నియో రిచ్-11

0
3

[జయంతి బయటకు వెళ్తుంటే నళినీ రెడ్డి కనిపిస్తుంది కానీ, పలకరించదు. పెంచలయ్య కారణంగానే ఆమెకు అంత గీర అనుకుంటాడు. పెంచలయ్య గురించి ఆలోచిస్తాడు. పెంచలయ్య ఎవరు, ఎక్కడ్నించి ఎదిగాడో తలచుకుంటాడు. ముసలయ్య అనే భిక్షగాడు ఓ కుర్రవాడ్ని పెంచుకోవాలనుకుంటాడు. కొండయ్య అనే వ్యక్తి – పిల్లల్ని తెచ్చి వారిని అంగవిహీనులుగా చేసి వాళ్ళని బిచ్చగాళ్ళుగా చేసి వారితో వ్యాపారం చేస్తూంటాడు. ముసలయ్య అతని దగ్గరకి వెళ్ళి ఓ కుర్రవాడిని డబ్బిచ్చి తెచ్చుకుంటాడు. అతనే పెంచలయ్య. ముసలయ్య పెంచలయ్యని సొంత కొడుకులా చూసుకుంటాడు. చిన్న ఉద్యోగంలో పెట్టిస్తాడు. కొన్నాళ్ళకి ముసలయ్య చనిపోతే పెంచలయ్య ఒంటరి అవుతాడు. ఆ ఇంటో కొంత డబ్బు, బంగారం దొరుకుతాయి పెంచలయ్యకి. డబ్బు ఓ షావుకారు వద్ద దాచుకుంటాడు. తాను పని చేసే కొట్టు యజమానితో బంగారం అమ్మించుకుంటాడు. బాగా డబ్బులొస్తాయి. ఆ ఊరు వదిలి వచ్చేస్తాడు పెంచలయ్య. కొత్త ఊరిలో ఓ పచారీ కొట్టును స్థాపించి, సరుకులు పద్ధతిగా ఇస్తాడన్న పేరు తెచ్చుకుంటాడు. ఆర్థికంగా ఎదుగుతాడు. ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశిస్తాడు. సుశీల అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని కాపురం పెడతాడు. పెళ్ళయ్యాక, అతనికి మరింత కలిసొస్తుంది. తన ఆస్తులకు రక్షణ అవసరం అని భావించి, రాజకీయాల అండ కావాలనుకుంటాడు. ప్రజాసేవ మొదలుపెడతాడు పెంచలయ్య. ఇక చదవండి.]

ఇలా ప్రజాసేవకుడొకడు ఆయనతో ఆ టౌనులో అర్ధాంతరంగా పుట్టాడనీ, అతని పుట్టుకతో ఇన్నేళ్ల మున్సిపాలిటీ పాలనలో అధికార, పాలక వర్గాలు చేయలేని చిల్లర పనులన్నీంటినీ ఒక్కడే పద్ధతిగా చేస్తూ జనానికి ఉపయోగపపడుతున్నడనీ చెప్తుకున్నారు. చెప్పుకొని అందరి నాయకుల్లా ఆగిపోలేదు. ఎందుకంటే పెంచలయ్య చేసినవి చేస్తున్నవి నాల్గు దినాల వాళ్ల మనస్సుల ఉండేవి. కనుక గుర్తులోకి తరచూ వచ్చేలా చేసుకోగలిగాడు. రాత్రి బడి నొకదాన్ని పెట్టించాడు. రికాంగా ఉన్న చోటులో నాల్గు దూలాల మొరపాక వేసి రెండు వైపులా తడికలు కట్టి శ్రద్ధ ఉన్న ఓ రిటైరయిన పంతుల్ని దానికి పెట్టాడు.

ఈ పుట్టుక రానురాను చంద్రబింబంలా అనిపించింది చాలా మంది జనానికి.

పెంచలయ్య వ్యాపారిగా గాక తమను ఆదుకును మనిషిగా కనపడసాగాడు.

ఇది ఇలా ఉంటే…

ప్రభుత్వంవారు ఓ అపరాత్రి ఎదుటి పార్టీ బలహీనంగా, కంగాళీగా ఉందని గ్రహించి ఇప్పుడు చిత్తు చేయడం తేలికనీ, మళ్ళీ కోలుకోలేని స్థితికి వాళ్లను తోసివేయ వచ్చుననీ భావించి వారి పథకంలో భాగంగా అర్థాంతరంగా మునిస్పిపల్ ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషను జారి చేసారు. ఈ వార్త అప్పటి దాకా చలిమంట దాకా కూడా వచ్చి కూర్చునే ఓపిక లేక పాత గొంగళిలో ముడుచుకొని కునికుపాట్లు పడుతున్న రాజనీయ చోటా బడా నాయకులకు నడి ఎండకాలం మిట్టమధ్యాహ్నపు ఎండలా చురుక్కుమన్నది.

పెద్ద హడావిడి వార్తయి కూర్చున్నది.

అప్పటిదాకా వారు ఉన్న రూపాల్ని ఎలా మార్చుకోవాలో, ఎలా కనిపిస్తే ఓటరు బాగానే ఉంది అనుకుంటాడో, ఎలా చెప్పితే భలేగా చెపుతున్నాడురా అనుకుటాడో అలా బయటకు వచ్చే ప్రయత్నాన సతమతమైపోయారు.

జనాన్ని గట్టిగా మోసగించి అయినా, ఎన్ని అబద్ధాలను అయినా నిజం అనిపించేలా చెప్పి అయినా నమ్మించి ఒక్క గెలుపే ధ్యేయంగా పథకాలను తయారుచేయడంలో తలమునకలయ్యారు.

మన పెంచలయ్యను వ్యాపార వర్గాలవారు తమతో తెచ్చుకున్నారు. అందు వెనకటి నుంచీ పాతుకుని ఉన్న వయోవృద్ధులే పాత వాసనలతో ముందుకు వచ్చారు సీట్ల కోసం. ఏదో ఒక పద్ధతిన అధికారం చిక్కించుకోవాలన్న ఆసక్తి వార్ని ఓ పూట సమావేశమయ్యేందుకు పురికొల్పింది. కానీ ఇంత కాలం వారితో వేగి వేగి ఉన్న యువత వాళ్లను మొత్తంగానే కట్ చేయాలనే అభిప్రాయానికి వచ్చి మొదటి దఫాయే తమ నాంది పలికారు

తమకు ప్రోత్సాహమిస్తూ ధైర్యంగా ముందుకు నడపగల్గిన వాడు, అర్థికంగా కూడా అంతో ఇంతో నింపాదిగా ఉన్నవాడూ యువకుడూ ఎవరా అని ఆలోచన ప్రారంభించారు. ప్రారంభంలోనే పెంచలయ్య వారికి ఓ యువకుడులా పంచకల్యాణినెక్కి కనిపించాడు.

అతన్ని కలిసారు.

అతన్ని నాయకత్వం వహించేందుకు, అతగాడు పెట్టిన షరతులన్నీ ఒప్పుకున్నారు. నాయకుడిగా వప్పించగలిగారు.

ఇది కాకతాళీయంగా జరిగినా జరిగినది పాతతరం వారికి కొరుకుడు పడలేదు. యువత అంతా ఒక్కటిగా అయి కోరడంతో పట్టుదలగా మెలగడంతో వాళ్లు దిగి రాక తప్పలేదు. ఈ ఆమోదాన్ని అసరా చేసుకొని ప్రణాళికను పకట్బందీగా సిద్ధం చేసుకున్నాడు. వార్డు మెంబర్లను సెలక్టు చేసుకునే విషయంలో అక్కడ వాళ్లను పూర్తిగా సంప్రదించి ఇద్దరు ముగ్గురు కావాలనుకునే వాళ్ళున్న చోట సర్ది చెప్పి; సర్దుబాటు కాని చోట వాళ్లతోనే బలాబలాలు స్నేహపూరిత వాతావరణంలో తేల్చి మరీ జాగ్రత్తగా అడుగు కదిపాడు. పాత వాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గంచి కొత్త వాళ్లలో ఉత్సాహవంతులనే కాకుండా, కొంత ఆర్థిక వనరు ఉన్నవాళ్ళను ఏరాడు. చదువుకున్న ఆడవాళ్ళను మాత్రమే ఎంచుకున్నాడు. ఎంచుకున్న వాళ్లని అందరినీ కూర్చోబెట్టి అమోదముద్ర వేయించుకోగలిగాడు. ఆనక జనంతో జనంలోకి నడిచాడు. టీమ్ వర్కు ఎలా ఉంటుందో చేసి చూపాడు. అభ్యర్ధుల జాబితా ఇక్కడ ఖరారు చేసుకోవడమే కాక నామినేషన్ల పర్వాన్నీ పద్ధతిగా ముగించాడు. ఒకటి రెండు వార్డులలో పాత వాసనలతో కొద్దిగా తలనొప్పి వచ్చినా చాలా ఓపికగా అందరినీ కూర్చోనబెట్టి సరి చేసుకున్నాడు.

ఇంత పకడ్బందీ వ్యూహాన్ని చిందరవందర చేసే ప్రయత్నం తస్మదీయులే చెరప ప్రయత్నించారు. పాత పోకడ పోక, అందులోని భాగంగా ముగ్గురు చీలి ప్రత్యర్థుల వైపుకు మొగ్గారు. ఒక్కణ్ణి మాత్రమే తమ దోవకు తెల్చుకోగలిగాడు. మిగిలిన చోట డమ్మీలతోనే తలపడ్డాడు. పెద్ద తలకాయలకు నచ్చచెపుతూ అవసరమైన హంగుల్ని సమకూర్చుతూ – యువకుల్ని కార్యకర్తలుగా మార్చుతూ వారికి తగిన ధైర్యాన్నిస్తూ అందరికీ తలలో నాలుకలా వెలుగుతూ అవిశ్రాంతంగా కృషి చేసాడు. దాదాపు టౌనులో ఉన్న మూడు వంతుల జనాన్ని కలిసాడు. నాల్గు వైపులా నాల్గు కుటుంబాలను పెట్టి టౌనుకున్న అప్పటి అవసరాలను తాను వాటిని ఎలా పరిష్కరించేదీ సవివరంగా వివరించాడు.

మీటింగులకు టౌను జనం మొత్తం కదలి వచ్చేలా చేసుకున్నాడు. తానే… ప్రత్యర్థి శిబిరాలలోని వాళ్లను కలిసాడు. తన భావనను చెప్పాడు. వారి భావన తేలుసుకున్నాడు. తను భావిస్తున్న పద్ధతిలో వెళ్తే టౌనుకు ఎలాంటి మంచి జరుగుతుందో తర్వాత జనం ఎంత సుఖంగా ఉండగలరో కూడా చెప్పగలిగాడు. చివరగా నేను వృత్తిగా రాజకీయవేత్తను కాదు. మనం ఉంటున్న ప్రదేశాన్ని మనం శుభ్రంగా ఆరోగ్యదాయకంగా ఉంచోకోవడం సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోనడం బాధ్యతగా భావించి మాత్రమే ఇప్పుడు వచ్చానని నమ్మబలికాడు.

ఇతని తీరూ, మాటాడే పద్ధతీ, ఓర్పు చూసాక చాలా మందిలో అసలు పెంచలయ్యనే చైర్మన్‌గా చేస్తే పోతుందిగదా అన్న భావన కల్గేలా చేయగలిగాడు. అతను పోటీలో లేడు గనుక ఆగారు.

ఓ పెద్ద మనిషి మీరెందుకు పోటీలో లేరు అని అడిగాడు కూడా.

“నా కోసం కాదు. నా వరకే అయితే నాకు పోటీలోకి రావాల్సిన అవసరం లేదు. అది మీకూ తెలుసు. ఇది అందరి కోసం అందరం కలిసి ఉంటున్నా ప్రదేశం మరి. దీన్ని మనంగా మంచిగా చేసుకొనడం కోసం” అని నవ్వాడు.

ఎన్నికలు గరం గానే నడచియ్.

గెలుపు ఓటములు ఎలా ఉన్నా చిన్న చిన్న ఘటనలు జరిగినా ఎన్నికలు సజావుగానే పూర్తయినయి.

ఫలితాలు పెంచలయ్యకు అనుకూలంగా వచ్చినయి.

దాదాపు నిలబెట్టిన వారిలో మూడు వంతులు మంది అభ్యర్ధులు నెగ్గారు.

ఈ గెలుపు నిజంగా పెంచలయ్యదే. దానిని గుర్తించిన జనం విజయోత్సవం చేస్తానంటే వాళ్లని వారించి, విజయోత్సవం అభ్యర్థి గెలిస్తే చేయవల్సినది కాదనీ జనానికి పని కొచ్చేదేదైనా సమర్థవంతంగా చేసినపపుడు చేయవల్సిందనీ హితవు చెప్పాడు.

పెద్దలను, కార్యకర్తలను, నిలబెట్టిన మొత్తం అభ్యర్థులను అత్యవసరంగా సమావేశపరిచాడు. జనాల వంక సభ నుద్దేశించి మాటాడాడు.

“మిత్రులకు నమస్కారం. ఇది మనం ఉమ్మడిగా సాధించిన మొదటి విజయం. అంటే మనం చేయతలపెట్టినదానిలో మొదటి ఘట్టం ముగిసింది. ఏం చేయాలో మన మనస్సుల్లో ఉన్నది.

పునాది తవ్వేందుకు ముహుర్తం కూడా జరగలేదు.

పురిటి బాధ నుంచి పసికూన బయట పడింది. ఇక బ్రతుకు బాధలోకి వస్తుంది.

ఇక జనం న్యాయమైన కోరికలను తీర్చే ప్రయత్నంలో మన నడక ప్రారంభం కావాలి.

కొండకు నాగలి వేయడాన్ని ఆపాలి. సామూహిక న్యాయం కోసం, అది ఎంత కష్టమైనా సాధించాలి. సాధించటానికి నడుం కట్టాలి. మనం మనుషులం. బలహీనుత లుంటాయి. వాటిని సమీక్షించుకుంటూ, సరి చేసుకుంటూ నడవాలి. ప్రత్యర్థులు బలం కల్గిన వారు. అడ్డు పడుతుంటారు. వారిని ఏదుర్కొంటూ న్యాయాన్ని అమలు జరిపే యత్నం నిరంతరం సాగాలి.

ఎదురవుతున్న అవాంతరాల వల్ల సామూహికపు న్యాయం కుంటుపడుతున్నదనేది జనాల గమనంలోకి తెస్తూ పోవాలి.

ప్రజలు తెలివి కలవారు.

ఆలోచన చేయగలరు.

తదనుగుణంగా నిర్ణయాలూ తీసుకోనగలరు.

దాని ఫలితమే మనని గెలిపించడం.

మంచేదో చెడేదో వారికి తెల్సు” అన్నది స్పష్టపరిచాడు.

“వారి బాధ్యత అయిపోయింది.

ఇక బాధ్యత బరువు మనది.

వాళ్లకు మళ్ళీ చురుకు తగిలేంత చెడు జరిగితే తప్ప తలెత్తి చూడరు. అట్టా చూసాక ఏ పావు మిగలదు.

అంతటి తిరుగులేని శక్తి వారి చూపుకు ఉంది.

కనుక-

మనతో పాటు వారిని బాద్యత తెల్సినవారిగా కలుపుకొని నడవాలి.

ఇక ఓ చిన్న మాట” అని నవ్వి

“మన ఏడుకొండల స్వామి కూడా మన మనకున్న కోరికలన్నింటిని తీర్చలేడు. After all మనమెంత?

అలా అని నిర్లక్ష్యం పనికిరాదు.

జనం నాడిని గమనిస్తూ తదనుగుణంగా మెలిగే విజ్ఞతను మనం అలవరుచుకోవాలి. దాని పైనే మన స్థిరత్వం అధారపడి ఉంటుంది.

చాలా మంది హితులు నన్ను చైర్మన్‌గా చూడాలని కోరుకుంటున్నారు. నాకా కోరిక లేదు.

ఆ రకమైన ఒత్తిడి వస్తుందనే భయంతోనే ఎన్నికలో పాల్గొనలేదు.

అయితే నాకో కోరిక ఉన్నది. అదేమంటే – మన చైర్మన్ కొత్తవాడూ, యువకుడూ ఉత్సాహవంతుడూ, జనం సమస్యలను విజ్ఞతతో అర్థం చేసుకొన గల్గినవాడు కావాలి. అది మనకు కొండంత బలాన్నిస్తుంది. అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తుంది.

జన జీవితంలో కలసి మెలసి మెలగగల్గడం అంత సామాన్యమైన పని కాదు,

అంతు లేని చోరవా, అవగాహనా కావాలి. మనందరితోనూ పని చేసుకోగల్గి మన ప్రతిష్ఠను పెంచాలి. కనుక నేను అంటే నేనే అన్న ధోరణి మనసులోకి రానివ్వకండి. మనలో ఎవరు ఈ గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరు అని ఆలోచించండి.” అని ఓ నిముషం ఆగి అందరికీ నమస్కారించి “మన విజేతలను పరిచయం చేస్తాను” అని వారిని వేదిక పైకి పిలిచాడు. అందర్నీ జనానికి పరిచయం చేస్తూ “మీ అభిమాన ధనంతో విజయులైన విజేతలు వీరు. వీరిలో ఎవరు న్యాయం చేయగలరు. సమర్థుడెవరు? అన్నీ… కూడా ఆలోచించండి. అభిప్రాయాలను పంచుకొని నిర్ణయానికి వద్దాం” అన్నాడు.

అరగంట గడిచాక గెలిచిన వాళ్లు పదిహేను భాగాలుగా కనిపించారు పెంచలయ్యకు. ఇందరికి చైర్మన్ అవ్వాలని ఉందన్నమాట అనుకుని నవ్వుకున్నాడు.

ఇక ఆలస్యం పనికి రాదనుకొని అందర్ని వేదిక దగ్గరకు పిలిచి – “ఇక మన అభిప్రాయాలను వెల్లడించవచ్చును” అన్నాడు.

చిన్న గుంపులు పెద్ద గుంపులుగా మారి కనిపించాయి.

ఫలానా వ్యక్తి అని ఎవ్వరూ మందుకు రాలేదు.

అయిదు నిముషాలు చూసి

“మిత్రులారా! దాదాపు ఇరవై సంవత్సరాలుగా కౌన్సిలర్లుగా ఉంటూ కావల్సిన అయుదుగురు సభ్యులను మళ్లా గెలిపించారు. వారిని అభినందిస్తున్నాను. ఈ అయిదుగురు అనుభవజ్ఞులు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్‍కు ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తారు” అన్నాడు.

“అంటే ఈ అయిదుగురూ పోటీలో లేనట్టేనా?” అని అరిచాడొకడు జనం నుంచి.

“అలా అని కాదు. యువతరాన్ని నిజమైన సేవకులుగా తీర్చిదిద్దుతాను. ఈ పదవిలో వారికి ప్రత్యేకంగా వచ్చే గౌరవం ఉంటుందని నేను భావించడం లేదు. ఆ స్థాయి దాటి ఎప్పుడో ఎదిగారు” అనగానే జనం కరతాళ ధ్వనులు చేసారు.

ఇలా ప్రారంభించిన మెలికను నళినీ రెడ్డి దగ్గర విప్పాడు.

ఈవిడ మంచి ప్రఖ్యాతి ఉన్న డాక్టరు భార్య. మహిళా సంక్షేమం, సాంఘిక సేవ అని ఊళ్ల వెంట బాగా తిరిగే అలవాటుంది. ఆర్థిక స్థితి బావున్నావిడ. అవసరమనిపించినప్పుడు దానధర్మాలు చేయడానికి కూడా వెనకాడేది గాదు. అలా చేసి వచ్చిన కీర్తితో ఆనందపడే తత్వం ఉన్న మనిషి.

పెంచలయ్య ఈవిడను రంగంలోకి దింపేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఎంచేతనంటే అక్కడ ప్రత్యర్థులు ఓ డాక్టరుమ్మనే ఏకంగా తమ అభ్యర్థిగా బరిలోకి వదిలారు. ఆవిడ బాగా ఉన్న మనిషి కనుక. అక్కడ ధీటైన అభ్యర్థిగా ఈవిడ అయితేనే సరిపోతుందని భావించి ప్రయత్నించాడు. అంగీకరించింది. పైగా నళినీ రెడ్డి ముభావంగా ఉండే మనిషి కాదు. బాగా అందరిలోనూ కలివిడిగా మెలగగలదు. మాటకారి. అందంగా పద్ధతిగా మాటాడగలదు.

ఈవిడ పేరును ఛైర్మన్ పదవికి చర్చలో వచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకించలేకపోయారు, ఈవిడ భర్త డాక్టరుగారి పైన ఉన్న గౌరవం మూలాన. దీన్ని అదునుగా తీసుకొని పెంచలయ్య నళినీ రెడ్డిని చైర్మన్‍గా ప్రపోజ్ చేసాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here