అత్తగారు బయలుదేరారు
[dropcap]ఈ[/dropcap]రోజే అక్కడ అత్తయ్య గారు బయలు దేరారు.. నాలుగు కార్ల నిండా బంధుగణం, స్నేహితులు, ఇరుగు పొరుగులూ కూడా వచ్చారట.. ఎయిర్‌పోర్ట్‌లో మా అత్తగారికి ఘనంగా వీడ్కోలు చెప్పినట్లు, ఆవిడతో పాటు వెళ్ళినవారందరూ ఫోన్లు, మెసేజ్ లు చేసారు. ఇంకా వారి వారి వాట్స్ఆప్ స్టేటస్‌లూ, ఫేస్బుక్ లలో కూడా మా అత్తయ్య గారి ఫోటోలతో నింపేసారు. దీన్ని బట్టి తెలిసింది. వీధి వీధి మొత్తం ఈవిడకి వీరాభిమానులే అని. అయినా… అందరూ రావొద్దూ! మరి, వాళ్ళిచ్చిన పేకేజీలన్నీ ఈవిడ మోసుకొస్తున్నారు కదా మరి. ఆ కృతజ్ఞతతో ఐనా అందరూ సెంఢాఫ్ ఇచ్చుంటారు.
ఎక్కడా ఏ ఇబ్బందీ లేకుండా రావాలని దేవుడికి మొక్కుకున్నాను. పాపం ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికీ బయలుదేరింది లేదు.. అలాంటిది ఇప్పుడు ఎకాఎకిన దేశం కాని దేశం బయలుదేరారు. భాష రాదు. దారిలో ఏదైనా చెకింగ్ అప్పుడు అవాంతరం కనక వస్తే ఇబ్బందే. అసలే ఆవిడకి కంగారు ఎక్కువ. ఫోను నెంబర్లను, అడ్రస్‌లు అన్నీ రాసి పెట్టుకోమని చెప్పాము. అయినా అన్నీ వీల్ చైర్‌లో తీసుకెళ్ళే వారే చూసుకుంటారని ,ఇక్కడకి వచ్చిన పేరెంట్స్ చెప్పారు. అదే మాట ఆవిడకి చెప్పాము.
మరో ఇరవై నాలుగు గంటల్లో వచ్చేస్తారు. ఆవిడకి అనుకూలంగా ఉండేట్టుగా ఇంట్లో ఓ గది సర్దిపెట్టాను. మాటి మాటికీ మెట్లు ఎక్కలేరని, కింద బెడ్ రూమ్ ఆవిడ కోసం ఏర్పాటు చేసాను.
రేపు దిగాక తన ప్రయాణం ముచ్చట్లు నాన్‌స్టాప్‌గా చెపుతూనే వుంటారు అని అనుకున్నాను.
నానపెట్టిన ఇడ్లీ పప్పు గ్రైండర్‌లో వేసాను. రోజూ రాత్రిళ్లు టిఫినే తింటారు. ఇలా ఇడ్లీ పిండిలో, దోశ పిండో రెడీగా ఉంటే గబగబా చేసేయొచ్చు.
పిల్లాడికి ముందుగానే చెప్పాను. “మీ బామ్మ ఉన్ననాళ్ళూ పిజాలూ, బర్గర్లూ, పాస్తాలూ,మాట ఎత్తొద్దు. ఆవిడకి వెల్లుల్లి వాసన కూడా గిట్టదు.” అని.
వాడా మాటకి, “చూస్తూండు, బామ్మకి కూడా ఇట్టే అలవాటైపోతాయి ఆ పిజాలు గట్రా. తరువాత వాటి రెసిపీలన్నీ నీ దగ్గర కంఠస్ధం పట్టేస్తుంది” అంటూ అన్నాడు.
ఆ మాటలకి నవ్వొచ్చింది.. “ఈవిడా ఇవి తినేది? మన ఊళ్లో ఒకసారి ఇంటి ముందుకి పానీపూరీ బండివాడు వచ్చినప్పుడు మీ బామ్మ ఎలా, ఎన్ని శాపనార్థాలు పెట్టిందో మర్చిపోయారా?” అన్నాను.
“ఔనౌను, అప్పటినుంచి నేను ఎప్పుడు పానీపూరీ తిన్నా, ఆరోజు బామ్మ మాటలే గుర్తొస్తాయి. వాడి ముందు చిప్ప పట్టుకుని, లైన్లో నిలబడి అలా అడుక్కోవడమేంట్రా? కుంకల్లారా! మున్సిపాలిటీ వీధి కుళాయి నీళ్ళలో ఏవేవో కలిపేసి.. పురచేత్తో ఆ బఠాణీ కూర ముద్ద పూరీలో కుక్కి ఇస్తే గుటుకూ గుటుకూ మింగుతున్నారు. కడుపులో ఏదైనా తేడా చేసి రేపు గుడగడుమంటే ఇంతే సంగతులు. మా బాత్ రూమ్‌లు మీ ఊళ్లోలా పడకగదిలో లేవు. మాటిమాటికి పెరట్లోకి పరుగెత్తాలి. జాగ్రత్త! ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా!” నవ్వాపుకుంటూ వాడనేసరికి, నాకు ఈ పానీపూరీ మీద గరికపాటిగారి ప్రవచనం గుర్తొచ్చింది.
అలాంటి పద్ధతైన మా అత్తగారు రాను రానంటూనే, ఇప్పుడు ఇక్కడ అడుగు పెడుతున్నారు. మడి వంట,రోజూ మహా నైవేద్యం, నేల మీద కూర్చుని భోజనం, చన్నీటి స్నానాలు… ఇలా ఇక్కడ అడ్జస్ట్ అవగలరో లేదో… అనే అనుమానాలు నాలో ముంచెత్తాయి. అయినా ఆవిడకి ఎక్కడికక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ అమర్చసాగాను. రేపు ఈపాటికల్లా ఇంట్లో ఉంటారు.
ఆవిడ కనక ఇక్కడ అడ్జస్ట్ అయి, ఉంటానని ఒప్పుకుంటే ఇక్కడే ఉంచేసుకోవాలని ఉంది.
కానీ, ఒప్పుకుంటారో, లేదో అనుమానమే.
మేము ఇక్కడికి వస్తున్నప్పుడు ఆవిడ మాతో…,’ఇప్పుడంటే అందరూ ఇలా వెళ్ళిపోతున్నారు కానీ.. ఇదివరలో ,ఎవరు తాలూకు వారైనా అమెరికా వెడితే… ఫలానా వారు వెళ్ళారని వింతగా చెప్పుకునేవారు. ఏంటో అదో విచిత్రంగా ఉండేది. వాళ్ళు చెప్పే కబుర్లు నోరు తెరుచుకుని వినేవాళ్ళం. అసలు చాలా కాలం ముందు పాత తరం వాళ్ళు ఇలా సముద్రం కనక దాటాలంటే నాలుక మీద వాత పెట్టుకునేవారట. ఆ పద్ధతులన్నీ ఇప్పుడు ఎక్కడా లేవు. ఇప్పుడు ఇంటికి ఇద్దరు ముగ్గురైనా విదేశాల్లోనే ఉంటున్నారు. అక్కడే సెటిల్ అయిపోతున్నారు కూడా.” అన్నారు.
అదీ నిజమే… ఇప్పుడు ప్రతీ ఇంటా.. ఇక్కడకి వచ్చే వారు ఎక్కువగానే అయిపోయారు.
అత్తయ్య గారిని కదిలించినా, కదిలించకపోయినా.. ఎన్నెన్నో తన అనుభవాలతో కూడిన మాటల మూటలు అందిస్తూనే ఉంటారు.
మా ఆయనైతే వాళ్ళమ్మని తలుచుకోని క్షణం లేదు.
‘మా అమ్మ వస్తోంది,మా అమ్మ వస్తోంది.’ అంటూ గాల్లో తేలిపోతున్నారు.
“నిజంగా ఎగిరిపోతే… తేలిపోయే శక్తి కనుక ఉంటే, ఎదురెళ్ళి స్వాగతం పలకండి” అంటూ మేలమాడసాగాను.*