేశ భక్తుడు “వెంకయ్య” దీక్ష వలన!

అతడు స్వాతంత్ర్య “వీర సావర్కరుండు”!
ఘనుని చెరసాల చరితది ‘కాలపాని’!

పౌరుషాగ్నితో విప్లవ వీరు డగుచు
ప్రాణ మర్పించె శ్రీ “సీత రామ రాజు”!

దేశమునకుదేశమునకు తా విప్లవ దీప్తు లొసగి
క్రొత్త పోరాట మార్గాన కొలువు సేసి,
భరత మాత స్వేచ్ఛ కొరకు ప్రాణములిడి,
“భగతు సింగు” షహీదుగా వాసి కెక్కె!

“జాతిపిత”గ తాను ప్రీతిగా పేరొందె –
శాంత్యహింస మహిమ చాటి జెప్పె!
గాడ్సె ఘాతుకమున గగనమ్మునకు నేగె –
బోసి నవ్వు వెలుగు భువిని మిగిలె!
అరుల చేజిక్కక నాత్మార్పణము జేసి,
అమర వీతుండైన అరుణ తార –
ఆత డుద్యమకారుల యందు మేటి!
ఖ్యాతి గొన్నట్టి “చంద్రశేఖర అజాదు”!

“ఆజాద్ హిందు ఫౌజ్” నమరించి ఆంగ్లేయ
పతనమ్ము గోరిన బల్లిదుడవు!
“జైహింద్” నినాదాల జాగృత సైన్యమున్
నడిపింప గల్గిన నాయకుడవు!
“పుట్టునే గాని, వీరుడు గిట్ట” డనగ –
వరలు “నేతాజి”! నిను నేను ప్రస్తుతింతు!

భర్త యాంగ్లేయుల బానిసై, “ఆజాదు
దళపతి” పైననే దాడి జేయ,
తట్టుకొనగ లేక – ధైర్యంబుతో నామె
భర్తనే జంపెను బాకుతోడ!
హృదయమున ధర్మ మార్గమె పొదవుకొన్న
త్యాగ శీలి – “నీరా ఆర్య”! అమృత మూర్తి!

ఇట్లా .. సరళమైన భాషలో … దేశమాత దాస్య శృంఖలాలను తెగచబూనిన మహానుభావుల దివ్య చరిత్రను క్లుప్తంగా, రమ్యంగా అందించిన గొప్ప పుస్తకమిది. భావి భారత పౌరులకు, ఔత్సాహికులకు మన దేశభక్తుల గూర్చి అవగాహన కల్పించే గట్టి ప్రయత్నమిది! అందుకు తమవంతు కృషిగా ఈ పద్యాలను రచించి అందించిన కవులందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను.

డా. ఆచార్య ఫణీంద్ర

***

సాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి
(శతాధిక కవుల ముక్తపదగ్రస్త కావ్యము)
సంపాదకులు: కోడీహళ్ళి మురళీమోహన్
ప్రచురణ: అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్
పేజీలు: 120, వెల: ₹ 250
ప్రతులకు:
కె. మురళీమోహన్
402, ఆనంద్ సాయి రెసిడెన్సీ,
రోడ్ నెం 2, కె.ఆర్.సి.ఆర్. కాలనీ,
బాచుపల్లి, హైదరాబాద్ 500090
ఫోన్: 9701371256
~
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here