అత్తగారు.. అమెరికా యాత్ర 6

0
3

అత్తగారు.. ఆగమనం

[dropcap]ఈ [/dropcap]మధ్యాహ్నం పన్నెండింటికి ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. బయటకి రావడానికి ఎంతలేదన్నా గంట పైనే పడుతుంది.

ఉదయం నుంచి ఈయనగారిని పట్టలేక పోయాను. మాటి మాటికీ టైమ్ చూసుకోవడమే.

నేనూ తక్కువేం కాదు. ఒకటే హడావుడి. కంగారు. ఇక్కడ పండగలప్పుడు తప్ప మన ఊళ్ళోలా ప్రతిరోజూ వాకిట్లో ముగ్గు వేయడం అలవాటు లేదు నాకు. చలికాలం, మంచు రోజుల్లో అసలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. అందుకని రోజూ,ఇంట్లోనే దేవుడి గదిలో మాత్రం ముగ్గు వేస్తూంటాను. ఈ రోజు పొద్దున్నే ఆ చలిలో వణుకుతూనే వాకిట్లో ఓ చిన్న ముగ్గు గీసాను. పాపం ఆవిడ ఏమీ అనరు కానీ… వెయ్యాలని నాకే అలా అనిపించింది.

గబగబా స్నానం, పూజ కానించి వంట మొదలెట్టేసాను. అత్తయ్య గారికి ఇష్టం అని ఆవ పెట్టిన… కందబచ్చలి కూర, కొబ్బరి పచ్చడి, మామిడికాయ పప్పు వేసాను. ఇవి చూసి ఆవిడ ఆశ్చర్యపడడం ఖాయం. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయా? అని ఆవిడ ఖచ్చితంగా ఆశ్చర్యపడతారని అనుకున్నాను.

అన్నం ఒకటీ మాత్రం, ఆవిడ వచ్చి స్నానాలు కానిచ్చుకొని లోగా వేడిగా వండుకోవచ్చు అనుకున్నాను.

ఫ్లైట్ టైమ్‌కి అరగంట ముందే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాము. అత్తయ్యగారి ఆగమనం కన్నా ముందే ఆవిడ సూట్‌కేస్‌లు మూడూ బయటకి వచ్చేసాయి. ముందుగా వాటి ఫోటోలు పెట్టి ఉండడం, వాటి మీద ఆవిడ పేరు, ఊరు తాటికాయంత అక్షరాలతో రాసి ఉండడం, పైగా వాటికి ఆవిడ వెంకటగిరి చీర అంచు చింపి పెట్టెలకి చుట్టూ కట్టి ఉండడం.. ఇన్ని బండగుర్తులుండేసరికి ఈజీగానే తెలిసిపోయాయి. బెల్టు మీద వాటిని చూడగానే మా వాడు గుర్తు పట్టేసాడు.

“బామ్మ ఎంత ముందు జాగ్రత్తతో పకడ్బందీగా సూట్‌కేస్‌లకి కట్టిందో? ఎక్కడా మిస్ అవకుండా భలే ఏర్పాటు చేసింది.

మధ్యలో ఏ చెకింగ్ లోనూ కూడా తీయడానికి వీల్లేని విధంగా ముళ్ళ మీద ముళ్ళు వేసింది. ఎంతైనా బామ్మ చాలా ఇంటెలిజెంట్” అంటూ ఒకటే నవ్వులు.

నాకూ నవ్వు వచ్చింది కానీ ఈయన ఉడుక్కుంటారని ఆపుకున్నాను. ఈయన ప్రయాణికులు బయటకి వచ్చే లిఫ్ట్ దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నేను పెట్టెలు మూడూ బెల్టు మీద నుండి దించి ట్రాలీ మీదకి చేర్చి నెమ్మదిగా తోసుకుంటూ లిఫ్ట్ దగ్గరకి చేరాను.

ఇక ఆవిడ రావడమే ఆలస్యం.

అదిగో! లిఫ్ట్ తలుపు ఓపెన్ అయింది.. వీల్ ఛైర్ అమ్మాయితో ఏవో పిచ్చాపాటి మాట్లాడేస్తూ, కులాసాగా, హుషారుగా కనిపించారు. ఈయనగారు వెంటనే, ‘అదిగో అమ్మ!’ అంటూ చేయూపసాగారు. ఆవిడ కూడా అక్కడ నుండే, ‘అచ్చిగా! వచ్చేసాను రా!’ కొడుకుని చూసిన ఆనందంతో కేక పెట్టారు. ఆ పిలుపుకి ఈయన గారు, ఎవరూ వినలేదు కదా! అనుకుంటూ చుట్టూ చూశారు. ఎందుకు వినరూ? విమానం నుంచి దిగింది మూడొంతులు తెలుగువారే… అందులో సగం మంది ఇలా వీల్ ఛైర్ అమ్మానాన్నలే… అయితే వాళ్ళంతా తమని రిసీవ్ చేసుకుందుకు వచ్చిన పిల్లల్ని చూసుకునే ఆనందంలోనూ, లేదా వారి వారిని ముద్దు పిలుపులు పిలుచుకుంటూ,

‘బుజ్జమ్మా! ఇటు ఇటు’ అంటూ తమ నలభై ఏళ్ల కూతురిని పిలుస్తూనో, లేదా బట్టతలతో ఉన్న కొడుకుని ‘ఒరేయ్! పండూ!’ అంటూ పిలుస్తూనో… వారి ఆనందాలలో మునిగిపోయున్నారు.

మన అచ్చిగాడిని ఎవరూ పట్టించుకోలేదని గ్రహించి, హమ్మయ్య అనుకుంటూ, అత్తయ్యగారి దగ్గరకి పరుగులు తీసి ఆవిడ కళ్ళకి దండం పెట్టాము. “అచ్చిగా! ఈ తోపుడు కుర్చీ అమ్మాయి చాలా మంచిదిరా! నన్ను జాగ్రత్తగా మీకు అప్పగించింది. ఓ పాతిక, ఏభయ్యో ఆ పిల్ల చేతికియ్యి. ఇంకా పెళ్ళవలేదట. తండ్రి పట్టించుకోవడం లేదట. పాపం తెగ బాధపడింది. ఆ పిల్ల వివరాలు, గోత్రం, శాఖ అన్నీ కనుక్కో! ఎవరికైనా చెపుదాము” అన్నారావిడ.

“అమ్మా! తనకి సంబంధాలు చూడమని, ఆ పిల్ల ఏ భాషలో చెప్పిందేంటి? ఈ కాసేపట్లోనే అంతంత ఊహించేసుకున్నావా?” అన్నారీయన.

“ఏమో! ఏం భాషో నాకు తెలీదు. నాకు అర్థం అయ్యింది మాత్రం అదే” దృఢంగా అన్నారావిడ.

ఈయన ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పి, తన చేతిలో కొంత డబ్బు పెట్టారు. ఆ పిల్లకి టాటా బైబై చెప్పారు అత్తయ్య గారు.

భాష తెలీదు, ఎలా వస్తారో అని ఈవిడ గురించా నేను కంగారు పడిందీ, అని మనసులో అనుకున్నాను.

“పదండి అత్తయ్యా! ఇంటికి వెడదాం.. అసలే అలసిపోయున్నారు మీరు” అంటూ ఆవిడ చేయి పట్టుకుని నడిచాను.

మరో లిఫ్ట్‌లో కింద సెల్లార్‌లో కారు పార్కింగ్ ప్లేస్‌కి చేరుకున్నాము. ఈయన లగేజ్ కారు ట్రంక్‌లో సర్దేలోగా, అత్తయ్య గారిని కారు సీట్లో కూర్చోపెట్టి, సీటు బెల్టు పెట్టాను. ఎయిర్‌పోర్ట్‌లో తెలీలేదు కానీ, సెల్లార్ లోకి వచ్చేసరికి విపరీతంగా చలి. ఆవిడ కప్పుకున్న శాలువా ఆగలేదు. ఇలా ఉంటుందని తెలిసే ఇంటి దగ్గర నుంచి ఆవిడ కోసం కొని రెడీగా ఉంచిన జాకెట్ పట్టుకొచ్చాను. “అమ్మో! నాకు చలికోటు వేసుకోవడం అలవాటు లేదే! వేసుకోను.” అన్నారు కానీ, ఈయన వచ్చి, “అమ్మా! ఇక్కడ వేసుకోకపోతే ఈ చలికి గడ్డ కట్టేస్తావు. వేసుకోవాలి” అనేసరికి, వణుకుతూ వేసుకున్నారు.

“విమానంలో ఫుడ్డు నచ్చిందా బామ్మా? ఏం పెట్టారు?” పిల్లాడి ప్రశ్నకు..

“వాళ్ళ పెట్టిన తిండీ ఒక తిండేనట్రా? ఎండిపోయిన రొట్టెముక్కలు, వాటి మధ్యలో ఏవో ఆకులు పెట్టి ఇచ్చారు. ఊరూ పేరూ తెలీనివి ఏంటేంటో పెట్టారు. అయినా ఆ మసాలా వాసనలు… బాబోయ్ ముక్కు మూసుకుని కూర్చున్నాను. అవి తినలేక నేను తెచ్చుకున్న పులిహోర, వేరుశెనగ పప్పుండలు, చెక్కలు, జంతికలు ఇలా బయటకి తీసి తినడం మొదలు పెట్టానో, లేదో.. ముందు సీట్లవాళ్ళూ, వెనక సీట్ల వాళ్లు, పక్కన కూర్చున్న తెల్లపిల్లా, వాళ్ళాయనా నా వైపు ఒకటే చూడడం. అడగడానికి మొహమాట పడుతున్నారు కాబోలు అనుకున్నా. నేను ఒక్కతినీ తింటే బావుండదని, వాళ్ళకి కూడా తలా కాస్త పెట్టాను. తీసుకోవడానికి ఎంత సిగ్గు పడిపోయారో? ఆ ఎయిర్ హోస్టెస్ పిల్లలు అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు వాళ్ళకీ కాసిని జంతికలిద్దామనుకున్నాను.

మొత్తం జంతికల పరపరలతో విమానం మోత మోగిపోయిందనుకో!” అన్నారు ఆవిడ.

“ఇంకా నయ్యమే బామ్మా! పైలట్లకి ఇవ్వలేదు.. ఇచ్చుంటే.. వాళ్లు ఆకాశంలోనే విమానం ఆపేసి నీ పులిహోర, జంతికలు, పప్పుండలూ… తింటూ కూర్చునేవారు” పడిపడి నవ్వుతూ వాడనేసరికి మేమందరం నవ్వాపుకోలేకపోయాం.

“అయ్యో! వాళ్ళకివ్వాలని నాకు తోచనేలేదు సుమా! ఈసారి తిరుగు ప్రయాణంలో ఇస్తాలే… ఔనూ! విమాన ప్రయాణంలో, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలంటగా? మన పక్కింటి వర్ధనమ్మ చెప్పింది. తను అమెరికా రెండు సార్లు వచ్చింది కదా! అనుభవంతో చెప్పింది.” అన్నారు.

ఈయన వెంటనే కంగారుగా, “ఏవేం ద్రవాలు తీసుకున్నావేంటి?” అడిగారు.

“ఏపిలు జ్యూసూ, కమలా పళ్ళరసం ఇచ్చారు. మళ్లీ మళ్లీ అడిగి తీసుకోమని వర్ధనమ్మే చెప్పింది. అందుకే ముఖమాటం లేకుండా అడిగేసాను. అడిగినప్పుడల్లా పాపం లేదనకుండా ఇచ్చారు ఆ పిల్లలు. ఎంత మర్యాద? ఎంత మన్ననా? ముచ్చటగా అనిపించింది. ఇక్కడ దిగేటప్పుడు ఎంచక్కా గుమ్మం దాకా వచ్చి సాగనంపారు కూడా!”

“నీకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు కదా బామ్మా! ఎలా మాట్లాడావు” అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

“భాష తెలియాలేంట్రా? వాళ్ళ ముఖకవళికలతో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నది ఇట్టే తెలుసుకోవచ్చు. పక్కన తెల్ల పిల్లతో అలాగే కబుర్లు చెపుతూ కూర్చున్నాను.”

మేము ఏదేదో అనుకున్నాం కానీ… అత్తయ్య గారు మాత్రం తన ఇరవై నాలుగు గంటల ప్రయాణం అవలీలగా చేసేసారు.

అత్తయ్య గారు.. ఇలా తన ప్రయాణం కబుర్లు చెపుతున్నంతలోనే ఇంటికి చేరుకున్నాము.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here