[dropcap]అ[/dropcap]లనాటి వేదాలు ఘోషించిన
అమూల్య ఘట్టాలు ఎన్ని ఉన్నా
పుక్కిటపట్టిన పురాణాలు
కోకొల్లలుగా తారసిల్లినా,
ఆధునిక చలనచిత్రాలు
కనులముందు నిలిచి అలరించినా,
ఆ బంధ వర్ణన ఎప్పుడూ సశేషమే,
ఆ బంధంలో ప్రతి విషయమూ
ఒక విశేషమే,
అదే స్నేహబంధం!!
అలనాటి శ్రీకృష్ఙ కుచేల స్నేహం,
ఈనాటి బాపూ రమణల నెయ్యం
లిఖించలేని, చిత్రీకరించలేని
మధురభావనల వీచికలు.
కలహాలు లేని స్నేహాలు కావు అవి.
కలహాలు ఉన్నా కలసే ఉన్న బంధాలు
ఆ అపురూప స్నేహబంధాలు!!
బుజంపై చేయి వేసి నేస్తం
అంటూ అల్లుకుపోతే
స్నేహబంధం విరాజిల్లదు,
సంతోషం పంచుకుంటే వర్ధిల్లి
వెలిగిపోయే బంధం కాదది.
ఆపదల్లో ఉన్న నేస్తానికి
నేనున్నా అనే భరోసాతో
కన్నీటిని తుడిచే ఆసరా
మనస్తత్వమే ఎన్నటికీ
వీడని విడిపోని నెయ్యం!!
రక్తం పంచుకు పుట్టకున్నా,
రక్తం కన్నా మిన్నగా చూసుకుని
మురిసిపోయే బంధం ఇది.
ఆస్తిపాస్తులు పంచుకోకున్నా,
ఆత్మీయతలు పంచుకునే అనిర్వచనీయ
ఆనందం ఈ బంధానికే ఆభరణం!!
రచయితలు వ్రాయలేని,
చిత్రకారులు గీయలేని
బంధమిది,
గొప్పల గొడుగులు,
మెప్పుల మెహర్భామీలు,
ఆశించని అజరామరం
ఈ స్నేహ మాధుర్యం,
కలకాలం నిలిచిపోయే
ఆత్మీయ సౌరభం!!